
గ్రేట్ రైటర్
పిల్లాడిగా కథలు వింటూ పెరిగాడు విలియం ఫాక్‌నర్ (1897–1962). అమెరికా పౌరుడిగా, అందునా దక్షిణాది రాష్ట్రమైన మిసిసిపి వాడిగా అక్కడి ఉత్తరాది రాష్ట్రాలకూ దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య జరిగిన సివిల్ వార్ గాథలూ, నల్లవాళ్లు–తెల్లవాళ్ల బానిసత్వపు కథలూ, శ్వేతాధిపత్యాన్ని ప్రవచించిన ‘కు క్లక్స్ క్లాన్’ కథలూ, ఫాక్‌నర్ వంశీయుల కథలూ... వాటన్నింటి ప్రభావం వల్ల పదిహేడేళ్ల నాటికే రాయడం ప్రారంభించాడు.
కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, సినిమాలకు స్క్రీన్‌ప్లేలు రాశాడు. ‘ఎ రోజ్ ఫర్ ఎమిలీ’ ఒక అమెరికన్ రాసిన అత్యంత ప్రసిద్ధ కథగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ’ ఇంగ్లిష్‌లో వెలువడిన వంద గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచింది.
‘యాజ్ ఐ లే డైయింగ్’, ‘లైట్ ఇన్ ఆగస్ట్’, ‘ద రీయవర్స్’, ‘ద ఫేబుల్’, ‘అబ్‌సలోమ్, అబ్‌సలోమ్!’ ఆయన ఇతర రచనలు. 1949లో ఫాక్‌నర్‌ను నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఒక మంచి కళాకారుడు తనకు సలహా ఇవ్వగలిగే స్థాయిలో ఎవరూ ఉండరని నమ్ముతాడు, అన్నారు ఫాక్‌నర్. తప్పులు చేస్తూనే నేర్చుకోవాలనీ, రచన అనేది యాంత్రికంగా ఏదో టెక్నిక్‌ను పాటించడం కాదనీ అనేవారు.
Comments
Please login to add a commentAdd a comment