![yuva katha magazine stories](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/6565465.jpg.webp?itok=sFffIJ13)
అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.
ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.
చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.
మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.
‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది.
‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.
పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.
‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.
‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.
మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్‌కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్‌లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.
హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్‌ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.
ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.
అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ.
అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య.
Comments
Please login to add a commentAdd a comment