
గాఢంగా చీకట్లు కమ్మిన ఒక రాత్రి– ఆకాశాన్ని చీలుస్తూ ఒక మెరుపు మెరుస్తుంది... మనల్ని, మన పరిసరాలనీ మన కళ్ళకే చూపించి మాయమై పోతుంది. ఆ మెరుపును మన ఇంటి దీపంలాగా గోడకు వేలాడదీసుకుందామంటే కుదరదు. కుదిరి నా భరించటానికి ఆ ఇంటికి శక్తి చాలదు. ఆ క్షణకాలపు వెలుగులో ఏం చూడగలరో, పరిసరాలను ఎంత చక్కదిద్దుకోగలరో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. సరిగ్గా ఆ మెరుపులాంటిదే లాలస! చలం రాసిన ‘జీవితాదర్శం’లో నాయిక. లాలస నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి– స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా? ఆ దారిలో నడవటం ఆడవాళ్ళకు క్షేమమా? అంటూ. అన్నిటికీ జవాబు ఒకటే– కాదు.
మరెందుకు మాట్లాడుకోవాలి లాలస గురించి? స్త్రీ పురుష సంబంధాలు– అధికారం వల్లనో, అవసరాల కోసమో సాగేవిగా ఉండరాదని, అవి హృదయగతమైన సంబంధాలుగా ఉండాలని చెప్పినందుకు, వాటిలో కపటమూ మోసమూ చోటు చేసుకున్నప్పుడు ఎంత బలమైన నిర్మాణమైనా లోలోపల గుల్లబారి కూలిపోక తప్పదని చెప్పటానికి తనను తానొక ప్రయోగశాలగా మార్చుకున్నందుకు లాలస గురించి మాట్లాడుకోవాలి.
లాలస నమ్మి, ఆచరించిన ‘హృదయవాదం’ అతి ప్రమాదకరమైనది. ఉనికిలో వున్న ఏ ఆదర్శ నమూనాలోనూ అది ఇమడదు. ‘నీతిమంతమైన’ ఏ నిర్మాణమూ దాన్ని భరించదు. నిజానికి లాలస పేచీ పడింది నీతితోనూ, ఆదర్శాలతోనూ కానేకాదు. ‘నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ’ అని గౌరవించే లాలస ఆ నీతులూ, ఆదర్శాలూ హృదయం లోంచి పుట్టే సహజ ప్రేరణలుగా కాకుండా ఉత్తి రిచువల్స్‌గా తయారవటాన్ని అసహ్యించుకుంటుంది.
స్త్రీలను సమానులుగా మనస్ఫూర్తిగా గుర్తించకుండా, అలా ఉన్నట్టుగా కనబడే వ్యక్తులకు సామాజిక గౌరవం ఉన్నందుకే ఆలా నడుచుకునే హి΄ోక్రటిక్ ఆదర్శ జీవులను ఆమె నిలదీస్తుంది. అయితే ఇలా విమర్శించినంత మాత్రాన తానొక ఆదర్శ వ్యక్తిననే భ్రమలు ఆమెకేమీ లేవు. ‘నువ్వు నాకు ఆదర్శమైన పురుషుడివి కావు... ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ, నేనొకతె ను ఉన్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక’ అని తను పెళ్ళాడబోతున్న వ్యక్తితో నిస్సంకోచంగా చెప్పగలదు లాలస.
ఆదర్శవంతమైన మనుషులు, అత్యంత కఠినమైన స్వీయ ప్రయత్నంతో రూపొందగలరే తప్ప, సామాజిక నిర్బంధంతో కాదని ఆమె నమ్మకం. ఆ ప్రయత్నంలో ఎగుడు దిగుళ్ళూ, తప్పటడుగులూ ఉండి తీరుతాయి. ఏ విలువల ప్రాతిపదికన బయల్దేరుతామో వాటిని కోల్పోయే స్థితికి దిగజారే ప్రమాదమూ ఎదురు కావచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి, ఒక విలువను ప్రతిపాదించగల స్థాయికి చేరిన వ్యక్తి లాలస. జనసామాన్యాన్ని కూడగట్టి నడిపించటానికీ, ఆచరణాత్మకమైన నిర్మాణాలను రూపొందించటానికీ పనికొచ్చే నాయకులు కాదు లాలస వంటి వ్యక్తులు.
చదవండి: కనపడని నాలుగో సింహం..!
ఆ పనుల కోసం రూపొందాయని చెప్పే మార్గాలు మూఢనమ్మకాలుగా మారిపోకుండానూ, ఆ నిర్మాణాలు గిడసబారి పోకుండానూ హెచ్చరించే అనుభవాల ప్రయోగశాలలు వీళ్ళు. మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమమూ మానవీయమైన సహజ చర్యగా సాగాలని, ఆదర్శాలన్నవి మనుషుల వ్యక్తిత్వాల్లో అసంకల్పితంగా భాగమై పోయేంత సహజ స్పందనలుగా మారాలనీ కలలుగనే మానవులు. అలాంటి కలలు గన్న పాత్రగా లాలస పాఠకులకు నచ్చుతుంది.
- కాత్యాయని
Comments
Please login to add a commentAdd a comment