అనగనగా ఒక కొలను.. ఒడ్డు మీద ఒక చింతచెట్టు. ఆ చింతచెట్టు మీద ఒక గద్ద నివసించేది. అది రోజుకో కోడిపిల్లనో, బాతు పిల్లనో ఎత్తుకొచ్చి చెట్టు తొర్రలో దాచేది. అవి చనిపోయి కుళ్ళినాక వాటిని తినేది. కొలనుకు అవతలి ఒడ్డున ఒక కోడి ఉండేది. దానికి అందమైన మూడు బుజ్జి బుజ్జి పిల్లలున్నాయి. ఆకోడి వాటిని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఒకరోజు తన బుజ్జి పిల్లలను వెంటేసుకుని ఇవతలి ఒడ్డుకు బయలుదేరింది. నడుచుకుంటూ పోతూండగా దారిలో ఓ చిట్టి బాతు ఏడుస్తూ కనిపించింది.
కోడి చిట్టి బాతుతో ‘ఎందుకు ఏడుస్తున్నావూ?’అని అడిగింది.
‘నేనూ, మా అక్కా.. అమ్మ నుండి విడిపోయి దారితప్పి ఇటు వచ్చాం’ అంది.
‘మరి మీ అక్క ఎక్కడుంది?’ అడిగింది కోడి.
‘అక్కను గద్ద ఎత్తుకుపోయింది. ఆ చింత చెట్టు తొర్రలో దాచింది’ అంది చిట్టి బాతు.
‘భయపడకు.. నిన్ను మీ అమ్మ దగ్గరకు నేను తీసుకుపోతాను’ అంది కోడి.
ఇంతలో ఆకాశం నుండి వేగంగా గద్దరావటం గమనించింది కోడి. తన రెక్కలచాటున తన బుజ్జి పిల్లలతో పాటు చిట్టి బాతుని దాచింది కోడి. గద్ద వచ్చి కోడి ముందు వాలింది. చిట్టి బాతు కోసం నలుదిక్కులా చూసింది.
‘ఏయ్ కోడీ! నీ పిల్లన్ని చూపించూ?’ అడిగింది గద్ద.
కోడి కోపంగా గద్దను చూసి ‘వెళ్ళు ఇక్కడి నుండి’ అంది.
‘ నీ పిల్లల్ని చూసి వెళతాను. వాటికి ఏ హానీ తలపెట్టనని హామీ యిస్తున్నాను’ అంది గద్ద.
కోడి రెక్కలు విప్పింది. అందులోంచి అందమైన బుల్లి కోడి పిల్లలతో పాటు చిట్టి బాతు బయటకు వచ్చాయి.
బాతు పిల్లని తనకు వదిలేయమంది గద్ద. కానీ కోడి అందుకు అంగీకరించలేదు.
‘చూడూ.. నీ జాతి వేరు, బాతు జాతి వేరు! బాతు పిల్లను నాకు వదిలేయ్’ అంది గద్ద.
అయినా కోడి.. చిట్టి బాతుని వదల లేదు. ‘మా జాతి వేరైనా బాతులు పెట్టే గుడ్లను పొదిగేది మేమే’ అంది కోడి.
గద్ద.. కొద్దిసేపు ఆలోచించి చింత చెట్టు మీదకు ఎగిరింది. తొర్రలోంచి బాతు పిల్లని ముక్కుతో పట్టుకుని నెమ్మదిగా కోడి ముందు వదిలింది.
‘నీలోని తల్లి ప్రేమ నన్ను మార్చింది. ఈ బాతు పిల్లని కూడా తన తల్లి వద్దకు చేర్చు. ఇకపై కేవలం పురుగులు, కుళ్ళిన కళేబరాలనే తింటూ కడుపు నింపుకుంటాను’ అని ఆకాశంలోకి ఎగిరింది గద్ద. కోడి రెండు బాతు పిల్లల్నీ వాటి తల్లి వద్దకు చేర్చటానికి వెనుదిరిగింది.
చదవండి: టీ గారూ.. తమరు సూపరు!
Comments
Please login to add a commentAdd a comment