అమరిక : బొమ్మలే కథలు చెబుతాయి!
‘కథ చెబుతాను... ఊఁ కొడతావా!’ అని పిల్లల్ని అడిగే పరిస్థితి ఇప్పుడు ఏ తల్లిదండ్రులకు ఉంది? ‘నాన్నా! కథ చెప్పవూ’ అని పిల్లలు అడిగితే ఏదో ఓ వంకతో తప్పించుకునే వాళ్లే ఎక్కువ. విశ్రాంత జీవనం గడుపుతూ పిల్లలకు కథలు చెప్పడంలో కాలం గడపాల్సిన తాతలు, నానమ్మలు కూడా తమకంటూ ఏదో ఓ వ్యాపకంలో బిజీగానే ఉంటున్నారు. కథలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. కథ వింటూ నిద్రలోకి జారుకున్న పిల్లలు కథలో విన్న చెవుల పిల్లి, గున్న ఏనుగుతో కలల్లో కబుర్లు చెబుతారు. కథ చెప్పే సమయమూ, సహనమూ లేకపోతే ఒక ప్రత్యామ్నాయాన్ని వెతకండి.
ఇదిగో... ఇలాంటి బెడ్‌రూమ్‌ని ఇస్తే పిల్లలు సొంతంగా కథ అల్లేసుకుంటారు. వినే ఓపిక ఉంటే ఒకే బొమ్మను చూపిస్తూ అమ్మానాన్నలకు బోలెడన్ని కథలు చెబుతారు. ఇందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
ఎగ్జిబిషన్‌లలో, బుక్‌షాపుల్లో ఇలాంటి కామిక్ బొమ్మలున్న వాల్‌పేపర్లు దొరుకుతాయి. వాటిని తెచ్చి పిల్లల బెడ్‌రూమ్ గోడకు అతికించడమే. అలాగే పిల్లల చేత బొమ్మలు గీయించి ఆ చార్టునే గోడకు అతికించవచ్చు. ఇలా నెలకో కొత్త బొమ్మ వేయమని సూచిస్తే చాలు. పిల్లలలోని సృజనాత్మకత బయటకు వస్తుంది, కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తారు.