ఒక కథ... రెండు బాధ్యతలు
ఒక కథ... రెండు బాధ్యతలు
Published Fri, Jun 6 2014 11:45 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
'90ల కాలం ఉద్యమాలు పూసిన కాలం. కథకులు వేయి రేకలుగా వికసించిన కాలం. ఆ ఉమ్మడిరోజుల తీరికలేనితనంలో చాలామంది తెలుగు కథకుల కృషి సరైన గుర్తింపుకు నోచుకోలేదు.
కళింగాంధ్ర, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ... ఈ నాలుగు ప్రాంతాలను కాళ్లు చేతులుగా ధరించిన తెలుగు రాష్ట్రంలో తెలుగు కథ కొత్తగా తల ఎత్తవలసి ఉన్నది. తల లేని తన నేలకు కొత్తగా తల ఇవ్వాల్సిన బాధ్యత దానికి ఉన్నది.
తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగు కథకు రెండు దారులు ఎదురుగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటానికీ ఆకాంక్షలకూ వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ కథ ఆ రాష్ట్ర ఆవిర్భావంతో సఫలీకృతం అయ్యింది. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రజాస్వామిక రచయిత తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం పట్ల ఆనందం, హర్షం వ్యక్తం చేస్తాడు. చేశాడు. తెలంగాణ కథది విజయం సాధించిన ఉత్సాహం. దాని బాధ్యత సరిగ్గా లేని గీతలను సరి చేయడం. నవ నిర్మాణంలో చురుగ్గా పాల్గొనడం. గతంలో జరిగిన- ఉమ్మడి రోజులలో విస్మరణకు గురైన- తన కథలను కథారచయితలను తిరిగి నిలబెట్టుకోవడం. ఇప్పటికే నిలబెట్టుకున్నవారి కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేయడం. నవరాష్ట్రం పోకడలను నిశితంగా పరిశీలిస్తూ కొత్త అధికార దొంతరలను గమనిస్తూ ఈ పరిణామాలలో సామాజిక న్యాయం కోసం బాధ్యతగా మెలగనుండటం.
అంతేకాక బహుశా దాని ఎదుట చాలా పనులే ఉన్నాయి. కథ విషయంలో భండారు అచ్చమాంబ, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, నెల్లూరు కేశవస్వామి, ఇల్లిందల సరస్వతీ దేవి, గూడూరి సీతారాం... తదితర వైతాళికులను ప్రతిష్టించుకోవడం... పునఃప్రతిష్టించుకోవడం.... నిన్న మొన్న వరకూ అందుబాటులో లేకపోయిన భాస్కరభట్ల కృష్ణారావు వంటి అనేకమంది గొప్ప రచయితల రచనలు వెలికి తీయడం... ముఖ్యంగా మూడో తరం నాలుగోతరంలో రాసిలోగాని వాసిలోగాని ఇతర ఏ భారతీయ రచయితకూ తీసిపోని విధంగా కృషి చేసిన పి.యశోదా రెడ్డి, అల్లం రాజయ్య, నవీన్, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, కాలువ మల్లయ్య, బి.ఎస్.రాములు, బోయ జంగయ్య, ఆడెపు లక్ష్మీపతి, ముదిగంటి సుజాతారెడ్డి, ఐతా చంద్రయ్య, జాతశ్రీ, శిరంశెట్టి కాంతారావు, రామా చంద్రమౌళి తదితర రచయితల కృషిని సేవనూ విస్తృతంగా చర్చించి గౌరవించుకోవడం.... అలాగే గురి తప్పక కథను సాధన చేస్తున్న పెద్దింటి అశోక్ కుమార్, బెజ్జారపు రవీందర్, వినోద్ కుమార్, కె.వి.నరేందర్, అఫ్సర్ వంటి సీనియర్ కథకుల కృషినీ.... ఈతరం కథకులలో చురుగ్గా ఉన్న భగవంతం, జాజుల గౌరి, కరుణ, జూపాక సుభద్ర, స్కైబాబా, షాజహానా, విమల, పసునూరి రవీందర్... తదితరుల కథా ప్రయాణాన్ని ప్రశంసించడం ప్రోత్సహించడం... ఇవిగాక విప్లవ కథ, ఉద్యమ కథ, ఉర్దూ కథ... వీటి అవలోకనాలు పరిచయాలూ అదంతా ఒక ఉత్సవ సౌరభం.
అయితే మరోవైపు తెలుగు కథ పరిస్థితి సులువుగా లేదు. తెలుగు ప్రజలు కొత్త భావోద్వేగాలతో సతమతం అవుతున్నారు. ఊహించి కొంత ఊహించక కొంత ఆశించి కొంత భంగపడి కొంత ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని స్వీకరించి ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నారు. వారికి కనిపిస్తున్న శకునాలు కూడా సంతోషాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ఎక్కే గడప దిగే గడపగా ఉన్నాడు. పత్రికలు రాజధాని కడుతున్నాం చందాలివ్వండి అని చేతులు సాచి నిలబడు తున్నాయి. ఉద్యోగుల రోదనలేవో దూరం నుంచి వినిపిస్తున్నాయి. నిరుద్యోగ కుర్రాళ్లు పరాయి రాజధానిలో దిక్కులు చూస్తూ నిలబడి ఉన్నారు. వీటన్నింటి నడుమ తెలుగు కథ తన దారిని వెతుక్కోవలసి ఉన్నది.
కళింగాంధ్ర, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ... ఈ నాలుగు ప్రాంతాలను కాళ్లు చేతులుగా ధరించిన తెలుగు రాష్ట్రంలో తెలుగు కథ కొత్తగా తల ఎత్తవలసి ఉన్నది. తల లేని తన నేలకు కొత్తగా తల ఇవ్వాల్సిన బాధ్యత దానికి ఉన్నది. చెత్తకుప్పలో పారవేయబడ్డ శిశువు దీనాలాపన దాని ముందు అనివార్యంగా ఉన్న తాజా కథావస్తువు. వాస్తవానికి తెలుగు కథ ఈ పరిణామాన్ని ఊహించి అందుకు సిద్ధంగా లేదు. ఆ మాటకొస్తే నేను తెలంగాణ, నేను తెలుగు ఇలాంటి ‘సంకుచిత అస్తిత్వాన్ని’ స్వీకరించకుండా విశ్వ మానవునికి ప్రతినిధిగా ఉండటానికే కథకులు ఇష్టపడతారు. అయితే కొన్ని సమయాల్లో నిర్దిష్టంగా ఉంటూ మాట్లాడటం కూడా విశ్వమానవుడి గురించి మాట్లాడటమే అవుతుంది. నువ్వేమిటో నీవు గుర్తించుకో నిరాకరించినా ఎదుటివారు గుర్తించే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాని తెలుగు రాష్ట్రంలోగాని ప్రస్తుతం ఇదే పరిస్థితి.
అందువల్ల కూడా తెలుగు కథ తన కొత్త రాష్ట్రాన్ని పాత పరంపరని తిరిగి అసెర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడినది. దానికి ఎల్లలూ హద్దులూ గుర్తు చేయడం వల్ల ఆ ఎల్లలూ హద్దులకూ లోబడే ఈ సందర్భంలో తన పెద్దలందరినీ ఒకసారి స్మరణకు తెచ్చుకొని మహోత్సాహంతో ముందుకు కదలనున్నది. తలచుకుంటే తెలుగు కథది ఎంతటి ఘన పరంపర. తెలుగు కథకులది ఎంతటి ఆత్మగౌరవం. గురజాడ మా ఆది ఆధునిక కథకుడు. శ్రీపాద మా పలుకు. రావిశాస్త్రి మా దిశ. చలం మా ధిక్కారం. కొ.కు మా మేధ. బుచ్చిబాబు మా సౌందర్యం. చా.సో మా శిల్పం. రంగనాయకమ్మ మా అభ్యుదయం. పతంజలి మా వ్యంగ్యం. మధురాంతకం రాజారాం మా మధ్యతరగతి ఆత్మ. ఇనాక్ మా వెలికేక.... గడిచిపోయిన ఆ కాలాన్నంతా మరోసారి గుర్తుకు తెచ్చుకొని ఆ వైతాళికులకు కొత్త కైమోడ్పులు అర్పించాల్సి ఉన్నది.
తెలుగు కథ ఇప్పుడు గోడ లోపలి తన కుటుంబ సభ్యులనే అనివార్యంగా అపురూపంగా చూసుకోవలసి వస్తున్నది. ఇంతకాలం అది కొందరిని సరిగా చూడలేదు. కొందరిని చూడవలసిన విధంగా చూడలేదు. ఆ నష్టాన్నిప్పుడు పూడ్చుకోవడానికి ఇదో అవకాశంగా భావించాల్సి ఉన్నది. కె.సభా, అందె నారాయణస్వామి, సొదుం జయరాం, శారద, కల్యాణ సుందరీ జగన్నాథ్, ఆర్.వసుంధరాదేవి, అల్లం శేషగిరిరావు, భూషణం, సి.రామచంద్రరావు, మహేంద్ర వంటి ఉత్తమోత్తమ కథకులందరినీ స్మరించి వారి కృషిని గ్రహించి వారి మెడన కొత్తపూలహారాలను ధరింపచేయవలసి ఉన్నది. ‘90ల కాలం ఉద్యమాలు పూసిన కాలం. కథకులు వేయి రేకలుగా వికసించిన కాలం. ఆ ఉమ్మడిరోజుల తీరికలేనితనంలో చాలామంది తెలుగు కథకుల కృషి సరైన గుర్తింపుకు నోచుకోలేదు. బండి నారాయణ స్వామి, చిలుకూరి దేవపుత్ర, దాదాహయత్, మధురాంతకం నరేంద్ర, జి.ఆర్.మహర్షి, జి.కల్యాణరావు, పి.సత్యవతి, కాట్రగడ్డ దయానంద్, బమ్మిడి జగదీశ్వరరావు, పి.రామకృష్ణ, (స్మైల్), సౌదా, పద్మాకర్, సతీష్ చందర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, వాడ్రేవు చినవీరభద్రుడు, డా.వి.చంద్రశేఖరరావు, కుప్పిలి పద్మ, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు వీరందరి కృషిని మాట్లాడాల్సి ఉన్నది. మాట్లాడుకోవాల్సి కూడా ఉన్నది.
ఇక తెలుగు కథ మరొక్క మారు తన ముచ్చటైన మాండలికాలను ముద్దాడనున్నది. సుందరమైన పలుకుతో సజీవతతో ఎప్పటిలాగే కళకళలాడుతూ అడుగు ముందుకు వేయనున్నది. కేశవరెడ్డి దాని విలుకాడు. నామిని గురికాడు. గోపిని కరుణాకర్, స.వెం.రమేశ్, ఇనయతుల్లా, రహమతుల్లా, వంశీ, నక్కా విజయరామరాజు, రాసాని, తుమ్మల రామకృష్ణ... ఇంకా ప్రతిపథాన తన పెదాన పిల్లనగ్రోవి వూదే పాటగాళ్లందరితోనూ అది వంతపాడనున్నది. శ్రీరమణకు మాటలోని సొగసు తెలుసు. కేతుకు సీమపలుకులోని సుడిగాలి తెలుసు. సింగమనేనికి ఎడారి రైతు కంఠాన ఆక్రందన.
తెలుగు కథ ఈ పరిణామకాలంలో ఖండాంతరాలలో ఉన్న తెలుగు కథకుల వైపు చూస్తున్నది. పట్టుదలతో ప్రతి గుక్కనూ ప్రాణంగా ఒడిసిపట్టనున్నది. చంద్ర కన్నెగంటి, ఆరి సీతారామయ్య, కనక ప్రసాద్, నారాయణ స్వామి, వేలూరి వేంకటేశ్వరరావు, కె.వి.గిరిధర రావు... వీరందరి కొత్త కథాపరంపరతో మరొక్కమారు తనను తాను సంపద్వంతం చేసుకోనున్నది. అన్నింటికీ మించి తెలుగు కథ ఈతరం కథకులతో అనేకానేక తాజాకథకుల రాకతో కొత్త ఊటలను వెదజల్లు తున్నది. అజయ్ ప్రసాద్, సురేశ్, ప్రతిమ, పసుపులేటి గీత, కె.ఎన్.మల్లీశ్వరి, లెనిన్, వేంపల్లి గంగాధర్, కె.సుభాషిణి, చింతకింది శ్రీనివాసరావు, ప్రసాదమూర్తి, కుమార్ రాజా, షరీఫ్, వినోదిని, సామాన్య, సింధు మాధురి, మల్లిపురం జగదీశ్, మెహర్, అనిల్ ఎస్.రాయల్, అక్కంపేట ఇబ్రహీం... వీరందరి ప్రవాహగానంతో మహాహోరుగా బలపడనున్నది.
తెలుగు కథ నెత్తిన ఇప్పుడు నిజంగానే చాలా బరువు ఉన్నది. అది పునాదుల నుంచి మొదలవ్వాల్సి ఉన్నది. కొత్త పెళ్లలు విరిగిపడి పోయే ప్రాణాల గురించి రాయాల్సి ఉన్నది. కొత్త తగాదాల్లో నలగనున్న రైతు కంటి చెమ్మను తుడవాల్సి ఉన్నది. కొత్త బదిలీల వల్ల అపసవ్యం కానున్న కుటుంబాల కార్చిచ్చులను చల్లార్చాల్సి ఉన్నది. ఉన్న భరోసా పోయి కుదేలైన కుర్రాడికి ఏం పర్లేదులే అని ధైర్యం నూరిపోయాల్సి ఉన్నది. నొసటన ‘దొంగ’ అనే పచ్చబొట్టును చెరిపి పరాయి రాజధానిలో ఆత్మగౌరవంతో బతికే హక్కును చాటవలసి ఉన్నది. ఉసురుకూ ముసురుకూ చోటివ్వకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు కదలమని పిలుపు ఇవ్వాల్సి ఉన్నది.
ఇక మీదట తెలుగు కథ తనకిచ్చిన హద్దుల్లోనే తాను ఉండదల్చుకున్నది.
బహుశా- ఆ హద్దుల నుంచే అది దిగంతాలకు ఎగరనున్నది.
ఇది చెరువులు నింపుకోవాల్సిన కాలం. నిండిన చెరువులను సరిచూసు
కోవాల్సిన కాలం.
అటూ ఇటూ ఆ పని పూర్తయ్యాక వారధి గురించి ఆలోచించాల్సి ఉన్నది.
- మహమ్మద్ ఖదీర్‌బాబు
Advertisement
Advertisement