సాహిత్యానికి బయటి బతుకులు
ఏటి గట్టునా మా ఊరూ
ఎవ్వరు లేరూ మా వారూ
ఏరు దాటి మా ఊరికి వస్తే
వెనక్కిపోలేరు... ఇక వెనక్కి పోలేరు....
ఇది సినిమా పాట. యాభై ఏళ్లు దాటిన ఈ రాజమకుటం అనే సినిమాలో రాజసులోచన ఐటమ్ సాంగ్. ఏలూరులో తమ్మిలేరు ఒడ్డున ఎరుకలు, యానాదులు, దొమ్మర్లు ఉంటారు. ఆడా మగా అందరికీ అసాధారణమైన టాలెంట్స్ ఉంటాయి. గొప్ప విలుకాళ్లు. సాము గరిడీల్లో సూపర్ స్పెషాలిటీలు. డప్పులూ, తీగ వాద్యాలూ గొప్పగా వాయిస్తారు. ఆడవాళ్లు తాడు మీద నడుస్తూ ఎన్నో విన్యాసాలు చేస్తారు. డాన్సులూ అదిరిపోతాయి. వీళ్ల సంస్కృతి చాలా విశిష్టమైనది.
ఈ సంచార జాతుల వాళ్లకి నేరస్థ జాతులుగా బ్రిటిష్‌వాళ్లు ముద్ర వేశారు. మన మిడిల్ క్లాస్ జనం కూడా వీళ్లని స్టూవర్ట్‌పురం గ్యాంగ్‌లలాగే చూస్తాం. ఊరి చివరగా బతికే ఈ బయటి గుడిసెల బతుకు మన సాహిత్య ప్రపంచానికి కూడా బయటనే మిగిలిపోయింది. అరుణ రాసిన ఎల్లి నవల, కేశవ రెడ్డి నవలలు, ఇంకా ఒకటీ అరా కథలు వీళ్లు బతికే తీరు గురించి తెలిపాయి. ఈ మధ్య దేవులపల్లి కృష్ణమూర్తి నవల- బయటి గుడిసెలు ఈ పనిని చాల గొప్పగా చేసింది. నక్రేకల్ దగ్గరున్న వీళ్ల బతుకుని చాల ప్రేమతో చూసి, లోతుగా సుదీర్ఘంగా ఫాలో అయి రాసింది. కృష్ణమూర్తి చాలాకాలం వారిని అబ్జర్వ్ చేసి వారితో కలసిపోయి గమనిస్తే తప్ప ఇలా రాసి ఉండరు. శ్రమతో కూడిన పని ఇది. కాని బాగ చేయగలిగారు.
గోర్కి కథ మనార్ చుద్రను సినిమాగా తీసి చాలా కాలమయింది. ‘జిప్సీ కాంప్ వేనిషెస్ ఇన్ టు బ్లూ’ పేరిట వచ్చిన ఈ ఫిలిం జిప్సీ జీవితాలని గోర్కీ కథ కంటే సుదీర్ఘంగా చూపి, గ్రీక్ ట్రాజెడీలా ముగుస్తుంది. యూరప్‌లోని రోమా జిప్సీలను కూడా అక్కడి వాళ్లు ఇలా నేరస్థ జాతులుగానే చూసి నానా అవస్థలూ పెడుతుంటారు. మంగోలియాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చిన కొంత కాలానికి రాజధాని ఉలాన్ బతోర్‌లో వీళ్ల కోసం భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే రాత్రికి రాత్రే సిటీని ఖాళీ చేసి యుర్త్‌లలో (వాళ్ల చక్రాల బళ్లూ, ఇళ్లూ అవే) దర్జాగా వెళ్లిపోయారట. వీళ్లని సంస్కరించి ఒక దారిలో పెట్టాలనుకోవడం కూడా ఒక విప్లవ వెర్రే అనిపిస్తుంది.
కృష్ణమూర్తిగారి నవల మన సాహిత్యంలో ఉన్న పెద్ద లోటును చిన్నగా భర్తీ చేసింది. మిడిల్ క్లాస్ బతుక్కే పెద్ద పీట వేసే మన సాహిత్యంలో ఇంకా ఇలా ఎన్నో జాతుల, గుంపుల మతుకుల మీద ఇంకా ఎన్నో కథలూ నవలలూ వస్తే ఎవ్వరికో సేవ కాదు మన సాహిత్యానికే బోల్డంత వెరైటీ వస్తుంది.
- మోహన్ (ఆర్టిస్ట్)
బయటి గుడిసెలు- దేవులపల్లి కృష్ణమూర్తి, వెల: రూ.100; ప్రతులకు: 9290094015