పాతికేళ్ల కథ ప్రయాణం | 25 years of stories traveling | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల కథ ప్రయాణం

Published Mon, Jan 18 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

పాతికేళ్ల కథ ప్రయాణం

పాతికేళ్ల కథ ప్రయాణం

ఈ పాతికేళ్ల కాలంలో మొదటి ఐదు సంవత్సరాలు మినహాయిస్తే తర్వాతి కాలంలో వచ్చిన కథల్లో ప్రధాన ఇతివృత్తాలు రెండు. ఒకటి- గ్లోబలైజేషన్, తదనుగుణంగా మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు. రెండోది- సమాజంలోని వివిధ వర్గాల అస్తిత్వ వేదనలు. ఇవి స్త్రీవాదం నుంచి ప్రాంతీయత వరకు విస్తరించాయి.
 
 కథ, జీవితమంత గొప్పది. సమాజమంత విశాలమైనది.
 తెలుగు కథ 1910కి ముందే పుట్టి ఇప్పటికి లక్షకు పైగా కథలు వెలువడ్డాయని ఒక అంచనా.
 (ఆ సంవత్సరం వచ్చిన కథలతో) వార్షిక సంకలనాలు తీసుకురావడం వంద సంవత్సరాల క్రితమే అమెరికాలో మొదలైంది. ద బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరీస్ పేరుతో ఒక వార్షిక కథాసంకలనం 1915లో ప్రారంభమై వందేళ్లుగా నేటికీ కొనసాగుతోంది. బహుశా పాతిక సంవత్సరాలుగా కొనసాగుతున్న వార్షిక సంకలనాల పరంపరలో కథాసాహితి సంకలనాలు ఆ వరుసలో రెండోది కావచ్చు.

 ఒక సంస్థ మనుగడలోనో, ఒక మనిషి జీవితంలోనో పాతికేళ్లు ఎక్కువ కాలమే కావచ్చు. కానీ చరిత్ర గమనంలో ఒక సమాజానికి అది స్వల్పకాలమే. అయితే, ఈ స్వల్పకాలం భారతదేశ చరిత్రలో మరీ ముఖ్యంగా తెలుగు సమాజ చరిత్రలో అతి ముఖ్యమైనది. 90లలో దేశంలో ప్రారంభమయిన నూతన ఆర్థిక విధానాలు అతి త్వరలోనే గ్లోబలైజేషన్ ప్రక్రియలో భాగమై మనల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకు ప్రయోగవేదికే అయింది. సమాజాన్ని ఆలోచనాపథం వైపు నడిపిన కమ్యూనిస్టు ఉద్యమాలు తాత్కాలికంగానే కావచ్చు, వెనకపట్టు పట్టాయి. వివిధ అస్తిత్వవాద ఉద్యమాలు అనేక కోణాల నుండి కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. అందులో భాగంగానే నిర్లక్ష్యానికి, వివక్షకు గురయిన ప్రాంతాలలో మొదలయిన అలజడి ఉద్యమరూపం సంతరించుకుంది. ఫలితంగా రాష్ట్రం రెండు భాగాలయింది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడిచిన ఉద్యమం రాజకీయాలను శాసించి, వాటికి కేంద్రబిందువయింది.
 ఈ మొత్తం వాతావరణం సాహిత్యంలోకి, ముఖ్యంగా కథల్లోకి తర్జుమా అయింది. రాజకీయాలు, ఆర్థిక విషయాలు, సామాజిక వాతావరణం సాహిత్యం మీద వేయగలిగిన ముద్ర ఎంత బలమైనదో ఈ కాలంలో వెలువడిన కథలు చదివితే అర్థమవుతుంది.
 హక్కులు, ఉద్యమాలు, నిర్బంధాలు, విప్లవాలు ప్రధాన వస్తువులుగా వెలువడిన కథల స్వరూపం 2000 సంవత్సరం నాటికి మారిపోయింది. వ్యక్తిగత భావనలు, అనుభవాలు, అంతఃసంఘర్షణలు, మానసిక ఒత్తిడులు, పురాజ్ఞాపకాలు కథలకు ప్రధాన వస్తువులయ్యాయి.

 ఈ పాతికేళ్ల కాలంలో మొదటి ఐదు సంవత్సరాలు మినహాయిస్తే తర్వాతి కాలంలో వచ్చిన కథల్లో ప్రధాన ఇతివృత్తాలు రెండు. ఒకటి- గ్లోబలైజేషన్, తదనుగుణంగా మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు. రెండోది- సమాజంలోని వివిధ వర్గాల అస్తిత్వ వేదనలు. ఇవి స్త్రీవాదం నుంచి ప్రాంతీయత వరకు విస్తరించాయి.

 గ్లోబలైజేషన్ పరిణామాలు సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చాయి. అవి కేవలం ఆర్థిక విషయాల వరకే పరిమితమయి లేవు. ప్రభుత్వ నిర్ణయాల్లోకి, పరిశ్రమల్లోకి, గ్రామీణ జీవితంలోకి, వ్యాపారాల్లోకి, విద్యా, ఉద్యోగ రంగాల్లోకి, నెమ్మదిగా వ్యక్తిగత జీవితాల్లోకీ ప్రవేశించాయి. ఆర్థికం నుండి వ్యక్తిగత జీవితం వరకూ ఈ పరిణామాలు ప్రవేశించిన తీరును కప్పడాలు కథలో అత్యంత ప్రతిభావంతంగా, వ్యంగ్యంగా చిత్రించారు. వివిధ సౌకర్యాలు గ్రామాలను భౌతికంగా పట్టణాల ముంగిటకు తీసుకువచ్చాయి. కానీ గ్రామీణ జీవన సంబంధాలు మాత్రం దూరంగా జరిగిపోయాయి. మానవ నాగరికతా పరిణామంలో ఇది అనివార్యతే కావచ్చు. కానీ, మార్పుల వేగం, తీవ్రత అందుకు సిద్ధంగా లేని జీవితాలను శిథిలం చేశాయి. అలాంటి నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను చిత్రించిన కథలెన్నో. అడుసు, కొలిమి, కుట్ర, అన్నంగుడ్డ, తెల్లదయ్యం, రంకె, నేలతిమ్మిరి, మిత్తవ వంటి కథలన్నీ ఒకరకంగా బతికి చెడ్డ దేశానివే.
 పట్టణ ప్రాంతాల్లో ఒకటొకటిగా మూతపడిపోయిన పరిశ్రమల ఆత్మఘోషలు, మానవ ఆక్రందనలు మరికొన్ని కథల్లో వినవచ్చు. జీవన్మృతుడు, విధ్వంసదృశ్యం, టైటానిక్, అలజడి వంటివి ఈ దృశ్యాలకు కథారూపాలు.

 మానవ సంబంధాలను ఆర్థిక అవసరాలు నిర్దేశించే స్థితికి సమాజం ప్రయాణించింది. తరాల మధ్య అంతరం, వాటి మధ్య భావ సంఘర్షణ తీవ్రమయింది. ఈ మార్పుల పట్ల ఒక ఆవేదనాపూర్వక స్వరం కథల్లో వినబడుతుంది. తెగిన గొళ్లాలు, చివరి యిల్లు, దూరపు కొండలు, సప్తవర్ణ సమ్మిశ్రీతం, అంత్యాక్షరి, ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, రూపాయిచొక్కా వంటి అనేక కథలు ఈ సంబంధాల మీద దృష్టిని కేంద్రీకరించి రాసినవే.
 తొలిరోజుల్లో గ్లోబలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కథావస్తువు నెమ్మదిగా చైతన్యస్థాయిని పెంచడానికి దోహదపడే కథావస్తువుగా విస్తరించింది. న్యూ బాంబే టైలర్స్, సాలభంజిక, పెండెం సోడాసెంటర్, ఆవు-పులి మరికొన్ని కథలు, యూ టర్న్ కథల్లో ఈ పరిణామం కనబడుతుంది.

 అస్తిత్వవాద చైతన్యం ముందుగా స్త్రీవాదంతో మొదలయింది. తరువాత కాలంలో దళిత, బహుజన, మైనారిటీ వాదాలు ముందుకొచ్చాయి. ఇల్లలకగానే... కథ సాదాసీదాగా మొదలై, స్త్రీ వాదానికి పెద్ద ఊపునిచ్చింది. సిగ్గు బహుశా తెలుగు సాహిత్యంలో దళిత తాత్త్విక దృక్పథాన్ని ప్రవేశపెట్టిన తొలి కథగా భావించవచ్చు. మట్టి-బంగారం బహుజన చైతన్యాన్ని నేరుగా చిత్రించిన కథ. జమీన్, సారీ జాఫర్ వంటి కథల్లో ప్రదర్శితమైన సానుభూతి, గెట్ పబ్లిష్డ్ వంటి కథల్లో ఆక్రోశంగా మారి, జీవం, అతడు, గోరీమా కథల ద్వారా తమ అస్తిత్వాన్ని ధైర్యంగా ప్రదర్శించుకునే స్థాయికి మైనారిటీవాదం ఎదిగింది.
 మరోవైపు, వర్షాభావం, కరువుకి తోడుగా రాయలసీమ ఫ్యాక్షన్ జీవితాల వెనుక విషాదాన్ని ఆ ప్రాంత రచయితలు వీరనారి, మెడ మీద వేలాడే కత్తి, వానరాలే, కన్నీటి కత్తి కథల ద్వారా బలంగానే తీసుకొచ్చారు. ఈ పాతికేళ్లలో తెలుగు కథాసాహిత్యానికి అదనపు కూర్పు డయాస్ఫోరా కథలు. బతుకు కథతో మొదలై ‘అవచారం’, పరివర్తన, సరిహద్దు, ఐ హేట్ మై లైఫ్ వంటివి ఆవలి తీర జీవితాలను పరిచయం చేసిన కథలు. అలాగే, ప్రధానపాత్ర కథలోకి ప్రవేశించకుండా ఆ పాత్ర చుట్టూ కథ నడుపుతూ, ఆ వ్యక్తి సృష్టించిన ఒక ప్రాంత ఉద్యమ విశ్వరూపాన్ని పాఠకుల ముందుంచిన అతడు కథ ఇరవై ఏళ్ల క్రితం ఓ సంచలనం. భార్యాభర్తల మధ్య సంబంధాలను వ్యక్తిగత కోణం నుంచి, ఉద్యమ నేపథ్యం నుంచి, సాంఘిక నేపథ్యం నుంచి చర్చించిన పనిపిల్ల కథపై పెద్ద పుస్తకమే వచ్చింది.
 ఇలా తెలుగు సమాజంలో వచ్చిన సకల మార్పులూ ఈ సంకలనంలోని కథల్లో ప్రతిబింబిస్తాయి. పాతికేళ్ల సామాజిక చరిత్రకు కథాదర్పణం ఈ సంకలనం.
 
 (1990-2014 వరకు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకులుగా కథాసాహితీ ఆధ్వర్యంలో వచ్చిన 155గురు కథకుల 336 కథలతో 1300+1300 పేజీల రెండు బృహత్ సంకలనాలను ‘మనసు ఫౌండేషన్’ వెలువరిస్తోంది. వీటి ఆవిష్కరణ జనవరి 24న ఎన్.టి.ఆర్.కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో ఉదయం 10:30- సాయంత్రం 5 వరకు భిన్న కార్యక్రమాల మధ్య జరగనుంది. పై వ్యాసం, సంపాదకీయంలోని కొంత భాగం; కొన్ని చేర్పులతో.)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement