తెలుగునేల పరిణామాలు చెప్పే నవల- ఒండ్రుమట్టి
ఒండ్రుమట్టి- నల్లూరి రుక్మిణి
వెల: రూ.170
ప్రతులకు: 99891 33401
తాజా నవల: ‘ఒకప్పుడు ఊరుకు, ఇప్పుడు ఊరుకు తేడా ఉందిరా. అప్పుడు భూములున్నయ్యిగాని డబ్బు లేదు. అందరూ ఆ జొన్నలే ఆ సంగటే... కాకపోతే వాళ్లు కడుపు నిండా రెండు పూటలు తిన్నారు. మేం ఒక పూట తిన్నాం. అప్పుడందరూ ముతగ్గుడ్డలే. ఇప్పుడు ఊరు అట్టా ఉందా? వాళ్లు వరన్నమేనా? అందులోకి ఎన్ని రకాలు వచ్చినయ్. వాళ్లిప్పుడు సన్న పంచెలు కడుతున్నారు. మేం జానెడు గుడ్డల్లోకి వచ్చాం. వాళ్ల ఆడోళ్లయితే రకానికొక కోకలు కడుతున్నారు. మన ఆడోళ్లు ఆ చాలీచాలని ముతగ్గుడ్డలే’...
ఇది ఈ నవలలో ఒక తాత తన మనవడికి చెప్పిన మాట.
నల్లూరి రుక్మిణి రాసిన ఒండ్రుమట్టి నవలంతా స్థూలంగా ఈ విషయాన్నే చర్చిస్తుంది. మన దేశంలో అభివృద్ధి జరిగింది. కాని అది ఎలాంటి అభివృద్ధి? పైవారిని పైకి తీసుకెళ్లే అభివృద్ధి. కిందవారిని కిందనే ఉంచే అభివృద్ధి. నిజానికి అభివృద్ధి అనేది కాలం చెల్లిన సంప్రదాయాలని, దురభిప్రాయాలని, కుల దురహంకారాన్ని తొలగిస్తూ రావాలి. కాని అది వాటిని బలోపేతం చేసింది. సమాజం ముందుకు పోతోంది అనుకున్నాం కాని అది మరింత వెనుకబాటురూపం తీసుకుంది. అందుకు ఉదాహరణే కారంచేడు ఘటన. పైవర్గం వారు కింద వర్గం వారిని ఊచకోత కోయడానికి ఈ అభివృద్ధి ఎలా ఒక ఆయుధంలా పని చేసింది. అసలు ఈ అభివృద్ధికి మూలం ఏమిటి? ఈ ప్రశ్నను అన్వేషించుకుంటూ ప్రకాశం జిల్లాలోని కృష్ణపురం అనే ఊరిని (కారంచేడుకు ప్రతీక) మోడల్‌గా తీసుకొని నల్లూరి రుక్మిణి సాగించిన నవల ఒండ్రుమట్టి.
ఈ నవలను చదువుతుంటే ఈతరం వారికి సరే పాతతరం వారికి కూడా ఆ రోజులు ఎలా గడిచాయో సరిగ్గా తెలుసా అనిపిస్తుంది. ఆడవాళ్లు ముతక కోకను నేయించుకోవడానికి రాట్నం పెట్టి ఏకులు వడుక్కోవడం... మెట్టప్రాంతల్లో జొన్నలు, రాగులు పండించి ఆ జొన్నలతో సంగటి చేయడానికి పొయ్యి రాజెయ్యడానికి కష్టాలు పడటం... ఆముదం కాచే పనులు... ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఊరిలోని వారందరి భాగస్వామ్యం ఉండే ఊరుమ్మడి బ్రతుకులు... ఇవన్నీ కనపడతాయి. చరిత్ర అంటే ఎప్పటివో రాజుల కథలే కాదు. మూడు నాలుగు తరాల క్రితం మన పెద్దల కథ కూడా చరిత్రే.
కథ విషయానికి వస్తే కృష్ణాపురమనే తీరగ్రామం. అన్నీ మెట్టపంటలే. జమిందారుల ప్రాభవాలు సన్నగిల్లుతున్న సమయం. కోటయ్య, గంగమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. తిరుపతయ్య, పరమయ్య, వెంకయ్యలు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కుటుంబం జరుగుబాటు కష్టమై ముందుగా పరమయ్య, వెనకాల తిరుపతయ్యలు తెలంగాణ పల్లె రాకూరుకు వెళ్లి అక్కడి అటవీ భూములను సాగులోకి తెచ్చుకుంటారు. ఇక ఇక్కడ వెంకయ్య కాలంలో సాగునీటి వనరులు అందుబాటులోకి రావడం పొగాకు సాగు కొత్తగా రావడం లాంటివి జరుగుతాయి.
ఇక్కడ ఇలాంటి కుటుంబాల అభివృద్ధి కింద వర్గాల వారిని ఇంకా కిందకు నెట్టేసింది. ఇక్కడి వాళ్లు తెలంగాణకు వచ్చి సాధించిన అభివృద్ధి అక్కడి వారిని వెనక్కు నెట్టేసింది. ఈ రెంటి మధ్య ఉన్న ఘర్షణ... మానవ సంబంధాల విచ్ఛిన్నం... మొత్తం తెలుగునేలపైని 65 సంవత్సరాల కాలప్రవాహంలోని మార్పులను ఈ నవల పట్టి ఇస్తుంది.
నవల తొలిభాగం ‘క్విట్ ఇండియా’ ఉద్యమం వరకు, మలిభాగం కారంచేడు ఘటనల వరకు సాగుతుంది. తొలిభాగంలో అనేక ఉద్యమాల ప్రభావాల వల్ల సమాజంలో జరుగుతున్న పరిణామాలను పాత్రల ద్వారా చక్కగా వివరించిన రచయిత్రి మలిభాగంలో ఉద్యమాలను కేవలం ఉపన్యాస ధోరణికి పరిమితం చేశారనిపిస్తుంది.
బహుశా నవల నిడివి ఎక్కువవుతుందనుకున్నారేమో. కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన నెహ్రూ ప్రజల దృష్టిని మళ్లించడానికి చైనాతో యుద్ధానికి దిగాడనే అర్థంలో రాశారు. కమ్యూనిస్టుల చైనా భక్తి, కూలిపోయిన సోవియెట్ యూనియన్ భక్తి వర్థిల్లుగాక. ఈ కమ్యూనిజం భక్తి ఎలా ఉందంటే తిరుపతయ్య అల్లుడు శంకరం పొగాకు కమిషన్ వ్యాపారం చేయవచ్చుగానీ వెంకయ్య కొడుకు భాస్కరం చేస్తే మాత్రం సంపాదన యావ అనేస్తారు.
చిన్న చిన్న లోపాలు, పఠనీయతలో కొంత నెమ్మది ఉండొచ్చుగాని ఈ కృషి మాత్రం గట్టిది. ఇంత విస్తృతి ఉన్న ఈ నవల రాయడం చాలా కష్టం. రచయిత్రి ఎక్కడా నిస్పృహ చెందక దీక్షగా దీనిని ముగించగలగడం విశేషం.
సుమారు 65 ఏళ్ల గ్రామీణ జీవితాన్ని దశల వారీగా ప్రజల జీవన శైలిలోని మార్పులను పట్టి చూపుతూ చిత్రించారు. ఈ తీరగ్రామంలోని మార్పులే కొన్ని ఏళ్లు ముందూ వెనకలుగా మిగిలిన ప్రాంతాల్లోనూ జరిగాయి. మెట్లపైర్లు పండించే ప్రజల జీవనం నీటిపారకం వల్ల, ఆధునిక యంత్రాలు, రవాణ వ్యవస్థ, విద్య వల్ల ఎలా మారాయో తెలుసుకోవాలనుకునేవారికి, దశాబ్దాల సమాజ పరిణామాలను అధ్యయనం చేయాలనుకునేవారికి ఈ నవల ఒక మంచి డాక్యుమెంట్.
- గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి