Navala
-
ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు!
ఎర్రసముద్రం కొంతకాలంగా అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ దన్నుతో హౌతీ ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై విచ్చలవిడి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. యెమన్‌లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న ఈ ఉగ్రవాద ముఠా సముద్ర దాడులు అంతర్జాతీయ సమాజానికి పెను సవాలుగా మారాయి. ఒకవిధంగా అంతర్జాతీయ వర్తకమే తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇంతకూ ఎవరీ హౌతీలు? వీళ్లెందుకిలా ఉన్నట్టుండి సముద్ర సవాళ్లకు దిగినట్టు...? – సాక్షి, నేషనల్ డెస్క్ గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి కనీవినీ ఎరగని రీతిలో బీభత్సం సృష్టించడం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ తెర తీసింది. హమాస్‌కు దన్నుగా హౌతీల ఆగడాలు అప్పటినుంచే పెచ్చరిల్లాయి. ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకనూ లక్ష్యం చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్‌తో ఏ సంబంధమూ లేని నౌకలను కూడా వదిలిపెట్టడం లేదు. కొద్ది రోజులుగానైతే కనిపించిన నౌక మీదల్లా విచ్చలవిడిగా దాడులకు దిగుతూ కల్లోలం సృష్టిస్తున్నారు. సమీపంలోని నౌకలపై డ్రోన్లు, సుదూరాల్లో ఉన్నవాటిపై ఏకంగా బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగిస్తూ గుబులు రేపుతున్నారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎర్రసముద్రంపై నౌకలపై హౌతీల దాడులు ఏకంగా 500 శాతం పెరిగిపోయాయి! వీటికి ఇరాన్ సహకారం కూడా పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. మిత్ర రాజ్యాలతో కలిసి హౌతీల స్థావరాలపై కొద్ది రోజులుగా అమెరికా పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగుతోంది. యెమన్ సాయుధ ముఠా..! హౌతీలు యెమన్‌కు చెందిన సాయుధ ముఠా. 1990ల్లో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకంటూ పుట్టుకొచ్చారు. అక్కడి షియా ముస్లిం మైనారిటీల్లో జైదీలనే ఉప తెగకు చెందినవారు. వీరి ఉద్యమ వ్యవస్థాపక నేత హుసేన్ అల్ హౌతీ పేరిట ఆ పేరు వచ్చింది. ఈ ముఠాను తొలుత అన్సర్ అల్లా (దేవ పక్షపాతులు)గా పిలిచేవారు... హౌతీలను అణచేసేందుకు సౌదీ అరేబియా సాయంతో సలే 2003లో విఫలయత్నం చేశాడు. యెమెన్ ప్రభుత్వంపై 2014 నుంచీ వీళ్లు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఫలితంగా పదేళ్లుగా దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. సౌదీ, యూఏఈ, ఇతర అరబ్ దేశాలన్నీ యెమన్ ప్రభుత్వానికి దన్నుగా ఉన్నా హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా 3.5 లక్షల మంది దాకా బలైనట్టు అంచనా! అల్లర్లకు తాళలేక అర కోటి మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యెమన్ నుంచి వలస బాట పట్టారని ఐరాస పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, పాలస్తీనా, హెబ్జొల్లా గ్రూపు తదితరాలతో కలిసి ‘ప్రతిఘటన శక్తులు’గా హౌతీలు తమను తాము చెప్పుకుంటారు. వీరికి లెబనాన్‌కు చెందిన హెబ్జొల్లా గ్రూపు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వీరికి 2014 నుంచీ ఆయుధాలను, పూర్తిస్థాయి సాయుధ శిక్షణను అందిస్తూ వస్తోంది. ఇరాన్ కూడా హౌతీలకు పూర్తిగా దన్నుగా నిలుస్తోందని చెబుతారు. ముఖ్యంగా వారికి బాలిస్టిక్ మిసైళ్లను సమకూర్చింది ఇరానేనని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2019లో తమ చమురు క్షేత్రాలపై దాడులకు హౌతీలు వాడిన డ్రోన్లు, క్షిపణులను కూడా ఇరానే అందజేసిందని సౌదీ ఆరోపిస్తూ ఉంటుంది. గాజాపై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌పై హౌతీలు పదేపదే బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. హౌతీల చెరలోనే యెమన్ నిజానికి రాజధాని సనాతో పాటు యెమన్ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే గాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు! ఇక యెమన్లోని ఎర్రసముద్ర తీర ప్రాంతం మొత్తాన్నీ హౌతీలే నియంత్రిస్తున్నారు. ఇప్పుడదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది. 2010 నాటికే ఈ ముఠాకు కనీసం లక్ష పై చిలుకు సాయుధ బలమున్నట్టు ఐరాస అంచనా వేసింది. పెను ప్రభావం... ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్రసముద్రమే అత్యంత దగ్గరి దారి. అంతేగాక అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15 శాతానికి పైగా ఎర్రసముద్రం మీదుగా మద్యధరా సముద్రం, సూయ జ్ కాల్వ గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హౌతీల మతిలేని దాడుల ప్రభావం అంతర్జాతీయ వర్తకంపై భారీగా పడుతోంది... ఎర్రసముద్రం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియాన్ని కంపెనీలు పది రెట్లకు పైగా పెంచాయి! మెడిటెరేనియన్ షిపింగ్ కంపెనీ, మార్క్స్, హపాగ్–లాయిడ్, బ్రిటిష్ పెట్రోలియం వంటి పలు కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి. దాంతో అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అటు దాడులు, ఇటు బీమా వ్యయాలకు దడిచి పెద్ద రవాణా కంపెనీలన్నీ ఎర్రసముద్రం మార్గానికి ఓ నమస్కారం అంటున్నాయి. వెరసి ఇదంతా రవాణా వ్యయాలు బాగా పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. -
కమ్యూనిస్టు విప్లవోద్యమాలను చిత్రించిన రెబెల్
సాహిత్య పాఠకులకు హెచ్చార్కె ఒక కవిగా, జర్నలిస్టుగా, వ్యాసకర్తగా, విప్లవవాదిగా తెలుసు. ఈ నవల చదివిన వారికి ఆయనొక రెబెల్ అని అర్థం అవుతుంది. ఈ నవల మొత్తం పవన్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. ఉపోద్ఘాతం మాత్రం ఒక సాయంత్రం వేళ అమెరికాలో తమ పిల్లల వద్ద నివసిస్తున్న ఇద్దరు ముసలాళ్ల మధ్య సంభాషణగా మొదలై, నవల చివర మళ్ళీ వారి సంభాషణతోనే ముగుస్తుంది. పవన్ తన కథను రచయితకు చెపితే, రచయిత మనకు పవన్ కథను నవరస భరితమైన రీతిలో చెప్పాడు. పవన్ పేరును వాళ్ల జేజి ఖరారు చేసింది. కుటుంబ ఆనవాయితీ ప్రకారం ఆంజనేయ స్వామిని స్ఫురణకు తెచ్చేలా ఆంజనేయులు, హనుమయ్య అని ఉండాలి. కానీ జేజి మోడ్రన్‌గా పవన్ కుమార్ అని పెట్టుకుంది. పవన్ ఎక్కడో గని అనే రాయలసీమ గ్రామంలో పేద రైతు కుటుంబంలో పుట్టాడు. నలుగురు అన్నదమ్ములకు కలిపి నాలుగు ఎకరాల నీళ్లవసతి లేని చేను. పవన్ చదువు సర్కారు బడుల్లో, బంధువుల ఇండ్లల్లో సాగుతుంది. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి సంజీవయ్య తనకెన్ని అప్పులున్నా పవన్‌ను ఇంకా చదివిస్తే ఉద్యోగం చేసి బతుకుతాడు కదా అని ఆశపడతాడు. ఎమ్మెస్సీ చదివే అవకాశం ఉన్నా చిన్న వయసు నుంచి తెలుగు సాహిత్యంపై ఉన్న అభిమానం, తనకు పద్యాలు, కథలు రాసే ఆసక్తి మెండుగా ఉంది గనుక, విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మే తెలుగులో చేరుతాడు. మహాప్రస్థానం చదివి ప్రభావితుడై, కమ్యూనిస్టు ఉద్యమ సాహిత్యం విపరీతంగా చదువుతాడు. ఉద్యమం పట్ల ఆకర్షితుడు కావటానికి మరో కారణం చండ్ర పుల్లారెడ్డి ఊరు అతని ఊరు పక్కనే. పవన్ కూడా తన గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి, పాటలు, ఉపన్యాసాల ద్వారా సంచలనం సృష్టిస్తాడు. కర్నూలులో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఓ పెద్ద ర్యాలీ నిర్వహించి నక్సల్ నేతగా పోలీసుల దృష్టిలో పడతాడు. కర్నూలు హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న మేనమరదలు విజయ కూడా తన మార్గంలో నడిచేందుకు సిద్ధమైన తర్వాత ఇద్దరూ స్టేజి మ్యారేజ్ చేసుకుంటారు. ఇంతలో 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించగానే, పోలీసులు పవన్‌ను అత్తగారింట్లో ఉండగా అరెస్టు చేసి, మీసా చట్టం కింద ముషీరాబాద్ జైల్లో పెడతారు. సెకండ్ క్లాస్ రాజకీయ ఖైదీ జీవితం తన ఊరి జీవితం కంటే మెరుగ్గా ఉందనుకుంటాడు. జైలులో ఉండగానే కూతురు పుడుతుంది. పెరోల్ దొరకదు. నక్సల్ పార్టీకి రాజీనామా చేసినట్లు అండర్ టేకింగ్ ఇస్తే పెరోల్ ఇస్తామని ఆశపెడతారు. కానీ ఒప్పుకోడు. అక్కడే యాదాటి కాశీపతి గురువై, గంటల కొద్దీ ఆంగ్ల సాహిత్యం బోధించిన వైనం పవన్‌కు మున్ముందు జర్నలిస్టు, రచయిత జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. జైలు నుంచి ఒక దినపత్రికలో చేరుతాడనగా చండ్ర పుల్లారెడ్డి పిలుపు మేరకు వారి పార్టీ పత్రిక ‘విమోచన’లో చేరి, భార్య విజయతో కలిసి 12 ఏండ్లు పార్టీలో, పత్రికలో ఫుల్ టైమర్‌గా పని చేస్తాడు. సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి, పాత్రికేయుడిగా పనిచేస్తాడు. ఈ నవల మొదటి భాగాల్లో రాయలసీమ భాషను ఆర్తిగా చిత్రించాడు రచయిత. జాలాడి, తల్లె, బర్రె గొడ్లు, సద్ది, ఈదులు, లొట్లు, గరిసె లాంటి పదాలు వింటే ప్రాణం లేచొస్తుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా పవన్ జీవితం గడుస్తుంది. కుటుంబానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అందరికీ దూరంగా ఉండిపోయి బాధపడుతుండగా ముగుస్తుంది. 11వ క్లాస్ వరకు కాళ్లకు చెప్పులు లేకుండా అతడి జీవితం గడిచింది. రైలు పెట్టెలో కండక్టర్ ఉంటాడు కదా, అప్పుడు టికెట్ తీసుకుందాంలే అనుకుంటాడు. మరి ఈ హెచ్చార్కే (హనుమంత రెడ్డి.కె), నవలా హీరో పవన్ ఒకరేనా? ఎందరో వాస్తవ నాయకులు, రచయితలు, ఎడిటర్లు, వాస్తవ చారిత్రక సంఘటనలు నవల నిండా ఉన్నాయి. 1968–1985 మధ్య కాలంలో జరిగిన విప్లవ ఉద్యమాలను వాటిలో పాల్గొన్న ఒక యువకుని కోణంలో ఇది ఆవిష్కరిస్తుంది. కర్ర ఎల్లారెడ్డి నవల: రెబెల్; రచన: హెచ్చార్కె ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్ ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ. ఫోన్: 7093800678 -
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాస భార్య నావెల్ సింఘాల్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. ఎలక్షన్ కమిషనర్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పలు కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె 2005లో ఎస్బీఐ నుంచి వైదొలిగింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన 11 నిర్ణయాల్లో లావాస తన అసమ్మతిని తెలియజేయగా కమిషన్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అసమ్మతిని రికార్డు చేయని ఈసీ సమావేశానికి అర్థంలేదని లావాస పేర్కొన్నారు. -
తెలుగు నవలా చక్రవర్తి విశ్వనాథ
వైతాళికుడు: తెలుగునాట నవలలపై విస్తృత చర్చ జరుగుతున్న దరిమిలా 58 నవలలు రాసి విఖ్యాతి చెందిన విశ్వనాథను తలచుకోవడం నవలా రచనలో తెలుగువారి ప్రగాఢ ప్రవేశాన్ని గుర్తు చేసుకోవడమే. ‘నేను మానవ ప్రవృత్తిని ఆమూలాగ్రం పరిశీలించి తెలిసికొని వ్రాశాను. నాకు గ్రంథ రచన అంటే ఏమిటో తెలుసు. సగం నిద్రలో లేపి ఒక నవల డిక్టేటు చేయమంటే చేయగలను’... అంటారు విశ్వనాథ సత్యనారాయణ తన ‘నేను- నా రచనా స్వరూపం’ వ్యాసంలో. విశ్వనాథను కవిసామ్రాట్ అంటారుగానీ ఆ బిరుదు ఆయనకు న్యాయం చేయదు. ఆయన కావ్యాలే కాదు వ్యాసాలు రాశారు. కథలు రాశారు. నవలలు రాశారు. నవలల్లో కూడా ఆ విస్తృతి అసామాన్యమైనది. సాంఘిక నవలలు, చారిత్రక కాల్పనిక నవలలు, మ్యాజికల్ రియలిజం ఛాయలున్న నవలలు, మానసిక విశ్లేషణ కలిగిన నవలలు, డిటెక్టివ్ నవలలు, సైన్స్ ఫిక్షన్‌కు దగ్గరగా ఉండే నవలలు... ఎన్నని. ‘కావ్యరచనలో పూర్వకవులు ఎన్ని పోకడలు పోయారో నేనూ అన్ని పోయాను’ అన్న ఆయన వ్యాఖ్య ఆయన నవలలకు కూడా వర్తిస్తుందనిపిస్తుంది. విశ్వనాథ ఏ రచన చేసినా ఎలాంటి రచన చేసినా చివరికి ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడినా ప్రతి పదంలో అంతస్సూత్రంగా పాశ్చాత్యుల సాంస్కృతి సామ్రాజ్యవాదాలను అవిశ్రాంతంగా నిర్ద్వంద్వంగా వ్యతిరేకించటం తప్పనిసరిగా కనిపిస్తుంది. దేశీయ సంస్కృతి పునరుత్థానం చెందితేనే దేశం స్వచేతనను నిలుపుకోగలుగు తుందనీ ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచగల శక్తి దానికే ఉందని ఆయన విశ్వాసం. దేశాభివృద్ధిలో గ్రామీణ వ్యవస్థ, సామాజికా భివృద్ధిలో దాంపత్య వ్యవస్థలను ఆయన మౌలికాంశాలుగా పరిగణించారు. ఈ రెండూ కట్టుదిట్టంగా ఉండటం సామాజిక అభివృద్ధికి కారణాలవుతాయని భావించారు. ఫలితంగా ‘వేయి పడగలు’తో సహా ఆయన రచనలన్నింటిలోనూ గ్రామీణ వాతావరణంలోని ఔన్నత్యం, అది బీటలు వారడం వల్ల కలిగే అనర్థాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన నవలల్లో ‘సముద్రపు దిబ్బ’ గొప్ప ప్రతీకాత్మక వ్యంగ్య రచన. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పాశ్చాత్య ప్రభావిత పథకాల వల్ల దుష్పరిణామాలు కలగనున్నాయని విమర్శిస్తూ వాటి పరిష్కారాలు సూచిస్తూ చేసిన అతి గొప్ప రచన ఇది. దేశంలోని అన్ని రంగాలలో ఈనాటి దిగజారుడుతనాన్ని దుస్థితిని ఆనాడే ఆ నవల ఊహించింది. ఈ నవలలో ఓ చోట ‘శాస్త్రముల చదువు వేరు. ఉద్యోగముల కొరకు చదివెడి లౌకికపు చదువు వేరు. లౌకికపు చదువులెంత చదివినను ధనాశ వృద్ధి పొందును. అతి దురాశ వృద్ధి పొందును. మనిషి బుద్ధి సద్వివేకము పొందబోదు’ అని స్పష్టం చేస్తాడాయన. ఈనాడు చదువుకున్నవారి సంఖ్య అధికమవుతున్న కొద్దీ విద్యావంతుల సంఖ్య పడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. విశ్వనాథ రచనలు ఆరంభించే సమయానికి జాతీయోద్యమం తీవ్రస్థాయిలో ఉంది. ఇదే సమయంలో భారతీయులను భౌతికంగానే కాదు మానసికంగా కూడా బానిసలుగా చేసుకోవాలన్న బ్రిటిష్ వారి ఆలోచనా ఫలితాలు కూడా స్పష్టమవసాగాయి. భారత దేశ చరిత్రను వక్రీకరిస్తూ అనేక వేల యేళ్ల అసలైన చరిత్రను చరిత్ర పుటల్లోంచి తొలగించే ప్రయత్నాలు సఫలమవసాగాయి. విదేశీ చదువులు చదివిన భారతీయులు ఆ ప్రభావంతో మన దేశ ఔన్నత్యాన్ని ప్రాచీనత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రాచీన వాఞ్మయాన్ని చులకన చేస్తూ న్యూనతా భావాన్ని సమాజంలో ప్రచారం చేయసాగారు. ఇలాంటి విచ్ఛిన్నకరమూ ప్రమాదభరితమూ అయిన ప్రచారాన్ని అడ్డుకుని మనవారికి ఆత్మవిశ్వాసం ఇచ్చే సాంస్కృతిక ఉద్యమం విశ్వనాథ రచనల జీవం అయింది. అందువల్లనే ఆయన తన నవలలు ‘స్వర్గానికి నిచ్చెనలు’, ‘మాబాబు’, ‘విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు’, ‘దేవతల యుద్ధము’, ‘పరీక్ష’, ‘జేబుదొంగలు’, ‘గంగూలీ ప్రేమకథ’, ‘దమయంతీ స్వయంవరం’, ‘కుక్కగొడుగులు’ వంటివాటిలో ఆధునిక సమాజంలో అపోహలకు గురవుతున్న అనేక అంశాలను సర్వ రీతిలో విశ్లేషించి వివరించటం కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో ఈనాడు కొందరు చిత్రిస్తున్న తీరులో వర్ణవ్యవస్థ ఉండేది కాదనీ కుల, మత, వర్ణాలకు అతీతంగా ధర్మరక్షణ ఉండేదనీ అందుకు తార్కాణంగా ఆ కాలంలోని ఆప్యాయతలు, గౌరవాలు, ఒకరిపై ఒకరు ఆధారపడే తీరు, దానిని గుర్తించి మెలిగే వ్యక్తుల ఔన్నత్యాలను చిత్రిస్తూ ‘ధర్మచక్రము’, ‘కడిమి చెట్టు’, ‘చందవోలు రాణి’, ‘ప్రళయ నాయుడు’, ‘బద్దన్న సేనాని’, ‘వీర వల్లడు’ వంటి నవలలు రాశారు. మన సంస్కృతికి ప్రాణం వంటి దాంపత్య ధర్మంపై విశ్వనాథ తన కాలంలో జరిగిన దాడులను, ఆకర్షణీయమైన విచ్ఛిన్నకర సిద్ధాంతాలను ఎదిరించాడు. సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వహించే వ్యవస్థను నిలబెట్టే దాంపత్య ధర్మాన్ని సమర్థించాడు. తెలుగు నవలల్లో, విశ్వనాథ నవలల్లో ‘ఏకవీర’ను మించి స్త్రీ పురుష మనస్తత్వాలను విశ్లేషించే నవల లేదనడం అతిశయోక్తి కాదు. ఈనాటికీ ఎవరెన్ని రకాల ప్రణయ గాథలు రాసినా వాటన్నింటిలో ఏకవీర ప్రతిధ్వనిస్తుంటుంది. విశ్వనాథ ద్రష్టత్వానికి ఇది తిరుగులేని ఉదాహరణ. విశ్వనాథ ప్రదర్శించిన వివాహ వ్యవస్థలో పురుషాధిపత్య భావన కనపడదు. సృష్టి పూర్ణానుసారమైతే స్త్రీ పురుషులు చెరి అర్ధభాగాలనీ ఒకరు లేక మరొకరు సంపూర్ణం కాదన్న సమానత్వ భావన చూపిస్తాడు. ‘ధర్మచక్రం’ నవలలో తన జన్మదోషం వల్ల రాణి తనను తక్కువగా చూస్తోందని రాజు కుములుతాడు. ‘చెలియలి కట్ట’లో రత్నావళి పాత్ర తన శరీరాన్ని వాంఛించే పురుషుల అజ్ఞానాన్ని తర్కంతో నిరూపిస్తుంది. ‘వేయి పడగలు’లో అరుంధతీ ధర్మారావుల దాంపత్యాన్ని వివరిస్తూ ‘ఈ ధర్మము పరస్పరమైనది. కాని పురుషుని ఆధిక్యత కలది కాదు’ అంటారు విశ్వనాథ. ఈ నవలలోని కిరీటి, శశిరేఖల ప్రణయగాథ ఏ ఆధునిక ప్రేమగాథకూ తీసిపోదు. ఇందులోని గిరిక ప్రణయం ఆధ్యాత్మిక ప్రణయం. అలాగే కుమారస్వామి, శ్యామలల వివాహం వర్ణాంతర వివాహం. ఇదంతా చూస్తే విశ్వనాథ ఛాందసుడనీ ఆధునిక భావ వ్యతిరేకి అని అనేవారికి విశ్వనాథను చదవడం రాదనుకోవాలి. లేదా వారు చదవకుండానే వ్యాఖ్యానిస్తున్నారని అనుకోవాలి. ‘ఏకవీర’లో ఛాయామాత్రంగా ప్రదర్శించిన ‘స్పర్శ సిద్ధాంత’ విరాట్ స్వరూపం ‘తెఱచిరాజు’లో చూడవచ్చు. ఇక ‘పులుల సత్యాగ్రహం’ ఆధునిక రాజకీయ విన్యాసాలపై వ్యంగ్య విమర్శ. విశ్వనాథ ‘కల్హణుడి రాజతరంగిణి’ ఆధారంగా ‘కాశ్మీర రాజవంశ’ నవలలు ఆరు రాశారు. కోట వెంకటాచలం నిరూపించిన భారత చరిత్ర ఆధారంగా ‘ఆరు నేపాళ రాజవంశ’ నవలలు రాశారు. ఈ 12 నవలలు కేవలం చరిత్రను సరైన రీతిలో ప్రదర్శించడం కోసమే. ఇక విశ్వనాథ సృజించిన 12 ‘పురాణ వైర గ్రంథమాల’ నవలలైతే ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వ సృజన. ఇవి కూడా భారత ధర్మ వ్యతిరేకతను ఖండించేవే. విశ్వనాథ రచనలు చదవడమంటే హిమాలయ శిఖరారోహణ చేస్తున్న అనుభూతిని పొందటం. చుట్టూ ఉండే ప్రకృతి ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు అనంతమైన ఆలోచనల మంచు తుపానులు కుదిపి వేస్తుంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం వెల్లువలా పెల్లుబుకుతుంటే రత్నాలను రాళ్లుగా భావించి చేజార్చుకుని అనంతమైన అద్వితీయమైన వారసత్వ సంపద ఉండి కూడా ప్రపంచంలో నిన్న మొన్న కళ్లు తెరిచిన వారిని చూస్తూ న్యూనతకు గురవుతూ ఆత్మవిశ్వాస రాహిత్యానికి గురవుతున్న భారతజాతిని తలచుకుని బాధ అనిపిస్తుంది. పరిస్థితి మార్చేందుకు నడుం బిగించాలన్న పట్టుదల కలుగుతుంది. - కస్తూరి మురళీకృష్ణ 9849617392 -
తెలుసుకోదగ్గ పుస్తకం.. దాస్ కాపిటల్
పేరు సరిగానే ఉంది. దీని టాగ్లైన్ ’'The novel of love and money market''. 2007లో అచ్చయింది. రాసింది వీకెన్ బెర్బేరియన్. సమకాలీన పెట్టుబడిదారీ స్టాక్ మార్కెట్ మాయాజాలాన్ని ఇంత నిష్కర్షగా చిత్రించిన నవల మరొకటి లేదన్నారు. ఇందులో కథా నాయకుడు వేన్. ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి ప్రతీక ఇతడు. లాభాలే లక్ష్యంగా వాల్‌స్ట్రీట్‌లో లావాదేవీలు జరిపేది ఇలాంటి వాళ్లే. మార్కెట్లు ఎప్పుడు పతనం అవుతాయో జోస్యం చెప్పగలడు వేన్. చాన్స్ దొరికితే చాలు షార్ట్ సెల్లింగ్‌లో లాభాలు మూటగట్టుకోవాలి. ట్రేడర్లందరికీ వెన్నతో పెట్టిన విద్య ఇది. పెట్టుబడి, అధికారం, శ్రమ వంటి గంభీరమైన విషయాల గురించి థ్రిల్లర్‌లాగా, సెటైర్ లాగా రచయిత ఈ నవలను నిర్వహిస్తాడు. కార్ల్ మార్క్స్ రచించిన దాస్ కాపిటల్ చదవడం కష్టమనుకుంటే అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ఈ నవలతో ఆ యిబ్బంది లేదు. ఆధునిక మార్కెట్ పరిభాష తెలిసిన వారందరూ హాయిగా చదువుకోవచ్చు. అన్నట్టు ఇందులో ప్రేమ కథ కూడా ఉంది. రచయిత వీకెన్ బెర్బేరియన్ బీరుట్లో ఒక ఆర్మీనియన్ కుటుంబంలో పుట్టాడు. లెబనాన్‌లోని అంతర్యుద్ధ కాలంలో లాస్ ఏంజిలిస్‌కు తరలి వచ్చింది కుటుంబం. కార్ల్ మార్క్స్‌కు ఇరవై ఒకటో శతాబ్ది రచయిత సమర్పించిన నివాళి- దాస్ కేపిటల్- ఏ నావెల్... - ముక్తవరం పార్థసారథి జూలూరి గౌరీశంకర్ యుద్ధవచనం 1996లోనే ‘తెలంగాణ’ దీర్ఘ కవిత రాసిన కవి జూలూరి గౌరీశంకర్. ఆ తర్వాత రాసిన ‘కాటు’, ‘చెకుముకిరాయి’ వంటి దీర్ఘకవితలు, విస్తృతంగా రాసిన కవిత్వం ఆయనను తెలంగాణ కవులలో బలంగా నిలబెట్టాయి. సామాజిక బాధ్యత ఉన్న కవి సామాజిక ఉద్యమాలలో కూడా దూకుతాడు. ‘తెలంగాణ రచయితల వేదిక’ తరఫున జూలూరి తెలంగాణ ఉద్యమంలో నడుం బిగించి పని చేశారు. అనేక కార్యక్రమాలు మీటింగులు పెట్టి ప్రజల్ని చైతన్య పరిచారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న కవులనూ సాహిత్యకారులనూ తెలుపుతూ అనేక వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల సంకలనమే ఈ యుద్ధ వచనం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక నిజాయితీతో నడపడంలో సరైన దిశలో నడపడంలో తెలంగాణ రచయితల, కవుల, వాగ్గేయకారుల విస్తృత పాత్రను ఆయన ఈ వ్యాసాల్లో చర్చిస్తారు. వాళ్లందరి ఫొటోలను జత చేసి ఇందులో గౌరవించుకున్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో సాహిత్య ఉద్యమకారుల కృషి తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి. ఎ.కె.ప్రభాకర్ సంపాదకత్వం ప్రశంసనీయం. వెల: రూ.180; ప్రతులకు- విశాలాంధ్ర మూలింటామె సమీక్షపై స్పందన సారీ... పుస్తకం రాసేటప్పుడు మామూలుగా నా వొళ్లు నా సోదీనంలో ఉండదు. ‘మూలింటామె’ మీద ‘సాక్షి’లో మన ఖదీరు రాసింది చదివినాక- ముందు ముందు పుస్తకమంటూ రాస్తే వొళ్లు దగ్గిర పెట్టుకుని జాగర్తగా మసులుకుంటా. ఆయా పాత్రల్ని- మాటీవీ కోటీశ్వరుల షోకు పంపో, లాటరీ టికెట్లు కొనిపించో- ఏదో ఒక వాటాన వాళ్లకు మంచి జరిగేటట్టు చల్లంగా చూస్తా. ఇంకా పుస్తకం పూర్తయిన వెంటనే పెద్దా చిన్నా లేకుండా అచ్చుకిచ్చీకుండా శ్రీయుతులు జిల్లా ఎస్.పి.గారికీ, మేజిస్ట్రేటుగారికీ పంపి వారి స్టాంపింగు కోసం నెలల తరబడి కుదురుగా ఎదురు చూసి ఎట్టకేలకు సాధిస్తా. చివరగా పుస్తకం ప్రచురించుకోవడానికి ‘అనుమతి పత్రం’ కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సాంఘిక సంక్షేమ శాఖామంత్రి చేత ముందుమాట రాయించుకొని పుస్తకాన్ని అచ్చు వేస్తా. అప్పుడు సమీక్ష కోసం పుస్తకాన్ని ఆరాంగ పంపించి దిగులూ భయమూ లేకుండా నిశ్చింతగా కన్ను మూయ వచ్చు. సెలవు. - నామిని గమనిక: మూలింటామె సమీక్షలో ఖదీర్ చేసిన రెండు వ్యాఖ్యలు ‘ఇరవై ఏళ్ల పిల్ల పందొసంత. చెప్పు తీసుకొని కొట్టి సరి చేయాలంటే క్షణం పట్టదు’... ‘పాత్రలను సృష్టించి వాటిని అర్ధాంతరంగా కడతేర్చే రచయితలకు భారతీయ శిక్షాస్మృతిలో ఏ శిక్షా లేకపోవడం మరో విషాదం’... ఈ రెండు వ్యాఖ్యలను ఖండిస్తూ వీటిని ప్రమాదకరమైన వ్యాఖ్యలుగా భావిస్తూ వాటి ఉపసంహరణకు 42 మంది సాహిత్యకారుల సంతకాలతో ప్రకటన వచ్చింది. అందులో ఖాదర్ మొహియుద్దీన్, వరవరరావు, చలసాని ప్రసాద్, టి.కృష్ణాబాయి, పాణి, నగ్నముని, జయప్రభ, కాత్యాయనీ విద్మహే, సురేంద్రరాజు, బండి నారాయణ స్వామి, స్కైబాబా, యాకూబ్, పర్స్పెక్టివ్స్ ఆర్కే, తుమ్మేటి, దేశరాజు, రాణి శివశంకర్, డా.మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సమీక్షకుని స్పందన ఇస్తున్నాం. ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. ఖదీర్ స్పందన: నా రెండు వ్యాఖ్యలు తప్పు అని కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు వ్యంగ్యం, తీవ్రత ప్రమాదం అని అర్థమైంది. రచయితలు నా తప్పును ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు. ఆ వాక్యాలను వెనక్కు తీసుకుంటున్నాను. శ్రీ సీతారామాంజనేయ సంవాదము ఒకసారి శివుడు పార్వతిని వరం కోరుకోమంటే ఆమె- పవిత్ర మంత్రమేదైనా ఉపదేశించమని కోరిందట. అప్పుడు శివుడు నీకు తగినది శ్రీరామమంత్రమని దానిని ఉపదేశించాడట. అప్పుడు పార్వతి శ్రీరామతత్త్వాన్ని వివరించమని కోరిందట. అప్పుడు శివుడు- లంక నుంచి తిరిగి వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయునితో సీత రామ తత్త్వాన్ని ఏ విధంగా వివరించిందో ఆ సంవాదం అంతా ఆమెకు వినిపించాడట. అదే ఈ గ్రంథం. పద్యమూ దాని తాత్పర్యం ఉన్న ఈ గ్రంథంలో ఆంజనేయునికి సీత- లక్షణాలు, ఆసనాలు, పరబ్రహ్మ స్వరూపం, ఓంకారం, బ్రహ్మ జ్ఞానం, సమాధి, గురు మంత్రార్థం... ఇలా అనేకానేక అంశాల వివరణ ఇచ్చి విశదం చేస్తుంది. ఒక రకంగా ఇది నిత్య పారాయణ గ్రంథం. బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణ సద్గురువులు వ్యాఖ్యానం చేయగా బ్రహ్మశ్రీ చంద్రగిరి సుబ్రమణ్యం సంకలనం చేసిన ఈ గ్రంథం 1992లో వచ్చింది. ఇది ద్వితీయ ముద్రణ. విశ్వానికి ఉపాదాన నిమిత్త కారణాలేవి? జీవుడెవరు? సూక్ష్మ శరీరం ఎట్టిది? స్థూల పంచభూతాలు ఎలా పంచీకరణం పొందుతాయి? జీవేశ్వరుల ఐక్యం ఎలా సాధించాలి? ‘తత్త్వమసి’ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి విలువైన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. అవశ్య పఠనీయ గ్రంథం. వెల: రూ. 350/- ప్రచురణ: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్ ప్రతులకు: 08562-274562; 9966623711 ప్రసిద్ధ కవి, కవి సంగమం వ్యవస్థాపకుడు, సరిహద్దు రేఖ వంటి విశిష్ట కవితా సంపుటులతో పాఠకులను ఆకట్టుకున్న యాకూబ్ తన తాజా కవితా సంపుటి ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ను ఆవిష్కరించి దేవిప్రియకు అంకితం ఇవ్వనున్నారు. గోరటి వెంకన్న, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, కోడూరి విజయకుమార్ తదితరులు పాల్గొంటారు. ఆగస్టు 15 ఉదయం 11 గం. నుంచి. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో. -
శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు
ఈదిన సముద్రాలు కొందరు ఒక జీవితకాలంలో చిన్న గుంతను తీసి నీరు నింపుతారు. కొందరు బావి తవ్వి బాటసారులకు వదిలిపెడతారు. కొందరు చెరువుకు ఆనకట్ట కట్టగలుగుతారు. కొందరు తటాకాలను కళకళలాడిస్తారు. కొందరైతే సరస్సులనే మన మానస మందిరాల్లో నింపుతారు. కాని సముద్రాలను సృష్టించినవారు కొందరుంటారు. అంచనాకు అందరు. సముద్రానికి సరిపడా మాలను అల్లగలరా ఎవరైనా? శ్రీకాంత శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాశారు. కథ రాశారు. నవల రాశారు. నాటిక రాశారు. నాటకం రాశారు. పాట రాశారు. గేయం రాశారు. యక్షగానం రాశారు. విమర్శ రాశారు. పరిశోధన రాశారు. అనువాదం రాశారు. కాలమ్స్ రాశారు... ఒక్క అక్షరం వృథా చేయకుండా పనికొచ్చేదంతా పులకరింప చేసేదంతా రాశారు. ఒకరోజు రెండు రోజులు కాదు... 1960 నుంచి ఇప్పటి వరకూ దాదాపు యాభై ఏళ్లు రాశారు. ఒక పేజీ రెండు పేజీలు కాదు వేలాది పేజీలు రాశారు. రోజూ తోడిబోస్తే ఒకనాటికి అది సముద్రం అవుతుందంటారు. ఇన్నాళ్లకు ఆయన రచనలన్నీ ఒకచోటకు చేరి రెండు బృహత్ సంపుటులు అయ్యాయి. రెండూ కలిపి దాదాపు 2,500 పేజీలు. ఉప్పు నీటి కెరటాలు కావు. అమృత జల భాండాలు. పుట్టినప్పుడు యేడవాలి నిశ్శబ్దంగా నువ్వు పడి ఉంటే మంత్రసాని ఏడిపించక వదలదు నువ్వు ఏడిచే వరకూ నీ జననం ఎవరికీ ఆనందదాయకం కాదు.... తొలిరోజుల్లో శ్రీకాంత శర్మ రాసుకున్న అనుభూతి గీతాల్లోని ఒక గీతం ఇది. జనన మర్మం, లోకమర్మం ఎరిగాక అనూహ్యమైన ఈ జీవితానికి అతిపెద్ద ఆలంబన సాహిత్యమే అనుకున్నారాయన. దానికి తగ్గ భూమిక ఇది వరకే ఏర్పడిపోయి ఉంది. తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి జగమెరిగిన సాహితీ మూర్తి. దానికి తోడు రామచంద్రాపురం (తూ.గో)లో గడిచిన బాల్యం, కొవ్వూరు (ప.గో) ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో సాగిన సంప్రదాయిక చదువు సాహిత్యం వైపు ఆయనకు సులువైన దారులు ఏర్పరిచాయి. ఆంధ్రజ్యోతి వీక్లీలో ఉద్యోగం, ఆ తర్వాత ఆలిండియా రేడియోలో సాగిన సుదీర్ఘ ఉద్యోగపర్వం ఆయనకు తేనె సేకరణ, మకరంద పంపిణీ తప్ప వేరే పని అప్పజెప్పలేదు. కనుక రాయడం.. రాయడం... రాయడం... ఇదే పని అయ్యింది శ్రీకాంత శర్మకు. ‘శిలా మురళి’ వంటి వచన కావ్యాలు, ‘ఏకాంత కోకిల’ వంటి పద్య కావ్యాలు, ‘తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా’ వంటి విస్తృత ప్రజాదరణ పొందిన గేయాలు... ఆయన కలం నుంచి కదనుతొక్కాయి. అయితే యక్షగానాల రచన ఆయన సామర్థ్యానికి సంగీత, నృత్యాల మేళవింపును దృష్టిలో పెట్టుకొని చేయగల వాక్య సృష్టికి తార్కాణంగా నిలిచాయి. ముఖ్యంగా అన్నమయ్య చరిత్రను ‘శ్రీపద పారిజాతం’ పేరుతో యక్షగానంగా మలచిన తీరు ప్రస్తావించ దగ్గది. ఇక ‘కిరాతార్జునీయం’, ‘శ్రీ ఆండాల్ కల్యాణం’, ‘గంగావతరణం’ నల్లేరుపై నడక. అయితే సరైన కవిని సరైన వచనం కూడా ఆకర్షిస్తుంది. విస్తృతి పొందిన వస్తువు కవిని వచనాన్ని ఆశ్రయించమని కోరుతుంది. శ్రీకాంత శర్మ ఆ విషయంలో- నేను కవిత్వానికి కట్టుబడి ఉంటాను అనుకోక కథలనూ సాధన చేశారు. గోదావరి జిల్లాల జీవితం ఆయన కథా వస్తువు. ఆయితే శ్రీపాద వారి గాలి కంటే మల్లాది వారి కేళే ఆయనను ఎక్కువ ఆకర్షించినట్టు అనిపిస్తుంది. స్త్రీల ప్రస్తావన, కట్టుగొయ్యకు కట్టిపడేసినట్టుగా చుట్టూ తిరిగే పురుషుల ప్రవర్తన... లోపలి బయటి కారణాలు... ఇవన్నీ శ్రీకాంత శర్మ కథల్లో కనిపిస్తాయి. అలానే హాస్యం కోసం చమత్కారం కోసం రాసిన సరదా కథలు కూడా ఉంటాయి. కాని నవలల సంగతి వచ్చేసరికి ఆయన కన్సర్న్స్ మారుతాయి. 1960లు కథాకాలంగా నడిచిన ఆయన తొలి నవల ‘తూర్పున వాలిన సూర్యుడు’ ఒక రకంగా శ్రీకాంత శర్మ ఆత్మకథా ఛాయలున్న రచన. ఓరియంటల్ కాలేజ్‌లో సాగే సంప్రదాయిక చదువును నేపథ్యంగా తీసుకొని నాటి విద్యార్థుల జీవితం గోదావరి జిల్లాలలోని బ్రాహ్మణ జీవితం ఆవిష్కరిస్తూ ‘వేద విద్య నాటి వెలుగెల్ల నశియించే’ పరిణామాలను సూచిస్తూ సాగుతుంది. అలాగే 1980లు కథాకాలంగా సాగిన ‘క్షణికం’ నవల నాటి బ్రాహ్మణ జీవితాలలోని ఆడపిల్లల్లో వస్తున్న కొత్త చైతన్యాన్ని, ప్రేమ ప్రకటనని, దాని వల్ల పాతతరం తల్లిదండ్రులతో పడవలసి వచ్చిన ఘర్షణని చూపిస్తుంది. అయితే అవసరం రీత్యా, అభిరుచి రీత్యా శ్రీకాంత శర్మ నాటకం/నాటికలో కూడా గట్టి కృషి చేశారనిపిస్తుంది. ఆకాశవాణిలో పని చేయడం వల్ల ఆయన లెక్కకు మించిన నాటకాలు, నాటికలు రాశారు. ఆయన రాసిన ‘ఆకుపచ్చని కోరికలు’ నాటకం జాతీయ పురస్కారం పొంది పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువాదమై శ్రోతలకు చేరింది. కవిత్రయ భారతంలోని మౌసల పర్వాన్ని ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణుడి ‘అవతార సమాప్తి’ని నాటిక చేసినా, కృష్ణ ద్వైపాయనుడు మహా భారత ఇతిహాసాన్ని రచించి వ్యాసమహర్షిగా మారిన తీరును ‘మహర్షి ప్రస్థానం’గా మలచినా అందుకు సృజన మాత్రమే చాలదు చాలా ‘చదువు’ కావాలి. ఆ వరుసలో ఆయన హెరాల్డ్పింటర్, బ్రెహ్ట్ వంటి గొప్ప నాటక కర్తల నాటకాలను అనుసృజిస్తూ కూడా నాటక రచన చేశారు. ఇక కాళిదాసును ప్రధాన పాత్రగా తీసుకొని మోహన్ రాకేష్ రాసిన హిందీ నాటకం ‘ఆషాఢ్ కా ఏక్ దిన్’ అనువాదం ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సృజనంతా ఒక ఎత్తు ఆయన చేసిన సమాలోచన ఒక ఎత్తు. సాధారణంగా సృజనకారులు సృజనాత్మక రచనల వల్ల కలిగే తృప్తిని కొండకచో కీర్తిని వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. చాలా కొద్ది మంది మాత్రం తాము గ్రహించిన జ్ఞానాన్ని, సమాచారాన్ని, పరిశీలనని, పరిశోధనని పదుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. వఈ పనిలో శ్రీకాంత శర్మ ఎటువంటి భేషజాలకు పోకుండా తన తరం వారికీ తన ముందు తరం వారికీ కూడా దివిటీలు పట్టారు. ‘సాహితీ దీపాలు’ పేరుతో దాదాపు ముప్పయ్ మంది సాహిత్యకారుల గురించి ఆయన రాసిన సమగ్ర పరిచయాలు- కేవలం ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు వంటివి కాదు- ఎందుకు గొప్పవారు ఎక్కడ గొప్పవారు అని చెప్పేవి. వేటూరి ప్రభాకర శాస్త్రి, త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, విశ్వనాథ సత్యనారాయణ, చలం, గుంటూరు శేషేంద్ర శర్మ... ప్రతి సాహిత్యాభిమాని తప్పని సరిగా చదవాల్సిన వ్యాసాలు ఇవి. కాని శ్రీకాంత శర్మ ఇంతకంటే చేసిన మంచి పని ‘అలనాటి నాటకాల’ను వాటి పూర్వాపరాలతో విస్తృతంగా పరిచయం చేయడం. తెలుగు నాటకాభిమానులకు- సతీ సావిత్రి, ద్రౌపదీ వస్త్రాపహరణము, సత్యహరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకము, శ్రీ కృష్ణ తులాభారము, తారా శశాంకం, సారంగధర... ఇలాంటివన్నీ కంఠోపాఠం. కాని వీటి వెనుక ఉన్న చరిత్ర, రచనల పుట్టుక, మార్పు ఇవన్నీ శ్రీకాంత శర్మ చేసిన పరిచయాలలో ఉన్నాయి. ఖల్జీ రాజ్య పతనము, రోషనార, ప్రతాపరుద్రీయం... ఈ నాటకాలకు సంబంధించిన విలువైన సమాచారం ఆయన శ్రమకోర్చి నిక్షిప్తం చేశారు. నిజం, కీర్తిశేషులు, మరో మొహంజోదారో, మా భూమి... వీటినీ వదల్లేదు. నిస్సందేహంగా ఇది గొప్పగా చెప్పుకోదగ్గ పని. ఇక కవిత్వానికి సంబంధించి తెలుగు పద్యం, గేయ కవితా ప్రస్థానం, యక్షగాన ప్రక్రియ, వచన కవిత, భావ కవిత, అనుభూతి కవిత... వీటన్నింటి గురించి చేసిన విస్తృత సమాలోచన కవులకు, సాహిత్య విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుంది. ‘తెలుగు కవుల అపరాధాలు’ ప్రత్యేకం. ఇవన్నీ కాకుండా ఇంత జీవితంలోనూ ఎదురైన పరిపరి పరిచయాలను శ్రీకాంత శర్మ పాఠకులకు ప్రత్యేక నజరానాగా అందిస్తారు. అయితే ఒకటి అనిపిస్తుంది. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈయన విశ్వాసాలు ప్రభావాలతో ఏర్పడినవి కావు. స్వయంగా ఏర్పరుచుకున్నవే. వాటి మీద రాజీ లేదు. అలాగే సాహిత్యం సాహిత్యం కొరకే తర్వాతే ప్రయోజనం కొరకు అనే విశ్వాసం కూడా ఆయనలో ఉంది. కళను తప్పించాక వస్తువుతో అది ఎంత పుష్టిగా ఉన్నా అది కళలోకి రాదు అనే భావన ఉంది. సాహిత్యాన్ని పలుచన కానివ్వరు కొందరు. శ్రీకాంత శర్మ అందులో ముఖ్యులు. సాహిత్యలోకంలో ఈ రెండు సంపుటాలు గౌరవనీయమైన స్థానాన్ని పొందుతాయనడంలో సందేహం అక్కర్లేదు. శ్రీకాంతశర్మ సాహిత్యం (రెండు సంపుటాలు); వెల: రూ.2,500; ప్రతులకు: నవోదయ 040- 24652387; శ్రీకాంత శర్మ నంబర్: 040 - 27114472 - సాక్షి సాహిత్యం -
తెలుగునేల పరిణామాలు చెప్పే నవల- ఒండ్రుమట్టి
ఒండ్రుమట్టి- నల్లూరి రుక్మిణి వెల: రూ.170 ప్రతులకు: 99891 33401 తాజా నవల: ‘ఒకప్పుడు ఊరుకు, ఇప్పుడు ఊరుకు తేడా ఉందిరా. అప్పుడు భూములున్నయ్యిగాని డబ్బు లేదు. అందరూ ఆ జొన్నలే ఆ సంగటే... కాకపోతే వాళ్లు కడుపు నిండా రెండు పూటలు తిన్నారు. మేం ఒక పూట తిన్నాం. అప్పుడందరూ ముతగ్గుడ్డలే. ఇప్పుడు ఊరు అట్టా ఉందా? వాళ్లు వరన్నమేనా? అందులోకి ఎన్ని రకాలు వచ్చినయ్. వాళ్లిప్పుడు సన్న పంచెలు కడుతున్నారు. మేం జానెడు గుడ్డల్లోకి వచ్చాం. వాళ్ల ఆడోళ్లయితే రకానికొక కోకలు కడుతున్నారు. మన ఆడోళ్లు ఆ చాలీచాలని ముతగ్గుడ్డలే’... ఇది ఈ నవలలో ఒక తాత తన మనవడికి చెప్పిన మాట. నల్లూరి రుక్మిణి రాసిన ఒండ్రుమట్టి నవలంతా స్థూలంగా ఈ విషయాన్నే చర్చిస్తుంది. మన దేశంలో అభివృద్ధి జరిగింది. కాని అది ఎలాంటి అభివృద్ధి? పైవారిని పైకి తీసుకెళ్లే అభివృద్ధి. కిందవారిని కిందనే ఉంచే అభివృద్ధి. నిజానికి అభివృద్ధి అనేది కాలం చెల్లిన సంప్రదాయాలని, దురభిప్రాయాలని, కుల దురహంకారాన్ని తొలగిస్తూ రావాలి. కాని అది వాటిని బలోపేతం చేసింది. సమాజం ముందుకు పోతోంది అనుకున్నాం కాని అది మరింత వెనుకబాటురూపం తీసుకుంది. అందుకు ఉదాహరణే కారంచేడు ఘటన. పైవర్గం వారు కింద వర్గం వారిని ఊచకోత కోయడానికి ఈ అభివృద్ధి ఎలా ఒక ఆయుధంలా పని చేసింది. అసలు ఈ అభివృద్ధికి మూలం ఏమిటి? ఈ ప్రశ్నను అన్వేషించుకుంటూ ప్రకాశం జిల్లాలోని కృష్ణపురం అనే ఊరిని (కారంచేడుకు ప్రతీక) మోడల్‌గా తీసుకొని నల్లూరి రుక్మిణి సాగించిన నవల ఒండ్రుమట్టి. ఈ నవలను చదువుతుంటే ఈతరం వారికి సరే పాతతరం వారికి కూడా ఆ రోజులు ఎలా గడిచాయో సరిగ్గా తెలుసా అనిపిస్తుంది. ఆడవాళ్లు ముతక కోకను నేయించుకోవడానికి రాట్నం పెట్టి ఏకులు వడుక్కోవడం... మెట్టప్రాంతల్లో జొన్నలు, రాగులు పండించి ఆ జొన్నలతో సంగటి చేయడానికి పొయ్యి రాజెయ్యడానికి కష్టాలు పడటం... ఆముదం కాచే పనులు... ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఊరిలోని వారందరి భాగస్వామ్యం ఉండే ఊరుమ్మడి బ్రతుకులు... ఇవన్నీ కనపడతాయి. చరిత్ర అంటే ఎప్పటివో రాజుల కథలే కాదు. మూడు నాలుగు తరాల క్రితం మన పెద్దల కథ కూడా చరిత్రే. కథ విషయానికి వస్తే కృష్ణాపురమనే తీరగ్రామం. అన్నీ మెట్టపంటలే. జమిందారుల ప్రాభవాలు సన్నగిల్లుతున్న సమయం. కోటయ్య, గంగమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. తిరుపతయ్య, పరమయ్య, వెంకయ్యలు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కుటుంబం జరుగుబాటు కష్టమై ముందుగా పరమయ్య, వెనకాల తిరుపతయ్యలు తెలంగాణ పల్లె రాకూరుకు వెళ్లి అక్కడి అటవీ భూములను సాగులోకి తెచ్చుకుంటారు. ఇక ఇక్కడ వెంకయ్య కాలంలో సాగునీటి వనరులు అందుబాటులోకి రావడం పొగాకు సాగు కొత్తగా రావడం లాంటివి జరుగుతాయి. ఇక్కడ ఇలాంటి కుటుంబాల అభివృద్ధి కింద వర్గాల వారిని ఇంకా కిందకు నెట్టేసింది. ఇక్కడి వాళ్లు తెలంగాణకు వచ్చి సాధించిన అభివృద్ధి అక్కడి వారిని వెనక్కు నెట్టేసింది. ఈ రెంటి మధ్య ఉన్న ఘర్షణ... మానవ సంబంధాల విచ్ఛిన్నం... మొత్తం తెలుగునేలపైని 65 సంవత్సరాల కాలప్రవాహంలోని మార్పులను ఈ నవల పట్టి ఇస్తుంది. నవల తొలిభాగం ‘క్విట్ ఇండియా’ ఉద్యమం వరకు, మలిభాగం కారంచేడు ఘటనల వరకు సాగుతుంది. తొలిభాగంలో అనేక ఉద్యమాల ప్రభావాల వల్ల సమాజంలో జరుగుతున్న పరిణామాలను పాత్రల ద్వారా చక్కగా వివరించిన రచయిత్రి మలిభాగంలో ఉద్యమాలను కేవలం ఉపన్యాస ధోరణికి పరిమితం చేశారనిపిస్తుంది. బహుశా నవల నిడివి ఎక్కువవుతుందనుకున్నారేమో. కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన నెహ్రూ ప్రజల దృష్టిని మళ్లించడానికి చైనాతో యుద్ధానికి దిగాడనే అర్థంలో రాశారు. కమ్యూనిస్టుల చైనా భక్తి, కూలిపోయిన సోవియెట్ యూనియన్ భక్తి వర్థిల్లుగాక. ఈ కమ్యూనిజం భక్తి ఎలా ఉందంటే తిరుపతయ్య అల్లుడు శంకరం పొగాకు కమిషన్ వ్యాపారం చేయవచ్చుగానీ వెంకయ్య కొడుకు భాస్కరం చేస్తే మాత్రం సంపాదన యావ అనేస్తారు. చిన్న చిన్న లోపాలు, పఠనీయతలో కొంత నెమ్మది ఉండొచ్చుగాని ఈ కృషి మాత్రం గట్టిది. ఇంత విస్తృతి ఉన్న ఈ నవల రాయడం చాలా కష్టం. రచయిత్రి ఎక్కడా నిస్పృహ చెందక దీక్షగా దీనిని ముగించగలగడం విశేషం. సుమారు 65 ఏళ్ల గ్రామీణ జీవితాన్ని దశల వారీగా ప్రజల జీవన శైలిలోని మార్పులను పట్టి చూపుతూ చిత్రించారు. ఈ తీరగ్రామంలోని మార్పులే కొన్ని ఏళ్లు ముందూ వెనకలుగా మిగిలిన ప్రాంతాల్లోనూ జరిగాయి. మెట్లపైర్లు పండించే ప్రజల జీవనం నీటిపారకం వల్ల, ఆధునిక యంత్రాలు, రవాణ వ్యవస్థ, విద్య వల్ల ఎలా మారాయో తెలుసుకోవాలనుకునేవారికి, దశాబ్దాల సమాజ పరిణామాలను అధ్యయనం చేయాలనుకునేవారికి ఈ నవల ఒక మంచి డాక్యుమెంట్. - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి -
హృదయం: రెండు రాష్ట్రాల ప్రేమ
టు స్టేట్స్... నవలగానే కాదు, సినిమాగా కూడా పెద్ద హిట్. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడి, వారి ప్రయాణం పెళ్లిదాకా సాగితే ఎలా ఉంటుందో చదివాం. చూశాం. ఆనందించాం! కానీ ఈ కథ చదువుతూ, చూస్తూ తమను తాము అద్దంలో చూసుకున్నవారి అనుభూతే వేరు. అలాంటి మూడు ప్రేమకథలు మీకోసం.డాక్టర్ ఆర్.కె.పూరి, డాక్టర్ విజయపూరిల ప్రేమకథ గురించి తెలుసుకోవాలంటే 30 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. పూరిది పంజాబ్‌లోని గుర్గావ్. విజయది తమిళనాడులోని చిదంబరం. పీహెచ్డీ పనిలో భాగంగా పూణె యూనివర్సిటీలో 1977లో కలిశారు వీళ్లిద్దరూ. ఐదేళ్ల సహచర్యంలో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది పెళ్లికి దారి తీసింది. ఐతే, వారి పెళ్లి అంత సులభంగా ఏమీ అయిపోలేదు. విజయ తల్లిదండ్రులు 1975కి ముందే చనిపోయారు. మిగిలిన బంధువులెవరూ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పట్లో నార్త్ ఇండియాలో కొత్త పెళ్లికూతుళ్లు వరుసగా అగ్నికి ఆహుతవుతున్న ఘటనలు పత్రికల్లో వస్తుండటంతో తమ అమ్మాయిని అంత దూరం పంపడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రులుంటే వాళ్లిద్దరినీ ఒప్పిస్తే సరిపోయేది కానీ, వాళ్లు లేకపోవడంతో బంధువులందరినీ ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో పూరి కూడా తన తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. చివరికి అంతా ఒప్పుకున్నాక, వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ తాము కలిసిన మహారాష్ట్రలోనే సెటిలయ్యారు. పెళ్లయి 30 ఏళ్లవుతున్నా... విజయ పంజాబీ నేర్చుకోలేదు. పూరి తమిళం వంటబట్టించుకోలేదు. ఇద్దరూ హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారు. మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడూ మరాఠిలోనూ కూడా. పూరి ప్రొఫెసర్‌గా రిటైరైపోగా, విజయ ఇంకా ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఓ కూతురు. ఆమెను తమిళునికో, పంజాబీకో కాకుండా మహారాష్ట్రవాసికిచ్చి పెళ్లి చేశారు. వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు మధ్య పెరిగిన వీరిద్దరూ ఇన్నేళ్లు ఎలా కలిసి జీవనం సాగించారు అంటే... మాది ప్రేమ భాష, మేం భారతీయులం అంటారు విజయ, పూరి. కిరణ్ పర్మార్, ప్రతిభ... ఈ పేర్లు చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్లిద్దరికీ ఎక్కడా కలవదని. కిరణ్ది గుజరాత్ అయితే, ప్రతిభది తమిళనాడు. వీళ్లిద్దరూ 2009లో ముంబైలో ఎంబీఏ చేస్తూ కలిశారు. ముందు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరి మధ్య తర్వాత ఏదో తెలియని బంధం మొదలైంది. అది ప్రేమేనని గుర్తించి ముందుగా కిరణ్, పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ప్రతిభకు కూడా కిరణ్‌పై మంచి అభిప్రాయం ఉండటంతో, ‘కాదు’ అని చెప్పలేకపోయింది. కానీ కథ అంతటితో సుఖాంతం అయిపోలేదు. కిరణ్ తల్లిదండ్రులు పెళ్లికి పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు కానీ, ప్రతిభ కుటుంబం నుంచి పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఎంత నచ్చజెప్పినా వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఏడాది పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. 2011 ఆగస్టు 16న కిరణ్ తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. దీంతో ప్రతిభ తల్లిదండ్రుల కోపం నషాళానికి అంటింది. తమ కూతురిని వెలివేశారు. ఆమెతో మాట్లాడలేదు. భర్త ప్రేమ, తల్లిదండ్రులు దూరమైన బాధను మరిపించినా, వాళ్లు ఎప్పటికైనా కలుస్తారన్న ఆశతో జీవనం సాగించింది ప్రతిభ. ఇద్దరికీ పాప పుట్టాక కానీ వారి మనసు కరగలేదు. ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ఈ ఘనత తమ పాప యాషినిదే అంటారు కిరణ్, ప్రతిభ. సంహిత చౌదరిది త్రిపుర. సాగర్ మల్సానెది మహారాష్ట్ర. వీళ్లిద్దరినీ కలిపింది ఇంగ్లండ్. మాస్టర్స్ చేసేందుకు యూకేలో అడుగుపెట్టిన సంహితకు కొన్నాళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు సాగర్. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని చూసిన తొలిసారే ప్రేమలో పడతారు. ఇక్కడ సీన్ రివర్స్. క్యాంటీన్లో భోజనం చేస్తుండగా నల్లటి టీ షర్ట్‌లో ఓ అబ్బాయిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది సంహిత. ఆమె ఫ్రెండ్ ఉన్నట్లుండి సాగర్‌ను తీసుకొచ్చి, పరిచయం చేసేసరికి ఆశ్చర్యపోయింది. ఆ పరిచయం కొన్నాళ్లకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని బంధంగా మారింది. ఓసారి క్రిస్మస్ సమయంలో సాగర్ వారం రోజులు కనిపించకుండా పోయేసరికి తట్టుకోలేకపోయింది సంహిత. అతను మళ్లీ కనబడగానే నిన్ను విడిచి ఉండలేనని చెప్పేసింది. నాదీ అదే ఫీలింగ్ అంటూ మనసు విప్పేశాడు సాగర్. ఐతే, తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో కొన్నాళ్లు ఎదురుచూడాలని భావించారు. కానీ ఎక్కువ రోజులు ఆగలేకపోయారు. ఒక్కొక్కరికీ విషయం చెప్పి, ఒప్పించే ప్రయత్నం చేశారు. అందరూ సరే అన్నారు. కానీ సాగర్ తండ్రి మాత్రం పెళ్లికి ససేమిరా అన్నాడు. ఐతే, ఓ రోజు సంహిత తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి, తన తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు సాగర్. అప్పటికీ కాదనే అన్న తండ్రి కొన్నాళ్ల తర్వాత మనసు మార్చుకుని పెళ్లికి పచ్చజెండా ఊపాడు. గత ఏడాది డిసెంబర్లో వీరి పెళ్లయింది. అంతా కలిసి అన్యోన్యంగా ఉంటున్నారు. -
అచ్చ తెలుగు సరస్సు జీవనం కొల్లేటి జాడలు...
అందరికీ కాకపోయినా చాలా మందికి బాల్యం ఒక మధురస్మృతి. అక్కినేని కుటుంబరావు ‘కొల్లేటి జాడలు’ నవల- కూడా ఒక బాల్య మధురస్మృతే. ఇది ఒక సరస్సు సృష్టించిన వ్యవస్థ నడుమ విరిసిన బాల్య స్మృతుల మాధుర్యం. మట్టీ నీరూ, ఏరూ లంకా, వానా వరదా, చెట్టూ చేనూ, చేపలూ పక్షులూ, బర్రెలూ జలగలూ- సరస్సు జీవనంలో అనివార్యమైన వీటి చుట్టూ విహరించే కథనం. ఒకనాటి కొల్లేటి భౌగోళిక నిర్దిష్టతను, అది సృష్టించి నడిపించిన జీవనాన్నీ ఈ నవల మన కళ్లకు కడుతుంది. అయితే అంతటితో ఆగిపోదు. వర్తమాన విధ్వంసాన్ని వివరిస్తుంది. ఈ నవలకు కేంద్రమైన పులపర్రు గ్రామంలో మనకు నేరుగా, సరస్సు జీవనంతో అత్యంత సరళంగా ప్రత్యక్షంగా వ్యవహరించే లేదా తలపడే రెండే కులాలు కనిపిస్తాయి. ఒకటి వ్యవసాయం చేసే కమ్మదొరల కులమూ, రెండోది చేపలు పట్టే వడ్డి రాజుల కులమూ. కొల్లేరు తీరం వెంబడి ఉండిన అటువంటి గ్రామాలన్నిటా- సహజంగానే- వీరి వంటా తిండీ, పనీ పాలూ, గొడ్డూ గోదా, సంబరం వినోదం, అలవాట్లూ ఆచారాలూ ఇవన్నీ అక్కడ దొరికే చేపల చుట్టూ, పండే పంటల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఆ మేరకు ప్రకృతితో, స్థానిక భౌగోళిక నిర్దిష్టతలతో పెనవేసుకుపోయాయి. ఈ సహజ సంబంధాన్ని ‘కొల్లేటి జాడలు’ మనోహరంగా చిత్రిస్తుంది. ఇవేవీ తెలియని పాఠకులకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ నవలలో చిత్రించినదాన్ని బట్టి చూస్తే ఆ ప్రాంతంలో ఫ్యూడల్ ఇనుపచట్రం మరీ బిగుతుగా లేదనిపిస్తుంది. ఇందుకు కారణం ఇక్కడి శ్రమ ప్రకృతితో ప్రత్యక్షంగా తలపడేదిగానూ శ్రమదోపిడీ అతి తక్కువగానూ ఉండడం కావచ్చు. ఆ మేరకు నవలలోని సమాజం బాగా ‘అభివృద్ధి’ చెందిన మైదాన ప్రాంతాల కన్నా ‘వెనుకబడిన’ గిరిజన సమాజానికి దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే కొల్లేటి ప్రకృతికి మరో పార్శ్వం కూడా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు, తత్ఫలితంగా కొల్లేటిలో కలిసే వాగుల ఉద్ధృతి, అంతిమంగా సరస్సు సృష్టించగల విధ్వంసం- వీటి మధ్య నిత్య ప్రశ్నార్థకంగా మిగిలే ‘కొల్లేటి వ్యవసాయం’- ఈ లింకుల్నీ, వాటి చుట్టూతా జరిగే నిరంతర పోరాటాన్ని కూడా మన కళ్లకు కడుతుందీ నవల. ఒక దశలో ‘మన పూర్వీకులు ఇలాంటి చోటుకొచ్చి స్థిరపడ్డారెందుకా’ అని గ్రామస్తులు తలలు పట్టుకుంటారు. అలాగని నిరాశలో కూరుకు పోకుండా తమవంతు కృషి చేసి గీతాబోధనను ఆచరణలో పెడతారు. కొల్లేరులో రైతుల పరిస్థితితో పోలిస్తే చేపలు పట్టి అమ్ముకునే వడ్డిరాజుల పరిస్థితి కాస్త మెరుగ్గా, అంటే కొంత నిలకడగా ఉన్నట్టు తోస్తుంది. ఇందుకు ప్రధాన కారణం- అప్పట్లో కొల్లేరులో నిత్యం పుష్కలంగా దొరికే చేపలు. అప్పటికి పెట్టుబడి పెట్టి చేపల్నీ రొయ్యల్నీ ‘పండించే’ ప్రయత్నం ఇంకా మొదలు కాలేదు కనుక జీవితం ప్రశాంతంగానే ఉంది. అయితే నవల చివరిలో- అంటే ఒక తరం గడిచేక- ఈ ప్రశాంతత పోయింది. ఊరూరా తిరిగి చేపల్ని అమ్ముకొనే సరళ వాణిజ్య స్థానంలో భారీ పెట్టుబడీ, దూరప్రాంతాలకు ఎగుమతీ చోటు చేసుకొని అంతకు ముందు లేని రిస్కులను, సంక్ష్లిష్టతనూ సృష్టిస్తాయి. అంతేకాదు ప్రకృతిలో ఉండిన సమతుల్యాన్ని ధ్వంసం చేస్తాయి. దీనికి పట్టణాల పెరుగుదల, అవి సృష్టించే మార్కెట్, ఎగువ ప్రాంతాల పారిశ్రామికీకరణ, దాని వెంట వచ్చే కాలుష్యం తోడవుతాయి. తీవ్రగతిన వినాశనం విస్తరిస్తుంది. రచయిత చెప్పించిన మాటల్లో- ‘వాళ్ల తప్పు వాళ్లకు తెలిసిందిగానీ చాలా ఆలస్యంగా తెలిసింది’ అయితే బాహ్యశక్తుల ప్రభావం కేవలం విధ్వంసానికే పరిమితమైందనుకోవడం కూడా సరికాదు. కొద్దిమందైనా చదువుకొని పట్నాలకు పోవడం, తిరిగి వచ్చి, సాహిత్యం సినిమాల వల్ల వచ్చిన చైతన్యంతో గ్రామాల్లో కొత్త ప్రశ్నలు లేవదీసి స్తబ్దతను వదల గొట్టడమూ కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఈ నవలా రచయిత కుటుంబరావు జీవితానుభవం, సృజనాత్మక కృషి కూడా ఇలాంటి ప్రభావం వల్ల సంభవించినవే. అందువల్ల ఈ క్రమాన్ని కూడా ‘కొల్లేటి జాడలు’ సృజనాత్మకంగా, సాధికారంగా నమోదు చేస్తుంది. ఏమైనా వ్యక్తులకు చైతన్యం కలిగి సమష్టిగా ఏదైనా చేసేలోపే ఆసియా ఖండపు అతిపెద్ద మంచినీటి సరస్సు సమూలంగా నాశనమైన తీరును ఈ నవల ప్రధానంగా మనముందుంచుతుంది. ఈ నవల చదవడం పూర్తయేసరికి ‘అయ్యో ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగకూడదు’ అనిపిస్తుంది. ఎందుకిలా జరిగిందనే ప్రశ్నకు నవలలోనే సమాధానం దొరుకుతుంది. మిగతా చోట్ల కూడా ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనే ప్రశ్నను ఈ రచన పాఠకులకు విడిచిపెడుతుంది. ఇందుకుగాను శ్రమిస్తున్న వాళ్లతో చేతులు కలపాలనే ఆలోచనను కలిగిస్తుంది. అలాగని ఉత్తుత్తి ఆశావాదపు భ్రమని కలిగించదు. అందుచేత ‘కొల్లేటి జాడలు’ నవల ఒక వ్యక్తి ఎప్పటికీ తిరిగిరాని తన బాల్యం గురించి రాసుకున్న కథ మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యంగా- ఒక సమాజం చేజేతులా నాశనం చేసుకున్న తిరిగిరాని జీవనం గురించి మోగించిన ప్రమాద ఘంటిక. తుది హెచ్చరిక. - సుధాకర్ ఉణుదుర్తి -
మన నవలలు: అసందిగ్ధ జీవితపు అగమ్య ప్రయాణం
దేవుడికి లోబడిపోదాం. ఈశ్వరా... అంతా నువ్వే చూసుకో తండ్రీ. సంతోషంగా ఉంటున్నామా? అంతా అనుకున్నట్టుగా జరుగుతోందా? అంతా మంచే సంప్రాప్తిస్తోందా. లేదే! పోనీ ప్రకృతికి లోబడిపోదాం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై... స్వచ్ఛంగా పవిత్రంగా హాయిగా... సంతోషంగా ఉన్నామా? పేదరికం... దరిద్రం... ఆకలి... విషజ్వరాలు. సరే. ఉద్యమానికి లోబడిపోదాం. చిత్రం. ఒక వీరుడు మంటల్లో. ఒక ఉపన్యాసకుడు అందలం మీద. సమానమైన ప్రతిఫలమేనా ఇది? మరి హేతువాదానికి లోబడటమే మేలు. దేవుడూ లేడూ దెయ్యమూ లేదు. మంచిదే. కాని ప్రతిదానికీ మనసు పీకుతూ ఉందే. ఏ నమ్మకమూ లేని బతుకు. మార్క్స్‌ను పట్టుకొని ఆ దారిలో? స్థిరం లేదు. హిట్లర్‌ను పట్టుకొని ఈ దారిలో? శాంతి లేదు. ఇంతకీ ఏ దారిలో వెళితే ఈ జీవితం సంతోషంగా ఉంటుంది? అసలు ఏ దారిలో వెళ్లినా సంతోషం దొరకని జీవితంలో అసందిగ్ధతను మోస్తూ బతకడం ఎట్లా? మధు కోరుకున్నదల్లా ఎంఏలో క్లాసు రావడం. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం. ఆ తర్వాత ఉన్నంతలో జీవితం. అతడు ఊహించింది ఇంత వరకే. అతని ఇంగితానికి దొరుకుతున్న జీవితమూ ఇంత వరకే. ఇంతకు మించి లేదు. ఎందుకంటే జీవితం గురించి ఆలోచించాలంటే అతడికి భయం. దాని గురించి ఆలోచించాలంటే ముందు అతడు తన తల్లి గురించి ఆలోచించాలి. ఆమె ఊళ్లో ఉంటుంది. తను హైదరాబాద్‌లో. ఊళ్లో ఉన్న తల్లి తను ఊహించిన తల్లిలానే ఉందా? ఏం లేదు. చిన్న వయసులోనే భర్త పోయాడని ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. అదీ అన్యకులం వాడితో. ఆమెకు వచ్చిన పరిస్థితులు అలాంటివి. ఆమె దృష్టిలో నుంచి చూసినప్పుడు సమర్థనీయం. తన దృష్టిలో నుంచి చూస్తే కాదు. కాని ఆమె జీవితాన్ని తను వ్యాఖ్యానించాల్సి రావడమే ఇబ్బంది కదా. మరి తను ఆమెకు పుట్టిన కొడుకు. ఇద్దరి జీవితాలకూ సంబంధం ఉంది. కాని విడివిడిగా చూస్తే ఎవరి జీవితం మీద వారికి హక్కు ఉండొద్దా? ఈ కలివిడి, విడివిడి పరిస్థితి మీద మధుకు అయోమయం ఉంది. అందుకే జీవితం వైపు కన్నెత్తి చూట్టానికి అతడికి భయం. సరే. పట్నంలో ఖాళీగా ఉండటం ఎందుకని చదువుకు నాలుగు డబ్బులు అక్కరకొస్తాయని జాగీర్దారు ఉమామహేశ్వరరావు ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఈ జాగీర్దారు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడో తాగి తందనాలాడుతుంటాడట. అప్పటికే జాగీర్ పోయింది. కాని ఈలోపే ఆయన అక్కగారు మేలుకొని ఆ వచ్చే నష్టపరిహారం జాగ్రత్త చేయడంతో పరిస్థితికి కొదవ లేకుండా ఉంది. ఇంట్లో ఆ అక్కగారు. ఆమె కూతురు నళిని. జాగీర్దారు కూతురు కుసుమ, ఇంకా పసితనం వీడని కుమారుడు కిశోర్. ఈ కిశోర్‌కు నాలుగు పాఠాలు చెప్పి కాసింత కాలక్షేపం చేద్దామనుకొని ఆ ఇంట అడుగుపెట్టాడు మధు. కాని జరిగిందేమిటి? జీవితం అతణ్ణి చేర్చిన దరి ఏమిటి? మొదట కుసుమ ఆకర్షణలో పడ్డాడు. కుసుమ ఇతడి ఆకర్షణలో పడింది. ఇద్దరూ సికిందరాబాద్ ప్యారడైజ్ టాకీస్‌లో ‘నౌరంగ్’ సినిమాకు వెళ్లి బాక్స్‌లో కూచుని ఆ చీకటిలో ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. నళిని ఇందుకు పరోక్షంగా సహకరించింది. అంతా కుదిరితే కుసుమకు, మధుకు వివాహం. ఇంతలో ఏదో జరిగింది. ఏం జరిగింది? ఒకరోజు సాయంత్రం కుసుమను మధు గట్టిగా కావలించుకున్నాడు. గాజులన్నీ పగిలిపోయాయి. ఒక గాజుముక్క గుచ్చుకుని మధు ఛాతీలో చిన్నబొట్టు చిమ్మింది. తలెత్తి చూస్తే ఆ ప్రణయచేష్టలో ఆమె బొట్టు చెరిగిపోయి ఉంది. వెల్లువలో పూచికపుల్లలు నవల: వెల్లువలో పూచికపుల్లలు; రచయిత: భాస్కరభట్ల కృష్ణారావు; తొలి ప్రచురణ: 1960 తెలుగులో అస్తిత్వవాదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నవల. పాఠకులను ఒక కొత్త ఎరుకలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నవల. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన భాస్కరభట్ల కృష్ణారావు కథా రచయితగా, నవలా రచయితగా సుప్రసిద్ధులు. మధ్యలో ఆయన రచనలు కనుమరుగైనా ఇటీవల పుస్తకాలుగా వెలువడటం వల్ల ఆయన ప్రతిభ కొత్త తరాలకు పరిచయం చేయడం వీలవుతోంది. భాస్కరభట్ల చిన్న వయసులో మృతి చెందకపోయి ఉంటే మరిన్ని గొప్ప రచనలు చూసి ఉండేవాళ్లం. ఆయన రచనలు రెండు వాల్యూములు విశాలాంధ్రలో లభ్యం. ఆయన ‘యుగసంధి’ నవల తెలంగాణ జీవితానికి దర్పణం. బొట్టు చెరగడం... గాజులు పగలడం... దేనికి సంకేతం? ఇద్దరి మనసూ వికలమైంది. బుద్ధి- ఇది మామూలు ఘటన అంటోంది. హృదయం- దుశ్శకునాన్ని సూచిస్తోంది. ఇద్దరూ తాత్కాలికంగా దూరమయ్యారు. ఈలోపు అక్కగారు గుండెజబ్బుతో గుటుక్కుమంది. లంకంత కొంప. మగతోడు లేదు. తల్లి పోయిన దుఃఖంలో నళిని ఏడ్చి ఏడ్చి సున్నమవుతుంటే ఆ సాయంత్రం ఆమెను ఉపశమింపజేయడానికి మధు గండిపేట తీసుకెళ్లాడు. అప్పటికే చీకటయ్యింది. వెన్నెల పూస్తోంది. తోటలో పూలూ మకరందమూ మత్తెక్కించే గాలి తప్ప వేరే ఏం లేదు. ఒకవైపు ఏకాంతం. మరోవైపు యవ్వనం. జరగాల్సింది జరిగిపోయింది. మరో రెండు వారాలకు ఇద్దరికీ పెళ్లయిపోయింది! ఆశ్చర్యమే ఇది. ట్యూషన్ చెప్పడానికి వచ్చినవాడు ఆ ఇంటి అల్లుడయ్యాడు. కాకపోతే ఒకరిని అనుకొని మరొకరిని చేసుకున్నాడు. ఇందులో తన తప్పు ఉందా? తన తప్పు ఏం ఉంది? పరిస్థితులు అలా తోసుకొచ్చాయి. ఆ పరిస్థితులకు తగినట్టుగా తాను వ్యవహరించాడు. అంతే. అయితే జీవితం ఇలా ఉంటుందని కుసుమకు తెలియదు. తాను వలచినవాడు తన కళ్లెదురుగా మరొకరికి భర్త అవుతాడని ఆమె ఊహించలేదు. అందుకే స్తబ్దుగా అయిపోయింది. ఎంత స్తబ్దుగా అంటే మామూలు ప్రపంచం నుంచి దాదాపుగా విరమించుకుంది. మతిభ్రమణం! పిచ్చి! ఆమె వైపు నుంచి చూస్తే నళినికి, మధుకు గిల్ట్. కాని తమ వైపు నుంచి చూస్తే తామే తప్పూ చేయలేదు. మరికొన్నాళ్లకు తాగీ తాగీ జాగిర్దారు పోయాడు. లంకంత కొంప దెయ్యాల కొంపలా మారింది. అక్కగారు లేదు. అయ్యగారు లేడు. ఒక కూతురుకి పిచ్చిపట్టింది. కిశోర్ ఇంకా పసివాడే. ఈ పరిస్థితుల్లో నళినికి, మధుకి ఏం సంతోషం ఉంటుంది? ఒక బిడ్డ పుట్టాడు. జీవితం మళ్లీ వెలిగింది. అమ్మయ్య జీవితంలో ఏదో ఒక పద్ధతి ఉన్నట్టే ఉంది అనుకున్నాడు మధు. నాలుగు రోజులు గడిచాయి. ఈ ఇల్లు బాగలేదని కొత్త ఇంట్లోకి మారదామని భారీ ఇంటికి నళిని ప్రణాళిక వేసింది. అందమైన భవిష్యత్తు కోసం కలలు. ఇంతలో ఆమెకు మళ్లీ గర్భం వచ్చింది. కాని ఈసారి జీవితం వెలగలేదు. ఆరిపోయింది. ఆ గర్భమే నళినిని ఈలోకం నుంచి తీసుకెళ్లిపోయింది. చీకటి. మధు జీవితంలో కటిక చీకటి. అంతా చేసి మూడేళ్లు. మూడేళ్ల క్రితం అతడో మామూలు కుర్రవాడిగా ఒక ట్యూషన్ మాస్టారుగా ఆ ఇంట అడుగుపెట్టాడు. మూడేళ్లు ముగిసేసరికి కొన్ని సంయోగాలని కొన్ని వియోగాలని కొన్ని ఆనందాలని కొన్ని భయంకరమైన విషాదాలని కొన్ని తనకు నిమిత్తమైన సంగతులని కొన్ని తన ప్రమేయం లేకుండా జరిగిపోయిన సంఘటనలని అన్నీ చూసేశాడు. ఇంత చూశాక అతడికి మళ్లీ సందేహం వచ్చింది. ఇంతకీ జీవితం అంటే ఏమిటి? నవల ముగిసింది. ‘కేవలం నీ చర్యలకు నువ్వు బాధ్యత వహిస్తూ పర్యవసానం ఏమిటో తెలియకుండా గమ్యం ఎటో తెలియకుండా జీవితాన్ని నిర్వహించుకుంటూ వెళ్లడం ఏ మనిషికైనా చాలా బరువుతో కూడుకున్న పని’- అస్తిత్వవాదానికి ఒక వ్యాఖ్యానం ఇది. మనిషి ఒక ఉనికి అయితే అతడి జీవితం ఏ ఉనికి ఆధారంగా నడుస్తుంది? దైవం ఉంది అనుకుంటే అంతా మంచే జరగాలి. జరగడం లేదు. దైవం లేదు అనుకుంటే అంతా చెడే జరగాలి. అలా జరగడం లేదు. పోనీ జీవితం ఇలా ఉంటుందని ఊహిస్తే అలా ఉండటం లేదు. అసలేమీ ఊహించకుండా ఊరుకుంటే జడత్వం వల్ల కదలడం లేదు. చలనం కావాలి. కాని అది మనం కోరుకున్నట్టుగా కావాలి అనుకోవడం అసాధ్యం. అసంభవం. అంటే జీవిత గమనం, ప్రపంచ గమనం ఒక అసంబద్ధం. అబ్సర్డ్. అందువల్ల అది ఎలా ఎదురుపడితే అలా స్వీకరించడమే చేయదగ్గది. జీవితాన్ని జీవించడమే, నిండుగా ఎదుర్కొనడమే చేయదగ్గది. దాన్నుంచి ఆశించినా భంగమే. దానికి దూరంగా పారిపోయినా నష్టమే. దాంతో పాటు నడుస్తూ మన ఉనికికి, చేష్టలకు బాధ్యత వహిస్తూ ఫలితంగా వచ్చే ఇష్ట/అయిష్టమైన పర్యవసానాలను సమైక్య దృష్టితో చూస్తూ ముందుకు సాగితే కొంత నయం. ఇలాంటి భావజాలాన్ని ‘అస్తిత్వవాదం’ పేరుతో కిర్క్గార్డ్లాంటి తత్త్వవేత్తలు ప్రవేశపెడితే జీన్ పాల్ సార్త్,్ర ఆల్బర్ట్ కామూలాంటి వాళ్లు సాహిత్యంలో ప్రవేశపెట్టి జగద్విదితం అయ్యారు. తెలుగులో అలాంటి భావజాలాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టడం, అదీ ఒక శక్తిమంతమైన నవలగా తీర్చిదిద్దడం రచయిత భాస్కరభట్ల కృష్ణారావు సాధించిన ఘనత. ఈ నవలలో పాత్రలు అంతవరకూ వచ్చిన నవలల్లోలాగా కంట్రోల్డ్‌గా ఉండవు. తాము ఊహించినట్టుగా ఉంటూ జీవితాన్ని తాము ఊహించినట్టుగా ఉంచుకోవు. సహజంగా ఉంటాయి. పరిమితులకు బాహ్యంగా వ్యవహరిస్తాయి. పరిస్థితులు తోసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మల్లే వెల్లువలో పూచికపుల్లల్లా కొట్టుకుపోతాయి. ప్రతి వ్యక్తి ఒక ఇండివిడ్యువల్. అతని జీవనసూత్రాలకీ మరొకరి జీవనసూత్రాలకీ పోలిక లేదు. అంటే ఎవరినీ దేనినీ వ్యాఖ్యానించడానికి ఒక కచ్చితమైన కొలబద్ద ఉండదు. ఒక రకంగా చూస్తే మధు తల్లి చేసింది ఒప్పు. మరో రకంగా చూస్తే మధు అభ్యంతరపడటం కూడా ఒప్పు. కాని ఒక తప్పుకు రెండు ఒప్పులు ఎలా ఉంటాయ్? అది ఆలోచించాలి. దేనికైనా ఒక మోడల్ అంటూ ఉంటే ఆఖరుకు విజేతలు, శ్రీమంతులు, ప్రపంచాధిపతులు కూడా అశాంతితో ఎందుకు ఉన్నారు? అది ఆలోచించాలి. అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిని పట్టి కుదేలు చేయడమే జీవితం పని. ఆ ఎరుక కలిగించే నవల ఇది. జీవితంలో డిస్టర్బెన్స్ ఉండటం గురించి కాకుండా అసలు డిస్టర్బెన్సే జీవితం అనే అవగాహన కలిగించి పాఠకులకు తమ జీవితాన్ని ఎదుర్కొనడం నేర్పే ఉత్కృష్టమైన నవల. అసలు సిసలు తెలుగు నవల. -
సాహిత్యానికి బయటి బతుకులు
ఏటి గట్టునా మా ఊరూ ఎవ్వరు లేరూ మా వారూ ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కిపోలేరు... ఇక వెనక్కి పోలేరు.... ఇది సినిమా పాట. యాభై ఏళ్లు దాటిన ఈ రాజమకుటం అనే సినిమాలో రాజసులోచన ఐటమ్ సాంగ్. ఏలూరులో తమ్మిలేరు ఒడ్డున ఎరుకలు, యానాదులు, దొమ్మర్లు ఉంటారు. ఆడా మగా అందరికీ అసాధారణమైన టాలెంట్స్ ఉంటాయి. గొప్ప విలుకాళ్లు. సాము గరిడీల్లో సూపర్ స్పెషాలిటీలు. డప్పులూ, తీగ వాద్యాలూ గొప్పగా వాయిస్తారు. ఆడవాళ్లు తాడు మీద నడుస్తూ ఎన్నో విన్యాసాలు చేస్తారు. డాన్సులూ అదిరిపోతాయి. వీళ్ల సంస్కృతి చాలా విశిష్టమైనది. ఈ సంచార జాతుల వాళ్లకి నేరస్థ జాతులుగా బ్రిటిష్‌వాళ్లు ముద్ర వేశారు. మన మిడిల్ క్లాస్ జనం కూడా వీళ్లని స్టూవర్ట్‌పురం గ్యాంగ్లలాగే చూస్తాం. ఊరి చివరగా బతికే ఈ బయటి గుడిసెల బతుకు మన సాహిత్య ప్రపంచానికి కూడా బయటనే మిగిలిపోయింది. అరుణ రాసిన ఎల్లి నవల, కేశవ రెడ్డి నవలలు, ఇంకా ఒకటీ అరా కథలు వీళ్లు బతికే తీరు గురించి తెలిపాయి. ఈ మధ్య దేవులపల్లి కృష్ణమూర్తి నవల- బయటి గుడిసెలు ఈ పనిని చాల గొప్పగా చేసింది. నక్రేకల్ దగ్గరున్న వీళ్ల బతుకుని చాల ప్రేమతో చూసి, లోతుగా సుదీర్ఘంగా ఫాలో అయి రాసింది. కృష్ణమూర్తి చాలాకాలం వారిని అబ్జర్వ్ చేసి వారితో కలసిపోయి గమనిస్తే తప్ప ఇలా రాసి ఉండరు. శ్రమతో కూడిన పని ఇది. కాని బాగ చేయగలిగారు. గోర్కి కథ మనార్ చుద్రను సినిమాగా తీసి చాలా కాలమయింది. ‘జిప్సీ కాంప్ వేనిషెస్ ఇన్ టు బ్లూ’ పేరిట వచ్చిన ఈ ఫిలిం జిప్సీ జీవితాలని గోర్కీ కథ కంటే సుదీర్ఘంగా చూపి, గ్రీక్ ట్రాజెడీలా ముగుస్తుంది. యూరప్‌లోని రోమా జిప్సీలను కూడా అక్కడి వాళ్లు ఇలా నేరస్థ జాతులుగానే చూసి నానా అవస్థలూ పెడుతుంటారు. మంగోలియాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చిన కొంత కాలానికి రాజధాని ఉలాన్ బతోర్‌లో వీళ్ల కోసం భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే రాత్రికి రాత్రే సిటీని ఖాళీ చేసి యుర్త్లలో (వాళ్ల చక్రాల బళ్లూ, ఇళ్లూ అవే) దర్జాగా వెళ్లిపోయారట. వీళ్లని సంస్కరించి ఒక దారిలో పెట్టాలనుకోవడం కూడా ఒక విప్లవ వెర్రే అనిపిస్తుంది. కృష్ణమూర్తిగారి నవల మన సాహిత్యంలో ఉన్న పెద్ద లోటును చిన్నగా భర్తీ చేసింది. మిడిల్ క్లాస్ బతుక్కే పెద్ద పీట వేసే మన సాహిత్యంలో ఇంకా ఇలా ఎన్నో జాతుల, గుంపుల మతుకుల మీద ఇంకా ఎన్నో కథలూ నవలలూ వస్తే ఎవ్వరికో సేవ కాదు మన సాహిత్యానికే బోల్డంత వెరైటీ వస్తుంది. - మోహన్ (ఆర్టిస్ట్) బయటి గుడిసెలు- దేవులపల్లి కృష్ణమూర్తి, వెల: రూ.100; ప్రతులకు: 9290094015 -
గుక్కెడు కృష్ణరసం... మోహనవంశీ...
ఏమీ ఆశించకుండా ప్రేమను పంచడం, శుష్కమైన జపాన్ని వదిలి ఫలాన్ని ఇచ్చే ఆరాధనను చేయడం ఎవరి నుంచి నేర్చుకున్నాడు? ఇంకెవరి నుంచి రాధ నుంచే. ఆ మహోన్నత స్త్రీయే తనకు ఇంత ప్రేమా ఇచ్చింది. ఇంత ప్రేమను ఇవ్వడమూ నేర్పింది. కృష్ణా... నల్లనయ్యా... బృందావన విహారీ... నీలికలువ తీవకు పూసిన మనోహర పుష్పమా... ప్రేమమూర్తీ.... వంశీగానంతో సకల జగత్తును సమ్మోహన పరిచే సంగీతకారుడా... మోహనవంశీ.... కురుభూమి ఉంది ఒకచోట. అదే దేవభూమి. ఆనందాల స్వర్గం. మనుషులు ఎలా ఉంటారు అక్కడ? అందంగా అపురూపంగా సౌందర్య భరితంగా ప్రకృతిలో ప్రకృతి వలే... కుసుమాల్లో కుసుమాల వలే... భ్రమరాల్లో భ్రమరాల వలే... తురంగాలలో తరంగాల వలే... వలువలు వారికి అడ్డం... కృత్రిమ విలువలూ వారికి అడ్డమే.... వారికి తెలిసిందల్లా ప్రేమ.. ప్రేమ... ప్రేమ. ప్రేమతో ఉంటారు. నీది అనరు. నాది అనరు. మనది అంటారు. ప్రేమ వస్తే ఆలింగనం చేసుకుంటారు. ఇష్టం కలిగితే చుంబనం సమర్పిస్తారు. మోహం ఏర్పడితే- ఉల్లము ఝల్లున స్పందనలు పంపితే- ఒకర్నొకరు పెనవేసుకొని ఆనందపు శయ్యపై విహరిస్తారు. లోకం నుంచి ఏమీ ఆశించరు. నిరాపేక్షగా పని చేసుకుపోతారు. కర్మను అనుసరిస్తారు. విధికి బద్ధులై నడుస్తారు. అది స్వర్గం. ఒక వ్యక్తి అలాంటి స్వర్గాన్ని ఒకచోట నిలిపాడు. దానిని అందరూ వ్రేపల్లె అన్నారు. అతణ్ణి కొందరు కృష్ణుడు అనీ రాధ మాత్రం ఆరాధనగా మోహనవంశీ అని పిలిచింది. మధురానగరం అప్పటికే కపటనగరంగా మారింది. సొంత ఆస్తి, సొంత స్త్రీ, సొంత పిల్లలు, స్వార్థం, ద్రోహం, మోసం, రాక్షసత్వం.... ప్రేమలో అనుక్షణం నిండి ఉండాల్సిన జగత్తు, చైతన్యం కలిగి సృష్టితో పాటు ప్రవహించి వెళ్లాల్సిన జగత్తు దుర్భరమైన విలువలతో తనను తాను హింసించుకుంటోంది. ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రేమించుకోవడం తప్పు. ముద్దాడటం తప్పు. రమించుకోవడం నేరం. హద్దులు ఎప్పుడైతే విధించబడ్డాయో అవి ఇష్టం లేని జనులు వాటిని దాటి ‘నేరం’, ‘పాపం’ వంటి భావనలకు లోనై ‘బహిష్కరణ’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తే పాపం కాదు. దైవంలో లీనమైపోవడం నేరం కాదు. కాని ఒక మనిషిలో ఇంకొకరు ఒక మనిషి పట్ల వేరొకరు ఆరాధనతో ప్రేమతో కోరికతో లీనమైపోవడం మాత్రం నేరం. ఇది ఎవరి సంస్కృతి అని ప్రశ్నించాడు కృష్ణుడు. పదేళ్ల ఆ పిల్లవాడి, ముద్దులొలికే ఆ బాలుడి పట్ల ఆరాధన పెంచుకున్న ఆ రాధ, వివాహిత, వరుస పెట్టి పిలిస్తే నిషిద్ధ వరుసలో నిలుచున్న స్త్రీ ఆరాధిస్తే అందులో తప్పు ఉన్నదా? ఆమె స్పందనలో దైవం పాదాల వద్ద రాలిపడే చామంతి దండలా ఉండాలనే తపన. కోరిక. కామం ద్వారా ఆ సమర్పణం సంభవిస్తే ఇంకా సంతోషమే. కృష్ణుడు దీనిని స్వీకరించాడు. రాధ ప్రేమను స్వీకరించాడు. ఆమె ప్రేమనేనా? ప్రేమను పంచాలనుకునే మహోన్నత మూర్తికి తనా మనా అనే భేదం ఉంటుందా? తపతిని, నీరజను, చంద్రికను, సత్యను, రుక్మిణిని, కాళిందిని, మిత్రవింద, లక్షణ, జాంబవతి.... వీరందరి ప్రేమనూ స్వీకరించాడు. వీరందరికీ ప్రేమ పంచాడు. నిజంగా ప్రేమమూర్తి కనుల నుంచే చూడాలి ప్రేమని. మామూ లు మనిషికి ఒక మరుగుజ్జు స్త్రీ మరుగుజ్జులానే కనిపిస్తుంది. కాని కృష్ణుడు ఆమెనూ స్వీకరించి ప్రేమగా పరిగ్రహించి పానుపుపై ఆమె బతుకు పండించాడు. పది యుగాలకు సరిపడా ఆనందం పంచాడు. ఆమె ఆత్మ ఎంత సంతృప్తి పడి ఉంటుంది. నిజంగా ఒక జీవి పట్ల మరో జీవి ప్రేమను ప్రదర్శిస్తే కలిగేది శాంతి..శాంతి... శాంతే. కురూపి నాగిని కూడా తన ఆకారం ఎంత కురూపిగా ఉన్నా తన మొత్తం దేహంలో వేరెవ్వరికీ లేనంత అతి సుందరమైన పెదాలతో కృష్ణుడిని ముద్దాడి ధన్యమైనదే. అందరూ కృష్ణుడిని దేవుడు... దేవుడు అంటున్నారు. అలా అని ఎందుకంటున్నారు తాతగారూ? అని అడిగాడు కృష్ణుడు, భీష్ముడిని. ‘ఎందుకంటే నీలో సత్యం, సౌందర్యం, సామర్థ్యం ఉన్నాయి కనుక. అవి ఉన్నవాడు భగవంతుడే అవుతాడు కనుక’ అన్నాడు భీష్ముడు. కృష్ణుడు ఆలోచించాడు. ఆ మూడు లక్షణాలే అయితే సత్యవతిలో, ద్రౌపదిలో, అర్జునుడిలో కూడా ఉన్నాయి. కాని వారికి భగవంతుడి హోదా ఇవ్వడం లేదే? తనకే ఎందుకు ఇస్తున్నారు? సమాధానం తట్టింది. ఎందుకంటే తాను ప్రేమను పంచుతాడు. ప్రేమను పంచడమే తన మతంగా పెట్టుకున్నాడు. నిజం చెప్పాలా? ఇలా ఏమీ ఆశించకుండా ప్రేమను పంచడం, శుష్కమైన జపాన్ని వదిలి ఫలాన్ని ఇచ్చే ఆరాధనను చేయడం ఎవరి నుంచి నేర్చుకున్నాడు? ఇంకెవరి నుంచి రాధ నుంచే. ఆ మహోన్నత స్త్రీయే తనకు ఇంత ప్రేమా ఇచ్చింది. ఇంత ప్రేమను ఇవ్వడమూ నేర్పింది. తాను ఇస్తున్నాడు. అందుకే మనిషినైన తనను అందరూ భగవంతుడని అంటున్నారు. నిజానికి ప్రతి మనిషీ ఒక భగవంతుడు కావచ్చును. హద్దులు, సరిహద్దులు, స్వార్థాలు, నిషిద్ధాలు, ఇది అవును అది కాదు అనిపించని సువర్ణ జీవితాలను జీవించవచ్చు. కాని మనిషి ప్రస్తుతానికి అంత ఉన్నతమైన సంస్కారాన్ని ఏర్పరుచుకోలేదు. అంత ఉన్నతుడు కాలేదు. ప్రేమలో నడిస్తే, కృష్ణప్రేమలో నడిస్తే, కృష్ణుడి వలే ప్రేమను పంచుతూ వెళ్లడం చేస్తే ఒకనాటికి మనిషి ఆ స్థితికి చేరుకుంటాడు. అప్పుడిక నిషిద్ధాలు ఉండవు. సొంతమూ పరాయి అను భేదాలుండవు. నేరాలు చెరసాలలూ ఉండవు. పాపాలు కూడా ఉండవు. అప్పుడు ప్రతి భూమి ఒక దేవభూమి అవుతుంది. అప్పుడు ప్రతిప్రాణీ కృష్ణమయమే అవుతుంది. ‘మోహనవంశీ’లో కృష్ణుడు భగవంతుడు కాడు. ఒక మనిషి. తన రూపంతో, మాటతో, మురళితో ఆకర్షణలోకి ఈడ్చిపారేసే మనోహరమూర్తి. నవలంతా అతడు తానేమిటి అనే అన్వేషణ సాగిస్తాడు. నిజానికి అది కృష్ణుడి అన్వేషణ కాదు. పాఠకుడి అన్వేషణే. తానేమిటి? తానెందుకు కృష్ణుడి వలే ఉండలేకపోతున్నాడు? కృష్ణుడిలా మారాలంటే ఏం చేయాలి? నవలలో ఒక చోట భీష్ముడు- నాకు స్త్రీలోని అమృత స్రవంతులు అనుభవంలోకి రాలేదు. అందుకే నాలో సగం నిర్జీవమైంది. చైతన్యరహితమైన ఆ భాగం వృథా అయ్యింది నాయనా అంటాడు కృష్ణుడితో. భీష్ముడు స్త్రీ ప్రేమను పొందలేదు. అందువల్ల నిజమైన ఆనందానికి అర్థం తెలీదు. కాని రచయిత్రి భావన ఏమంటే ప్రేమ పొందలేని, ప్రేమను పంచలేని ఏ మనిషైనా నిర్జీవుడి కిందే లెక్క. జీవితమంటే ఏమిటి? అని కృష్ణుడు రాధను అడుగుతాడు. ఇంకా చాలా మందినే అడుగుతాడు. అందంగా జీవించడమే జీవితం అని జవాబు. సుందరంగా జీవించడం, చైతన్యంతో జీవించడం, ప్రేమతో జీవించడం అదే జీవితమంటే. ఎంతకాలం బతికామనేది కాదు ముఖ్యం. ఎంతసేపు జీవించామనేది ముఖ్యం. ఆత్మసంతృప్తికరమైన జీవితం లిప్తకాలంపాటు అనుభవించినా సరే ఆ మనసు ఇక సంతృప్తి చెందిపోతుంది. ఇక మరి దానికి మృత్యువంటే భయం లేదు. సంపూర్ణంగా అనుభవించాల్సింది అనుభవించాక మృత్యువును ఒక భయం వలే కాక విముక్తి ప్రసాదించే మార్గంగా, మరో కొత్త జీవితాన్ని ప్రసాదించబోయే కానుకగా భావించే ఆత్మజ్ఞానం సంభవిస్తుంది. ఇదంతా ఈ నవలలో చర్చిస్తుంది రచయిత్రి. అందుకే ఎప్పుడో రాసినా సరే సమకాలీనంగా సార్వజనీనంగా కళకళలాడుతూ ఉంది ఈ నవల. యమునా ప్రవాహం వంటి శైలి, తమాల వృక్షపు ఛాయ వంటి చిక్కటి శిల్పం, రాధ చనుకట్టు వంటి ఉన్నతమైన వస్తువు, శ్రీకృష్ణుడి వాక్కు వంటి తాత్త్వికత, పరిగెత్తి చేరుకోవాలనిపించే వంశీనాదం వంటి వర్ణనా విన్యాసం.... సాధారణ మనసుతో, కృత్రిమ కలం కాగితాలతో, బయట వినిపించే చప్పుళ్లు... జీవన వ్యాపారాల చికాకుల లోజగత్తు... ఇవి ఉన్నవారు చేసే రచన కాదు ఇది. అవి ఉన్నవాళ్లు ఇలా రాయలేరు కూడా. ఇదంతా ఒకానొక స్వాప్నికావస్థలో చిగిర్చే విత్తుకు మేఘధార సరిజోడులో రసోద్రేకం కలిగి దైవికంగా జరిగిన రచన ఇది. రచయిత్రి చేయి పట్టుకొని ప్రకృతి చేయించిన రచన. కృష్ణుడి గురించి ఎందరు రాయలేదు? కాని ఒక రచయిత్రి రాధలా మారి మది నిండా ప్రేమ నింపుకొని కాలంలో ఈదుకుంటూ వెళ్లి రేపల్లెలో కూచుని చేసిన రచన ఇది. తెలుగులో ఇంత మోహనరూపం కలిగిన నవల మరొకటి లేదు. లతకు సాటి రాగల పేరు మరొకటి ఉండదు. నవల: మోహనవంశీ, రచయిత్రి: తెన్నేటి హేమలత (లత) దాదాపు నలభై ఏళ్ల క్రితం వెలువడి పాఠకులను ఉర్రూతలూగించిన రచన. టైమ్ మిషన్‌లో కూచుని వెనక్కు ప్రయాణించి రేపల్లె చేరుకుని నాటి పరిసరాల్లో కూచుని రాసినట్టుగా, కన్నులతో చూసి చెప్తున్నట్టుగా అద్భుతమైన శైలిలో కృష్ణప్రేమను ప్రకటించడానికి చేసిన రచన ఇది. భారత, భాగవతాల ఆధారంగా కృష్ణుడి పాత్రను స్వీకరించి తాను మాత్రమే అంటే ఒక స్త్రీ మాత్రమే చేయదగ్గ కల్పనలతో, ఆరాధనతో లత ఈ నవలలోని అణువణువులో నిండి ఆకట్టుకుంటారు. కృష్ణుడిని మనిషిగా చూపెడుతూ సామాన్య మానవుల సమక్షంలో భాగవతాన్ని నడుపుతున్నట్టుగా రచన చేస్తూ హేతువును, తర్కాన్ని, తాత్త్వికతను మిళితం చేయడం వల్ల ఏ కాలంలో అయినా ఏ తరం అయినా తప్పనిసరిగా చదవదగ్గ రచనగా ఇది మారింది. ఇది లత తన 28వ ఏటలోనే సాధించిన ఘన విజయం. ఎంత మంది తెలుగు రచయితలు ఆ వయసులో ఈ స్థాయి రచన చేశారు? అది లత గొప్ప. మోహనవంశీ మార్కెట్లో అందుబాటులో ఉంది. వెల: రూ. 60 ప్రతులకు: 0866 - 2436643 అక్షరాలను సాకిన చేతులు పసిడి రెక్కలు విసిరి కాలం ఎక్కడికీ పారిపోలేదు. అది కొన్ని పూలు రాల్చి వెళ్లింది. కొన్ని నీడల్ని మిగిల్చి వెళ్లింది. కొన్ని జ్ఞాపకాలని ఫొటోఫ్రేమ్లలో అమర్చి తలుచుకొమ్మని ముద్దులిచ్చి వెళ్లింది. గతకాలం ఎప్పటికీ మేలే వచ్చు కాలం కంటే. కలం తప్ప వేరే ఏమీ లేని రోజులు. కాగితాలు తప్ప వేరే ఏమీ లేని రోజులు. పాఠకులు, రచనలు తప్ప వేరే ఏమీ లేని రోజులు అవి. మహిళా రచయితలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలం. మగ రచయితలు ఆకులందు అణిగిమణిగి కూస్తున్న కాలం. బహుశా 1965 కావచ్చు. కాసుబ్రహ్మాందరెడ్డి ఇంటనో ఆయన శ్రీమతి సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగానో కొంతమంది రచయిత్రులు కలిశారు. ఇలా ఒక బంగారు జ్ఞాపకాన్ని ఇచ్చారు. గుర్తు పట్టగలిగారా? లేకుంటే ఇవీ పేర్లు. ఎడమ నుంచి: రంగనాయకమ్మ, పి.యశోదా రెడ్డి, రాఘవమ్మ (కాసుబ్రహ్మానంద రెడ్డి శ్రీమతి), భానుమతి రామకృష్ణ, ఇల్లిందల సరస్వతీదేవి, తురగా జానకీరాణి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తెన్నేటి హేమలత (లత). -
మన నవలలు: మూడు పర్వాల మహాభారతం గోపాత్రుడు...
కలికాలం మంచి జోరు మీద ఉందనడానికి కూడా శకునాలుంటాయ్. కుక్కలకు మాటలు రావడం ఒకటి. వీరబొబ్బిలి ఏ క్లాస్ కుక్క. చెయ్యెత్తు ఉంటుంది. మనిషెత్తు ఉంటుంది. ఏనుగెత్తు కూడా. తాండ్ర పాపయ్య వంశ వారసుల ఇంట పుట్టి పెరిగింది. వేట తెలుసు. కాని చేయదు. కాపలా తెలుసు. కాని చేయదు. మరేం తెలుసు? తినడం తెలుసు. పోలుగు పిట్టల మాంసంకూర తేలిగ్గా మసాలా వేసి వొండి పెడితే చట్టీలకు చట్టీలు మింగడం తెలుసు. తర్వాత? తొంగోవడమే. ఇది గాకుండా ఇంకోటి కూడా ఉంది. నేనింత నేనంత నాకు ఫలానా వారంటే ఖాతరీ లేదు ఫలానా వారికి నా పేరు చెప్తే యూరినరీ ఇన్ఫెక్షన్. గొప్పలు చెప్పుకోవడం. వీరబొబ్బిలేనా ఇలా? మొత్తం లోకమే అలా ఉంది. బంగారంలాంటి భూమి. బంగారంలాంటి దేశం. మన్ది. అలెగ్జాండర్ వచ్చాడు. పట్టుకుపోయాడు. నాదిర్ షా వచ్చాడు. పట్టుకుపోయాడు. ఇంకెవడో వచ్చాడు. పట్టుకుపోయాడు. ఇంగ్లిషోడొచ్చాడు. నాల్రోజులు ఉండి పోతానురా దద్దా అని రెండు వందల ఏళ్లు ఉండి తీరిగ్గా తోచిందల్లా పట్టుకుపోయాడు. దేశాన్ని వాడికి అప్పజెప్పి తినడం తొంగోవడం. పోనీ వాడు పోయాకైనా పంచెలు సర్దుకొని, తువ్వాళ్లు బిగించి ఏదైనా పనికొచ్చే పని చేస్తారా? నా చంగతేంటి... నీ చంగతేంటి... విప్పుడు ఫలానా పని చేస్తే నీకేటి ప్రయోజనం.. నాకేటి నాభం... మింగడమే పని. స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్లు నిండినా ఏం మార్లేదు. దరిద్రులు అలాగే ఉన్నారు. పాల కోసం ఏడ్చే పిల్లలు అలాగే ఉన్నారు. కొత్తకోక కొనిస్తాను రాయే అంటే పోయే ఆడకూతుళ్లు అలాగే ఉన్నారు. రోగాలు అలాగే ఉన్నాయి. అజ్ఞానం అలాగే ఉంది. మూఢ విశ్వసాలు అలాగే ఉన్నాయి. కడుపుకింత తిని, బుద్ధికింత చదివి, నలుగురికింత మంచి చేసి, జాతి నిర్మాణంలో తలా ఒక చేయి వేద్దామని ఒక్క చవట సన్నాసీ అనుకోవడం లేదు. అంతా వీరబొబ్బిలి టైపు. తినడానికి రెడీ. తిరగడానికి షంషేర్. అయితే లోకం విలాగుందనీ... వీ రీతిన వీ రీతిన పాడుబడిందనీ... ఖాయిలా పడిందని... స్వార్థం, అల్పత్వం, ఎదుటివాడు ఎలా పోయినా పర్వాలేదనే సంకుచితత్వం వంటి అన్ని జబ్బులూ సోకి, మరి చావు వైపు దూసుకుపోతున్నప్పుడే అది ఈ రీతిగా వర్తిస్తుందని ముందుగా వైద్యులకే తెలుస్తుంది. ఆలమండ పెదపాత్రుడు అలాంటి వైద్యుడే. జ్ఞాని. బతికినంత కాలం లోకం నాడీ పట్టుకొని చూసి, ఈ నీచత్వాన్ని, ఈ దిగజారుడుతనాన్ని, కూసిని రూకల కోసం సాగే కుట్రలని, కాసిని మెతుకుల కోసం జరిగే ఖూనీలని గమనించి గమనించి, చావు మంచం మీద జేరి, మరి కాసేపట్లో పోతాడనగా కొడుకు గోపాత్రుణ్ణి పిలిచి- ఒరే బాబూ... ఈ లోకం దగుల్బాజీది... దుమ్ములగొండి ముఖంది... లోన ప్రేవులు కడుక్కోకుండా పైన సెంటు బట్టలు కట్టుకొని తిరిగే కంపు కళేబరంది... భూమి గుండ్రంగా లేకపోవడం వల్లే ఇదిలాగ తయారైంది. భూమే గనక గుండ్రంగా ఉంటే ఇటు నుంచి పోయిన వెలుతురు మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పడాలి. ఇటు నుంచి పోయిన వానలు మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కురవాలి. ఇటు నుంచి పోయిన ఎండ మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి మన ముండ బతుకుల మీద కాయాలి. మరలాగ జరగడం లేదంటే, ఎప్పటికీ మనం చీకట్లో ఉంటున్నామంటే, ఎప్పటికీ కరువులో ఉంటున్నామంటే, ఎప్పటికీ సంతోషం, ఆనందం, వికాసం ఎరగక నాచు పట్టిపోయామంటే భూమి బల్లపరుపుగా ఉన్నట్టు లెక్క. భూమి బల్లపరుపుగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. ఈ ముక్క మనసులో ఎట్టుకో అనేసి పోయాడు. గోపాత్రుడు మేధావి. తండ్రి మాటలు నమ్మాడు. వాటిని తన విశ్వాసంగా మార్చుకున్నాడు. అయితే ఇలాంటి విశ్వాసాలు, వాస్తవాలు, సత్యాలు అన్నీ తలుపు చాటున ఉంటేనే లోకానికి బెటర్. అప్పుడే అది సజావుగా ఏమీ ఎరగనట్టుగా తన మానాన తాను ముందుకు పోతుంటుంది. కాని గోపాత్రుడు ఉన్నట్టుండి ఉత్పాతం సృష్టించాడు. ఆలమండ పెదరామ కోవెల అరుగు మీద తీరుబాటుగా కూచుని భూమి గుండ్రంగా లేదనీ బల్లపరుపుగా ఉందనీ బాంబు పేల్చాడు. ఆ మాట రేపిన తుపాను అంతా ఇంతా కాదు. మొదట రాజులు ఏకమయ్యారు. గోపాత్రుడు ఎవడు? తమ మనిషి. కనుక భూమి ఎలాగుంటే మనకేంటి? గోపాత్రుడి విశ్వాసమే మన విశ్వాసం. కనుక భూమి బల్లపరుపుగా ఉందనీ అందుకు కాదన్నవాళ్లని టుపాకులెట్టి కాల్చేస్తామనీ హెచ్చరించారు. అయితే రాస నంజికొడుకులంటే రైతులకి- అంటే ఎలమలకి- పడదు గనక కొప్పల ఎలమలందరూ జట్టీ గట్టి రాజుల మాట చెల్లుబాటు కావడానికి వీల్లేదనీ భూమి బల్లపరుపుగా ఎంతమాత్రం లేదనీ అది పెరట్లోని గుమ్మడికాయలాగా గుండ్రంగా ఉందనీ ఇది తమ విశ్వాసమనీ కాదంటే ఖబడ్దారనీ రోషానికొచ్చారు. చాకలి, మంగలి, మాలలు శబాసో అని ఎలమల పక్షాన చేరారు. కాని- ఎలమలకు తాము శాశ్వితంగా అపోజిషను కనుక ఓటు కాడ గాని మాటకాడ గాని ఎలమల చెమ్డా లెక్కదీయడమే తమ పని కనక తెలగలందరూ కలిసి మీటింగెట్టుకుని ఎందుచేతనో తామందరికీ భూమి బల్లపరుపుగా ఉన్నట్టుగానే తోస్తోందని అభిప్రాయపడ్డారు. ఎలమలందరూ కులానికి ఒకటే అయినా ఎలమలకు దక్కవలసిన లబ్ధి అంతా ఎలమల పేరు జెప్పి ఒక్క లగుడు ముత్యాల నాయుడే తింటున్నాడు కనుక అదే కులానికి చెందిన రొంగలి కూటమానానికి పెద్ద అయిన రొంగలి బుజ్జి తనను సమితి పెసిడెంటును చేసే షరతు మీద రాజులతో కలిసి భూమి రాజులు ఆశిస్తున్నట్టు మసాలబండలాగా నలుచదరంగా ఉందని నమ్మడానికి రెడీ అయిపోయాడు. ఊరంతా ఇదే కలి. కమ్మరులొకవైపు. కుమ్మరులొకవైపు. రంగరాజు మాస్టారు వంటి తటస్థులు పొద్దునొకవైపు రాత్రొకవైపు. పెంకితనాల కోసం, పట్టుదలల కోసం, కులాల ముఠాల ప్రాంతాల పట్టింపులు వంటి ఉన్నత లక్ష్యాల కోసం మనుషులు ఎంత దూరమైనా వెళతారు. ఇక్కడా వెళ్లారు. కురుక్షేత్రం జరిగింది. తలలు పగిలాయి. భుజాలు విరిగాయి. తమ పక్షంలో ఉన్నా సరే అప్పులిచ్చి తిరిగి డబ్బులడిగిన ప్రతి గాడ్ది కొడుకును ఎంచి ఎంచి కొట్టారు. పోలీసులొచ్చారు. కేసు రాష్ట్రమంతా గగ్గోలు రేపి కోర్టులకూ కచ్చేరీలకూ ఎక్కింది. కాని చివరాఖరికి ఏం తేలింది? ఈ భూమి రాజులు కోరినట్టుగా బల్లపరుపుగా గాని, ఎలమలు కోరినట్టుగా గుండ్రంగా గాని లేదని, అది ఈ దేశంలోని కుబేరులకు తోచిన ఆకారంలో ఉందని, వారి ప్రయోజనాల కోసం ఏర్పడ్డ ప్రభుత్వాలు కోరిన ఆకారంలో ఉందని, ఆ ప్రభుత్వాల అధికారానికి బాహ్యరూపమైన పోలీసుల చేతిలోని లాఠీకర్రలా ఉందని తేలింది. వ్యవస్థ ఇలా ఉన్నంత కాలమూ మనుషులు తిట్టుకుంటూ తిమ్ముకుంటూ ఈసురోమంటూ గుడ్డి దీపాల కాంతిని సూర్యోదయాలుగా భావిస్తూ నశిస్తూ నాశనమవుతూ ఇలా ఉండ వలసిందే. నవల ముగుస్తుంది. నవల: వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు (ట్రయాలజీ) రచయిత: కె.ఎన్.వై. పతంజలి వివరాలు: ‘భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపుగా ఉందా?’ అనే అల్పమైన మిషతో కూడా మనుషులు ఒక కురుక్షేత్రాన్ని ఎలా సృష్టిస్తారో ఆ కురుక్షేత్రానికి చోదకశక్తులుగా ఏవి పని చేస్తాయో సూక్ష్మంగా అయినా విరాట్ రూపంలో చూపిన నవల. కళింగాంధ్ర భాషలోని సజీవత్వాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పాత్రల నిజరూపాలతో అద్భుతంగా చూపుతుంది. మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘పతంజలి రచనలు’లో ఈ నవల లభ్యం.1984 నుంచి ’95 మధ్యలో మూడు భాగాలుగా- వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు- పేర్లతో పతంజలి చేసిన ఉత్కృష్టమైన ప్రపంచస్థాయి వ్యంగ్య రచన ఇది. గొప్ప రచన. స్వార్థ ప్రయోజనాలే మనిషిని ఎప్పుడూ నడుపుతాయి. మహాభారతంలో కురుక్షేత్రం అందుకే సంభవించింది. ఆలమండ బయలులో కురుక్షేత్రమూ అందుకే సంభవించింది. వర్తమానంలో ఈ నవలాంశంతో సరిగ్గా పోల్చదగ్గ తెలంగాణ - సీమాంధ్ర కురుక్షేత్రమూ అందుకే సంభవిస్తోంది. భూమి ఎలా ఉందో ఎవడికి కావాలి. ప్రజలు ఏమవుతారో ఎవడికి కావాలి. నీకేటి ప్రయోజనం... నాకేటి నాభం... అంతే. మానవజాతి ఇవన్నీ దాటి ఒక అడుగు ముందుకేసేంత వరకూ భారతం ఉంటుంది. ‘గోపాత్రుడు’ ఉంటుంది. పతంజలీ ఉంటారు. -
కొత్త పుస్తకం: మలినం అంటని మాండలిక కతలు.. ఇరులదొడ్డి బతుకులు
హోసూరులో కథలు వరదలెత్తుతున్నాయి. తమిళ పరిష్వంగంలో నలిగిపోతున్న తెలుగు ప్రాంతం హోసూరు. కృష్ణగిరి జిల్లాలో ఉంది. బెంగళూరుకు కూతవేటు దూరం. అక్కడ తెలుగువారున్నారన్న సంగతి, అది తెలుగు ప్రాంతం అన్న సంగతి చాలామంది తెలుగువారికే తెలియదు. మేమున్నాం ఇక్కడ అని వాళ్లు అరిస్తే ఎవరూ పట్టించుకోరు. అందుకే వాళ్లు సాహిత్యంలోకి తమ గళాల్ని (కలాల్ని) మళ్లించారు. తమ ప్రాంతం భాష, యాస, సంస్కృతి, తెలుగు వారు మర్చిపోయినా తాము మర్చిపోని కట్టుబాట్లు అన్నింటిని తాము ఎలా కాపాడుకుంటున్నామో కథలు రాస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతం నుంచి ‘ఎర్నూగుపూలు’, ‘తెల్లకొక్కెర్ల తెప్పం’ వంటి పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు నంద్యాల నారాయణరెడ్డి రాసిన ‘ఇరులదొడ్డి బతుకులు’. హోసూరుకు సమీపంలోని ఒక అడవి ప్రాంతంలో ఈ రచయిత గడిపిన బాల్యాన్ని ఈ కతలన్నీ చూపుతాయి. చెట్లు, పుట్టలు, సీళు కుక్కలు, ఏనుగులు, కొమ్ముల ఆవులు అడపా దడపా గాండ్రించే పులులూ అన్నెం పున్నెం ఎరగని అమాయకపు మనుషులు... వీళ్లంతా ఈ కథల్లో కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందులో వాడిన భాషది కూడా ఒక తెలియని రుచి. మాండలికం అంటే అశ్లీలమైన పదాలు వాడాలనీ స్త్రీలను కించపరిచే పదాలు ఉన్నదే మాండలికం అనీ స్థిరపరిచిన కొన్ని రకాల రచనలకు ఈ కథలు ఒక మెరుగైన జవాబు. కాలుష్యం గాలి నుంచి కాసేపు తప్పించుకోవాలంటే ఈ కథలు వీచే అడవిగాలిని ఆహ్వానించండి. వెల: రూ. 100; ప్రతులకు: 09360514800 స్త్రీ హృదయం: గాజు నది ‘ఏమీ రాయకపోతే/ ఏదీ రాయలేకపోతే ఏదో కోల్పోయిన వెలితి కలల నిండా కలం నిండా స్త్రీల కన్నీటి సిరాతో చైతన్యించిన దీపశిఖల ప్రజ్వలనమే కవిత్వం’ అనే కవయిత్రి రాయకుండా ఉండగలదా? ఏదో ఒక బాధను కవిత్వం చేయకుండా ఉండగలదా? స్త్రీ వాద రచయిత్రులలో ఒక ప్రత్యేకతను సాధించుకున్న కవి శిలాలోలిత. సరళంగా చెప్తూనే గట్టిగా నిర్మొహమాటంగా కూడా మాట్లాడే కవిత్వం ఆమెది. అతడు - ప్యాంటూ చొక్కా తొడుక్కుని వెళతాడు. ఆమె - ఇంటిని కూడా తొడుక్కుని వెళుతుంది... అనడంలో స్త్రీని వదలని ఇంటి చాకిరి స్త్రీని పట్టి ఉంచే బంధనాలు ఎలాంటివో సూటిగా చెప్తారామె. ‘ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేమో’ అనే వేదన ఆమె కవిత్వం. ద్రవీభవించే, ఘనీభవించే, ప్రతిబింబాన్ని చూపే, భళ్లున బద్దలయ్యే స్త్రీ హదృయం వంటి ఈ గాజునది కవిత్వాన్ని చదవండి. వెల: రూ.రూ.80; ప్రతులకు: 9391338676 సాహిత్య పత్రిక చినుకు గత ఎనిమిదేళ్లుగా తెలుగు సాహిత్యానికి మెరుగైన వేదికగా వెలువడుతున్న మాస పత్రిక ‘చినుకు’. కథలు, కవితలు, సాహిత్య చర్చలు... ప్రామాణిక స్థాయిలో ప్రచురిస్తూ సాహిత్యాభిమానులకు చేరువైన పత్రిక ఇది. అంతే కాకుండా ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో వార్షిక సంచిక వెలువరించి తెలుగులో వార్షిక సాహిత్య సంచికలకు ఉన్న లోటును తీరుస్తోంది. చిన్నా పెద్దా రచయితలు చాలా మంది తమ రచనలు ఈ పత్రికలో చూసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఇది సాధించిన గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. సంపాదకుడు నండూరి రాజగోపాల్. వివరాలకు: 98481 32208 సాహిత్య డైరీ నల్గొండలోని మారుమూల గ్రామం కదిరేని గూడెం నుంచి ఇవాళ అంతర్జాతీయ చిత్రకళా ప్రపంచంలో తనదైన ముద్రను వేసే స్థాయికి ఎదిగిన చిత్రకారుడు ఏలే లకష్మణ్. దేశ విదేశాల్లో ఆయన ఆర్ట ఎగ్జిబిషన్ జరుగుతున్నా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అక్టోబర్ 5 నుంచి 15 వరకూ ‘ఫెలో ట్రావెలర్స’ పేరుతో ఆయన చిత్రకళా ప్రదర్శన జరగనుంది. వేదిక: కళాకృతి, రోడ్ నం. 10, బంజారాహిల్స. 040 - 66564466 రూ. 12 వేల నగదు బహుమతి కలిగిన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ (సిరిసిల్లా) కోసం కవిత్వ సంపుటాలు ఆహ్వానిస్తున్నారు. వివరాలకు : 98490 12459 అంగడి సరుకు: మండి ‘మండి’ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సరుకు అమ్ముతారు. అయితే తరతరాలుగా ఈ ప్రపంచంలో అమ్ముడుపోయే ఒక మానవ సరుకు ఉంది - స్త్రీ. హైద్రాబాద్‌లో జరిగే ఈ కథలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ‘కోఠా’ (వ్యభిచార కేంద్రం) ఉంటుంది. నగరం పెరిగి పెద్దదయ్యి ఆ ప్రాంతంలో ఒక కొత్త మార్కెట్‌ను కట్టాలనుకోవడంతో ఆ ‘కోఠా’కు ముప్పొచ్చి పడుతుంది. దానిని ఖాళీ చేయాలి. కాని ఆ ఆడవాళ్లు, పొట్టకూటి కోసం పడుపువృత్తి చేసుకునే ఆ నిర్భాగ్యులు, నిరక్షరాస్యులు ఎక్కడికెళ్లాలి? చివరకు వాళ్లను ఊరి అవతలకు తరిమేస్తారు. ఆశ్చర్యం. అక్కడ ఎప్పటితో ఒక బాబాగారి సమాధి బయటపడి అదొక రద్దీ క్షేత్రం ఏర్పడుతుంది. మళ్లీ ఆ స్థలానికి మార్కెట్ వ్యాల్యూ వచ్చింది. దాంతో అక్కణ్ణుంచి వాళ్లను తిరిగి తరిమేయాలి. లేదా ఆ చీమల పుట్టను పాములు ఆక్రమించుకోవాలి. చివరకు అదే జరుగుతుంది. విషాదమైన ఈ కథను వ్యంగ్యంగా చెప్పడం వల్ల అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ చూస్తాం. ప్రసిద్ధ పాకీస్తానీ రచయిత గులామ్ అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే కథానిక ఆధారంగా శ్యామ్ బెనగళ్ తీసిన సినిమా (1983) ఇది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ పోటీ పడి చేసినా షబానా స్థిరత్వం అసామాన్యం అనిపిస్తుంది. ‘మేమున్నాం కాబట్టే ఈ సమాజం ఈ మాత్రమైనా ఉంది’ అంటుంది ఈ సినిమాలో షబానా. ‘మేం తప్పు చేస్తున్నామా? మీ మొగాళ్లను ఇంట్లో కట్టి పెట్టండి చేతనైతే. మమ్మల్నెందుకంటారు?’ అని నిలదీస్తుంది నలుగురినీ. దానికి సమాధానం లేదు. ఉండదు కూడా. మర్యాదకరమైన సాహిత్యం చూడ నిరాకరించే ఈ కురుపు సలపరం తెలియాలంటే యూ ట్యూబ్‌లో Mandi (film) అని కొట్టి చూడండి. పాత సంగతి భమిడిపాటి కామేశ్వరరావు అభిమానులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ‘అయ్యా... తమకు సన్మానం చేసి బిరుదు ప్రదానం చేద్దామనుకొంటున్నాం’ అన్నారు. అందుకు ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. వాళ్లు మరీ బలవంతం చేసేటప్పటికి - ‘కొంతమంది బిరుదులు తమకు తాము తగిలించుకుంటారు. మరికొంతమంది బిరుదులు సాహిత్య సంఘాలకు విరాళాలు ఇచ్చి కొనుక్కుంటారు. మొదటి పద్ధతి బిరుదు స్వయంగా తగిలించుకోవడం నాకిష్టం లేదు. రెండో పద్ధతిలో బిరుదు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మీకు మీరుగా బిరుదు ఇస్తున్నారు కనుక సరే అలాగే కానివ్వండి’ అన్నారు. అలా ఆయనకు ‘హాస్యబ్రహ్మ’ అనే బిరుదు లభించింది. ఒకసారి క్లాస్‌లో హోమ్‌వర్‌క చేయని పిల్లలను తలా ఒక దెబ్బ వేస్తున్నారట. క్లాసులో వారబ్బాయి కూడా ఉన్నాడు. ‘హోమ్‌వర్‌క ఎందుకు చేయలేదు’ అనంటే ‘మా కుటుంబం అంతా పెళ్లికి వెళ్లిందండి’ అన్నాట్ట కుమారుడు. ఆయన కుమారుడికి ఒక దెబ్బ వేసి, పరీక్షలు దగ్గర పడుతున్న సంగతి పట్టించుకోకుండా నిన్ను పెళ్లికి తీసుకెళ్లినందుకు ఇదిగో నాక్కూడా దెబ్బ అని చేతి మీద ఒక దెబ్బ కొట్టుకున్నారట. ఇలా భమిడిపాటి ఉదంతాలు అనేకం. న్యూ రిలీజెస్ ది హంగ్రీ ఘోస్‌ట్స The Hungry Ghosts చేసిన పాపాల నుంచి నిష్కృతి ఉంటుందా? ఈ జీవితంలో లెక్కకు మించి కోరికలు ఉన్నవారు చనిపోయాక దెయ్యాలుగా మారతారట. కాని వాళ్లకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుందట. కాని ఏమీ తినలేకపోతారట. వింటేనే భయం వేసే ఇలాంటి కథలు తన నాయనమ్మ నోటి గుండా విని పెద్దవాడయ్యాడు శివన్. కాని అతడి జీవితంలో కూడా అతడి నిమిత్తం లేకుండా ‘పాపం’ జరిగింది. అతడు ‘గే’. తన స్వదేశం శ్రీలంకను వదిలి కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. కాని ఏదో అసంతృప్తి, పాపభీతి నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన బౌద్ధకథలు వెంటాడుతూనే ఉన్నాయి. అతడు తిరిగి కొలంబో బయలుదేరుతాడు. తర్వాత ఏం జరుగుతుంది? జీవితంలో ఉండాల్సిన వెతుకులాట, కనుగొనడం, అర్థం చేసుకోవడం, వచ్చిన సంఘర్షణలను దాటి ముందుకు వెళ్లడం, వదలక పట్టుకున్న కోరికల దెయ్యాలను వదిలించుకోవడం వీటన్నింటి సమాహారమే శ్యామ్ సెల్వదురై రాసిన నవల ‘ది హంగ్రీ ఘోస్‌ట్స’. ఇంగ్లిష్‌లో రాసే శ్రీలంక రచయితలు భారతీయ రచయితలతో సమానంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు. వాళ్లలో శ్యామ్ కూడా ఒకడు. బాగుంది. రెండు కోట్ల మంది ఉన్న శ్రీలంక నుంచి అంతమంది రచయితలు వస్తే ఇన్ని కోట్ల మంది ఉన్న తెలుగువారి నుంచి ఎంత మంది రావాలి? పోనీలెండి. మనకెందుకు? నవల చదవండి. The Hungry Ghosts, Shyam Selvadurai, Penguin Viking, Rs. 599