గురజాడ అస్తమించిన తరువాత, ఆయన ముత్యాల ‘సరళి’ని అనుసరించినట్టే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ అడుగుల, పరుగుల లయగతులను అందుకున్నారు చాలామంది. వారిలో, ‘సీరపాణి’ పేరుతో ‘డమరు ధ్వని’ కవితాసంపుటిని ప్రకటించిన బుడితి బలరామనాయుడొకరు. పెద్దగా, ఆయన కవిత్వం ప్రచారానికి రాలేదు. కారణాలు తెలీదు కానీ, అచ్చయింది ఆ ఒక్క సంపుటి మాత్రమే! దీనికి ‘నమ్మకం’ పేరుతో, ఆరుద్ర ముందుమాట రాశారు. ‘రుధిరంలో అనలద్యుతి ధమనుల్లో ఢమరు ధ్వని’ గల అభ్యుదయ కవి, అని సీరపాణిని ప్రశంసించారు. ‘సమత ఇతని కవితకు ప్రాణం. అది ముందు తరాలకు, కవి ఇచ్చే గోదానం’ అన్నారు.
మహాప్రస్థానం’ వెలువడిన 39 ఏళ్ల తరువాత, ‘ఢమరు ధ్వని’ వెలువడింది. మహాప్ర స్థానం వెలువడిన, తొమ్మిదేళ్ల తరువాత, బొబ్బిలి ప్రాంతంలోని కామందొరవలస గ్రామంలో కవి జన్మించాడు. ‘శ్రీకాకుళం సాయుధ పోరాటం’ దశ నాటికి, ఆయన వయసు 21–23 ఏళ్లు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘భాషాప్రవీణ’ చదువుతున్న రోజుల్లో, చాసో, అనిశెట్టి వంటి పెద్దల పెంపకంలోకి వెళ్లాడు. వారివల్ల శ్రీశ్రీ కవిత్వ శక్తి పరిచయమైతే, శ్రీకాకుళం పోరాటగడ్డ స్వయంగా అతనిదే! నిరంతరం శ్రీశ్రీని ఆవాహన చేసుకోవడానికే, కవితాధ్యానం చేశాడా? అనిపిస్తుంది, ‘ఢమరు ధ్వని’ చదివితే! మహాప్రస్థానంలో ‘జ్వాలాతోరణం’, ఢమరు ధ్వనిలోని ‘సమతా సంగీతం’లో కనిపిస్తుంది. ‘జగన్నాథుని రథచక్రాలు’ అతని ‘అగ్నిగీతం’లో శబ్దిస్తాయి. చివరకు, ‘కొంపెల్ల’ కోసం శ్రీశ్రీ అనుభవించిన కవిత్వవేదన, సీరపాణి ‘కన్నీటిలేఖ’లో ప్రతిఫలిస్తుంది. ఒక్క మాటగా చెప్పాలంటే, శ్రీశ్రీ ‘ఢంకాధ్వానం’, శంఖారావం’తో కలసి సీరపాణి ‘ఢమరు ధ్వని’ వినిపించాడా! అనిపిస్తుంది.
‘ఏమన్నది? ఏమన్నది? ప్రకృతి మాత ఏమన్నది? యుగయుగాల నాదు తప: ఫలమే మానవుడన్నది’ అని చెప్పి, ‘అగ్ని కేకేసింది, అందరూ కదలండి’ అని పిలుపునిచ్చిన సీరపాణి, ‘చరాచరం క్రియేషన్, మహాత్ముడొక కొటేషన్, కవిత కొక్కటే ప్రాణం, కదిలించే ఇమోషన్’ అని కవిత్వ రహస్యాన్ని విడమరిచారు. ‘అందుకో ఆదర్శాల బ్రెన్‌గన్, పాటల తూటాలు బిగించి, పేల్చీవోయ్ ధన్, ధన్’ అని సందేశాన్ని ముగించాడు. కానీ, చదివిన ప్రతిసారి, కొత్త ప్రకంపనలను అది ప్రారంభిస్తూనే వుంటుంది. అతడు ‘ఢమరు ధ్వని’ తరువాత, మరేమీ రాయకుండా, ఆరుద్ర నమ్మకాన్ని కొనసాగించకపోయినా, ఆనాటి యువకవితరంపై మహాకవి ప్రభావాన్ని మరోసారి నిరూపించడానికి, నమ్మకమైన ప్రతిధ్వని ‘ఢమరు ధ్వని’.
u నల్లి ధర్మారావు
Comments
Please login to add a commentAdd a comment