ఇప్పటి వరకు మనకు తెలిసింది పిల్లలకు కథ చెప్పి వాళ్లను ఊహా లోకంలో విహరింపచేయడమే. అది కాకపోతే టీవీలో, యూ ట్యూబ్‌లో కామిక్ వీడియోలు చూపించి కథ తెలియ చేయడం తెలుసు. ఇప్పుడు కొత్త ట్రెండ్ పిల్లల్ని కథల్లో జీవింపచేయడం. ఆ ట్రెండ్‌ను సృష్టించింది.. ‘అమర్ చిత్ర కథ అలైవ్’. ఓ హనుమంతుడు, ఓ శ్రీకృష్ణుడు వంటి పాత్రలను ఆవాహన చేసుకుని పిల్లలు ఇంటిని పీకి పందిరి వేయకుండా, వాళ్ల సృజనాత్మకతకు చక్కటి పందిరి వేయడానికి అనువైన రూపకల్పన ఇది.
రాణా రతన్ సింగ్ రాజస్థాన్‌లో ఓ రాజ్యానికి రాజు. అతడి గారాల కూతురు మీరా. ఆమె ఓ రోజు అంతఃపురంలో నుంచి రాజవీథి నుంచి వెళ్తున్న పెళ్లి ఊరేగింపుని చూసింది. ఏనుగు అంబారీ మీద ఊరేగుతున్న వరుణ్ని చూసింది. పెళ్లంటే... ఒక అమ్మాయి వధువులా అలంకరించుకుని ఒద్దికగా ఉంటుంది. ఒక అబ్బాయి వరుడి అలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు... అని అర్థం చేసుకుంది ఆరేళ్ల మీరా. ‘అమ్మా! నాకు వరుడు ఎవరు’ అని వాళ్లమ్మను అడిగింది. ఈ సన్నివేశంతో మొదలైన భక్త మీరాబాయి కథ, ఆమె వృద్ధాప్యం వరకు సాగుతుంది. కృష్ణుడి పట్ల ఆమె మధురభక్తిని బొమ్మలతో కళ్లకు కడుతుంది అమరచిత్ర కథ.
అలాగే హనుమాన్ కూడా. పిల్లలకు ఇష్టమైన పాత్ర. ఉదయిస్తున్న ప్రభాత భానుడిని పండుగా భావించిన బాల హనుమాన్ ఆ పండుని అందుకోవడానికి గాల్లోకి ఎగురుతాడు. ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు తమను తాము హనుమంతుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసుకుంటారు. హనుమంతుడు లంకాదహనం చేస్తున్న బొమ్మలను చూస్తూ... తోక ఒక్కటి లేదన్నమాటే కానీ ఇంట్లో అంతటి బీభత్సాన్ని సృష్టిస్తారు గడుగ్గాయిలు. అమరచిత్రకథ రూపకర్త అంకుల్ పాయ్ సృష్టించిన పిల్లల ప్రపంచం ఇది.
కథల మామయ్య
అందరికీ మేనమామ చందమామ. అయితే పిల్లలకు కథలు చెప్పే మామ అనంత్‌పాయ్. అంకుల్ పాయ్ పేరుతో పిల్లలకు కథలు చెప్పిన మామయ్య అనంత్‌పాయ్. 1967లో అనంత్‌పాయ్ చెప్పిన కథలకు ‘అమరచిత్ర కథ అలైవ్’ పేరుతో భౌతిక రూపం వచ్చిందిప్పుడు. దేశంలోనే తొలి ప్రయత్నమిది. పిల్లలకు కథ చెప్పడమే కాదు, కథలో దాగి ఉన్న పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయించడంతోపాటు, జీవననైపుణ్య కళలను పరిచయం చేసే ప్రయత్నం కూడా ఇది. ఓ హనుమంతుడు, శ్రీకృష్ణుడు పాత్రలను ఆవాహన చేసుకుని పిల్లలు ఇంటిని పీకి పందిరి వేయకుండా, వాళ్లే పందిరి వేయడానికి అనువైన ఇంటి రూపకల్పన ఇది.
ఎవరికి తోచినట్లు వాళ్లు
వేసవి సెలవులు కావడంతో ‘అమరచిత్ర కథ అలైవ్’ పిల్లలకు ఇది ఓ పెద్ద ఆటవిడుపు. ఒక్కోగదిలో నలుగురైదుగురు పిల్లలు కలిసి ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమై ఉన్నారు. వాల్మీకి గదిలో స్టోరీ టెల్లింగ్, తాన్‌సేన్ గదిలో మ్యూజిక్ క్లాస్, చిత్రలేఖ గదిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఆమ్రపాలి గదిలో ట్రైనర్‌లు పిల్లలకు భరతనాట్యం, యోగ, కలరిపయట్టు వంటి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్‌లో పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ సెక్షన్‌లో ప్రింటింగ్ బ్లాక్స్‌తో కుస్తీ పడుతున్నారు, మరికొందరు మూన్ సర్ఫేస్‌ను వాళ్ల ఊహ మేరకు పేపర్ క్రాఫ్ట్ చేస్తున్నారు. దర్జీ కార్నర్‌లో రంగురంగుల గుండీలు, దారాలను మ్యాచ్ చేస్తూ టైలరింగ్‌తో పరిచయం పెంచుకుంటున్నారు.
