నాగరకత ముసుగులో... ఆదివాసీలకు ఆధునిక సమాజం పెట్టే పరీక్షలు... అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు... పల్లెపదాలు... జానపదజావళులకు... ఆమె అక్షరమైంది. అలాగే... అమెరికా ప్రకృతి అందాలు... మనవాళ్ల ప్రగతి సుగంధాలు కూడ. ఆరుపదులు దాటిన ఆమెలోని రచయిత్రి...ఇప్పుడు... పిల్లలకు కథల అమ్మమ్మ అవుతోంది.
విజయనగరం జిల్లా... స్వచ్ఛతకు, అమాయకత్వానికి నిలయం. అణచివేత, దోపిడీలను ప్రశ్నించే గళాలను పుట్టించిన నేల. ఇంటి గడపలే సప్తస్వరాలుగా సరిగమలు పలికే గుమ్మాలు ఒకవైపు. అరాచకాన్ని ఎదిరిస్తూ గళమెత్తిన స్వరాలు మరొకవైపు... పడుగుపేకల్లా అల్లుకుని సాగిన జీవన వైవిధ్యానికి ప్రత్యక్ష సాక్షి కోరుపోలు కళావతి. నాటి అమానవీయ సంఘటనలకు సజీవ సాక్ష్యాలు ఆమె రచనలు. చదివింది పదవ తరగతే. కానీ ‘వాస్తవాలను కళ్లకు కట్టడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదు, అన్యాయానికి అక్షరరూపం ఇవ్వగలిగితే చాలు. వాస్తవ జీవితాలు చెప్పే నీతి సూత్రం కంటే పాండిత్యం చెప్పగలిగిన న్యాయసూత్రం పెద్దదేమీ కాద’ని నిరూపిస్తోందామె. ఇటీవల ‘మన్యంలో మధురకోయిల’ రచనను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అక్షర జ్ఞాపకాలివి.
‘‘మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం. మా నాన్న పెదపెంకి కూర్మినాయుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. వంగపండు ప్రసాదరావుగారితో కలిసి ప్రజాచైతన్యం కోసం పనిచేశారు. నేను చదివింది పదవ తరగతి వరకే. కానీ రాయాలనే దాహం తీరనంతగా ఉండేది. యద్దనపూడి సులోచనారాణి పెద్ద చదువులు చదవకపోయినా లెక్కలేనన్ని నవలలు రాశారని తెలిసి నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆమె స్ఫూర్తితోనే రచనలు మొదలుపెట్టాను. మా వారు టాటా స్టీల్‌లో అధికారి కావడంతో పెళ్లి తర్వాత మేము పాతికేళ్లపాటు ‘కడ్మా’లో నివసించాం.
కడ్మా అనేది జార్ఖండ్‌లో జెమ్‌షెడ్‌పూర్ నగరానికి సమీపంలో, టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులు నివసించేప్రాంతం. అక్కడ అన్నిప్రాంతాలు, రకరకాల భాషల వాళ్లతో కలిసి జీవించడం నాకు మంచి అనుభవం. పిల్లలు పెద్దయ్యే వరకు ఇంటి బాధ్యతలే ప్రధానంగా గడిచిపోయింది నా జీవితం. కడ్మాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఉగాది సంచిక కోసం వ్యాసాలు సేకరించడం, రాయడంతో సంతోషపడేదాన్ని. పదిహేనేళ్ల కిందట యూఎస్‌లో ఉన్న మా అమ్మాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి ప్రకృతి, మనవాళ్లు సాధిస్తున్న ప్రగతిని ‘అమెరికా అందాలు గంధాలు’ పేరుతో నవల రాశాను.
అదే తొలి నవల. నేను రాయగలననే నమ్మకం వచ్చిన రచన కూడా. ఆ తర్వాత మా జిల్లా సంగీత కౌశలాన్ని వివరిస్తూ ‘భారత్‌లో భాసిల్లిన విద్యల నగర సౌధము’ రాశాను. మా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు జీవితాన్ని చిన్న పదాలతో అల్లేసి, రాగయుక్తంగా పాడుతారు. ఆ వైనాన్ని ‘జానపద జావళి’ పేరుతో రాశాను. ఆదివాసీల స్వచ్ఛతకు అద్దం పట్టే ‘గడ్డిగులాబీలు’, ప్రతిమ, చిగురించే ఆశలు, వసివాడిన వసంతం, అవనిలో ఆంధ్రావని, జీవన స్రవంతి... ఇలా రాస్తూ ఉన్నాను, రాయడంలో ఉన్న సంతోషాన్ని ఇనుమడింప చేసుకుంటున్నాను.
