మౌనమూ బోధనే
జెన్ పథం
జెన్ గురువు విన్సీ దగ్గరకు ఒకరోజు శిష్యులు వచ్చారు. అవీ ఇవీ మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘అన్నట్టు గురువుగారూ, మీరు బుద్ధుడు, బోధిధర్ముడు వీరిద్దరిలో ఎవరిని ఉన్నతులుగా పేర్కొంటారు?’’ అని అడిగారు.
వారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నేను ఆ ఇద్దరికీ ప్రాధాన్యమివ్వను’’ అని చెప్పారు.
బుద్ధుడిని వెతుకుతున్నప్పుడు బుద్ధుడిని కోల్పోతున్నాం. బోధిధర్ముడిని వెతుకుతున్నప్పుడు బోధిధర్ముడిని కోల్పోతున్నాం అనేది జెన్ తత్వం. దేని కోసమూ వెతుకుతూ తిరగకు. ఒకవైపే ఉండకు. సొంతమనేదేదో నీకు నువ్వు తెలుసుకో అనేది పరమార్థం.
జెన్ గురువు యౌషన్ ఏదీ మాట్లాడరు. శిష్యులు అనేక మంది ఆయను చూసి మాట్లాడేందుకు వచ్చినా సరే ఆయన ఏమీ మాట్లాడరు. వారిలో ఒకరు ఉండబట్టలేక ‘‘గురువుగారూ, మీదగ్గర ఆత్మజ్ఞానం పొందుదామనే ఉద్దేశంతో మేమందరం వచ్చాం. నేనైతే ఇదే విషయాన్ని తెలుసుకోవాలని అనేక సార్లు వచ్చాను. వెళ్లాను. కానీ మీరు ఒక్క మాటా మాట్లాడటం లేదు....’’ అన్నాడు.
‘‘సరే, సాయంత్రం మీరందరూ ఇక్కడికి రండి. మాట్లాడుకుందాం’’ అని చెప్పారు గురువుగారు.
సాయంత్రం భారీ సంఖ్యలో శిష్యులు తరలివచ్చారు. గురువుగారు వారి వంక మౌనంగా చూశారు. కాస్సేపు తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగివెళ్ళడానికి సిద్ధపడ్డారు.
అందరూ విస్తుపోయారు. వారిలో ఒకరు ‘‘గురువుగారూ, జ్ఞానామృతం ఏదైనా చెప్తారేమోనని మేమందరం వచ్చాం. ఇక్కడకు రావలసిందిగా మీరు చెప్పారు కూడా. మీరేదో చెప్తారని మేమొచ్చాం. కానీ మీరు ఒక్క మాటా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి?’’ అని అడిగాడు.
గురువు ఇలా అన్నారు......
‘‘క్రమశిక్షణ నేర్పడానికి అనేకమంది ఆచార్యులు ఉన్నారు. నీతి కథలు చెప్పడానికీ చాలా మంది ఉన్నారు. ధర్మాల గురించి చెప్పడానికీ అనేక మందే ఉన్నారు. అటువంటివి చెప్పడం నా పని కాదు. జెన్ అనేది భాషకు అతీతం. మాటకు అతీతం. దేనికీ లొంగదు. మరి దానిని నేనెలా చెప్పగలను? సహజసిద్ధంగా ఉన్న దానిని ఏదో విడమరిచి చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నదంతా చెడి అర్థంపర్థం లేకుండా పోతుంది. సహజసిద్ధమైనదానిని ఉన్నదున్నట్లుగానే గ్రహించాలి’’ అని చెప్పారు.
మరొక జెన్ గురువు. ఆయన చుట్టూ అనేక మంది శిష్యులు. ఆయననే అందరూ చూస్తూ రెప్పవాల్చక కూర్చున్నారు. ఆయన ఏ క్ష ణాన ఏం చెప్తారా అని చూస్తున్నారు.
అప్పుడు ఆ ఆశ్రమ ఆవర ణలోని ఒక పక్షి కీచుకీచుమని అరుస్తోంది. ఆ అరుపు వినసొంపుగా ఉంది. అది కాస్సేపటికి అరవడం ఆపేసింది.
‘‘ఏమిటి అందరూ విషయాన్ని గమనించారుగా?’’ అని గురువుగారు లేచి వెళ్ళిపోయారు. ఇంకొక గురువు. ఆయన జ్ఞానోపదేశం కోసం అనేక మంది వచ్చారు. వారిని చూసి ‘‘మీరందరూ వెళ్లి తేనీరు తాగి రండి’’ అని చెప్పారు.
అంతే అంతకన్నా ఆయన మరేదీ చెప్పలేదు.
జ్ఞానం, ఉపదేశం, వివరణ, విడమరిచి చెప్పడం వంటివన్నీ వొట్టి సంగ తులు. అవన్నీ అప్రధానమైనవి. వాటికోసం బుర్రలు బద్దలుకొట్టుకోవడం మూఢత్వం అంటుంది జెన్.
వెళ్లి టీ తాగి రండి అనే దానిపై అనేక వివరణలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. అయినా అదే ఫలానా అర్థమని ఎవ్వరూ చెప్పలేకపోయారు.
జెన్ యథార్థమైంది. చిక్కుల్లేనిది. నిజాన్ని తెలుసుకోవడానికి చదువో సంధ్యో తెలివితేటలో ఇవేవీ అక్కర్లేదు. ఎవరైనా జ్ఞానాన్ని పొందవచ్చు అంటుంది జెన్.
- సమయ