ఆ ఆదర్శ దంపతుల అద్భుత గాథ మరోసారి
సత్‌గ్రంథం
లోకపూజ్యమూ, రసరమ్యమూ అయిన రామాయణాన్ని మనకు తొలుత అందించింది వాల్మీకే అయినా, ఈ రమణీయ గాథను వందలాదిమంది కథలుగా, కావ్యాలుగా, పద్యాలుగా, శ్లోకాలుగా, చలనచిత్రాలుగా, కల్పవృక్షాలుగా, ఆఖరికి విషవృక్షాలుగా కూడా రకరకాల నామరూపాలతో అందించారు. అయినప్పటికీ రామకథను ఆస్వాదించేవారికి ఎప్పటికీ కొదవలేదనే చెప్పాలి. రాజమండ్రి వాస్తవ్యులు, ‘సాక్షి’లో ఉపసంపాదకులుగా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యాసాలను రచించిన దీక్షితుల సుబ్రహ్మణ్యం ప్రక్షిప్తాల జోలికి పోకుండా, వాల్మీకి రామాయణాన్ని తనదైన శైలిలో, మాటలలో తొలుత ‘సంహిత’ అనే వెబ్ పత్రికలోనూ, తర్వాత ఫేస్‌బుక్‌లోనూ ధారావాహికగా అందించారు. ఆ వ్యాసాలకు లభించిన ఆదరణ, ప్రోత్సాహ ఉత్సాహాలతో, పెద్దలు, పీఠాధిపతుల ఆశీస్సులు, అండదండలతో ‘సీతారామ కథాసుధ’గా పుస్తక రూపమిచ్చారు. వాటిలో ప్రస్తుతానికి బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండలు విడుదలయ్యాయి. సామాన్యులకు కొరుకుడు పడని పదాలు, పెద్ద పెద్ద విశ్లేషణలు, సంస్కృత శ్లోకాలతో నింపకుండా, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే శ్లోకాలను పొందుపరచడం రచయిత పాత్రికేయ పరిణతికి నిదర్శనం.
పత్రికలలో ప్రత్యేక కథనాలు రాసినట్లుగా, చక్కటి శైలిలో అంతంత మాత్రం చదువుకున్న వారికి కూడా అర్థం అయేలా ఉండటం ఈ రచనలోని ప్రధాన బలం. ‘లాభాల మాట రాముడెరుగు, ముందు అందరికీ ఈ అమృతాన్ని తలాకాస్త అందిద్దాం’ అనుకున్నట్లు రచయిత, ప్రచురణకర్తలు ధరను అందుబాటులో ఉంచారు. ఈ సంపుటిలోని ‘అరణ్యకాండ’ ఐదుదేశాలలో ఆవిష్కృతం కావడం ఆనందదాయకం.
శ్రీమద్రామాయణం
బాలకాండము పుటలు: 270; వెల రూ. 150
అయోధ్యాకాండము పుటలు: 300; వెల రూ. 200
అరణ్యకాండ పుటలు: 176; వెల రూ. 100
ప్రతులకు: ఆర్.ఆర్. పబ్లికేషన్స్, షాప్‌నంబర్-2, ప్రెస్‌క్లబ్, గణేశ్ చౌక్, రాజమండ్రి, ఫోన్: 9440451836.ఈ
- డి.వి.ఆర్.