శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు | Srikanth Sharma literature gets honourable name | Sakshi
Sakshi News home page

శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు

Published Fri, Aug 8 2014 11:40 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు - Sakshi

శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు

 ఈదిన సముద్రాలు
  కొందరు ఒక జీవితకాలంలో చిన్న గుంతను తీసి నీరు నింపుతారు. కొందరు బావి తవ్వి బాటసారులకు వదిలిపెడతారు. కొందరు చెరువుకు ఆనకట్ట కట్టగలుగుతారు. కొందరు తటాకాలను కళకళలాడిస్తారు. కొందరైతే సరస్సులనే మన మానస మందిరాల్లో నింపుతారు. కాని సముద్రాలను సృష్టించినవారు కొందరుంటారు. అంచనాకు అందరు. సముద్రానికి సరిపడా మాలను అల్లగలరా ఎవరైనా?  శ్రీకాంత శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాశారు. కథ రాశారు. నవల రాశారు. నాటిక రాశారు. నాటకం రాశారు. పాట రాశారు. గేయం రాశారు.
 
 యక్షగానం రాశారు. విమర్శ రాశారు. పరిశోధన రాశారు. అనువాదం రాశారు. కాలమ్స్ రాశారు... ఒక్క అక్షరం వృథా చేయకుండా పనికొచ్చేదంతా పులకరింప చేసేదంతా రాశారు. ఒకరోజు రెండు రోజులు కాదు... 1960 నుంచి ఇప్పటి వరకూ దాదాపు యాభై ఏళ్లు రాశారు. ఒక పేజీ రెండు పేజీలు కాదు వేలాది పేజీలు రాశారు. రోజూ తోడిబోస్తే ఒకనాటికి అది సముద్రం అవుతుందంటారు. ఇన్నాళ్లకు ఆయన రచనలన్నీ ఒకచోటకు చేరి రెండు బృహత్ సంపుటులు అయ్యాయి. రెండూ కలిపి దాదాపు 2,500 పేజీలు. ఉప్పు నీటి కెరటాలు కావు. అమృత జల భాండాలు.
 
 పుట్టినప్పుడు యేడవాలి
 నిశ్శబ్దంగా నువ్వు పడి ఉంటే
 మంత్రసాని ఏడిపించక వదలదు
 నువ్వు ఏడిచే వరకూ
 నీ జననం ఎవరికీ ఆనందదాయకం కాదు....
 
 తొలిరోజుల్లో శ్రీకాంత శర్మ రాసుకున్న అనుభూతి గీతాల్లోని ఒక గీతం ఇది. జనన మర్మం, లోకమర్మం ఎరిగాక అనూహ్యమైన ఈ జీవితానికి అతిపెద్ద ఆలంబన సాహిత్యమే అనుకున్నారాయన. దానికి తగ్గ భూమిక ఇది వరకే ఏర్పడిపోయి ఉంది. తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి జగమెరిగిన సాహితీ మూర్తి. దానికి తోడు రామచంద్రాపురం (తూ.గో)లో గడిచిన బాల్యం, కొవ్వూరు (ప.గో) ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో సాగిన సంప్రదాయిక చదువు సాహిత్యం వైపు ఆయనకు సులువైన దారులు ఏర్పరిచాయి. ఆంధ్రజ్యోతి వీక్లీలో ఉద్యోగం, ఆ తర్వాత ఆలిండియా రేడియోలో సాగిన సుదీర్ఘ ఉద్యోగపర్వం ఆయనకు తేనె సేకరణ, మకరంద పంపిణీ తప్ప వేరే పని అప్పజెప్పలేదు. కనుక రాయడం.. రాయడం... రాయడం... ఇదే పని అయ్యింది శ్రీకాంత శర్మకు.
 
  ‘శిలా మురళి’ వంటి వచన కావ్యాలు, ‘ఏకాంత కోకిల’ వంటి పద్య కావ్యాలు, ‘తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా’ వంటి విస్తృత ప్రజాదరణ పొందిన గేయాలు... ఆయన కలం నుంచి కదనుతొక్కాయి. అయితే యక్షగానాల రచన ఆయన సామర్థ్యానికి సంగీత, నృత్యాల మేళవింపును దృష్టిలో పెట్టుకొని చేయగల వాక్య సృష్టికి తార్కాణంగా నిలిచాయి. ముఖ్యంగా అన్నమయ్య చరిత్రను ‘శ్రీపద పారిజాతం’ పేరుతో యక్షగానంగా మలచిన తీరు ప్రస్తావించ దగ్గది. ఇక ‘కిరాతార్జునీయం’, ‘శ్రీ ఆండాల్ కల్యాణం’, ‘గంగావతరణం’ నల్లేరుపై నడక.
 
 అయితే సరైన కవిని సరైన వచనం కూడా ఆకర్షిస్తుంది. విస్తృతి పొందిన వస్తువు కవిని వచనాన్ని ఆశ్రయించమని కోరుతుంది. శ్రీకాంత శర్మ ఆ విషయంలో- నేను కవిత్వానికి కట్టుబడి ఉంటాను అనుకోక కథలనూ సాధన చేశారు. గోదావరి జిల్లాల జీవితం ఆయన కథా వస్తువు. ఆయితే శ్రీపాద వారి గాలి కంటే మల్లాది వారి కేళే ఆయనను ఎక్కువ ఆకర్షించినట్టు అనిపిస్తుంది. స్త్రీల ప్రస్తావన, కట్టుగొయ్యకు కట్టిపడేసినట్టుగా చుట్టూ తిరిగే పురుషుల ప్రవర్తన... లోపలి బయటి కారణాలు... ఇవన్నీ శ్రీకాంత శర్మ కథల్లో కనిపిస్తాయి. అలానే హాస్యం కోసం చమత్కారం కోసం రాసిన సరదా కథలు కూడా ఉంటాయి. కాని నవలల సంగతి వచ్చేసరికి ఆయన కన్సర్న్స్ మారుతాయి.
 
 1960లు కథాకాలంగా నడిచిన ఆయన తొలి నవల ‘తూర్పున వాలిన సూర్యుడు’ ఒక రకంగా శ్రీకాంత శర్మ ఆత్మకథా ఛాయలున్న రచన. ఓరియంటల్ కాలేజ్‌లో సాగే సంప్రదాయిక చదువును నేపథ్యంగా తీసుకొని నాటి విద్యార్థుల జీవితం గోదావరి జిల్లాలలోని బ్రాహ్మణ జీవితం ఆవిష్కరిస్తూ ‘వేద విద్య నాటి వెలుగెల్ల నశియించే’ పరిణామాలను సూచిస్తూ సాగుతుంది. అలాగే 1980లు కథాకాలంగా సాగిన ‘క్షణికం’ నవల నాటి బ్రాహ్మణ జీవితాలలోని ఆడపిల్లల్లో వస్తున్న కొత్త చైతన్యాన్ని, ప్రేమ ప్రకటనని, దాని వల్ల పాతతరం తల్లిదండ్రులతో పడవలసి వచ్చిన ఘర్షణని చూపిస్తుంది.
 
 అయితే అవసరం రీత్యా, అభిరుచి రీత్యా శ్రీకాంత శర్మ నాటకం/నాటికలో కూడా గట్టి కృషి చేశారనిపిస్తుంది. ఆకాశవాణిలో పని చేయడం వల్ల ఆయన లెక్కకు మించిన నాటకాలు, నాటికలు రాశారు. ఆయన రాసిన ‘ఆకుపచ్చని కోరికలు’ నాటకం జాతీయ పురస్కారం పొంది పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువాదమై శ్రోతలకు చేరింది. కవిత్రయ భారతంలోని మౌసల పర్వాన్ని ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణుడి ‘అవతార సమాప్తి’ని నాటిక చేసినా, కృష్ణ ద్వైపాయనుడు మహా భారత ఇతిహాసాన్ని రచించి వ్యాసమహర్షిగా మారిన తీరును ‘మహర్షి ప్రస్థానం’గా మలచినా అందుకు సృజన మాత్రమే చాలదు చాలా ‘చదువు’ కావాలి. ఆ వరుసలో ఆయన హెరాల్డ్‌పింటర్, బ్రెహ్ట్ వంటి గొప్ప నాటక కర్తల నాటకాలను అనుసృజిస్తూ కూడా నాటక రచన చేశారు. ఇక కాళిదాసును ప్రధాన పాత్రగా తీసుకొని మోహన్ రాకేష్ రాసిన హిందీ నాటకం ‘ఆషాఢ్ కా ఏక్ దిన్’ అనువాదం ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది.
 
