దళితులే రాసిన దళిత కథలివి!
కథకుడూ, అనువాదకుడూ అయిన రంగనాథ రామచంద్రరావు తాజాగా ‘సమకాలీన కన్నడ దళిత కథలు’ తెలుగులోకి అనువదించారు. ఆ సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు.
1. కన్నడ భాషతో మీకు ఎలా పరిచయం?
మా పూర్వులు మైసూరు సమీపంలోని చామరాజనగర్‌కు చెందినవారు. 80 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లాలోని ఆదోనికి వలస వచ్చారు. తల్లిదండ్రుల నుంచి కన్నడ, ఆదోనిలో పుట్టి పెరగటం వల్లా, తెలుగులోనే విద్యాభ్యాసం చేయటం వల్లా ఇరుభాషలతో సంబంధాలు ఏర్పడ్డాయి.
2. అనువాదాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం?
మనదేశం వివిధ భాషలకూ, సంస్కృతులకూ నిలయం. అనువాదం వివిధ భాషల మధ్య సేతువుగా నిలుస్తుందని అందరికీ తెలుసు. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేయాలన్న అభిలాషే నన్ను అనువాద రచనను గంభీరంగా తీసుకునేలా చేసింది.
3. ఇప్పటివరకూ చేసిన అనువాదాలు?
కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం కన్నడ నుంచి ‘రాళ్లు కరిగే వేళ’, ‘తిరుగుబాటు’, ‘ఓం నమో’, ‘పూర్ణచంద్ర తేజస్వి జీవితమూ సాహిత్యమూ’, ‘అంతఃపురం’, ‘అవధేశ్వరి’ అనువదించాను. సొంతంగా ‘ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు’, ‘నలుపు, తెలుపు కొన్ని రంగులు’ తెచ్చాను. ఇంకా, నేను అనువదించిన 350 కథల్లో 200కు పైగా కన్నడ కథలున్నాయి. మిగిలినవి హిందీ, ఇంగ్లీషు.
4. ఈ ‘సమకాలీన కన్నడ దళిత కథ’ల ప్రత్యేకత ఏమిటి?
దళితేతరులు ఎంత చక్కగా రాసినా, అవి సానుభూతితో కూడుకుని ఉంటాయి. కానీ, దళితులే రాసినప్పుడు వారి బాధలు, వ్యథలు, కోపాలు, నిస్సహాయత అన్నీ మరింత ప్రామాణికంగా బయటికి వస్తాయి. అందుకే ఈ సంకలనం కోసం దళితులే రాసిన దళిత కథలను ఎన్నుకోవటం జరిగింది. 1968లో దేవనూరు మహాదేవ రాసిన ‘అమ్ముడు పోయినవాళ్లు’ నుంచి 2015లో సంతోష గుడ్డియంగడి రాసిన ‘గొడ్డు కాఫీ’ వరకు మొత్తం 15 కథలున్నాయిందులో.
5. తర్వాతి సంకలనం?
ప్రస్తుతం కన్నడ నుంచి ‘బండాయ’ (తిరుగుబాటు) కథలు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను.
రంగనాథ రామచంద్రరావు
పుస్తక ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్.
అనువాదకుడి ఫోన్: 9290050229