ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు! | Houthi attacks on shipping in Red Sea persist US and allies strike back | Sakshi
Sakshi News home page

ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు!

Published Sat, Jan 13 2024 1:13 AM | Last Updated on Sat, Jan 13 2024 6:49 AM

Houthi attacks on shipping in Red Sea persist US and allies strike back - Sakshi

ఎర్రసముద్రం కొంతకాలంగా అల్లకల్లోలంగా మారింది. ఇరాన్‌ దన్నుతో హౌతీ ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై విచ్చలవిడి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. యెమన్‌లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న ఈ ఉగ్రవాద ముఠా సముద్ర దాడులు అంతర్జాతీయ సమాజానికి పెను సవాలుగా మారాయి. ఒకవిధంగా అంతర్జాతీయ వర్తకమే తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇంతకూ ఎవరీ హౌతీలు? వీళ్లెందుకిలా ఉన్నట్టుండి సముద్ర సవాళ్లకు దిగినట్టు...?  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

గత అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్‌ ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి కనీవినీ ఎరగని రీతిలో బీభత్సం సృష్టించడం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్‌ తెర తీసింది. హమాస్‌కు దన్నుగా హౌతీల ఆగడాలు అప్పటినుంచే పెచ్చరిల్లాయి. ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకనూ లక్ష్యం చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్‌తో ఏ సంబంధమూ లేని నౌకలను కూడా వదిలిపెట్టడం లేదు.

కొద్ది రోజులుగానైతే కనిపించిన నౌక మీదల్లా విచ్చలవిడిగా దాడులకు దిగుతూ కల్లోలం సృష్టిస్తున్నారు. సమీపంలోని నౌకలపై డ్రోన్లు, సుదూరాల్లో ఉన్నవాటిపై ఏకంగా బాలిస్టిక్‌ మిసైళ్లు ప్రయోగిస్తూ గుబులు రేపుతున్నారు. గత నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో ఎర్రసముద్రంపై నౌకలపై హౌతీల దాడులు ఏకంగా 500 శాతం పెరిగిపోయాయి! వీటికి ఇరాన్‌ సహకారం కూడా పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. మిత్ర రాజ్యాలతో కలిసి హౌతీల స్థావరాలపై కొద్ది రోజులుగా అమెరికా పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగుతోంది. 

యెమన్‌ సాయుధ ముఠా..!
హౌతీలు యెమన్‌కు చెందిన సాయుధ ముఠా. 1990ల్లో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకంటూ పుట్టుకొచ్చారు. అక్కడి షియా ముస్లిం మైనారిటీల్లో జైదీలనే ఉప తెగకు చెందినవారు. వీరి ఉద్యమ వ్యవస్థాపక నేత హుసేన్‌ అల్‌ హౌతీ పేరిట ఆ పేరు వచ్చింది. ఈ ముఠాను తొలుత అన్సర్‌ అల్లా (దేవ పక్షపాతులు)గా పిలిచేవారు... 

  • హౌతీలను అణచేసేందుకు సౌదీ అరేబియా సాయంతో సలే 2003లో విఫలయత్నం చేశాడు. 
  • యెమెన్‌ ప్రభుత్వంపై 2014 నుంచీ వీళ్లు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఫలితంగా పదేళ్లుగా దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. 
  • సౌదీ, యూఏఈ, ఇతర అరబ్‌ దేశాలన్నీ యెమన్‌ ప్రభుత్వానికి దన్నుగా ఉన్నా హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు. 
  • ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా 3.5 లక్షల మంది దాకా బలైనట్టు అంచనా! 
  • అల్లర్లకు తాళలేక అర కోటి మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యెమన్‌ నుంచి వలస బాట పట్టారని ఐరాస పేర్కొంది. 
  • అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, పాలస్తీనా, హెబ్జొల్లా గ్రూపు తదితరాలతో కలిసి ‘ప్రతిఘటన శక్తులు’గా హౌతీలు తమను తాము చెప్పుకుంటారు. 
  • వీరికి లెబనాన్‌కు చెందిన హెబ్జొల్లా గ్రూపు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వీరికి 2014 నుంచీ ఆయుధాలను, పూర్తిస్థాయి సాయుధ శిక్షణను అందిస్తూ వస్తోంది. 
  • ఇరాన్‌ కూడా హౌతీలకు పూర్తిగా దన్నుగా నిలుస్తోందని చెబుతారు. ముఖ్యంగా వారికి బాలిస్టిక్‌ మిసైళ్లను సమకూర్చింది ఇరానేనని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. 
  • 2019లో తమ చమురు క్షేత్రాలపై దాడులకు హౌతీలు వాడిన డ్రోన్లు, క్షిపణులను కూడా ఇరానే అందజేసిందని సౌదీ ఆరోపిస్తూ ఉంటుంది. 
  • గాజాపై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌పై హౌతీలు పదేపదే బాలిస్టిక్‌ మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. 


హౌతీల చెరలోనే యెమన్‌ 
నిజానికి రాజధాని సనాతో పాటు యెమన్‌ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే గాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు! ఇక యెమన్‌లోని ఎర్రసముద్ర తీర ప్రాంతం మొత్తాన్నీ హౌతీలే నియంత్రిస్తున్నారు. ఇప్పుడదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది. 2010 నాటికే ఈ ముఠాకు కనీసం లక్ష పై చిలుకు సాయుధ బలమున్నట్టు ఐరాస అంచనా వేసింది. 

పెను ప్రభావం... 
ఆసియా, యూరప్‌ మధ్య సముద్ర రవాణాకు ఎర్రసముద్రమే అత్యంత దగ్గరి దారి. అంతేగాక అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15 శాతానికి పైగా ఎర్రసముద్రం మీదుగా మద్యధరా సముద్రం, సూయ జ్‌ కాల్వ గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హౌతీల మతిలేని దాడుల ప్రభావం అంతర్జాతీయ వర్తకంపై భారీగా పడుతోంది... 

  • ఎర్రసముద్రం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియాన్ని కంపెనీలు పది రెట్లకు పైగా పెంచాయి! 
  • మెడిటెరేనియన్‌ షిపింగ్‌ కంపెనీ, మార్క్స్, హపాగ్‌–లాయిడ్, బ్రిటిష్‌ పెట్రోలియం వంటి పలు కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి. 
  • దాంతో అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. 
  • అటు దాడులు, ఇటు బీమా వ్యయాలకు దడిచి పెద్ద రవాణా కంపెనీలన్నీ ఎర్రసముద్రం మార్గానికి ఓ నమస్కారం అంటున్నాయి. 
  • వెరసి ఇదంతా రవాణా వ్యయాలు బాగా పెరిగేందుకు కారణమవుతోంది. 
  • అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement