♦ మోసం చేసిన దంపతుల అరెస్టు
♦ గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దన్న సీఐ రాజిరెడ్డి
వేంసూరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చల్లా వాసు-లక్ష్మీతిరుపతమ్మ దంపతులు కుర్చీలు, ఫ్యాన్లు, చాపలు తదితర వస్తువులను వారాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే మండల పరిధిలోని కందుకూరుకు చెందిన నరిశెట్టి లలితమ్మ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానురాలితో వరసలు కలిపి ఆమెను నమ్మించారు. ఈ నెల 6వ తేదీన ఆ దంపతులు సత్తుపల్లిలో పెళ్లికి వెళ్తున్నాం... మా వద్ద పెట్టుకునేందుకు బంగారం లేదు.. మీ బంగారం ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పి నమ్మించారు. అదీగాక అదే రోజు ఆ ఇంటి యజమానురాలు డబుల్‌కాట్ మంచం కింద దాచిన రూ.70వేలు నగదును గమనించారు. లలితమ్మ ఇంట్లో లేని సమయంలో ఆ డబ్బు చోరీ చేసి పరారయ్యూరు.
లలితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం వెల్లడైంది. వారి వద్ద నుంచి మూడు గ్రాముల బంగారం, రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ ఇంటి యజమానులు అద్దెకు వచ్చేవారి వివరాలు తెలుసుకోకుండా అద్దెకు ఇస్తే వారు ఎలాంటి వారో కనిపెట్టడం కష్టమన్నారు. కందుకూరు ఘటనలో ఇదే జరిగిందన్నారు. నిందితులను కోర్టుకు రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.