హోసూరులో కథలు వరదలెత్తుతున్నాయి. తమిళ పరిష్వంగంలో నలిగిపోతున్న తెలుగు ప్రాంతం హోసూరు. కృష్ణగిరి జిల్లాలో ఉంది. బెంగళూరుకు కూతవేటు దూరం. అక్కడ తెలుగువారున్నారన్న సంగతి, అది తెలుగు ప్రాంతం అన్న సంగతి చాలామంది తెలుగువారికే తెలియదు. మేమున్నాం ఇక్కడ అని వాళ్లు అరిస్తే ఎవరూ పట్టించుకోరు. అందుకే వాళ్లు సాహిత్యంలోకి తమ గళాల్ని (కలాల్ని) మళ్లించారు. తమ ప్రాంతం భాష, యాస, సంస్కృతి, తెలుగు వారు మర్చిపోయినా తాము మర్చిపోని కట్టుబాట్లు అన్నింటిని తాము ఎలా కాపాడుకుంటున్నామో కథలు రాస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతం నుంచి ‘ఎర్నూగుపూలు’, ‘తెల్లకొక్కెర్ల తెప్పం’ వంటి పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు నంద్యాల నారాయణరెడ్డి రాసిన ‘ఇరులదొడ్డి బతుకులు’. హోసూరుకు సమీపంలోని ఒక అడవి ప్రాంతంలో ఈ రచయిత గడిపిన బాల్యాన్ని ఈ కతలన్నీ చూపుతాయి. చెట్లు, పుట్టలు, సీళు కుక్కలు, ఏనుగులు, కొమ్ముల ఆవులు అడపా దడపా గాండ్రించే పులులూ అన్నెం పున్నెం ఎరగని అమాయకపు మనుషులు... వీళ్లంతా ఈ కథల్లో కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందులో వాడిన భాషది కూడా ఒక తెలియని రుచి. మాండలికం అంటే అశ్లీలమైన పదాలు వాడాలనీ స్త్రీలను కించపరిచే పదాలు ఉన్నదే మాండలికం అనీ స్థిరపరిచిన కొన్ని రకాల రచనలకు ఈ కథలు ఒక మెరుగైన జవాబు. కాలుష్యం గాలి నుంచి కాసేపు తప్పించుకోవాలంటే ఈ కథలు వీచే అడవిగాలిని ఆహ్వానించండి.
వెల: రూ. 100; ప్రతులకు: 09360514800 స్త్రీ హృదయం: గాజు నది
‘ఏమీ రాయకపోతే/ ఏదీ రాయలేకపోతే
ఏదో కోల్పోయిన వెలితి
కలల నిండా కలం నిండా
స్త్రీల కన్నీటి సిరాతో
చైతన్యించిన దీపశిఖల ప్రజ్వలనమే కవిత్వం’
అనే కవయిత్రి రాయకుండా ఉండగలదా? ఏదో ఒక బాధను కవిత్వం చేయకుండా ఉండగలదా? స్త్రీ వాద రచయిత్రులలో ఒక ప్రత్యేకతను సాధించుకున్న కవి శిలాలోలిత. సరళంగా చెప్తూనే గట్టిగా నిర్మొహమాటంగా కూడా మాట్లాడే కవిత్వం ఆమెది. అతడు - ప్యాంటూ చొక్కా తొడుక్కుని వెళతాడు. ఆమె - ఇంటిని కూడా తొడుక్కుని వెళుతుంది... అనడంలో స్త్రీని వదలని ఇంటి చాకిరి స్త్రీని పట్టి ఉంచే బంధనాలు ఎలాంటివో సూటిగా చెప్తారామె. ‘ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేమో’ అనే వేదన ఆమె కవిత్వం. ద్రవీభవించే, ఘనీభవించే, ప్రతిబింబాన్ని చూపే, భళ్లున బద్దలయ్యే స్త్రీ హదృయం వంటి ఈ గాజునది కవిత్వాన్ని చదవండి.
వెల: రూ.రూ.80; ప్రతులకు: 9391338676
సాహిత్య పత్రిక చినుకు
గత ఎనిమిదేళ్లుగా తెలుగు సాహిత్యానికి మెరుగైన వేదికగా వెలువడుతున్న మాస పత్రిక ‘చినుకు’. కథలు, కవితలు, సాహిత్య చర్చలు... ప్రామాణిక స్థాయిలో ప్రచురిస్తూ సాహిత్యాభిమానులకు చేరువైన పత్రిక ఇది. అంతే కాకుండా ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో వార్షిక సంచిక వెలువరించి తెలుగులో వార్షిక సాహిత్య సంచికలకు ఉన్న లోటును తీరుస్తోంది. చిన్నా పెద్దా రచయితలు చాలా మంది తమ రచనలు ఈ పత్రికలో చూసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఇది సాధించిన గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. సంపాదకుడు నండూరి రాజగోపాల్. వివరాలకు: 98481 32208
సాహిత్య డైరీ
నల్గొండలోని మారుమూల గ్రామం కదిరేని గూడెం నుంచి ఇవాళ అంతర్జాతీయ చిత్రకళా ప్రపంచంలో తనదైన ముద్రను వేసే స్థాయికి ఎదిగిన చిత్రకారుడు ఏలే లకష్మణ్. దేశ విదేశాల్లో ఆయన ఆర్‌ట ఎగ్జిబిషన్ జరుగుతున్నా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అక్టోబర్ 5 నుంచి 15 వరకూ ‘ఫెలో ట్రావెలర్‌స’ పేరుతో ఆయన చిత్రకళా ప్రదర్శన జరగనుంది.
వేదిక: కళాకృతి, రోడ్ నం. 10, బంజారాహిల్‌స. 040 - 66564466
రూ. 12 వేల నగదు బహుమతి కలిగిన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ (సిరిసిల్లా) కోసం కవిత్వ సంపుటాలు ఆహ్వానిస్తున్నారు. వివరాలకు : 98490 12459
అంగడి సరుకు: మండి
‘మండి’ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్‌లో సరుకు అమ్ముతారు. అయితే తరతరాలుగా ఈ ప్రపంచంలో అమ్ముడుపోయే ఒక మానవ సరుకు ఉంది - స్త్రీ. హైద్రాబాద్‌లో జరిగే ఈ కథలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ‘కోఠా’ (వ్యభిచార కేంద్రం) ఉంటుంది. నగరం పెరిగి పెద్దదయ్యి ఆ ప్రాంతంలో ఒక కొత్త మార్కెట్‌ను కట్టాలనుకోవడంతో ఆ ‘కోఠా’కు ముప్పొచ్చి పడుతుంది. దానిని ఖాళీ చేయాలి. కాని ఆ ఆడవాళ్లు, పొట్టకూటి కోసం పడుపువృత్తి చేసుకునే ఆ నిర్భాగ్యులు, నిరక్షరాస్యులు ఎక్కడికెళ్లాలి? చివరకు వాళ్లను ఊరి అవతలకు తరిమేస్తారు. ఆశ్చర్యం. అక్కడ ఎప్పటితో ఒక బాబాగారి సమాధి బయటపడి అదొక రద్దీ క్షేత్రం ఏర్పడుతుంది. మళ్లీ ఆ స్థలానికి మార్కెట్ వ్యాల్యూ వచ్చింది. దాంతో అక్కణ్ణుంచి వాళ్లను తిరిగి తరిమేయాలి. లేదా ఆ చీమల పుట్టను పాములు ఆక్రమించుకోవాలి. చివరకు అదే జరుగుతుంది. విషాదమైన ఈ కథను వ్యంగ్యంగా చెప్పడం వల్ల అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ చూస్తాం. ప్రసిద్ధ పాకీస్తానీ రచయిత గులామ్ అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే కథానిక ఆధారంగా శ్యామ్ బెనగళ్ తీసిన సినిమా (1983) ఇది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ పోటీ పడి చేసినా షబానా స్థిరత్వం అసామాన్యం అనిపిస్తుంది. ‘మేమున్నాం కాబట్టే ఈ సమాజం ఈ మాత్రమైనా ఉంది’ అంటుంది ఈ సినిమాలో షబానా. ‘మేం తప్పు చేస్తున్నామా? మీ మొగాళ్లను ఇంట్లో కట్టి పెట్టండి చేతనైతే. మమ్మల్నెందుకంటారు?’ అని నిలదీస్తుంది నలుగురినీ. దానికి సమాధానం లేదు. ఉండదు కూడా. మర్యాదకరమైన సాహిత్యం చూడ నిరాకరించే ఈ కురుపు సలపరం తెలియాలంటే యూ ట్యూబ్‌లో Mandi (film) అని కొట్టి చూడండి.
పాత సంగతి
భమిడిపాటి కామేశ్వరరావు అభిమానులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ‘అయ్యా... తమకు సన్మానం చేసి బిరుదు ప్రదానం చేద్దామనుకొంటున్నాం’ అన్నారు. అందుకు ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. వాళ్లు మరీ బలవంతం చేసేటప్పటికి - ‘కొంతమంది బిరుదులు తమకు తాము తగిలించుకుంటారు. మరికొంతమంది బిరుదులు సాహిత్య సంఘాలకు విరాళాలు ఇచ్చి కొనుక్కుంటారు. మొదటి పద్ధతి బిరుదు స్వయంగా తగిలించుకోవడం నాకిష్టం లేదు. రెండో పద్ధతిలో బిరుదు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మీకు మీరుగా బిరుదు ఇస్తున్నారు కనుక సరే అలాగే కానివ్వండి’ అన్నారు. అలా ఆయనకు ‘హాస్యబ్రహ్మ’ అనే బిరుదు లభించింది. ఒకసారి క్లాస్‌లో హోమ్‌వర్‌క చేయని పిల్లలను తలా ఒక దెబ్బ వేస్తున్నారట. క్లాసులో వారబ్బాయి కూడా ఉన్నాడు. ‘హోమ్‌వర్‌క ఎందుకు చేయలేదు’ అనంటే ‘మా కుటుంబం అంతా పెళ్లికి వెళ్లిందండి’ అన్నాట్ట కుమారుడు. ఆయన కుమారుడికి ఒక దెబ్బ వేసి, పరీక్షలు దగ్గర పడుతున్న సంగతి పట్టించుకోకుండా నిన్ను పెళ్లికి తీసుకెళ్లినందుకు ఇదిగో నాక్కూడా దెబ్బ అని చేతి మీద ఒక దెబ్బ కొట్టుకున్నారట. ఇలా భమిడిపాటి ఉదంతాలు అనేకం.
న్యూ రిలీజెస్
ది హంగ్రీ ఘోస్‌ట్స The Hungry Ghosts
చేసిన పాపాల నుంచి నిష్కృతి ఉంటుందా? ఈ జీవితంలో లెక్కకు మించి కోరికలు ఉన్నవారు చనిపోయాక దెయ్యాలుగా మారతారట. కాని వాళ్లకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుందట. కాని ఏమీ తినలేకపోతారట. వింటేనే భయం వేసే ఇలాంటి కథలు తన నాయనమ్మ నోటి గుండా విని పెద్దవాడయ్యాడు శివన్. కాని అతడి జీవితంలో కూడా అతడి నిమిత్తం లేకుండా ‘పాపం’ జరిగింది. అతడు ‘గే’. తన స్వదేశం శ్రీలంకను వదిలి కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. కాని ఏదో అసంతృప్తి, పాపభీతి నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన బౌద్ధకథలు వెంటాడుతూనే ఉన్నాయి. అతడు తిరిగి కొలంబో బయలుదేరుతాడు.
తర్వాత ఏం జరుగుతుంది? జీవితంలో ఉండాల్సిన వెతుకులాట, కనుగొనడం, అర్థం చేసుకోవడం, వచ్చిన సంఘర్షణలను దాటి ముందుకు వెళ్లడం, వదలక పట్టుకున్న కోరికల దెయ్యాలను వదిలించుకోవడం వీటన్నింటి సమాహారమే శ్యామ్ సెల్వదురై రాసిన నవల ‘ది హంగ్రీ ఘోస్‌ట్స’. ఇంగ్లిష్‌లో రాసే శ్రీలంక రచయితలు భారతీయ రచయితలతో సమానంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు. వాళ్లలో శ్యామ్ కూడా ఒకడు. బాగుంది. రెండు కోట్ల మంది ఉన్న శ్రీలంక నుంచి అంతమంది రచయితలు వస్తే ఇన్ని కోట్ల మంది ఉన్న తెలుగువారి నుంచి ఎంత మంది రావాలి? పోనీలెండి. మనకెందుకు? నవల చదవండి.
The Hungry Ghosts, Shyam Selvadurai, Penguin Viking, Rs. 599
కొత్త పుస్తకం: మలినం అంటని మాండలిక కతలు.. ఇరులదొడ్డి బతుకులు
Published Mon, Sep 30 2013 12:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement