
ఆహా ఏమి కథ!
కథలు దొరకడం లేదు, అయినా కొత్తగా కథలేముంటాయి. అనే మాటలు పరిశ్రమలో తరచూ వింటుంటాం. అలాంటిది యువ నటి నందిత అబ్బురపరచే కథ విన్నారట. అంతేకాదు ఆ కథలో తనకు అవకాశం ఇస్తే పారితోషికం అడగకుండా నటిస్తానని మాటిచ్చేశారట. అయితే ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆమె అలా అనలేదట. నిజానికి ఈ పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఉన్న నందిత అట్టకత్తి, ఎదిర్‌నీశ్చల్, ఇదర్కుదానే ఆశై పడ్డాయే బాల కుమారా, ముండాసు పట్టి వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రతిభ గల నటిగాను పేరు తెచ్చుకున్నారు.
గ్లామర్ విషయంలో ససేమిరా హద్దులు దాటను అంటూ తనకంటూ గీత గీసుకున్న నందిత పారితోషికం విషయంలోను పట్టు విడుపులు పాటిస్తున్నారు. అయితే నా షరతులకు మీరు ఓకే అంటే మీరు ఇచ్చేపారితోషికానికి తాను రెడీ అంటున్నారట. ప్రస్తుతం నటనకు అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తున్న నందిత ఇటీవల నటుడు కృష్ణతో వానవరాయన్ వల్లవరాయన్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు రాజ్‌మీనన్ ఆమెను కలిసి ఒక కథ చెప్పారట.
అది విన్న నందిత చాలా విస్మయం చెందారట. అంతేకాదు ఆ చిత్రంలో నటించే అవకాశం తనకు కల్పిస్తే పారితోషికం కూడా తీసుకోకుండా చేస్తానని చెప్పారట. అంతగా ఆ కథ ఆమెను ఆకట్టుకుందట. స్త్రీ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని నందితతో తెరకెక్కించడానికి దర్శకుడు రాజ్‌మీనన్ సిద్ధం అవుతున్నారట. నటకు అవకాశం ఉన్న పాత్రల్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు నందిత.