సింగర్ రెనినారెడ్డి
సంభాషణం
చూడగానే ఆమె ఆహార్యం ఆకట్టుకుంటుంది. గొంతు విప్పి పాడిందంటే మనసు ఆమెకు దాసోహమంటుంది. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఆమె... రెనినారెడ్డి. రెక్కలు తొడిగిన పక్షల్లే (కరెంట్), బంతిపూల జానకీ జానకీ (బాద్‌షా), మాటే రాని మౌనం (రౌద్రం), మీ ఇంటికి ముందు (జులాయి) వంటి పాటలతో సంగీత ప్రియుల మనసులు దోచిన రెనినా తన గురించి, తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు...
తెలుగువారై ఉండీ, తమిళంలో ఎక్కువ పాడతారెందుకు?
నేను తెలుగమ్మాయినే కానీ, బెంగళూరులో పుట్టి పెరిగాను. అయితే కన్నడ పరిశ్రమలో అవకాశాలు అంతంతమాత్రం. అందుకే చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. అవకాశాలు అందిపుచ్చుకున్నాను. తర్వాతే తెలుగులో పాడాను. అందుకే తమిళంలో ఎక్కువ పాడుతుంటాను.
పాటతో పరిచయం ఎప్పటి నుంచి?
నాన్న సి.ఎం.స్వామి క్లాసికల్ సింగర్, కంపోజర్. నాటకాలకు దర్శకత్వం కూడా వహించేవారు. అమ్మ కూడా మంచి గాయని. దాంతో చిన్నప్పుడే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. పెద్దయ్యాక సింగర్ అవ్వాలని అప్పుడే ఫిక్సైపోయాను.
ఇప్పటి వరకూ ఏయే భాషల్లో పాడారు? నచ్చిన పాట ఏది?
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, కొంకణి భాషల్లో పాడాను. రౌద్రం చిత్రంలోని ‘మాటే రాని మౌనం’ నేను పాడిన వాటిలో నాకు చాలా నచ్చిన పాట.
మర్చిపోలేని ప్రశంస?
చాలా వస్తుంటాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో చాలామంది పొగుడుతుంటారు. ఒక వ్యక్తి అయితే నా పుట్టినరోజుకి రక్తదానం కూడా చేశారు. మరోసారి అయితే ఇద్దరు దంపతులు నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్లిద్దరికీ చాన్నాళ్లుగా గొడవలట. విడాకులు తీసుకునే వరకూ వెళ్లారట. కానీ నేను పాడిన ‘మాటే రాని మౌనం’ విన్న తర్వాత ఇద్దరూ కదిలిపోయారట. ఆలోచించడం మొదలుపెట్టారట. మీ పాట వల్ల మా పొరపొచ్చాలు పోయాయి, మేం హ్యాపీగా ఉన్నాం అని వాళ్లు చెప్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యక్తి అయితే... తన పార్లర్‌కి నా పేరు, పార్లర్‌లో నా ఫొటో పెట్టుకున్నాడట. ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఉంటాయా అసలు!
విసిగించిన ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా?
నేను ఫేస్‌బుక్‌లో అందరి మెసేజ్‌లకీ సమాధానాలు ఇస్తాను... ఎంతో అభిమానంతో ఇస్తారు కదా అని! కెనడాలో ఉన్న ఓ అబ్బాయికీ అలానే ఇచ్చాను. అయితే ఓసారి స్విట్జర్లాండులో నా షో ఉందని తెలిసి తనూ వస్తానన్నాడు. నా కోసమే అయితే వద్దు, కెనడా వచ్చినప్పుడు నేనే కలుస్తాను అన్నాను. వెంటనే అతడు ఏవేవో పిచ్చి మెసేజులు మొదలుపెట్టాడు. దాంతో బ్లాక్ చేసి పారేశాను. కానీ ఓసారి శ్రీలంకలో కాన్సర్ట్‌కి వెళ్తే సడెన్‌గా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఏదేదో మాట్లాడాడు. దేవుడి దయవల్ల తప్పించుకున్నాను. అతను గుర్తొస్తే ఇప్పటికీ చెమటలు పోస్తాయి నాకు!
మనసు గెలుచుకున్నవారెవరూ లేరా?
ఇంకా లేదు. మంచివాడు, నిజాయతీపరుడు, నన్నూ నా ప్రొఫెషన్‌నీ అర్థం చేసుకున్నవాడు దొరికితే మనసులో చోటిస్తా. అంతవరకూ పాటనే ప్రేమిస్తా!
మీరు ఆహార్యం పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తారు...
నిజం చెప్పొద్దూ... నాకు మొదట్నుంచీ గ్లామర్ మీద శ్రద్ధ కాస్త ఎక్కువే. షోలు ఉన్నప్పుడు దుస్తులు డిజైన్ చేయించుకుంటాను. హెయిర్ స్టయిల్, మేకప్ మీద చాలా శ్రద్ధ పెడతాను. పాటలు వినాలంటే సీడీలో అయినా వింటారు కదా! కాన్సర్ట్‌కి వస్తున్నారు అంటే మనల్ని చూడ్డానికే వస్తారు. కాబట్టి వారి కళ్లకు అందంగా కనిపించాలి అన్నది నా ఉద్దేశం.
మీ గ్లామర్ చూసి నటించమని ఎవరూ అడగలేదా?
నాకైతే ఇష్టమే. కానీ నాన్నగారే ఒప్పుకోవడం లేదు. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా వదిలేశాను. కానీ ‘గజినీ’లో అసిన్ చేసిన రోల్ లాంటిది దొరికితే నాన్నను ఒప్పించి నటించేస్తాను.
ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తోన్న కోరికేదైనా ఉందా?
ఇళయరాజా దగ్గర ఇంకా పాడలేదు. ఆ చాన్‌స కోసం చూస్తున్నాను. రెహమాన్‌తో పని చేసే చాన్స్ వచ్చినా తీరిక లేక మూడు నాలుగుసార్లు మిస్ అయ్యాను. ‘కడలి’ తెలుగు వెర్షన్లో పాడాను కానీ ఇంకా ఆయనతో పని చేయాలనుంది.
భవిష్యత్ ప్రణాళికలు...?
ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలని ఉంది. కానీ విదేశాల్లో మాదిరిగా మన మార్కెట్లో ప్రైవేట్ ఆల్బమ్స్ నిలబడటం లేదు. సంగీతమంటే సినిమా సంగీతమే అన్న పరిస్థితి వచ్చింది. నిజానికి సినిమా పాటలు దర్శకుడికి, నిర్మాతకి నచ్చినట్టుగా చేస్తారు. అదే ప్రైవేట్ ఆల్బమ్‌కి అయితే, ఆ సంగీతం మనసులోంచి వస్తుంది. కాబట్టి కచ్చితంగా గొప్పగా ఉంటుంది. అయితే మన దగ్గర వాటికి పెద్ద ఆదరణ, మార్కెట్ రెండూ లేవు.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
మన సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించాలి. మనం పాశ్చాత్య సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం. మరి మన సంగీతాన్ని వాళ్లకూ రుచి చూపించాలి కదా! వాళ్లు అక్కడ కొన్ని రాగాలను మాత్రమే వాడతారు. కానీ మనకు కొన్ని వేల రాగాలున్నాయి. వాటన్నికీ వారికి పరిచయం చేయాలి. భారతీయ సంగీత విశిష్టతను ప్రపంచమంతా చాటాలి. ఇది చిన్న విషయం కాదని నాకు తెలుసు. అయితే నాలాంటి కొందరు చేతులు కలిపితే ఆ రోజు ఎప్పటికైనా వస్తుంది అని నా నమ్మకం!
- సమీర నేలపూడి