నవల: ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్
రచయిత్రి: ఎలీనా ఫెరాంటె
ఇటాలియన్ నుంచి ఆంగ్లానువాదం: ఆన్ గోల్డ్‌స్టైన్
ప్రచురణ: యూరోపా ఎడిషన్స్; 2020
‘‘చిన్నప్పుడు నేను అబద్ధాలు చెప్పేదాన్ని, తరచూ శిక్షింపబడేదాన్ని కూడా! అబద్ధాలు చెప్పడాన్ని వ్యతిరేకించే పెద్దవాళ్లు మాత్రం ఇతరులకే కాదు, తమకి కూడా తేలికగా అబద్ధాలు చెప్పేసుకుంటారు. జీవితాలకో అర్థం, స్థిరత్వం, ఇతరులనెదుర్కునే శక్తి, తమ పిల్లల ముందు ఆదర్శప్రాయంగా నిలబడగలిగే సామర్థ్యం – వీటన్నిటికీ అబద్ధాలే ప్రాథమికావసరమైనట్టు! చిన్నప్పటి ఈ ఆలోచనే జొవానా కథకి ప్రేరణ అనుకోవచ్చు.’’ ఈనెల విడుదలయిన ‘ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్’ నవల రచయిత్రి ఎలీనా ఫెరాంటె ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలివి. ఈ నవల పెద్దవాళ్ల అబద్ధాల గురించీ, పన్నేండేళ్ల జొవానా చేసే ఉద్విగ్నభరిత సంతృప్త ప్రయాణం గురించీ. రాసిన నవలలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినా, తనెవ్వరో ప్రపంచానికి తెలియనివ్వని ఫెరాంటేని ప్రస్తావిస్తూ ‘‘ఎవరికీ తెలియని ప్రముఖ ఇటాలియన్ రచయిత్రి’’ అంటారు జేమ్స్ వుడ్. ఆవేదనల భావతీవ్రతలనీ, మేధోపరమైన విశ్లేషణలనూ ఇటాలియన్ నుంచి ఆంగ్లంలోకి సరళానువాదం చేసింది ఆన్ గోల్డ్‌స్టైన్.
పేదరికంలో పెరిగిన ఆండ్రియా స్వయంకృషితో చదువుకుని, ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటాడు. భార్య నెల్లీ, ప్రేమించే కూతురు జొవానా, ఇదే అతని జీవితం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకపఠనం, అప్పుడప్పుడూ స్నేహితుడు మేరియానోతో మార్క్సిజం, ఇతరత్రా విషయాలపై ఘాటైన చర్చలు ఆండ్రియాకి ఆటవిడుపులు. మేరియానో భార్య కాన్‌న్టాన్, వారిపిల్లలూ వీరి కుటుంబంతో కలిసిపోతారు. తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు లేని ఆండ్రియాకి సోదరి విటోరియా అంటే అసహ్యం. తండ్రి మాటలనిబట్టి అత్తయ్య విటోరియా ద్వేషం, కుత్సితత్వం రూపుదాల్చిన అనాకారిగా జొవానాకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు తన చదువు గురించి ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి ‘‘జొవానా రోజురోజుకీ విటోరియాలా తయారౌతోంది,’’ అనటం వినిపిస్తుంది. అప్పుడప్పుడే మొదలయిన నెలసరీ, మారుతున్న శరీరాకృతీ, శారీరకమైన అపరిశుభ్ర భావనల మధ్య జరుగుతున్న మార్పులను పూర్తిగా స్వీకరించలేని సున్నితమైన మనఃస్థితిలో ఉన్న ఆమెకు తండ్రి మాటలు శరాఘాతాలై, తనరూపం గురించి మరిన్ని అనుమానాలు రేకెత్తించి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఎప్పుడూ అద్దంలో చూసుకుంటూ, లోపాలను వెతుక్కుంటూ, వాటిని సరిదిద్దుకునే తాపత్రయంలో పడిపోతుంది జొవానా. ఆమెలో న్యూనతతోబాటు ఎదురుతిరిగే ధోరణి మొదలవుతుంది. ఆదర్శవంతంగా ఆమెను తీర్చిదిద్దాలనుకున్న తల్లిదండ్రులకు జొవానా అర్థంకాని ప్రశ్నలా మారుతుంది. అత్తయ్య విటోరియాని కలిసిన జొవానాకి ఆమె జీవనవిధానం, మాటల్లో అనియంత్రితమైన స్వేచ్ఛ, సూటిదనం కొత్తగా అనిపిస్తాయిగానీ ఆకట్టుకుంటాయి.
తల్లిదండ్రులపట్ల అత్తయ్యకున్న ద్వేషం అర్థమయినా ఆమె ప్రేమభావన జొవానాని కట్టిపడేస్తుంది. అప్పుడే ఉల్కాపాతంలా తన తండ్రికీ మేరియానో భార్య jlకీ మధ్య గత పదిహేనేళ్లుగా సంబంధం ఉందన్న నిజం జొవానాకి తెలుస్తుంది. తల్లిదండ్రుల మధ్య గొడవల అనంతరం తండ్రి తమను వదిలి కా¯Œ స్టా¯Œ ్స ఇంటికి వెళ్లిపోవటంతో జొవానా ప్రపంచం తలకిందులవుతుంది. పసితనాన్ని అంతమొందిస్తున్నట్టుగా కఠిన వాస్తవమేదో ఆమెను కమ్మేస్తుంది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి తనని పట్టించుకోని తల్లి, అప్పుడప్పుడు కలవడానికి వచ్చి తనకర్థంకాని కూతురితో మాట్లాడటానికేమీ తోచక మౌనంగా ఉండిపోయే తండ్రి– జొవానాలో ఒంటరితనాన్ని పెంచుతారు. ప్రేమరాహిత్యపు పరిణామంగా అసహనం, అందరినీ దూరంగా పెట్టడం, విచిత్రమైన వేషధారణ – ‘నేనింతే, నేనిదే,’ అని ప్రపంచానికి చాటిచెప్పే నిర్లక్ష్యపు ప్రకటన కనిపిస్తుంది ఆమెలో. సంస్కారయుతమైన విజ్ఞతనీ, ఆలోచనావగాహనల్లో స్పష్టతనీ పెంపొందించుకునే ప్రయత్నంలో జొవానాకి ‘ప్రేమంటే ద్వేషాన్ని మర్చిపోవటమే’ అని పోనుపోనూ అర్థమవుతుంది. సంఘర్షణలకతీతంగా అందరినుంచీ నేర్చుకుంటూ, స్వేచ్ఛని పునర్నిర్వచించుకుంటూ, తల్లిదండ్రులతో బంధాన్ని పునర్నిర్మించుకుంటూ అడుగులు వేస్తుంది. జరిగిపోయిన వాటిల్లో తప్పొప్పులని ఎంచడం గతజలసేతుబంధనం అన్నది ఆమె అంతస్సంఘర్షణ వెలువరించిన ఆవిష్కరణ.
తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలూ, మనస్పర్థలతో విడిపోవటాలూ పిల్లలని సంక్షోభానికి గురిచేస్తాయి. ఆత్మ, పరవంచనలకి పాల్పడే సగటు మనుషులు ఎదుగుతున్న వ్యక్తిత్వాలకి అవరోధాలుగా పరిణమిస్తారు. నవలలో చెప్పినట్టు, ‘‘ఒకోసారి మనుషులు ఇతరులకు కష్టాన్ని కలిగిస్తారు కానీ, వారి అభిమతం మాత్రం అదికాదు.’’ జొవానాలాగా ఈ విషయాన్ని గ్రహించగలిగితే, జీవితంలో చాలా సమస్యలని దూరం పెట్టవచ్చు.
పద్మప్రియ
Comments
Please login to add a commentAdd a comment