
చేగువేరా ఒక సైకిల్ ఫాక్టరీ చూడటానికి వెళ్లాడట. ఫాక్టరీ అంతా చూపించిన ఫోర్‌మన్, చే గువేరా వెళ్లిపోబోయే సమయానికి ఒక సైకిల్‌ని బహుమతిగా ఇవ్వబోయాడట. ‘‘ఇదంతా ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. నీ సొంతం కాదు కాబట్టి అలా ఇవ్వడం సబబు కాదు,’’ అని బహుమతిని అతను నిరాకరించాడట.
క్యూబాలోని హవానాలో నివసించే ఓ కుటుంబపెద్ద ఈ కథని అందరికీ చెబుతుంటాడు. క్యూబా విప్లవస్ఫూర్తి మీద వీరాభిమానమూ, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అత్యంత విధేయతా ఉన్న ఆ యజమానితో బాటు భార్య, కూతురు, కొడుకు ఉండే చిన్నకుటుంబం అది. టీచర్‌గా పనిచేసిన భార్య ప్రస్తుతం మూర్ఛవ్యాధితో బాధ పడుతుండగా, అసహనంగా ఉండే కొడుకు తప్పనిసరైన మిలిటరీ ట్రైనింగ్‌కి వెళ్తాడు. తండ్రి పనిచేస్తున్న హోటల్‌లోనే పనిచేసే కూతురు, తండ్రికి తెలియకుండా హోటల్‌నుంచి అవీయివీ కాజేస్తూ కుటుంబ నిర్వహణలో తనవంతు పాత్ర నిర్వహిస్తూంటుంది. ఈ కుటుంబం పడే కడగండ్లని వివరించే నవల కార్లోస్ మాన్యుయెల్ అల్వారెజ్ రాసిన ‘ది ఫాలెన్’.
నవలా సారాంశం చాలా సెంటిమెంటల్‌గా కనిపించే ఈ నవల వెనక క్యూబా చరిత్ర నేపథ్యం ఉంది.1952 నాటికి కొనసాగుతున్న బటీస్టా సైనిక పాలనకి వ్యతిరేకంగా చేసిన న్యాయపోరాటం విఫలమయ్యాక, ఫిడెల్ కాస్ట్రో సాయుధ పోరాటానికి దిగాడు. ఐదున్నర సంవత్సరాలపాటు సాగిన క్యూబా విప్లవం విజయవంతమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అమెరికాతో పొసగని సంబంధాల వల్ల సాటి కమ్యూనిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్‌కి దగ్గరై, యుద్ధాలకి సహకరించడం వలనా, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వలనా సగటు జీవన ప్రమాణాలను పెంచడంలో విఫలమైంది. ఈ విషయాన్ని కాస్ట్రో స్వయంగా 1970లో ఒప్పుకున్నాడు కూడా.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత, వారు సంవత్సరానికి అందిస్తున్న 4–6 బిలియన్ డాలర్ల సహాయం ఆగిపోగానే క్యూబా ఆర్థిక పరిస్థితి 1991 నుంచి పూర్తిగా దిగజారడం ప్రారంభమైంది. ఆహారం, ఇంధనం విషయాలలో ఆ దేశ ప్రజలు పడ్డ కష్టాలు దాదాపు ఆ శతాబ్దం ఆఖరివరకూ కొనసాగాయి. స్పెషల్ పీరియడ్ అని వ్యవహరించే 1991–2000 దశాబ్దంలో సుమారు 1996 ప్రాంతం ఈ నవలాకాలం. విప్లవానంతర కాలంలో ప్రజలకి గొంతులేకపోవడం, అసంఖ్యాకమైన ఉరితీతలపట్ల కూడా చాలా కథనాలు ఉన్నాయి. ప్రజావాణిని అణిచేసి, గొంతు విప్పినవారిని రాజకీయ ఖైదీలను చేయడంలో క్యూబా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని ఈమధ్యనే న్యూయార్క్ టైమ్స్ పత్రికలో (జనవరి 13) ఎడెల్ గోంజాలెజ్ అనే మాజీ క్యూబా జడ్జి చెప్పిన వివరాల ప్రకారం పరిస్థితులు ఇప్పటికీ ఆశావహంగా లేవన్నది సుస్పష్టం.
నేపథ్యం తెలిసాక చదివితే నవల అర్థమయ్యే తీరు వేరే తలంలో ఉంటుంది. పాతదే పూజ్యం, కొత్తదైతే త్యాజ్యం అన్న తరహాలో సాగే దేశ విధానాన్ని తండ్రి పాత్ర ప్రదర్శించడమే కాకుండా, దారిద్య్రాన్ని అనుభవిస్తూ కూడా దాని గురించి అతను మాట్లాడకపోవడం గమనార్హం. కష్టకాలాల్లో పిల్లలకి సరైన తిండికూడా పెట్టలేక నిస్సహాయురాలైన తల్లి చివరికి అపస్మారకాలలోకి కూరుకునిపోతుండగా, రాబోయే తరాలని రచించవలసిన పిల్లల పాత్రలు మాత్రం వైరుధ్యాలతో నిండివుంటాయి. విసుగు, అసహనాలతో కొడుకు లక్ష్యరహితంగా సాగటం సామాజిక పర్యవసానాల ఒకకోణం కాగా, తను పనిచేస్తున్న చోట చిల్లర దొంగతనాలు చేస్తూ ఏదోరకంగా బతకడమే ముఖ్యమనుకున్న కూతురు పాత్ర ఈ సామాజిక సంక్షోభానికి మరో పార్శ్వం. విప్లవం ముగిసిన ఐదారు దశాబ్దాల తర్వాత కూడా కొత్తతరాలకి వారసత్వంగా దక్కింది కేవలం సంప్రదాయపు శిథిలాలే.
క్యూబాలో నెలకొన్న ఆందోళనకర స్థితిని నాలుగు పాత్రల అంతరంగాలుగా – పరోక్షంగానైనా సరే –రాసిన రచయిత వచన ప్రతిభ ఫ్రాంక్ విన్ చేసిన అనువాదం ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రజాజీవితాన్ని ఇలాంటి వెలుగులో ప్రతీకాత్మకంగా చూపించడం, ముగింపులో కోళ్లఫారం పోలిక తీసుకురావడం చూస్తే, అక్కడి వాస్తవాలని బహిర్గతపరచి బాహ్య ప్రపంచాన్ని హెచ్చరించడం రచయిత తనవంతు సామాజిక బాధ్యతగా తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది.
ఎ.వి.రమణమూర్తి
నవల: ది ఫాలెన్
స్పానిష్ మూలం: కార్లోస్ మాన్యుయెల్ అల్వారెజ్
ఇంగ్లిష్ అనువాదం: ఫ్రాంక్ విన్
ప్రచురణ: గ్రేవూల్ఫ్; 2020
Comments
Please login to add a commentAdd a comment