పై ఫ్లోర్‌లో ఉంది పాటరీ సెక్షన్. పిల్లలు మట్టితో కుండలు చేయడానికి ప్రయాస పడుతున్నారు. ఆ పక్కనే ఉన్న స్కల్ప ్చర్ అండ్ మాస్క్ మేకింగ్ విభాగంలో ఓ పాపాయి దీపావళి ప్రమిద చేసి సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకుంటోంది. మరో గదిలో సంస్కృతం నేర్చుకుంటూ కొందరు, లైబ్రరీలో ఉన్న కథల పుస్తకాలు తీసుకుని చదువుకుంటున్న పిల్లలు... మొత్తానికి ‘అమర్ చిత్రకథ అలైవ్’ ప్రాంగణం అంతా ఆహ్లాదంగా ఉంది. బయట ఆర్చరీ పాయింట్ ఉంది. గురి బాణాలు వేస్తున్న విలుకాళ్లు అర్జునుడిని మించి పోవడం జరగదేమో కానీ ఓ లింబారామ్, మరో దీపికా కుమారి తయారయ్యే అవకాశం మాత్రం ఉంది.
ఈ తరం కృష్ణులు
‘ఫ్యూచర్ గ్రూప్’ అధినేత కిషోర్ బియాని, రానా దగ్గుబాటి, అమర చిత్ర కథ గ్రూప్ సంయుక్తంగా డిజైన్ చేసిన థీమ్.. ‘అమర చిత్ర కథ లైవ్’ శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపుని ఆశ్రమంలో 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారు. ప్రతి కళనూ ఒక కథరూపంలో నేర్చుకున్నారు. లైఫ్‌డిజైనింగ్ స్కిల్స్‌ని కథల రూపంలో నేర్పించాడు సాందీపుడు. ఆ కథల్లో పిల్లల్ని జీవింపచేస్తోంది అమర చిత్ర కథ అలైవ్. కాలదోషం పట్టిన కళల్ని వదిలేసి 32 కళలను మాత్రమే పిల్లలకు నేర్పిస్తున్నారు.
– వాకా మంజులారెడ్డి
మాట్లాడే కుందేళ్లు
‘అమర చిత్ర కథ అలైవ్’ లెర్నింగ్ సెంటర్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, 79వ రోడ్‌లో ఉంది. లైబ్రరీలో కృష్ణ– రుక్మిణి, పృథ్విరాజ్ చౌహాన్, చంద్ర గుప్త మౌర్య, విక్రమాదిత్య, అష్టావక్రుడు, బీర్బల్, షాజహాన్, రాణి– ఝాన్సీ, కృష్ణదేవరాయ, ద హిస్టారిక్ సిటీ ఆఫ్ ఢిల్లీ, షేర్‌షా, ద గోల్డెన్ మంగూస్, తంజావూరు.. ఇలాంటి కథల పుస్తకాలెన్నో ఉన్నాయి. ఈ కథల్లోని పాత్రలు గోడలమీద పెయింటింగ్స్ రూపంలో ప్రాణం పోసుకుని ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ రూమ్‌లో ఉన్న పిల్లలు ఆ పాత్రల్లో ఒదిగిపోయి ఉన్నారు. క్లాత్‌తో చేసిన జంతువుల మాస్కులను వేళ్లకు తొడుక్కుని తమను తాము ఆ పాత్రలో లీనం చేసుకుని మరీ కథలో జీవిస్తున్నారు.
కుందేలు, రామచిలుక, ఏనుగు, చిట్టి ఎలుగుబంటి.. ఇలా ఒక్కో పాపాయి ఒక్కో పాత్రను ఆవాహన చేసుకుని ఆ పాత్ర చెప్పాల్సిన డైలాగ్స్ చెప్తూ అమర చిత్ర కథలకు ప్రాణం పోస్తున్నారు. మధ్యలో కిలకిల నవ్వుకుంటున్నారు. కోట్లు కుమ్మరించినా అంతటి స్వచ్ఛమైన నవ్వు నవ్వలేరు పెద్దవాళ్లు. లక్షలు ఫీజు వసూలు చేసే స్కూళ్లు కూడా పిల్లల్ని రోజుకో గంటసేపు అలా నవ్వించలేవు. నవ్వడానికి ఎటువంటి శషబిషలు లేని బాల్యం కడుపారా నవ్వాలి. నవ్వడానికి ఓ కథ చెప్పే తీరిక లేని పెద్దవాళ్లున్నప్పుడు నవ్వించడానికి, పిల్లల్ని నవ్వులో జీవింపచేయడానికి చేసిన గొప్ప ఆలోచన ఇది.
Comments
Please login to add a commentAdd a comment