సాహిత్య పాఠకులకు హెచ్చార్కె ఒక కవిగా, జర్నలిస్టుగా, వ్యాసకర్తగా, విప్లవవాదిగా తెలుసు. ఈ నవల చదివిన వారికి ఆయనొక రెబెల్ అని అర్థం అవుతుంది. ఈ నవల మొత్తం పవన్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. ఉపోద్ఘాతం మాత్రం ఒక సాయంత్రం వేళ అమెరికాలో తమ పిల్లల వద్ద నివసిస్తున్న ఇద్దరు ముసలాళ్ల మధ్య సంభాషణగా మొదలై, నవల చివర మళ్ళీ వారి సంభాషణతోనే ముగుస్తుంది. పవన్ తన కథను రచయితకు చెపితే, రచయిత మనకు పవన్ కథను నవరస భరితమైన రీతిలో చెప్పాడు.
పవన్ పేరును వాళ్ల జేజి ఖరారు చేసింది. కుటుంబ ఆనవాయితీ ప్రకారం ఆంజనేయ స్వామిని స్ఫురణకు తెచ్చేలా ఆంజనేయులు, హనుమయ్య అని ఉండాలి. కానీ జేజి మోడ్రన్‌గా పవన్ కుమార్ అని పెట్టుకుంది. పవన్ ఎక్కడో గని అనే రాయలసీమ గ్రామంలో పేద రైతు కుటుంబంలో పుట్టాడు. నలుగురు అన్నదమ్ములకు కలిపి నాలుగు ఎకరాల నీళ్లవసతి లేని చేను. పవన్ చదువు సర్కారు బడుల్లో, బంధువుల ఇండ్లల్లో సాగుతుంది. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి సంజీవయ్య తనకెన్ని అప్పులున్నా పవన్‌ను ఇంకా చదివిస్తే ఉద్యోగం చేసి బతుకుతాడు కదా అని ఆశపడతాడు.
ఎమ్మెస్సీ చదివే అవకాశం ఉన్నా చిన్న వయసు నుంచి తెలుగు సాహిత్యంపై ఉన్న అభిమానం, తనకు పద్యాలు, కథలు రాసే ఆసక్తి మెండుగా ఉంది గనుక, విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మే తెలుగులో చేరుతాడు. మహాప్రస్థానం చదివి ప్రభావితుడై, కమ్యూనిస్టు ఉద్యమ సాహిత్యం విపరీతంగా చదువుతాడు. ఉద్యమం పట్ల ఆకర్షితుడు కావటానికి మరో కారణం చండ్ర పుల్లారెడ్డి ఊరు అతని ఊరు పక్కనే. పవన్ కూడా తన గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి, పాటలు, ఉపన్యాసాల ద్వారా సంచలనం సృష్టిస్తాడు. కర్నూలులో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఓ పెద్ద ర్యాలీ నిర్వహించి నక్సల్ నేతగా పోలీసుల దృష్టిలో పడతాడు. కర్నూలు హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న మేనమరదలు విజయ కూడా తన మార్గంలో నడిచేందుకు సిద్ధమైన తర్వాత ఇద్దరూ స్టేజి మ్యారేజ్ చేసుకుంటారు.
ఇంతలో 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించగానే, పోలీసులు పవన్‌ను అత్తగారింట్లో ఉండగా అరెస్టు చేసి, మీసా చట్టం కింద ముషీరాబాద్ జైల్లో పెడతారు. సెకండ్ క్లాస్ రాజకీయ ఖైదీ జీవితం తన ఊరి జీవితం కంటే మెరుగ్గా ఉందనుకుంటాడు. జైలులో ఉండగానే కూతురు పుడుతుంది. పెరోల్ దొరకదు. నక్సల్ పార్టీకి రాజీనామా చేసినట్లు అండర్ టేకింగ్ ఇస్తే పెరోల్ ఇస్తామని ఆశపెడతారు. కానీ ఒప్పుకోడు. అక్కడే యాదాటి కాశీపతి గురువై, గంటల కొద్దీ ఆంగ్ల సాహిత్యం బోధించిన వైనం పవన్‌కు మున్ముందు జర్నలిస్టు, రచయిత జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. జైలు నుంచి ఒక దినపత్రికలో చేరుతాడనగా చండ్ర పుల్లారెడ్డి పిలుపు మేరకు వారి పార్టీ పత్రిక ‘విమోచన’లో చేరి, భార్య విజయతో కలిసి 12 ఏండ్లు పార్టీలో, పత్రికలో ఫుల్ టైమర్‌గా పని చేస్తాడు. సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి, పాత్రికేయుడిగా పనిచేస్తాడు.
ఈ నవల మొదటి భాగాల్లో రాయలసీమ భాషను ఆర్తిగా చిత్రించాడు రచయిత. జాలాడి, తల్లె, బర్రె గొడ్లు, సద్ది, ఈదులు, లొట్లు, గరిసె లాంటి పదాలు వింటే ప్రాణం లేచొస్తుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా పవన్ జీవితం గడుస్తుంది. కుటుంబానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అందరికీ దూరంగా ఉండిపోయి బాధపడుతుండగా ముగుస్తుంది. 11వ క్లాస్ వరకు కాళ్లకు చెప్పులు లేకుండా అతడి జీవితం గడిచింది. రైలు పెట్టెలో కండక్టర్ ఉంటాడు కదా, అప్పుడు టికెట్ తీసుకుందాంలే అనుకుంటాడు. మరి ఈ హెచ్చార్కే (హనుమంత రెడ్డి.కె), నవలా హీరో పవన్ ఒకరేనా? ఎందరో వాస్తవ నాయకులు, రచయితలు, ఎడిటర్లు, వాస్తవ చారిత్రక సంఘటనలు నవల నిండా ఉన్నాయి. 1968–1985 మధ్య కాలంలో జరిగిన విప్లవ ఉద్యమాలను వాటిలో పాల్గొన్న ఒక యువకుని కోణంలో ఇది ఆవిష్కరిస్తుంది.
కర్ర ఎల్లారెడ్డి
నవల: రెబెల్;
రచన: హెచ్చార్కె
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్
ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ. ఫోన్: 7093800678
కమ్యూనిస్టు విప్లవోద్యమాలను చిత్రించిన రెబెల్
Published Mon, Aug 17 2020 12:13 AM | Last Updated on Mon, Aug 17 2020 12:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment