మన నవలలు: మూడు పర్వాల మహాభారతం గోపాత్రుడు...
కలికాలం మంచి జోరు మీద ఉందనడానికి కూడా శకునాలుంటాయ్. కుక్కలకు మాటలు రావడం ఒకటి. వీరబొబ్బిలి ఏ క్లాస్ కుక్క. చెయ్యెత్తు ఉంటుంది. మనిషెత్తు ఉంటుంది. ఏనుగెత్తు కూడా. తాండ్ర పాపయ్య వంశ వారసుల ఇంట పుట్టి పెరిగింది. వేట తెలుసు. కాని చేయదు. కాపలా తెలుసు. కాని చేయదు. మరేం తెలుసు? తినడం తెలుసు. పోలుగు పిట్టల మాంసంకూర తేలిగ్గా మసాలా వేసి వొండి పెడితే చట్టీలకు చట్టీలు మింగడం తెలుసు. తర్వాత? తొంగోవడమే. ఇది గాకుండా ఇంకోటి కూడా ఉంది. నేనింత నేనంత నాకు ఫలానా వారంటే ఖాతరీ లేదు ఫలానా వారికి నా పేరు చెప్తే యూరినరీ ఇన్ఫెక్షన్. గొప్పలు చెప్పుకోవడం.
వీరబొబ్బిలేనా ఇలా? మొత్తం లోకమే అలా ఉంది. బంగారంలాంటి భూమి. బంగారంలాంటి దేశం. మన్ది. అలెగ్జాండర్ వచ్చాడు. పట్టుకుపోయాడు. నాదిర్ షా వచ్చాడు. పట్టుకుపోయాడు. ఇంకెవడో వచ్చాడు. పట్టుకుపోయాడు. ఇంగ్లిషోడొచ్చాడు. నాల్రోజులు ఉండి పోతానురా దద్దా అని రెండు వందల ఏళ్లు ఉండి తీరిగ్గా తోచిందల్లా పట్టుకుపోయాడు. దేశాన్ని వాడికి అప్పజెప్పి తినడం తొంగోవడం. పోనీ వాడు పోయాకైనా పంచెలు సర్దుకొని, తువ్వాళ్లు బిగించి ఏదైనా పనికొచ్చే పని చేస్తారా? నా చంగతేంటి... నీ చంగతేంటి... విప్పుడు ఫలానా పని చేస్తే నీకేటి ప్రయోజనం.. నాకేటి నాభం... మింగడమే పని. స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్లు నిండినా ఏం మార్లేదు. దరిద్రులు అలాగే ఉన్నారు. పాల కోసం ఏడ్చే పిల్లలు అలాగే ఉన్నారు. కొత్తకోక కొనిస్తాను రాయే అంటే పోయే ఆడకూతుళ్లు అలాగే ఉన్నారు. రోగాలు అలాగే ఉన్నాయి. అజ్ఞానం అలాగే ఉంది. మూఢ విశ్వసాలు అలాగే ఉన్నాయి. కడుపుకింత తిని, బుద్ధికింత చదివి, నలుగురికింత మంచి చేసి, జాతి నిర్మాణంలో తలా ఒక చేయి వేద్దామని ఒక్క చవట సన్నాసీ అనుకోవడం లేదు. అంతా వీరబొబ్బిలి టైపు. తినడానికి రెడీ. తిరగడానికి షంషేర్.
అయితే లోకం విలాగుందనీ... వీ రీతిన వీ రీతిన పాడుబడిందనీ... ఖాయిలా పడిందని... స్వార్థం, అల్పత్వం, ఎదుటివాడు ఎలా పోయినా పర్వాలేదనే సంకుచితత్వం వంటి అన్ని జబ్బులూ సోకి, మరి చావు వైపు దూసుకుపోతున్నప్పుడే అది ఈ రీతిగా వర్తిస్తుందని ముందుగా వైద్యులకే తెలుస్తుంది. ఆలమండ పెదపాత్రుడు అలాంటి వైద్యుడే. జ్ఞాని. బతికినంత కాలం లోకం నాడీ పట్టుకొని చూసి, ఈ నీచత్వాన్ని, ఈ దిగజారుడుతనాన్ని, కూసిని రూకల కోసం సాగే కుట్రలని, కాసిని మెతుకుల కోసం జరిగే ఖూనీలని గమనించి గమనించి, చావు మంచం మీద జేరి, మరి కాసేపట్లో పోతాడనగా కొడుకు గోపాత్రుణ్ణి పిలిచి- ఒరే బాబూ... ఈ లోకం దగుల్బాజీది... దుమ్ములగొండి ముఖంది... లోన ప్రేవులు కడుక్కోకుండా పైన సెంటు బట్టలు కట్టుకొని తిరిగే కంపు కళేబరంది... భూమి గుండ్రంగా లేకపోవడం వల్లే ఇదిలాగ తయారైంది. భూమే గనక గుండ్రంగా ఉంటే ఇటు నుంచి పోయిన వెలుతురు మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పడాలి. ఇటు నుంచి పోయిన వానలు మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కురవాలి. ఇటు నుంచి పోయిన ఎండ మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి మన ముండ బతుకుల మీద కాయాలి. మరలాగ జరగడం లేదంటే, ఎప్పటికీ మనం చీకట్లో ఉంటున్నామంటే, ఎప్పటికీ కరువులో ఉంటున్నామంటే, ఎప్పటికీ సంతోషం, ఆనందం, వికాసం ఎరగక నాచు పట్టిపోయామంటే భూమి బల్లపరుపుగా ఉన్నట్టు లెక్క. భూమి బల్లపరుపుగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది.
ఈ ముక్క మనసులో ఎట్టుకో అనేసి పోయాడు. గోపాత్రుడు మేధావి. తండ్రి మాటలు నమ్మాడు. వాటిని తన విశ్వాసంగా మార్చుకున్నాడు. అయితే ఇలాంటి విశ్వాసాలు, వాస్తవాలు, సత్యాలు అన్నీ తలుపు చాటున ఉంటేనే లోకానికి బెటర్. అప్పుడే అది సజావుగా ఏమీ ఎరగనట్టుగా తన మానాన తాను ముందుకు పోతుంటుంది. కాని గోపాత్రుడు ఉన్నట్టుండి ఉత్పాతం సృష్టించాడు. ఆలమండ పెదరామ కోవెల అరుగు మీద తీరుబాటుగా కూచుని భూమి గుండ్రంగా లేదనీ బల్లపరుపుగా ఉందనీ బాంబు పేల్చాడు. ఆ మాట రేపిన తుపాను అంతా ఇంతా కాదు.
మొదట రాజులు ఏకమయ్యారు. గోపాత్రుడు ఎవడు? తమ మనిషి. కనుక భూమి ఎలాగుంటే మనకేంటి? గోపాత్రుడి విశ్వాసమే మన విశ్వాసం. కనుక భూమి బల్లపరుపుగా ఉందనీ అందుకు కాదన్నవాళ్లని టుపాకులెట్టి కాల్చేస్తామనీ హెచ్చరించారు. అయితే రాస నంజికొడుకులంటే రైతులకి- అంటే ఎలమలకి- పడదు గనక కొప్పల ఎలమలందరూ జట్టీ గట్టి రాజుల మాట చెల్లుబాటు కావడానికి వీల్లేదనీ భూమి బల్లపరుపుగా ఎంతమాత్రం లేదనీ అది పెరట్లోని గుమ్మడికాయలాగా గుండ్రంగా ఉందనీ ఇది తమ విశ్వాసమనీ కాదంటే ఖబడ్దారనీ రోషానికొచ్చారు.
చాకలి, మంగలి, మాలలు శబాసో అని ఎలమల పక్షాన చేరారు. కాని- ఎలమలకు తాము శాశ్వితంగా అపోజిషను కనుక ఓటు కాడ గాని మాటకాడ గాని ఎలమల చెమ్డా లెక్కదీయడమే తమ పని కనక తెలగలందరూ కలిసి మీటింగెట్టుకుని ఎందుచేతనో తామందరికీ భూమి బల్లపరుపుగా ఉన్నట్టుగానే తోస్తోందని అభిప్రాయపడ్డారు. ఎలమలందరూ కులానికి ఒకటే అయినా ఎలమలకు దక్కవలసిన లబ్ధి అంతా ఎలమల పేరు జెప్పి ఒక్క లగుడు ముత్యాల నాయుడే తింటున్నాడు కనుక అదే కులానికి చెందిన రొంగలి కూటమానానికి పెద్ద అయిన రొంగలి బుజ్జి తనను సమితి పెసిడెంటును చేసే షరతు మీద రాజులతో కలిసి భూమి రాజులు ఆశిస్తున్నట్టు మసాలబండలాగా నలుచదరంగా ఉందని నమ్మడానికి రెడీ అయిపోయాడు. ఊరంతా ఇదే కలి. కమ్మరులొకవైపు.
కుమ్మరులొకవైపు. రంగరాజు మాస్టారు వంటి తటస్థులు పొద్దునొకవైపు రాత్రొకవైపు. పెంకితనాల కోసం, పట్టుదలల కోసం, కులాల ముఠాల ప్రాంతాల పట్టింపులు వంటి ఉన్నత లక్ష్యాల కోసం మనుషులు ఎంత దూరమైనా వెళతారు. ఇక్కడా వెళ్లారు. కురుక్షేత్రం జరిగింది. తలలు పగిలాయి. భుజాలు విరిగాయి. తమ పక్షంలో ఉన్నా సరే అప్పులిచ్చి తిరిగి డబ్బులడిగిన ప్రతి గాడ్ది కొడుకును ఎంచి ఎంచి కొట్టారు. పోలీసులొచ్చారు. కేసు రాష్ట్రమంతా గగ్గోలు రేపి కోర్టులకూ కచ్చేరీలకూ ఎక్కింది. కాని చివరాఖరికి ఏం తేలింది? ఈ భూమి రాజులు కోరినట్టుగా బల్లపరుపుగా గాని, ఎలమలు కోరినట్టుగా గుండ్రంగా గాని లేదని, అది ఈ దేశంలోని కుబేరులకు తోచిన ఆకారంలో ఉందని, వారి ప్రయోజనాల కోసం ఏర్పడ్డ ప్రభుత్వాలు కోరిన ఆకారంలో ఉందని, ఆ ప్రభుత్వాల అధికారానికి బాహ్యరూపమైన పోలీసుల చేతిలోని లాఠీకర్రలా ఉందని తేలింది. వ్యవస్థ ఇలా ఉన్నంత కాలమూ మనుషులు తిట్టుకుంటూ తిమ్ముకుంటూ ఈసురోమంటూ గుడ్డి దీపాల కాంతిని సూర్యోదయాలుగా భావిస్తూ నశిస్తూ నాశనమవుతూ ఇలా ఉండ వలసిందే. నవల ముగుస్తుంది.
నవల: వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు (ట్రయాలజీ)
రచయిత: కె.ఎన్.వై. పతంజలి
వివరాలు: ‘భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపుగా ఉందా?’ అనే అల్పమైన మిషతో కూడా మనుషులు ఒక కురుక్షేత్రాన్ని ఎలా సృష్టిస్తారో ఆ కురుక్షేత్రానికి చోదకశక్తులుగా ఏవి పని చేస్తాయో సూక్ష్మంగా అయినా విరాట్ రూపంలో చూపిన నవల. కళింగాంధ్ర భాషలోని సజీవత్వాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పాత్రల నిజరూపాలతో అద్భుతంగా చూపుతుంది. మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘పతంజలి రచనలు’లో ఈ నవల లభ్యం.1984 నుంచి ’95 మధ్యలో మూడు భాగాలుగా- వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు- పేర్లతో పతంజలి చేసిన ఉత్కృష్టమైన ప్రపంచస్థాయి వ్యంగ్య రచన ఇది. గొప్ప రచన. స్వార్థ ప్రయోజనాలే మనిషిని ఎప్పుడూ నడుపుతాయి. మహాభారతంలో కురుక్షేత్రం అందుకే సంభవించింది. ఆలమండ బయలులో కురుక్షేత్రమూ అందుకే సంభవించింది. వర్తమానంలో ఈ నవలాంశంతో సరిగ్గా పోల్చదగ్గ తెలంగాణ - సీమాంధ్ర కురుక్షేత్రమూ అందుకే సంభవిస్తోంది. భూమి ఎలా ఉందో ఎవడికి కావాలి. ప్రజలు ఏమవుతారో ఎవడికి కావాలి. నీకేటి ప్రయోజనం... నాకేటి నాభం... అంతే. మానవజాతి ఇవన్నీ దాటి ఒక అడుగు ముందుకేసేంత వరకూ భారతం ఉంటుంది. ‘గోపాత్రుడు’ ఉంటుంది. పతంజలీ ఉంటారు.