వెల్‌కమ్ న్యూ ఇయర్ – 2025
సందర్భం
కాలం మనల్ని వెక్కిరిస్తూ ముందుకు పరిగెత్తుతూంటుంది. మనం దానితోపాటు నడవలేం. దాన్ని ఆపలేం. దాని వెంట పరిగెత్తనూలేం. చేయగలిగిందల్లా దాన్ని వీలైనంత ‘మంచి’ చేసుకోవడమే. అంటే దాన్ని సరిగ్గా వాడుకోవడమే. దాని వేగాన్ని తగ్గించలేక పోయినా దాని విలువను గుర్తించడం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి.
‘నాకు సమయం లేదు’ అనీ, ‘రోజులు గడిచిపోతున్నాయి. చాలా చెయ్యాలనుకున్నా. ఏమీ చెయ్యలేకపోయా’ అనీ, ‘ఉన్న సమయమంతా ఇంకొకళ్ల కోసమే అయిపోతోంది. ఇక నా కోసం ఏం చేసుకోడానికైనా టైం ఏదీ’ అనీ, ‘ఇల్లు, ఆఫీసు... ఈ రెండిటితోనే సరిపోతుంది. ఇంకేమీ చెయ్యలేను బాబూ’... ఇలాంటి మాటలు ఎంత తరచుగా వింటామో! ఈ మాటలు చాలా మంచి ‘సాకులు’. అవి కఠోర వాస్తవాలని మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చుగానీ నిజానికి అవి మనం ‘మనకు నచ్చిన పని చెయ్యకుండా, మనం చెయ్యాల్సిన పని చెయ్యకుండా’ తప్పించుకోడానికి కల్పించుకునే సాకులే.
కాలం అందరికీ ఒకటే. ఎవరికైనా రోజులో ఉన్నవి ఇరవై నాలుగ్గంటలే. కొందరు రోజుకు పది పనులు అవలీలగా చేసేస్తారు; మరికొందరు ఒకటిన్నర పనితో సరిపెట్టుకుంటారు. ఈ తేడాకు కారణం మరొకరిపై తోసేయడం సుళువు. దానికి మనం ఎంతవరకు కారణమో ఆలోచించడం నేర్పు. ఇప్పటి ఆడవాళ్లకు అవసరమైంది ఈ నేర్పే. ‘సుళువు’లు చాలా ఏళ్లగానే వాడుకుంటున్నాం. ఇక మన నేర్పును చూపించే వేళ ఆసన్నమైంది.
కొంత వెనక్కి వెళ్లి చూస్తే– మనలో మంచి చిత్రకారిణి ఉంది; పాటగత్తె ఉంది; సమాజ సేవకురాలు ఉంది; రచయిత్రి ఉంది; నృత్యకారిణి వుంది; నాయకురాలు ఉంది; వ్యాపారవేత్త ఉంది; దానికి పదును పెట్టాలన్న కోరికా ఉంది. కానీ లేనిదల్లా ఆ పదును పెట్టడానికి సమయమే. ఎందుకంటే వీటితో పాటే ‘నువ్వు ఏదైనా చెయ్యి కానీ నీ ఇంటి బాధ్యతలు పూర్తి చేశాకే’ అని తర్జని చూపించే కుటుంబమూ ఉంది. ‘ఆవిడ అంత పేరు తెచ్చుకుందంటే ఇల్లొదిలి తిరిగింది కాబట్టేగా’ అని మూతి విరిచే సమాజమూ ఉంది.
ఇప్పుడు ఆ కుటుంబాన్నీ, సమాజాన్నీ నోటితో కాకపోయినా నొసలుతో వెక్కిరించే చైతన్యం ఎంతో కొంత మనకు అబ్బింది. అయినా అనుకున్నంతగా, మన సామర్థ్యానికి తగినంతగా సాధించలేకపోతున్నాం. ప్రతి పనినీ ‘వాయిదాలు’ వేస్తాం. వాయిదా వేయడానికి కనిపించినన్ని కారణాలు, ఉపయోగించేంత తెలివి తేటలు, పని చెయ్యడానికే వెచ్చిస్తే ఎంత బాగుంటుంది! అలా కూర్చునీ, కూర్చునీ ‘వయసైపోతోంది. ఏం సాధించాను ఈ జీవితంలో?’ అని నిస్పృహగా ప్రశ్నించుకుంటున్నాం. ‘నాలో ఎంతో ప్రతిభ ఉంది. ఏమీ ప్రతిభ లేని వాళ్లు ముందుకు వెళ్లిపోతున్నారు.
నేనింకా వెనకబడే ఉన్నాను’ అని వాపోతున్నాం. గుర్తింపు కోసం, అవార్డుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, బిరుదుల కోసం తహతహలాడటం మానుకోలేకపోతున్నాం. మన మానసిక సంతృప్తి వల్ల లభించే ‘విజయం’ మరే వేదికల వల్లా రాదని గుర్తించలేక పోతున్నాం. ఆ సంతృప్తిని సాధించే సమయం కూడా మన వద్ద ఉండటం లేదు. ఎందువల్ల? కాలాన్ని వాడుకోవడం చేతకాకపోవడం వల్ల; కాలం పట్ల భయమే తప్ప గౌరవం, ఇష్టం లేకపోవడం వల్ల.
ఏం జరుగుతోందో అర్థమయ్యాక దాన్ని తట్టుకునేందుకూ లేదా అధిగమించేందుకూ ఏం చెయ్యాలో కూడా ఆలోచించాలి. మనం రోజులో ఎంత సమయం ఎలా వృథా చేస్తున్నామో తెలుసుకోవాలి. వంట చెయ్యడం, ఇంటి పనులు, పిల్లల పనులు చెయ్యడం కాదు వృథా చెయ్యడమంటే. సమయం వృథా చెయ్యడమంటే కాలాన్ని అగౌరవ పరచడం.
అది ఎలా చేస్తున్నాం? ఇతరుల గురించి ఆలోచించడం; ఇతరుల పట్ల ఈర‡్ష్యను పెంచి పోషించడం; ఇతరుల జీవితాల్లో ఎన్ని లొసుగులున్నాయో వాకబు చెయ్యడం; మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో సామాజిక మాధ్యమాల్లో వెతుక్కోవడం; మనల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారో తెలుసుకుని గంటల తరబడి ఆనందించడం; ఎంతమంది తిడుతున్నారో తెలుసుకుని కుంగిపోవడం; లేదా శాపనార్థాలు పెట్టుకోవడం; మనకిష్టం లేని వాళ్లను ఎలా భ్రష్టు పట్టించాలో పన్నాగాలు వేయడం; అస్మదీయులతో బృందాలను ఏర్పరచుకుని వారితో పేరంటాలు, పండగలు చేసు కోవడం; మనకు ఉత్తరోత్తరా పనికి వచ్చే వాళ్లతో స్నేహాల కోసం ప్రయత్నించడం; మనల్ని బాధపెట్టిన వాళ్ల గురించి, మనకు నచ్చని వాళ్ల గురించి గంటల తరబడి ఫోన్లలో సంభాషణలు చేయడం; మన బాధ ప్రపంచపు బాధ అనుకుని అందరికీ మన గోడు, మనకు జరిగిన అన్యాయాలనూ వినిపించుకోవడం; ఈ ప్రపంచానికి మనల్ని అవమానించడం మినహా మరో పని లేదనే భ్రమలో జీవించడం.
ఇదంతా ఇప్పటి మధ్య వయస్కుల తరం కాలాన్ని గడిపే వైనం. మరి ‘కాలం’ బాధపడదూ? మనకు మేలు చెయ్యాలని ఉన్నా ఎందుకులే ఈ మొహాలకు అని మొహం చాటేయదూ? తాము పుట్టడమే ఈ లోకానికి మహోపకారమనుకునే అహంభావుల కోసం తనెందుకు ఆగాలని అనుకోదూ? కనక, మన జీవితాలను బాగుపరచుకోడానికి గొప్ప అవకాశం ఇచ్చే అనంతమైన కాలాన్ని కొత్త సంవత్సరం నుంచి అయినా ఒక్క చిటికెడు, దోసెడు గౌరవిద్దాం.
డా‘‘ మృణాళిని
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, ఆచార్యులు
Comments
Please login to add a commentAdd a comment