అర్థమైందా నాన్నగారూ? | Katha Saram Story In Sakshi Literature | Sakshi
Sakshi News home page

అర్థమైందా నాన్నగారూ?

Published Mon, Mar 25 2019 12:18 AM | Last Updated on Mon, Mar 25 2019 12:18 AM

Katha Saram Story In Sakshi Literature

‘‘చూడండీ.’’

‘‘..........’’

‘‘మిమ్మల్నే’’

‘‘ఊ– రేపు నాకు బడిలేదు... నిద్రపోనీ.’’

‘‘మాట; – రేపు మీరు కార్తీక సోమవారం ఉంటారా?’’

‘‘సోమవారం ఉండటమా? ఎక్కడ?’’

‘‘ఎక్కడేమిటి? – ఇంకా మీకు మెలుకవ రాలేదూ? కార్తీక సోమవారం ఉపవాసం ఉంటారా?’’

‘‘ఉండను.’’

‘‘పోనీయండి, నేను సముద్ర స్నానానికి వెళ్లివస్తాను. కాస్త పిల్లలను చూస్తుండండి.’’

‘‘వద్దు...’’

‘‘పెద్దపిల్లను తీసుకొనే పోతాను. చిన్నవాళ్లను కాస్త చూస్తుండండి.’’

నిద్రమత్తులో ఏమన్నానో జ్ఞాపకం లేదు. ఆమె బండెక్కి వెళ్లటం నేను తలుపు వేసుకొని మళ్లీ వచ్చి పడుకోటం.

కాంతం ఇల్లు దాటిన పావుగంట కల్లా పసిది లేచి తల్లి పక్కలో లేకపోవటం మూలాన కెవ్వున ‘అమ్మా’ అని పిలిచింది. నేను లేవక తప్పింది కాదు. ‘‘అమ్మా లేచావు తల్లీ పడుకో’’ అన్నాను. నా మాటలు దానికి అర్థం అయితే గద! అట్లాగే మేకులాగ కూర్చున్నది నడిమంచం మీద ‘‘అమ్మ, అమ్మ’’ అంటూ.

నాలుగు వైపులా చూచి, అమ్మ రాకపోవటం మూలాన లేచి మేడ దిగటానికి పోతున్నది.

మెట్లు పసిది దిగలేదు. దాని ఉద్దేశాన్ని గ్రహించి క్రిందికి దింపాను. ముందు వంట ఇంట్లోకి వెళ్లింది ‘‘అమ్మా’’ అని ఏడుస్తూ. ఎవ్వరూ కనబడలేదు. తరువాత దొడ్డితలుపు దగ్గర నుంచుని ఏడ్చింది. తలుపు తీశాను. మసక చీకట్లోనే దొడ్డంతా వెతికింది. అమ్మ కనబడలేదు.

అమ్మ ఇంట్లో లేదన్న విషయాన్ని గ్రహించి అది నన్నే నమ్ముకొని నేను చెప్పినట్లు వింటుందని నా నమ్మకం. ఎత్తుకొని మళ్లీ మేడపైకి వచ్చాను. ఏడ్పు ఆపలేదు. అట్లా పెంకితనంగా ఏడ్వటం సమంజసంగా కనపడలేదు. ‘‘తల్లీ మీ అమ్మ సముద్రానికి పోయింది. గంటలో వస్తుంది’’ అని చెప్పాను.

దాని కాసంగతి బోధపడలేదనా? ‘‘అమ్మ– ఓ పోయి’’ అన్నది.

‘‘ఆ. అదీ. నీవు ఏడ్వవద్దు. బిస్కట్లు పెడతాను’’ అన్నాను.

ఇక ఊరుకోవలసిందేనా, న్యాయంగా? ఊరుకోదే! పైగా ఎత్తుకున్నా నిలవక పోవడం, భుజం మీద పడుకోబెట్టుకొని చిచ్చిగొట్టినా జారిపోవటానికి ప్రయత్నం చేయటం.

‘‘ఎట్లాగే నీతో, అమ్మాయీ, కోపం వస్తోంది’’ అని చెయ్యి ఎత్తి చూపి భయపెట్టాను. ఇంకా ఎక్కువైంది ఏడ్పు.

ఇంతలో ‘‘అమ్మా’’ అంటూ లేచాడు చిన్నవాడు. వీడు దానికంటె పెద్దవాడు. నాలుగో ఏడు. మాటలు అర్థం అవుతాయి.

‘‘నాయనా పడుకో’’ అన్నాను.

‘‘అమ్మేది’’ అన్నాడు.

‘‘అమ్మ ఇంకాసేపుట్లో వస్తుంది. తెల్లవారలేదు. నిద్రపో’’

‘‘నేను పడుకోను’’

‘‘పోనీ ఆడుకో... ఆ పుస్తకంలో బొమ్మలు చూచుకో.’’

‘‘వద్దు’’

‘‘మరి ఏం జేస్తావు?’’

‘‘అమ్మ పోతా.’’

‘‘ఓరి వెధవా– అమ్మ సముద్రానికి వెళ్లింది. నాలుగు మైళ్లుంది. నీవు నడవలేవు. ఇంకాసేపటికల్లా వస్తుంది’’ అన్నాను.

‘‘రాదు’’ అన్నాడు నిస్సందేహంగా. అన్నవాడు ఊరుకోక మేడ మెట్లు దిగి ప్రయాణం గట్టాడు. సముద్రానికి నాలుగేండ్ల వెధవ వెళ్లటం ఏమిటి? వీళ్లకు తెలివి ఎందుకుండదో.

గబగబ మెట్లు దిగి పోతున్నాడు. ఏమిటి వీడి సాహసం!

‘‘ఒరేయ్‌’’ అంటూ వాడ్ని రెక్కుచ్చుకున్నాను. ‘‘నాయనా, ఒరే... ఏడ్వకూ’’

వాడు మళ్ల ‘అమ్మా’ అన్నాడు.

‘‘వస్తుందిరా నాయనా, తెల్లవారేప్పటికి వస్తుంది.’’

‘రాదు’ అని ఒకటే ఏడ్వటం.

‘‘అబ్బబ్బ. చంపుతున్నావురా నాయనా. తప్పక వస్తుందిరా’’ అని అరిచాను కోపంతో. ఊహు. మహాప్రభూ– ఎట్లా వీడ్ని నమ్మించడం! పోనీ ఏదో అల్లాగ ఏడుస్తూ ఉన్నా ఒక సుగుణమే. కాళ్లొచ్చిన వెధవ. మేడ దిగి సముద్రానికి పోతానంటూ బయలుదేరుతున్నాడు. చిన్నది ఎత్తుకున్నా ఏడ్వటం మానలేదు. దాన్ని దింపేసి, వీడి దగ్గర చేరి ఎట్లాగయినా సముదాయిద్దామని కూర్చున్నాను.

చిన్నది నా పడకగదిలోకి వెళ్లింది. ఇంకో గదిలోకి వెళ్లింది. వాళ్లమ్మను నేను దాచేశానని కాబోలు దీని నమ్మకం. 

చిన్న గదిలో సుశీ పడుకొని ఉన్నది. వాళ్లమ్మ చీర కప్పుకొని. చిన్నది ఆ చీర గుర్తుపట్టి అదే అమ్మ అనుకొని వెళ్లి అమాంతం దానిమీద పడ్డది. కెవ్వున కేకేసి ‘‘అమ్మా’’ అంటూ లేచింది సుశీ కూడా.

కాస్త పెద్ద పిల్లగదా ‘‘అమ్మా సుశీ, పసిదాన్ని కాస్త సముదాయించు’’ అన్నాను.

‘‘అమ్మ ఎక్కడి కెళ్లిందీ?’’ అన్నది సుశీ.

‘‘సముద్రానికి స్నానానికి’’

‘‘నన్ను తీసుకెళ్లలేదేం?’’ అని ఒక్క పెట్టున ఏడ్చింది.

‘‘ఓసి భడవా? నీవు కూడా ఏడిస్తే ఎట్లాగే? వీళ్లతోటే సతమతం అవుతుంటేను! వళ్లు పగలగొడతా ఏడిస్తివా అంటే!’’ అని భయపెట్టాను. ఇది మట్టుకు భయపడి ఊరుకుంది.

పసిది మాత్రం వెక్కి వెక్కి ఏడ్వటం మానలేదు. చిన్నవాడు ఒకే స్థాయిలో ఏడుస్తున్నాడు. అమ్మ వస్తుంది ఉండరా అని నేనూ, రాదనివాడూ వాదన.

తలబద్దలు కొట్టుకుందామనుకున్నంత విసుకు పుట్టింది. ఈ లోపున సుశీ మెల్లగా వెళ్లి నిద్రపోతున్న తమ్ముడ్ని లేపింది. అమ్మ వెళ్లిపోయిందని చెప్పేసింది. వాడో ఏడ్పు ఏడ్చాడు. భయపెడితే బిక్కముఖం వేశాడు.

‘‘నాయనా, మొగపిల్లలు ఏడ్వకూడ’’దని అప్పీలు చేశాను. ఎట్లాగయితేనేం మొగతనాన్ని నిలబెట్టాడు మా వాడు.

వాళ్ల ఇద్దర్ని ఎట్లాగో ఆపానుగాని పసివాళ్లనే ఊరుకోబెట్టడం నా తరం గాలేదు. బిస్కట్లు పెట్టాను. విసిరి పారేశారు. కర్జూరపండు ఇచ్చాను. మొఖాన కొట్టారు. ఆట వస్తువులు చూపాను. కాళ్లతో తన్నేశారు. చిన్నదానికి ఏమీ తెలియక ఏడ్పు. వాడు మొండితనాన ఏడ్పు. వీపుపైని చెళ్లున వేశాను నోరు మూయమని. వాడు ఏడస్తూ మెట్లు దిగాడు.

చీకట్లో భయపడతాడని పసిదాన్ని దింపి వాడి వెంటబడి గిలగిల కొట్టుకుంటూన్న వాడ్ని పట్టుకొచ్చాను. 

ఈ లోపున పసిది మెట్లు దొర్లటానికి సిద్ధమైంది. మహాప్రభో!

పసిదాన్ని లాక్కొచ్చి మంచం మీద కూలేసి, చూస్తూ ఊరుకున్నాను. శత్రుసేనలు కోట తలుపులు బద్దలు కొట్టుకుని వస్తూంటే, ఏమీ చేయలేక నిలబడిపోయిన రాజులాగ.

అంతలో అరుణోదయం అయింది. ‘‘అమ్మాయీ, సుశీ, మీ అమ్మ వస్తున్నదేమో చూడూ వాకిట్లో కెళ్లి’’

ఏదీ? సుశీ లేదు. దాని తమ్ముడూ లేడు. గుండె గుభేలు మన్నది. వీధి తలుపు తీసివుంది. పెద్దగా కేకవేశాను. జాడ లేదు. ఆ పిల్ల చేతులకు బంగారపు గాజులున్నాయి. వాటి కాశపడి పిల్లదాన్ని ఎవరేం జేస్తారో? పోనీ వాళ్ల కోసం వెతుకుదామంటే వీళ్లిద్దరినీ వదలి ఎల్లాగ కదలటం!

ఇంతలో పసిముండ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది. భుజాల మీదే ఉంచుకొని పాలడబ్బా తీసి కొంచెం పాలు కలిపి, ‘అమ్మా తాగ’మని ఇచ్చాను. పుచ్చుకొని గుక్కెడు కామోలు ఆ గ్లాసు విసిరి కొట్టింది. బట్టంతా తడిసింది. మొఖం నిండా పాలచుక్కలు.

‘చీ–దీని దుంపతెగ... అవస్థ...’ అని విసుక్కొని ఇటు చూద్దును గదా, ఆ చిన్న వెధవ సందు దొరికింది గదా అని, సముద్రానికి ప్రయాణం గట్టి వాకిట్లోకి పోయినాడు. అపుడు తెలతెల వారుతుంది.

పరుగెత్తుకొని వెళ్లాను వాడ్ని పట్టుకొందామని. నాకు చిక్కకుండా పారిపోవాలనే ప్రయత్నంలో వాడు పరుగెత్తి జారి సైడుకాల్వలో పడ్డాడు. ఠకీమని దిగాను. మోకాలు లోతు మురుగులోకి. వాడ్ని చప్పున ఎత్తుకొని చంక నేసుకొన్నాను. వాడి ముఖం, వళ్లూ, అంతా బురద. నా బట్టలన్నీ బురద. 

ఇంతలోకే చిన్నది కూడా అడుగులేస్తున్నది ఆ వేపే. ఎక్కడ పడుతుందోనని ఇంకో చంకలో ఎత్తుకున్నాను. అప్పుడు చూడాలి నన్ను.

ఈ స్థితిలో నేనుండగానే వాకిట్లో బండి ఆగటం ఆవిడ దిగటం తటస్థించింది.

నన్ను ఆ స్థితిలో చూచి నేను పడ్డ పాట్లన్నీ గ్రహించి, కాంతం నా పై జాలిపడి నాయందు సానుభూతి చూపి, తాను సుఖంగా సముద్రస్నానం చెయ్యటానికి వీలు కల్పించేందుకోసం, ఇంత అవస్థా నేను పడ్డందుకు నాయందు ఎంతో కృతజ్ఞత కలిగి, నన్ను ఎంతో థేంక్‌ చేస్తుందన్న ఆశతో అక్కడే నిలబడ్డాను.

వచ్చిందో అమ్మగారు నిప్పులు గక్కుతూ ‘‘ఇద్దరు పిల్లలనూ వదిలేశారేం? వంతెన మీద కూర్చుని ఏడుస్తున్నారు’’ అంటూ.

నేనేం మాట్టాడలేదు. చూడు నా అవస్థ– అన్నట్లు అక్కడే నుంచున్నాను. చూచింది ఒక్క నిమిషం. కొంచెం విచారం కళ్లలో. మళ్లీ చిరునవ్వు.

పసిది తాచులాగ జారిపోయింది తల్లి దగ్గరకు. పసివాడు పోయి కావలించుకున్నాడు.

కాంతం కూర్చుని పిల్లదానికి పాలిస్తూ ‘‘అమ్మా నా తల్లే, ఎంత ఏడ్చిందో! నోరెండి పోయిందా? నాన్నా... నా తండ్రి... ప్రాణాలన్నీ మీ మీదే ఉన్నాయి. ఎంత ఏడ్చావురా? నాయినా పడ్డావా?’’ అని మాట మీద మాట అంటూ దాన్ని ముద్దెట్టుకోనూ, వీడ్ని ముద్దెట్టుకోనూ, దాన్ని పలకరించనూ, వీడ్ని పలకరించనూ, ఇదే వరస!

ఈ మానవుడు పడ్డ కష్టానికి ఒక్క సానుభూతి వాక్యం, కృతజ్ఞతను సూచించు ఒక్క చూపు లేదు. పిల్లలకు తల్లే లోకమైంది. నాకు స్థానం ఏదీ!

అల్లాగ సూర్యుని కెదురుగా నిలబడిపోయేను వెర్రి చూపులు చూస్తూ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement