టీవీక్షణం : మనమెందుకు తీయట్లేదు?
అత్తాకోడళ్ల గొడవలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, స్నేహితుల మధ్య అపోహలు... సీరియల్ అంటే ఇవే ఉండాలా? అవునని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, సీరియల్ ఇలా ఉండాలి అని రూలేమీ లేదు కాబట్టి. కాదు అనీ అనలేం. ఎందుకంటే... నేటి సీరియళ్లలో అవి తప్ప ఏమీ కనిపించడం లేదు కాబట్టి. ఏవో కొన్ని మినహా... అన్ని సీరియళ్లూ ఈ అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్నది ఒప్పుకు తీరాల్సిన వాస్తవం.
అయితే హిందీలో పరిస్థితి ఇందుకు కాస్త భిన్నంగానే ఉంది. కమర్షియల్ సీరియళ్ల ఒరవడిని కొనసాగిస్తూనే... వాస్తవికతతో కూడిన కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. ఎవరూ చూడరు అని అనుకోవడం లేదు. చూపించేలా తీస్తే చూస్తారు అని నమ్ముతున్నారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... చారిత్రక కథనాల గురించి. జోధాఅక్బర్, అక్బర్ ద గ్రేట్, అక్బర్-బీర్బల్, మహారాణా ప్రతాప్, ఝాన్సీకీ రాణీ, చిత్తోడ్‌కీ రాణీ పద్మిని, చంద్రగుప్త మౌర్య, చాణక్య, టిప్పుసుల్తాన్, నూర్జహాన్, పృథ్వీరాజ్ చౌహాన్, క్రాంతి 1857 లాంటి సీరియల్స్ ఎన్నో వచ్చాయి హిందీలో. మనం కూడా కొన్ని తీశాం. కానీ హిందీ వాళ్లతో పోలిస్తే చాలా తక్కువ! ఇప్పుడయితే అసలు ఇలాంటి కథాంశాలను మనం ఎంచుకోవడమే లేదు. కావాలంటే డబ్ చేసుకుంటున్నాంగానీ, స్ట్రెయిట్‌గా మాత్రం తీయటం లేదు.
రామాయణం, మహాభారతం సీరియళ్లను మనం తీయలేదు. కానీ డబ్ చేస్తే జనం చూశారు. మరి మనమే తీస్తే చూడరా? ఝాన్సీకీ రాణీ, జోథాఅక్బర్ వంటి డబ్బింగ్ సీరియళ్లు మన చానెళ్లకి టీఆర్పీలు తెచ్చిపెడుతున్నాయి. మరి మనమే తీస్తే టీఆర్పీ రాదా? కచ్చితంగా వస్తుంది. పరభాషలో తీసినవాటిని, లిప్‌సింక్ లేని డైలాగులని చూసి ఇష్టపడుతున్న ప్రేక్షకులు... మనవాళ్లతో, మన భాషలో తీస్తే ఇంకెంత ఇష్టపడతారు! మన చరిత్రని, మన దేశాన్ని పాలించిన గొప్ప గొప్ప వారిని, వారు దేశానికి, ప్రజలకు చేసిన సేవలని చూపించే ప్రయత్నం మనమూ చేయొచ్చు కదా?
ఇది విమర్శ కాదు. ఒక్క ప్రశ్న... అంతే. చరిత్ర పుటల్లో అక్షరాలుగా నిక్షిప్తమైన మహామహుల గాథల్ని మన పిల్లలకు, వారి పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం గురించి గుర్తు చేయాల్సిన అవసరం మనకు మాత్రం లేదంటారా? దర్శకులు, నిర్మాతలు ఓసారి ఆలోచిస్తే బాగుంటుందేమో!