ఒకసారి శ్రీరంగం శ్రీనివాసరావూ, అబ్బూరి వరద రాజేశ్వరరావూ విశాఖపట్నంలో సముద్రతీరానికి బయల్దేరారు. ‘నువ్వెప్పుడైనా లైట్‌హౌస్ పైకి వెళ్లి సముద్రాన్ని చూశావా?’ అడిగాడు దారిలో వరద. దీపస్తంభాన్ని ఎన్నేళ్లనుంచో చూస్తున్నప్పటికీ అది ఎక్కి సముద్రాన్ని చూడొచ్చన్న ఆలోచన అంతకుముందు రాని శ్రీశ్రీ ఆశ్చర్యపోయాడు. దాని పైకెక్కటం ఎలా అని అడిగాడు. సరాసరి పొన్నాంబళ్ దగ్గరికి పోయారు. అతడు వరదకు పరిచయం. ‘ఇదే ఆఖరు’ అంటూ అతడు ఇద్దరినీ మెలికలు తిరుగుతూ పోయిన మెట్ల మీది నుంచి పైకి తీసుకుపోయాడు. శ్రీశ్రీ సముద్రం వంక చూస్తూ నిశ్చలంగా నిలబడిపోయాడు. తదేక దృష్టితో చూస్తున్నాడు. ఈలోగా వరద బైనాక్యులర్స్ ఇచ్చాడు. అందులోంచి చూశాడు. చూస్తున్నాడు. చూస్తున్నాడు. శ్రీశ్రీ ముఖకవళికలు మారిపోయినై. హఠాత్తుగా ‘పడండి ముందుకు, పడండి తోసుకు పైపైకి’, ‘ఫెళ ఫెళా విరుచుకుపడండి’ ‘వండర్‌ఫుల్’ అన్న మాటలు ఆయన నోటినుంచి వచ్చినై. కిందికి మెట్లు దిగుతుండగా, ‘ఆ కెరటాల్ని దగ్గరినుంచి చూశావు కదా, ఎలా విరుచుకుపడుతున్నాయో; అంత భయంకర దృశ్యాన్ని చూడటం నాకిదే మొదటిసారి’ అన్నాడు శ్రీశ్రీ. అ తరంగాల్ని చూస్తూ అన్న ఆ మాటలే మరో రెండేళ్లకు మరో రూపంలో శ్రీశ్రీ ప్రసిద్ధ కవితలోని పంక్తులుగా నిలిచినాయి.
Comments
Please login to add a commentAdd a comment