‘మన్యంలో మధురకోయిల’ సుమారు యాభై ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మన్యం బాలికల యదార్థగాధ. అంతకుమునుపు రాసిన ‘ప్రతిమ’ అరకు చుట్టూ సాగింది. ఒక ఫొటోగ్రాఫర్ అరకు ప్రకృతి సౌందర్యాన్ని, అడవిబిడ్డ అచ్చమైన స్వచ్ఛతను ఫొటో తీయడానికి తరచూ వస్తుండేవాడు. ఒక గిరిజన అమ్మాయిని ఫొటోలు తీసి, పోటీకి పంపించి అవార్డు తెచ్చుకుంటాడు కూడా. ఫొటోల పేరుతో మళ్లీ అరకు బాట పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ అవకాశవాదం నుంచి తమ అడవి బిడ్డను కాపాడుకోవడానికి గిరిజనులు పెట్టిన ఆంక్షలకు కథారూపమిచ్చాను.
ఆలయాలు సరే... ఆశ్రమాలూ కట్టండి!
నన్ను నేను వ్యక్తం చేసుకునే అవకాశాన్నిచ్చింది అక్షరమే. కథ అంటే ఊహల్లో నుంచి రూపుదిద్దుకోవాలని అనడం కూడా విన్నాను. కానీ నా కథాంశాలన్నీ వాస్తవాలే. అమెరికాలో మనవాళ్లు... మన సంస్కృతికి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మిస్తుంటారు. భాషల పరంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క వృద్ధాశ్రమాన్నయినా కట్టారా? వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంగ్లిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలోనే చేరుస్తారు. అక్కడ మనవాళ్లకు భాష తెలియక పోవడంతో మాట రాని మూగవాళ్లుగా జీవిస్తుంటారు. అదే మన భారతీయులే వృద్ధాశ్రమాలను నిర్మించి నిర్వహిస్తే... రిటైర్ అయిన తల్లిదండ్రులు మన ఆహారం తింటూ, మన భాష వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ సేదదీరుతారు కదా! అలాగే పండుగలు, సెలవులప్పుడు వీలు చూసుకుని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు వెళ్లి కలవడానికి వీలవుతుంది. నాకు కలిగిన ఈ ఆలోచననే ఆ రచనలో చెప్పాను.
నా అక్షరాలకు చిత్ర రూపం!
నా రచనలకు ముఖచిత్రం నా మనుమరాలు హర్షిత వేస్తుంది. తను సెవెన్త్ క్లాస్, ఇంగ్లిష్లో చిన్న చిన్న కథలు సొంతంగా రాస్తుంది. యూఎస్‌లో ఉన్న పెద్ద మనుమరాలు నందిని నా తొలి నవలను ఇంగ్లిష్లో ట్రాన్స్‌లేట్ చేస్తానని తీసుకువెళ్లింది. నా ఇద్దరబ్బాయిలూ విజయనగరంలో ఇంజనీర్లే. నేను, మా వారు వాళ్ల దగ్గర శేషజీవితాన్ని గడుపుతున్నాం. నా రచనల్లో కర్పూరకళిక, వలస వచ్చిన వసంతం, వాడినపూలే వికసించునులే, కలలగూడు’ వంటి వాటికి పుస్తకరూపం ఇవ్వాలి. పిల్లలకు కథలు చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు కరవైన ఈ రోజుల్లో ‘బాలానందం’ పేరుతో పిల్లల కథల పుస్తకం రాశాను. అది ముద్రణ దశలో ఉంది. అక్షరంతో స్నేహం... నాకు జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్నిచ్చింది. నా ఈ స్నేహిత ఎప్పటికీ నాతోనే ఉంటుంది’’ అన్నారు కళావతి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: కంది గౌరీ శంకర్, సాక్షి, విజయనగరం
తొలివాక్యం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది!
నేను రాసిన తొలివాక్యం ‘కొట్టు కొనమంటుంది– పోట్ట తినమంటుంది’. ఈ వాక్యానికి ఐదు రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ ఐదు రూపాయలను ఖర్చు చేయకుండా చాలా ఏళ్లు దాచుకున్నాను. అప్పుడు నేను ఐదవ తరగతి. చందమామ పత్రికలో ఫొటో ఇచ్చి ఒక వాక్యంలో వ్యాఖ్యానం రాయమనేవారు. మా పెద్దన్నయ్య భాస్కరరావు పుస్తకం తెచ్చిచ్చి క్యాప్షన్ రాయమన్నాడు. ‘ఒక చిన్న కుర్రాడు ఆకలితో పచారీ కొట్టు ముందు బేలగా నిలబడి వేలాడదీసిన అరటి గెల వైపు చేయి చూపిస్తూ ఉన్నాడు. కొట్టతడేమో డబ్బిస్తేనే ఇస్తానంటూ కసురుకుంటున్నాడు’ ఇదీ అందులో విషయం. ఆ తొలివాక్యమే కవయిత్రి కావాలనే కలకు కారణం అయింది. నేను చూసిన సంఘటనలు, నా గమనింపునకు వచ్చిన అంశాలు కొత్త రచనకు ఇంధనాలయి తీరుతాయి. అలా ఒక వాక్యంతో మొదలైన నా అక్షరవాహిని జీవనదిలా సాగుతోంది. – కోరుపోలు కళావతి,రైటర్
Comments
Please login to add a commentAdd a comment