జెప్టో సీఈవో ఆదిత్ పాలీచా
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంప్రదాయ ఈ–కామర్స్ దిగ్గజాలకు క్విక్ కామర్స్ పోటీనిస్తుందని జెప్టో కో–ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలీచా అన్నారు. భారత్‌లో అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ స్థాయి ఫలితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని క్విక్ కామర్స్ కలిగి ఉందని 2024లో ప్రజలు గ్రహిస్తారని జెప్టో గతేడాది ప్రకటించిందని నూతన సంవత్సరం సందర్భంగా లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో ఆయన గుర్తు చేశారు. 2025లో క్విక్ కామర్స్ కూడా ఈ–కామర్స్‌తో పోల్చదగిన స్థాయిని చేరుకుంటుందని తెలిపారు. ఐపీవో బాటలో ఉన్న జెప్టో 2023–24లో నిర్వహణ ఆదాయం 120 శాతం పెరిగి రూ.4,454 కోట్లకు చేరుకుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జోమాటో బ్లింకిట్ వంటి పోటీ కంపెనీలను అధిగమించింది.
ప్రతి కంపెనీకి సవాలు..
కార్యకలాపాలను అసాధారణంగా అమలు చేయడంపై క్విక్ కామర్స్ విజయం ఆధారపడి ఉంటుందని ఆదిత్ నొక్కిచెప్పారు. ఆ స్థాయిలో అమలు చేయడం ప్రతి కంపెనీకి ఒక సవాలుగా ఉంటుందని అన్నారు. ‘2025లో క్విక్ కామర్స్ యొక్క ప్రాథమిక అంశాలు నాటకీయంగా అభివృద్ధి చెందుతాయి. కస్టమర్ చేసే చెల్లింపులకు తగ్గ విలువ మరింత వేగంగా పెరుగుతుంది. నిర్వహణ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్థికాంశాలు, కార్యక్రమాలు మారతాయి. 2023, 2024తో పోలిస్తే ఈ పరిశ్రమకు క్యాపిటల్ మార్కెట్ వాతావరణం కూడా భిన్నంగా కనిపిస్తుంది’ అని అన్నారు. నమ్మశక్యం కాని రీతిలో 2025 ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో వేదికగా నూతన సంవత్సర అమ్మకాల్లో 200 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు.
రికార్డుల న్యూ ఇయర్..
డిసెంబర్ 31న అత్యధిక విక్రయాలను సాధించామని బ్లింకిట్ ప్రకటించింది. ఒక నిమిషంలో, ఒక గంటలో అత్యధిక ఆర్డర్లతోపాటు.. ఒక రోజులో డెలివరీ భాగస్వాములు అందుకున్న టిప్స్ సైతం అత్యధికమని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా మైక్రో–బ్లాగింగ్ సైట్ ఎక్స్ వేదికగా తెలిపారు. అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయాన్ని భారతీయులు స్వీకరించినందున నూతన సంవత్సర వేడుక రోజున ఒక రోజులో అత్యధికంగా ద్రాక్షలను విక్రయించినట్లు బ్లింకిట్ పేర్కొంది. స్పానిష్ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment