హృదయం: రెండు రాష్ట్రాల ప్రేమ
టు స్టేట్స్... నవలగానే కాదు, సినిమాగా కూడా పెద్ద హిట్. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడి, వారి ప్రయాణం పెళ్లిదాకా సాగితే ఎలా ఉంటుందో చదివాం. చూశాం. ఆనందించాం! కానీ ఈ కథ చదువుతూ, చూస్తూ తమను తాము అద్దంలో చూసుకున్నవారి అనుభూతే వేరు. అలాంటి మూడు ప్రేమకథలు మీకోసం.డాక్టర్ ఆర్.కె.పూరి, డాక్టర్ విజయపూరిల ప్రేమకథ గురించి తెలుసుకోవాలంటే 30 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. పూరిది పంజాబ్‌లోని గుర్గావ్. విజయది తమిళనాడులోని చిదంబరం. పీహెచ్‌డీ పనిలో భాగంగా పూణె యూనివర్సిటీలో 1977లో కలిశారు వీళ్లిద్దరూ. ఐదేళ్ల సహచర్యంలో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది పెళ్లికి దారి తీసింది. ఐతే, వారి పెళ్లి అంత సులభంగా ఏమీ అయిపోలేదు. విజయ తల్లిదండ్రులు 1975కి ముందే చనిపోయారు.
మిగిలిన బంధువులెవరూ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పట్లో నార్త్ ఇండియాలో కొత్త పెళ్లికూతుళ్లు వరుసగా అగ్నికి ఆహుతవుతున్న ఘటనలు పత్రికల్లో వస్తుండటంతో తమ అమ్మాయిని అంత దూరం పంపడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రులుంటే వాళ్లిద్దరినీ ఒప్పిస్తే సరిపోయేది కానీ, వాళ్లు లేకపోవడంతో బంధువులందరినీ ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో పూరి కూడా తన తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. చివరికి అంతా ఒప్పుకున్నాక, వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ తాము కలిసిన మహారాష్ట్రలోనే సెటిలయ్యారు. పెళ్లయి 30 ఏళ్లవుతున్నా... విజయ పంజాబీ నేర్చుకోలేదు. పూరి తమిళం వంటబట్టించుకోలేదు. ఇద్దరూ హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారు. మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడూ మరాఠిలోనూ కూడా. పూరి ప్రొఫెసర్‌గా రిటైరైపోగా, విజయ ఇంకా ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఓ కూతురు. ఆమెను తమిళునికో, పంజాబీకో కాకుండా మహారాష్ట్రవాసికిచ్చి పెళ్లి చేశారు. వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు మధ్య పెరిగిన వీరిద్దరూ ఇన్నేళ్లు ఎలా కలిసి జీవనం సాగించారు అంటే... మాది ప్రేమ భాష, మేం భారతీయులం అంటారు విజయ, పూరి.
కిరణ్ పర్మార్, ప్రతిభ... ఈ పేర్లు చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్లిద్దరికీ ఎక్కడా కలవదని. కిరణ్‌ది గుజరాత్ అయితే, ప్రతిభది తమిళనాడు. వీళ్లిద్దరూ 2009లో ముంబైలో ఎంబీఏ చేస్తూ కలిశారు. ముందు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరి మధ్య తర్వాత ఏదో తెలియని బంధం మొదలైంది. అది ప్రేమేనని గుర్తించి ముందుగా కిరణ్, పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ప్రతిభకు కూడా కిరణ్‌పై మంచి అభిప్రాయం ఉండటంతో, ‘కాదు’ అని చెప్పలేకపోయింది. కానీ కథ అంతటితో సుఖాంతం అయిపోలేదు. కిరణ్ తల్లిదండ్రులు పెళ్లికి పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు కానీ, ప్రతిభ కుటుంబం నుంచి పెద్ద ఇబ్బంది ఎదురైంది.
ఎంత నచ్చజెప్పినా వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఏడాది పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. 2011 ఆగస్టు 16న కిరణ్ తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. దీంతో ప్రతిభ తల్లిదండ్రుల కోపం నషాళానికి అంటింది. తమ కూతురిని వెలివేశారు. ఆమెతో మాట్లాడలేదు. భర్త ప్రేమ, తల్లిదండ్రులు దూరమైన బాధను మరిపించినా, వాళ్లు ఎప్పటికైనా కలుస్తారన్న ఆశతో జీవనం సాగించింది ప్రతిభ. ఇద్దరికీ పాప పుట్టాక కానీ వారి మనసు కరగలేదు. ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ఈ ఘనత తమ పాప యాషినిదే అంటారు కిరణ్, ప్రతిభ.
సంహిత చౌదరిది త్రిపుర. సాగర్ మల్సానెది మహారాష్ట్ర. వీళ్లిద్దరినీ కలిపింది ఇంగ్లండ్. మాస్టర్స్ చేసేందుకు యూకేలో అడుగుపెట్టిన సంహితకు కొన్నాళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు సాగర్. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని చూసిన తొలిసారే ప్రేమలో పడతారు. ఇక్కడ సీన్ రివర్స్. క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా నల్లటి టీ షర్ట్‌లో ఓ అబ్బాయిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది సంహిత. ఆమె ఫ్రెండ్ ఉన్నట్లుండి సాగర్‌ను తీసుకొచ్చి, పరిచయం చేసేసరికి ఆశ్చర్యపోయింది. ఆ పరిచయం కొన్నాళ్లకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని బంధంగా మారింది. ఓసారి క్రిస్మస్ సమయంలో సాగర్ వారం రోజులు కనిపించకుండా పోయేసరికి తట్టుకోలేకపోయింది సంహిత.
అతను మళ్లీ కనబడగానే నిన్ను విడిచి ఉండలేనని చెప్పేసింది. నాదీ అదే ఫీలింగ్ అంటూ మనసు విప్పేశాడు సాగర్. ఐతే, తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో కొన్నాళ్లు ఎదురుచూడాలని భావించారు. కానీ ఎక్కువ రోజులు ఆగలేకపోయారు. ఒక్కొక్కరికీ విషయం చెప్పి, ఒప్పించే ప్రయత్నం చేశారు. అందరూ సరే అన్నారు. కానీ సాగర్ తండ్రి మాత్రం పెళ్లికి ససేమిరా అన్నాడు. ఐతే, ఓ రోజు సంహిత తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి, తన తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు సాగర్. అప్పటికీ కాదనే అన్న తండ్రి కొన్నాళ్ల తర్వాత మనసు మార్చుకుని పెళ్లికి పచ్చజెండా ఊపాడు. గత ఏడాది డిసెంబర్‌లో వీరి పెళ్లయింది. అంతా కలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.