Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి! | Creator of Story Hour Founder Neelima Penumurthy special story | Sakshi
Sakshi News home page

Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి!

Published Thu, Apr 25 2024 4:58 PM | Last Updated on Thu, Apr 25 2024 4:58 PM

Creator of Story Hour Founder Neelima Penumurthy special story - Sakshi

స్కూల్లో మ్యాథ్స్‌ అవర్‌... సైన్స్‌ అవర్‌ అంటుంటాం. చట్టసభలో జీరో అవర్‌ అనే మాట వింటుంటాం. స్టోరీ అవర్‌... ఈ గంట ఎక్కడ నుంచి వచ్చింది?
నీలిమ పెనుమర్తి ఆలోచన నుంచి వచ్చింది. రోజుకో గంట కథలు వినమని చెప్తున్నారీమె. యూకేలో ఆచరణలో పెట్టి... ఇండియాకి తెచ్చారు. విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆడియో బుక్స్‌తో స్వచ్ఛమైన భాష నేర్పిస్తున్నారు.

 హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నీలిమ ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పిల్లల పెంపకంలో కథలు కూడా ఒక భాగం అయి తీరాలని నమ్ముతారామె. మనదేశంలో స్కూల్‌ కరికులమ్‌లో పిల్లలకు కథలు లేక΄ోవడం విచారకరం అంటారామె. కథ ్రపాధాన్యం తెలిసిన అభివృద్ధి చెందిన దేశాలు పిల్లల రోజువారీ క్రమంలో ఓ గంట కథల కోసం కేటాయిస్తున్నాయని, మన దగ్గర అది లోపించడంతో ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ ఒక విషయాన్ని చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించగలిగిన నైపుణ్యం కొరవడుతోందన్నారు నీలిమ. భాష ఏదైనా ఆ భాషలో పదాలను స్పష్టంగా ఉచ్ఛరించడం అలవాటు చేయాలంటే ఇంట్లో తల్లిదండ్రులు అంత స్వచ్ఛంగా మాట్లాడే నేపథ్యం ఉండాలి. ఆ వెసులుబాటు లేని పిల్లలకు తన ప్రయత్నం మంచి భాషను, చక్కటి భావ వ్యక్తీకరణను నేర్పిస్తుందన్నారు నీలిమ. ఏడేళ్ల కిందట ‘స్టోరీ అవర్‌‘ ఆలోచనకు బీజం పడిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నా రామె.

ఓ గంట నిడివిలోనే కథ
 ‘‘నాకు లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌లో కెమిస్ట్రీలో ఎంఎస్‌ చేయడానికి స్కాలర్‌షిప్‌ వచ్చింది. మా వారు కూడా స్కాలర్‌షిప్‌ మీద లండన్‌లోనే వచ్చారు. అలా 30 ఏళ్ల కిందట యూకేకి వెళ్లడం, చదువు, ఉద్యోగం, ఇద్దరు పిల్లలతో అక్కడే సెటిలయ్యాం. రెండవసారి గర్భిణిగా ఉన్నప్పుడు పీహెచ్‌డీలో విరామం తీసుకున్నాను. ఆ విరామం నా ఆలోచనలను కథల మీదకు మళ్లించింది. పెద్ద బాబుకి కథలు చెప్పడం మొదలుపెట్టాను. అమరచిత్ర కథ చదవడం అలవాటు చేశాను. అదే చిన్నబాబుకి కూడా అలవడింది. మా అబ్బాయిలిద్దరూ గ్రీక్‌ ΄ûరాణిక గ్రంథాలను కూడా చదివారు. వాళ్లిద్దరి మాటల్లో ఆ పాత్రల గురించిన చర్చ వస్తుండేది.

అప్పుడు మన రామాయణాన్ని పరిచయం చేశాను. అదే సమయంలో మా పెద్దబ్బాయి స్కూల్‌ వాళ్లిచ్చిన ్రపాజెక్ట్‌ కోసం ఒక స్టోరీ బోర్డ్‌ చేయాల్సి వచ్చినప్పుడు రామాయణం ఇతివృత్తంగా చేశాడు. ఆ తర్వాత పిల్లలకు సెలవుల్లో రామాయణం మీద వాళ్ల వెర్షన్‌ రాయమని చె΄్పాను. ఆ టాస్క్‌లో మరో చాలెంజ్‌... కథనం గంటకు మించరాదు. తమకు తోచినట్లు ఎడిట్‌ చేసుకుంటూ సీతారామలక్ష్మణులు యుద్ధం తర్వాత విజేతలై అయోధ్యకు రావడం దీపావళి వేడుక చేసుకోవడంతో ముగింపు ఇవ్వాలన్నమాట. ఆ సాధన ఆడియో బుక్‌ ఆలోచనకు రూపమిచ్చింది.

పిల్లలే పాట రాశారు!
మాల్గుడి డేస్‌ వీడియోలకు సిగ్నేచర్‌ ట్యూన్‌ ఉన్నట్లే మా ఆడియో బుక్స్‌కి కూడా ట్యూన్‌ ఉండాలని పాట కోసం ప్రయత్నించాను. పిల్లలకు ఇస్తే ఎలా రాస్తారో చూద్దామని యూకేలో శచి అనే అమ్మాయికిచ్చాను. తాను రామాయణం కథను ఒక్క వాక్యంలో ‘వారధి నిర్మాణం సీత మీద రాముడికి ఉన్న ప్రేమకు ప్రతిబింబింబం’ అనే భావంతో రాసింది. అలాగే భారతీయ మూలాలు ఏ మాత్రం లేని ‘ఎవీ సిమన్స్‌’ అనే అమ్మాయి ‘లైట్‌ ద ల్యాంప్స్‌’ పేరుతో సీతారాములు విజేతలుగా అయోధ్యకు వచ్చి దీపావళి వేడుక చేసుకోవడాన్ని రాసింది. మంథర విషపూరిత వచనాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో వివరించింది.

క్రియేటివ్‌గా సైన్స్‌ పాఠాలు
 బాల్యంలో మేము బాలానందం వినేవాళ్లం. సరళంగా సాగే కథనాలు పిల్లల్ని అలరించేవి. నా ఆడియోబుక్స్‌ కూడా సులువుగా ఉంటాయి. ఇవన్నీ ‘స్టోరీ అవర్‌ డాట్‌ కో డాట్‌ యూకే’ వెబ్‌సైట్‌లో ఉచితంగా ఉన్నాయి. భాష శుద్ధంగా ఉంటే ఆలోచనలు కూడా అంతే శుద్ధంగా ఉంటాయని నా అభి్రపాయం. మంచి భాష మాట్లాడితే వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల కోసం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే... మంచి భాష ద్వారా చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మంచి ఉచ్చారణ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. అందుకే సైన్స్‌ సబ్జెక్ట్‌ని కూడా ఈ క్రియేటివ్‌ మీడియం ద్వారా వివరించాలనేది నా ఆకాంక్ష’’ అని తన ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించారు నీలిమ పెనుమర్తి.  

సమయం లేని తల్లిదండ్రుల కోసం...
ఇప్పుడు ఉద్యోగాలు దాదాపుగా అందరి జీవితాలనూ సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కథ చె΄్పాలని ఉన్నప్పటికీ కొంతమందికి అందుకోసం ఓ గంట సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటోంది. వాళ్లకు ఉపయోగపడేటట్లు కథలకు ఆడియో బుక్‌ రూపమిచ్చాను. దానిని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో తెచ్చాను. మా పిల్లలు శ్రేయాస్, ఆయుర్‌ ఇద్దరూ హిస్టరీ చదివారు. అక్కడ హిస్టరీ అంటే రష్యన్‌ విప్లవం, ఫ్రెంచ్‌ విప్లవం, ప్రపంచ యుద్ధాలు ప్రధానంగా ఉంటాయి.

మా పిల్లలు అలాగే యూకేలో ఉన్న భారతీయమూలాలున్న పిల్లలకు మన చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశంతో ‘ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ ఫ్రమ్‌ ద మొఘల్స్‌ టు ద మహాత్మా’ పేరుతో మరో ఆడియో బుక్‌ చేశాను. ఆ స్టోరీ ఈస్ట్‌ ఇండియా కంపెనీ మనదేశంలో అడుగు పెట్టడం నుంచి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సముపార్జన వరకు సాగింది. అలాగే మన సామెతలను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నమే ‘తాతమ్మ కథలు’. మా అమ్మ, నాన్న, అత్త, మామగారితో ఒక్కో సామెతకు ఒక్కో కథ రాయించి వాటిని ఐదు నిమిషాలకు మించకుండా ఎడిట్‌ చేసి రికార్డ్‌ చేశాను. మొత్తం పన్నెండు కథలు, గంట ఆడియో.

ఈ కథలకు నాకు మాల్గుడి డేస్‌ స్ఫూర్తి. యూకేలోని తెలుగు కుటుంబాల పిల్లలు ఈ కథలను వినడం మొదలు పెట్టిన తర్వాత తొలి రోజుకి పన్నెండవ రోజుకీ వారి ఉచ్చారణ మారి΄ోయింది. కథకు అంతటి శక్తి ఉంటుందనే నా నమ్మకం నిజమేనని నిరూపితమైంది. తోలుబొమ్మలతో చేసిన ప్రయోగానికి చాలా ఖర్చయింది, కానీ అది కూడా సంతృప్తినిచ్చింది. ఆరు పాత్రలతో కథను అల్లుకుంటూ రాసుకున్నాం. ఆడియో బుక్‌ అనువాదాలకు హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయ (ఉప్పల్‌) విద్యార్థులు, బేగంపేటలోని దేవనార్‌ (అంధ విద్యార్థుల పాఠశాల) స్కూల్‌ విద్యార్థులు గళమిచ్చారు.
– నీలిమ పెనుమర్తి, స్టోరీ అవర్‌ రూపకర్త

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు : అనిల్‌ కుమార్‌ మోర్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement