weeks
-
కోవిషీల్డ్ రెండో డోసు గడువు మళ్లీ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు గడువును వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి పెంచింది. ప్రస్తుతం మొదటి డోసు పొందిన తర్వాత 12–16 వారాల మధ్యలో రెండో డోసు ఇస్తుండగా, ఈ గడువును 14–16 వారాలకు పెంచుతూ ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బుధ వారం ఉత్తర్వులు జారీచేశారు. అంటే కోవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న 14 నుంచి 16 వారాల మధ్యలోనే రెండో డోసు టీకాను తీసు కోవాల్సి ఉంటుంది. కాగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందజేస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. -
రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కరోనా విషయంలో కాస్త మెరుగ్గా ఉందని.. మహారాష్ట్ర, కర్నాటకలాంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్రం పరిస్థితి బాగుందని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. వందేళ్లకోసారి ఇలాంటి విపత్తులు వస్తాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాబోయే 3,4 వారాలు చాలా కీలకం..జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌పై హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియాలో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. పెళ్లిళ్ల సీజన్ ముందుంది కాబట్టి ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల మంది పైగా వాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. విడతలవారీగా మిగతావారికి కూడా వాక్సిన్ వేయిస్తామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ గురించి ఆందోళన కూడా అవసరం లేదని భరోసా ఇచ్చారు. లక్షణాలు ఉంటేనే కోవిడ్ ఉన్నట్టని, భయంతో పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరొద్దని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలకు దూరం అవుతున్నారు..కోవిడ్ లేని వారు పరీక్షల కోసం వచ్చి వ్యాధి తెచ్చుకుంటున్నారని వివరించారు. లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని, తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 80 శాతం మందికి ఆస్పత్రులు అవసరం లేదని.. చాలా వరకు ఇంట్లో వైద్యుల సలహాలతో కోలుకోవచ్చని డైరెక్టర్ శ్రీనివాసరావు గుర్తుచేశారు. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు -
శ్రీశ్రీ స్ఫూర్తితో డమరు ధ్వని
గురజాడ అస్తమించిన తరువాత, ఆయన ముత్యాల ‘సరళి’ని అనుసరించినట్టే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ అడుగుల, పరుగుల లయగతులను అందుకున్నారు చాలామంది. వారిలో, ‘సీరపాణి’ పేరుతో ‘డమరు ధ్వని’ కవితాసంపుటిని ప్రకటించిన బుడితి బలరామనాయుడొకరు. పెద్దగా, ఆయన కవిత్వం ప్రచారానికి రాలేదు. కారణాలు తెలీదు కానీ, అచ్చయింది ఆ ఒక్క సంపుటి మాత్రమే! దీనికి ‘నమ్మకం’ పేరుతో, ఆరుద్ర ముందుమాట రాశారు. ‘రుధిరంలో అనలద్యుతి ధమనుల్లో ఢమరు ధ్వని’ గల అభ్యుదయ కవి, అని సీరపాణిని ప్రశంసించారు. ‘సమత ఇతని కవితకు ప్రాణం. అది ముందు తరాలకు, కవి ఇచ్చే గోదానం’ అన్నారు. మహాప్రస్థానం’ వెలువడిన 39 ఏళ్ల తరువాత, ‘ఢమరు ధ్వని’ వెలువడింది. మహాప్ర స్థానం వెలువడిన, తొమ్మిదేళ్ల తరువాత, బొబ్బిలి ప్రాంతంలోని కామందొరవలస గ్రామంలో కవి జన్మించాడు. ‘శ్రీకాకుళం సాయుధ పోరాటం’ దశ నాటికి, ఆయన వయసు 21–23 ఏళ్లు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘భాషాప్రవీణ’ చదువుతున్న రోజుల్లో, చాసో, అనిశెట్టి వంటి పెద్దల పెంపకంలోకి వెళ్లాడు. వారివల్ల శ్రీశ్రీ కవిత్వ శక్తి పరిచయమైతే, శ్రీకాకుళం పోరాటగడ్డ స్వయంగా అతనిదే! నిరంతరం శ్రీశ్రీని ఆవాహన చేసుకోవడానికే, కవితాధ్యానం చేశాడా? అనిపిస్తుంది, ‘ఢమరు ధ్వని’ చదివితే! మహాప్రస్థానంలో ‘జ్వాలాతోరణం’, ఢమరు ధ్వనిలోని ‘సమతా సంగీతం’లో కనిపిస్తుంది. ‘జగన్నాథుని రథచక్రాలు’ అతని ‘అగ్నిగీతం’లో శబ్దిస్తాయి. చివరకు, ‘కొంపెల్ల’ కోసం శ్రీశ్రీ అనుభవించిన కవిత్వవేదన, సీరపాణి ‘కన్నీటిలేఖ’లో ప్రతిఫలిస్తుంది. ఒక్క మాటగా చెప్పాలంటే, శ్రీశ్రీ ‘ఢంకాధ్వానం’, శంఖారావం’తో కలసి సీరపాణి ‘ఢమరు ధ్వని’ వినిపించాడా! అనిపిస్తుంది. ‘ఏమన్నది? ఏమన్నది? ప్రకృతి మాత ఏమన్నది? యుగయుగాల నాదు తప: ఫలమే మానవుడన్నది’ అని చెప్పి, ‘అగ్ని కేకేసింది, అందరూ కదలండి’ అని పిలుపునిచ్చిన సీరపాణి, ‘చరాచరం క్రియేషన్, మహాత్ముడొక కొటేషన్, కవిత కొక్కటే ప్రాణం, కదిలించే ఇమోషన్’ అని కవిత్వ రహస్యాన్ని విడమరిచారు. ‘అందుకో ఆదర్శాల బ్రెన్గన్, పాటల తూటాలు బిగించి, పేల్చీవోయ్ ధన్, ధన్’ అని సందేశాన్ని ముగించాడు. కానీ, చదివిన ప్రతిసారి, కొత్త ప్రకంపనలను అది ప్రారంభిస్తూనే వుంటుంది. అతడు ‘ఢమరు ధ్వని’ తరువాత, మరేమీ రాయకుండా, ఆరుద్ర నమ్మకాన్ని కొనసాగించకపోయినా, ఆనాటి యువకవితరంపై మహాకవి ప్రభావాన్ని మరోసారి నిరూపించడానికి, నమ్మకమైన ప్రతిధ్వని ‘ఢమరు ధ్వని’. u నల్లి ధర్మారావు -
చిత్రం వెనుక కథ!
కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వుతుంటే... వారికి గతజన్మలో విషయాలు గుర్తుకొస్తాయని , దేవుడే ఆ చిన్నారులను నవ్విస్తాడని వారి వారి నమ్మకాలను బట్టి చెప్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో ఇటీవల కనిపించిన ఓ పసిపాప చిత్రం.. కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. కొత్తగా లోకంలో అడుగుపెట్టి, నిద్రలోనే బోసినవ్వులను కురిపిస్తూ కనిపించిన ఆ ఫోటో వెనుక కథ ఎందరినో కదిలింప జేసింది. సుమారు నలభై లక్షలమంది లైక్ చేసిన చిత్రం.. ఎనభైవేల సార్లు షేర్ కూడ అయ్యింది. ఇంతకూ ఆ చిత్రం వెనుక కథేమిటో చూద్దామా. తొమ్మిది నెలలు మోసి కని పెంచే తల్లితోపాటు, కంటికి రెప్పలా కాపాడే తండ్రి స్పర్శకు సంబంధించిన విషయం.. ప్రతి గుండెను తట్టింది. లోకం తెలీని పసిపాప ప్రస్తుతం నిద్రలో నవ్వులు చిందిస్తున్నా... ఊహ తెలిపిన తర్వాత ఎంత వేదన పడుతుందో అంటూ సానుభూతి వ్యక్తమౌతోంది. ఆమె పుట్టడానికి కేవలం నెల రోజుల ముందు బైక్ రేసర్ అయిన తండ్రి చనిపోయినా.. అతడు వాడిన గ్లౌజ్ లు, హెల్మెట్ స్పర్శతోనే ఆమె నిద్రలో నవ్వులు పూయించడం ఓ మిరాకిల్ గా మారింది. మోటార్ సైకిల్ రేస్ అంటే అమితంగా ఇష్టపడే హెక్టార్ డానియల్ ఫెర్రర్ అల్వరేజ్ ఫ్లోరిడాలో ఏప్రిల్ నెలలో స్నేహితుడి చేతులో హత్యకు గురయ్యాడు. ఆయన జ్ఞాపకాలను మరచిపోలేని అల్వరేజ్ భార్య.. కేథరిన్ విలియమ్స్.. ఆయన వాడిన గ్లౌజ్ లు , హెల్మెట్ ను అతడి ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంది. నెలరోజుల తర్వాత ఆయన గుర్తుగా బిడ్డ ఆబ్రే పుట్టినా... మామూలు ప్రపంచంలోకి రాలేకపోయింది. భర్తను తలచుకొంటూ, అతడి ప్రేమకు గుర్తుగా గ్లౌజ్ లు, హెల్మెట్ దాచుకుంది. బిడ్డను హత్తుకున్నట్లుగా, తండ్రి చేతుల్లోనే నిద్రపోతున్నట్లు గ్లౌజ్ లు, హెల్మెట్ బిడ్డను హత్తుకున్నట్లుగా పెట్టి ఫోటోలు తీయించింది. గాఢంగా నిద్రపోతున్న ఆ పసిపాప.. తండ్రి గ్లౌజుల స్పర్మ తగలగానే చిరునవ్వులు ప్రారంభించిందని, నిజంగా ఆ సన్నివేశం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ ఫోటోగ్రాఫర్ కిమ్ స్టోన్ వివరించాడు. పసిపాప అమ్మమ్మ ఫోటో సెషన్ కోసం తనను బుక్ చేసిందని, చిన్నారి పుట్టక ముందే ఆమె తండ్రి చనిపోయినట్లు ఆవిడ చెప్పిందని, ఆ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తీయాలంటూ తనను బుక్ చేశారని కిమ్ స్టోన్ తెలిపాడు. కుమార్తెను నిజంగా పట్టుకున్నట్లు గ్లౌజ్ లను పెట్టగానే..పసిపాప బోసి నవ్వులు చిందించడం ఆశ్చర్యం కలిగించినట్లు కిమ్ చెప్తున్నాడు. అలా కిమ్ తీసిన ఫోటోల్లోని ఓ చిత్రమే ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఫొటో వివరాలను చెప్తూ కిమ్... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి తక్కువ వ్యవధిలో కోట్లకొద్దీ మనసులను దోచుకుంది. ఆ చిట్టితల్లి చిరకాలం అలా నవ్వుతూనే ఉండాలంటూ ప్రతి మనసూ కోరుకుంది. స్టోన్ పోస్ట్ కు స్పందించిన విలియమ్స్.. అలాగే తన చిన్నారికి జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు సందేశాన్ని పంపింది. తన బిడ్డ కోసం ప్రపంచం ఎంత ప్రార్థించిందో ఆమె పెద్దయిన తర్వాత చూపిస్తానంటూ విలియమ్స్ తన సందేశంలో వివరించింది. తండ్రి కలలను ఫోటో నిజం చేసిందని, ఆయన చనిపోయినా చిరస్థాయిగా నిలిచేట్టు చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నిద్రలో నవ్వుతుంటే పసిపాపలకు దేవుళ్ళు కనిపిస్తారంటారు... అది నిజంగా నిజమేనేమో అంటూ స్టోన్ వ్యాఖ్యానించగా.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫోటోను చూసి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తండ్రి పాత్రకు తగిన గుర్తింపునిచ్చే ఉద్దేశ్యంతో సోనారా.. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే పండుగ వెలుగు చూసేలా చేస్తే... అదే సమయంలో.. తండ్రి స్పర్శ, జ్ఞాపకాలకు సంబంధించిన గుర్తులతో 'ఆబ్రే' ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. అందమైన 'ఫాదర్స్ డే' ఉత్సవానికి మరో మచ్చుతునకైంది. -
నమ్మించారు..నగదు, నగలతో పరారయ్యారు
♦ మోసం చేసిన దంపతుల అరెస్టు ♦ గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దన్న సీఐ రాజిరెడ్డి వేంసూరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చల్లా వాసు-లక్ష్మీతిరుపతమ్మ దంపతులు కుర్చీలు, ఫ్యాన్లు, చాపలు తదితర వస్తువులను వారాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే మండల పరిధిలోని కందుకూరుకు చెందిన నరిశెట్టి లలితమ్మ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానురాలితో వరసలు కలిపి ఆమెను నమ్మించారు. ఈ నెల 6వ తేదీన ఆ దంపతులు సత్తుపల్లిలో పెళ్లికి వెళ్తున్నాం... మా వద్ద పెట్టుకునేందుకు బంగారం లేదు.. మీ బంగారం ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పి నమ్మించారు. అదీగాక అదే రోజు ఆ ఇంటి యజమానురాలు డబుల్‌కాట్ మంచం కింద దాచిన రూ.70వేలు నగదును గమనించారు. లలితమ్మ ఇంట్లో లేని సమయంలో ఆ డబ్బు చోరీ చేసి పరారయ్యూరు. లలితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం వెల్లడైంది. వారి వద్ద నుంచి మూడు గ్రాముల బంగారం, రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ ఇంటి యజమానులు అద్దెకు వచ్చేవారి వివరాలు తెలుసుకోకుండా అద్దెకు ఇస్తే వారు ఎలాంటి వారో కనిపెట్టడం కష్టమన్నారు. కందుకూరు ఘటనలో ఇదే జరిగిందన్నారు. నిందితులను కోర్టుకు రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.