
తెలుగులో సుప్రసిద్ధమైన నవలల్లో ఒకటి రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘అల్పజీవి’. ఇది చదివిన వారందరికీ సుబ్బయ్య పాత్ర, చైతన్యస్రవంతి శిల్పం మాత్రమే గుర్తుంటాయి. కానీ అందులో కథకు అతి కీలకమైన స్త్రీ పాత్ర ఉంది. ఆమే మనోరమ. నవలలో వస్తువు సుబ్బయ్యలోని ఆత్మన్యూనత. అదే ఆ పాత్రను అల్పజీవిని చేసిన అంశం.
ఆ ఆత్మన్యూనత తగ్గడానికి ప్రేరణ మనోరమ సాన్నిహిత్యం. అందరిచేతా ‘నంగిరి పింగిరి గాడు’, ‘భయస్థుడు’, ‘అసమర్థుడు’ అనిపించుకున్న సుబ్బయ్య, భార్య చేత ‘మగడు మగాడు కాకపోతే భార్యల గతి ఇంతే’ అని ఈసడించుకోబడ్డ సుబ్బయ్య, నవల చివర్లో ‘ఈ ఆడది కష్టంలో ఉందని తెల్సుకుందికి అట్టే కష్టం లేదు... చేతనైతే సాయం చేయవచ్చు’ అని మనోరమ గురించి అనుకునే స్థాయికి ఎదగడానికి, తన అల్పత్వాన్ని అధిగమించడంలో తొలి అడుగు వేయడానికి కారణం ఆ మనోరమే.
మనోరమను ‘నల్లచీర మనిషి’ అని పరిచయం చేస్తాడు రచయిత. స్కూలు టీచరు అని చెబుతాడు. ఆమె గతం మనకుగానీ, సుబ్బయ్యకు గానీ చెప్పడు. మాట తీరును బట్టి కలుపుగోలు మనిషి, ముప్ఫయ్యో పడిలో ఉన్న అందమైన స్త్రీ అని మాత్రమే ఆ పరిచయంలో అర్థమవుతుంది.
మనోరమ తెలుగు నవలాసాహిత్యంలోనే విలక్షణమైన పాత్ర. కొంతవరకూ మార్మిక పాత్ర కూడా. నవలలో సుబ్బయ్యను మనిషిలా చూసిన ఏకైక వ్యక్తి. అతన్ని అన్ని బలహీనతలతో సహా అభిమానించిన వ్యక్తి. ఏ ఫలాపేక్ష లేకుండా అతని కష్టాలన్నీ సానుభూతితో వినడమే కాక, అతనికి శారీరకంగానూ దగ్గరైన వ్యక్తి. అతని ప్రాణానికి కంటకుడిగా మారిన గవరయ్యను తన ఊరివాడన్న చిన్న సెంటిమెంటును గుర్తుచేసి, నచ్చజెప్పి, సుబ్బయ్యకు ఆపద తప్పించిన ఉపకారి.
మనశ్శాస్త్రవేత్త ఆల్ఫెడ్ర్ ఆడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఆత్మన్యూనతకు లోనై, సమాజం నుంచి పారిపోవాలనుకునే వ్యక్తికి కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి గానీ ఒక ఆధారం, ఊరట లభిస్తే ఆ బలహీనత నుంచి కోలుకుంటారు. ఆ ఊరటకు ప్రతీకే మనోరమ. మగవాడికి, ఒక అపరిచితురాలైన అందమైన స్త్రీ తన సాన్నిహిత్యాన్ని కోరుతున్నది అన్న ఒక్కటి చాలు – అహం తృప్తి పడ్డానికీ; న్యూనత తగ్గడానికీ. పురుషుల సైకాలజీకి సంబంధించిన ఈ అంశానికి ప్రతినిధిగా మనోరమను సృష్టించి, రావిశాస్త్రి తన రచనాప్రతిభను చాటుకున్నారు.
రచయిత మనోరమ అంతరంగాన్ని చిత్రించకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. నవల చివర్లో మాత్రం ఆమె ఎందుకో బాధపడుతోందన్న సూచన చేస్తాడు. దాని వివరాలేవీ చెప్పడు. ఎందుకంటే ఇది సుబ్బయ్య కథ. మనోరమ కథ కాదు. కానీ, ఎప్పుడూ తన ఏడుపు మాత్రమే ఏడ్చుకునే సుబ్బయ్య ఒక మనిషిగా మారడానికి మనోరమలో కలిగిన ఈ వ్యాకులమే నాంది పలికింది. ఆ పాత్ర ప్రయోజనం ఈ నవలకు సంబంధించినంతవరకూ అంతే కావచ్చు.
ఈ రకంగా రావిశాస్త్రి మనోరమకు అన్యాయం చేసి వుండవచ్చు కూడా... కానీ, రావిశాస్త్రి ఎందుకోసం సృష్టించినా, గుండె నిండా ఔదార్యం, మనసు నిండా ప్రేమ కలిగిన మనోరమ తెలుగు నవలా సాహిత్యంలో గుర్తుంచుకోదగ్గ స్త్రీ పాత్ర.
Comments
Please login to add a commentAdd a comment