 ఈ సృజనంతా ఒక ఎత్తు ఆయన చేసిన సమాలోచన ఒక ఎత్తు. సాధారణంగా సృజనకారులు సృజనాత్మక రచనల వల్ల కలిగే తృప్తిని కొండకచో కీర్తిని వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. చాలా కొద్ది మంది మాత్రం తాము గ్రహించిన జ్ఞానాన్ని, సమాచారాన్ని, పరిశీలనని, పరిశోధనని పదుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. వఈ పనిలో శ్రీకాంత శర్మ ఎటువంటి భేషజాలకు పోకుండా తన తరం వారికీ తన ముందు తరం వారికీ కూడా దివిటీలు పట్టారు. ‘సాహితీ దీపాలు’ పేరుతో దాదాపు ముప్పయ్ మంది సాహిత్యకారుల గురించి ఆయన రాసిన సమగ్ర పరిచయాలు- కేవలం ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు వంటివి కాదు- ఎందుకు గొప్పవారు ఎక్కడ గొప్పవారు అని చెప్పేవి. వేటూరి ప్రభాకర శాస్త్రి, త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, విశ్వనాథ సత్యనారాయణ, చలం, గుంటూరు శేషేంద్ర శర్మ... ప్రతి సాహిత్యాభిమాని తప్పని సరిగా చదవాల్సిన వ్యాసాలు ఇవి. కాని శ్రీకాంత శర్మ ఇంతకంటే చేసిన మంచి పని ‘అలనాటి నాటకాల’ను వాటి పూర్వాపరాలతో విస్తృతంగా పరిచయం చేయడం.
 
  తెలుగు నాటకాభిమానులకు- సతీ సావిత్రి, ద్రౌపదీ వస్త్రాపహరణము, సత్యహరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకము, శ్రీ కృష్ణ తులాభారము, తారా శశాంకం, సారంగధర... ఇలాంటివన్నీ కంఠోపాఠం. కాని వీటి వెనుక ఉన్న చరిత్ర, రచనల పుట్టుక, మార్పు ఇవన్నీ శ్రీకాంత శర్మ చేసిన పరిచయాలలో ఉన్నాయి. ఖల్జీ రాజ్య పతనము, రోషనార, ప్రతాపరుద్రీయం... ఈ నాటకాలకు సంబంధించిన విలువైన సమాచారం ఆయన శ్రమకోర్చి నిక్షిప్తం చేశారు. నిజం, కీర్తిశేషులు, మరో మొహంజోదారో, మా భూమి... వీటినీ వదల్లేదు. నిస్సందేహంగా ఇది గొప్పగా చెప్పుకోదగ్గ పని. ఇక కవిత్వానికి సంబంధించి తెలుగు పద్యం, గేయ కవితా ప్రస్థానం, యక్షగాన ప్రక్రియ, వచన కవిత, భావ కవిత, అనుభూతి కవిత... వీటన్నింటి గురించి చేసిన  విస్తృత సమాలోచన కవులకు, సాహిత్య విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుంది. ‘తెలుగు కవుల అపరాధాలు’ ప్రత్యేకం. ఇవన్నీ కాకుండా ఇంత జీవితంలోనూ ఎదురైన పరిపరి పరిచయాలను శ్రీకాంత శర్మ పాఠకులకు ప్రత్యేక నజరానాగా అందిస్తారు.
 
 అయితే ఒకటి అనిపిస్తుంది. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈయన విశ్వాసాలు ప్రభావాలతో ఏర్పడినవి కావు. స్వయంగా ఏర్పరుచుకున్నవే. వాటి మీద రాజీ లేదు. అలాగే సాహిత్యం సాహిత్యం కొరకే తర్వాతే ప్రయోజనం కొరకు అనే విశ్వాసం కూడా ఆయనలో ఉంది.  కళను తప్పించాక వస్తువుతో అది ఎంత పుష్టిగా ఉన్నా అది కళలోకి రాదు అనే భావన ఉంది. సాహిత్యాన్ని పలుచన కానివ్వరు కొందరు. శ్రీకాంత శర్మ అందులో ముఖ్యులు. సాహిత్యలోకంలో ఈ రెండు సంపుటాలు గౌరవనీయమైన స్థానాన్ని పొందుతాయనడంలో సందేహం అక్కర్లేదు.
 శ్రీకాంతశర్మ సాహిత్యం (రెండు సంపుటాలు); వెల: రూ.2,500; ప్రతులకు: నవోదయ 040- 24652387; శ్రీకాంత శర్మ నంబర్: 040 - 27114472
 - సాక్షి సాహిత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement