గడియారం శ్రీరామ అంది | Thirty Years Of Ramanand Sagars Ramayan | Sakshi
Sakshi News home page

గడియారం శ్రీరామ అంది

Published Wed, Feb 13 2019 12:47 AM | Last Updated on Wed, Feb 13 2019 12:47 AM

Thirty Years Of Ramanand Sagars Ramayan - Sakshi

సకల సద్గుణాల వల్ల రాముడు దేవుడయ్యాడు ప్రతి గుణం ఒక రామాయణం నలుగురిని నడిపించేది రామాయణం అందరినీ చూసేలా చేసింది అందరినీ నడిపించింది రామానందసాగర్‌ రామాయణం బుల్లితెరపై ప్రత్యక్షమైన ఇంటింటా రామాయణం.

టైమ్‌ మిషన్‌లో మూడు దశాబ్దాల వెనక్కి వెళితే ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఓ అందమైన దృశ్యం కళ్లకు కడుతుంది. టీవీ ఉన్న ప్రతి ఇల్లు నిండుకుండలా కనిపిస్తుంది. భక్తిగా చేతులు జోడించి టీవీ తెరకు కళ్లప్పగించే జతల జతల కళ్లు రామరసాన్ని గ్రోలుతూ పారవశ్యం చెందుతుండటం చూస్తాం. ఆ అద్భుతాన్ని చవి చూపినవాడు రామానంద్‌ సాగర్‌. 78 ఎపిసోడ్లలో రామాయణాన్ని దృశ్యీకరించిన బుల్లితెర వాల్మీకి  ఇతడు. జనవరి 25, 1987లో ప్రారంభమైన ఈ సీరియల్‌ జులై 31, 1988 వరకు వచ్చింది. అప్పట్లో ఈ సీరియల్‌ టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్‌ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి.

రైళ్లు, బస్సులు, ఇంటర్‌ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీసెట్స్‌ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు పలికేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని వీక్షించింది. సీరియల్‌ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ విద్యాభ్యాసం చేయించింది. అఫ్‌కోర్స్‌ అప్పటికి ఇప్పటిలా వందల చానెల్స్‌ లేవు. కానీ, రామాయణం ఇంకా జీవించడానికి తాను కూడా ఉడతసాయం చేశానని బుల్లితెర ఒళ్లంతా కళ్లు చేసుకొని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది.

 పాలసంద్రం నుంచి పట్టాభిషేకం వరకుసీరియల్‌ స్టార్ట్‌ అవడమే..పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, భర్త పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి.. బ్రహ్మాది దేవతలంతా ..  ‘శాంతాకారం భుజగ శయనం    పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం..’  అంటూ స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా పరిఢవిల్లుతోంది. పాప నాశనం చేసి, ధర్మసంస్థాపన చేయండి.. అని వేడుకుంటారు. తాను ఇచ్చిన వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చిందని చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు.

రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. సత్యమేవ జయతే అంటారు దేవగణం. అక్కడి నుంచి రాముడు పుట్టడం,విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. ఈ సీరియల్‌ మొత్తానికి కీలక పాత్రధారులు దశరథుడు, అతని ముగ్గురు భార్యలు, వీరితో పాటు దుష్టవనితగా పేరొందిన మంధర మొదటి ఎపిసోడ్‌లోనే కనిపిస్తారు. యజ్ఞం చేయగా వచ్చిన పాయసాన్ని దశరథుని ముగ్గురు రాణులు సేవిస్తారు. విష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖుచక్రాలు భరత, శత్రుఘ్నులుగా జన్మిస్తారు. ఇక రెండవ ఎపిసోడ్‌లో రామలక్ష్మణ, భరత శత్రుఘ్నుల విద్యాభ్యాసం గురుకులంలో జరుగుతుంది. అక్కడే పెరిగి పెద్దవుతారు.  అక్కడితో సీరియల్‌ని భక్తిగా చూసే ప్రేక్షకుల హృదయాలు రామ రామ అంటూ రామ జపం చేస్తూ కథలో లీనమయ్యాయి.

బుల్లితెర వాల్మీకి ప్రయాణం
రామానంద్‌ సాగర్‌ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టారు. రచయితగా ఎన్నో మారుపేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబం వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్‌లో పృథ్వీరాజ్‌ కపూర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్‌ ఆర్ట్స్‌ పేరుతో సొంత ప్రొడక్షన్‌ కంపెనీని నిర్మించాడు. కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు అతని ప్రొడక్షన్‌ నుండి వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం బుల్లితెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని చెప్పుకునే రామానంద సాగర్‌ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో మాత్రం అపార ప్రతిభను కనబరిచాడని విమర్శకుల మెప్పును పొందారు.  

పట్టాభిషేకం తర్వాత...?
రామానంద్‌ సాగర్‌ వాల్మీకి రామాయణ్, తులసీదాస్‌ రామచరిత మానస్‌లను తన సీరియల్‌కి మూలకథగా ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు అంటే రాముడు పట్టాభిషేకం వరకు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రామాయణాలలో సీతను రాముడు వదిలేయడం, లవకుశుల చాప్టర్లను ఇందులో తీసుకోలేదు. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో రామానంద్‌ సాగర్‌ తనయుడు ప్రేమ్‌సాగర్‌ మాట్లాడుతూ– ‘చాలామంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు’ అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్‌ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు.

పౌరాణికాలకు దారిచూపిన సీరియల్‌
రామాయణం తర్వాత సాగర్‌ ఇండస్ట్రీ నుంచి శ్రీ కృష్ణ, లవ్‌ ఔర్‌ కుష్, అలిఫ్‌ లైలా.. వంటి  సీరియల్స్‌ వచ్చాయి. అంతేకాదు, రామాయణ్‌ ప్రేరణతో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్‌ రూపొందించడానికి టీవీ ఒక మాధ్యమంగా సాగింది. లెక్కలేనన్ని పౌరాణిక సీరియల్స్‌ ఆ తర్వాతి కాలంలో బుల్లితెరమీద బొమ్మకట్టాయి. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్‌ సాగర్‌ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. అలాగే, సాగర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నుంచి  2008లో మరో రామాయణం వచ్చింది. ఆ తర్వాత 2015లో మరో రామాయణ్‌ సీరియల్‌ టీవీలో వచ్చింది. అయితే, 1986లో తీసిన రామాయణ్‌ 2015లో వచ్చిన రామాయణ్‌ సీరియల్‌ను చూస్తే రూపకల్పనలో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. 

పూజలందుకున్న నటీనటులు
రామాయణ్‌ సీరియల్‌లో రామ పాత్రధారి ‘అరుణ్‌ గోవిల్‌’ రూపం, వాయిస్‌ ఆ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్‌గా మారింది. చూపులకు ప్రశాంతంగా కనిపిస్తూ వీనులకు విందు చేసే రాముడి పాత్రధారి పలుకులు విన్న వారి కళ్లు ఆర్ధ్రమయ్యేవి. ఆ తర్వాత అతను ఎక్కడకు వెళ్లిన ప్రజలు అరుణ్‌గోవిల్‌ను రాముడిగా కొలిచారు. సీత క్యారెక్టర్‌ గురించి మాటల్లో చెప్పలేం. వాల్మీకి రామాయణంలోని సీత తమ నట్టింటికే నడిచి వచ్చిందన్నంత తన్మయత్వం చెందారు ప్రేక్షకులు. ఇప్పటివరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్‌ అని కళ్లు మూసుకొని వెతికితే ‘దీపికా చిఖాలియా’ రూపమే నిలుస్తుంది.

ఈ సీరియల్‌లోని కొన్ని ఎపిసోడ్స్‌ చూస్తే ఆమె కళ్లతో పలికించిన భావాలు ప్రేక్షకుల మనసు నుంచి చెదిరిపోవు. ఆమె ఒక అందమైన మహారాణి మాత్రమే కాదు తన తండ్రితోపాటు ప్రతి ఒక్కరికీ సాయం చేసే స్వభావం కలదిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్ర హనుమాన్‌. ఇప్పటిదాకా వచ్చిన రామాయణ్‌ సీరిస్‌లలో హనుమాన్‌ పాత్రధారులను గమనిస్తే సాగర్‌ రామాయణ్‌లో హనుమాన్‌గా నటించిన ‘దారాసింగ్‌’ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్‌ అంటే దారాసింగ్‌ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటైనది రావణాసురుడి పాత్ర. సీరియళ్లు, సినిమాలలో చాలామంది రావణాసురుడి పాత్ర పోషించారు.

వారంతా మంచి నటులే. అయితే, ‘అరవింద్‌ త్రివేది’ రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా ఉంటుంది. ఒక సీరియల్‌లోని నటీనటులు రాజకీయంగా ఎదగడం అనేది రామాయణం నుంచే మొదలైంది. అరుణ్‌గోవిల్‌ను మొదట బిజెపీ, తర్వాత కాంగ్రెస్‌ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాయి. దీపికా చిఖాలియా (సీత), అరవింద్‌ త్రివేది(రావణుడు) ఇద్దరూ ఎంపీలుగా ఓ వెలుగు వెలిగారు. రామాయణం విన్నా, కన్నా జన్మ తరిస్తుందని చెబుతారు పెద్దలు. అలా రామాయణం తీసి జన్మ చరితార్ధం చేసుకున్నది రామానంద్‌సాగర్‌ అయితే, ఆ ధారావాహికను కన్నులారా వీక్షించిన ప్రతి గుండే చరితార్థమే అయ్యింది. 

రంగుల రామాయణం
రామానంద్‌సాగర్‌ బుల్లితెరకు రామాయణం ఇస్తే దానికి ఊపిరిలూదినవారు కంపోజర్‌ రవీందర్‌ జైన్‌. ఆ తర్వాత చెప్పుకోదగినవి కాస్ట్యూమ్‌ కలర్స్‌. దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్‌ టెలివిజన్‌ చేరువవుతోంది. ఈ చిన్న తెరమీద గులాబీ, ఎరుపురంగులతో షోని బ్లాస్ట్‌ చేశాడు దర్శకుడు. ఇండియన్‌ టీవీలో మొట్టమొదటి బ్లాక్‌బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షోగా రామాయణం వరల్డ్‌ లిమ్కా బుక్‌ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement