Why do students commit suicide in IIT Madras? - Sakshi
Sakshi News home page

ఒ‍క్కరు కాదు ఇద్దరు కాదు.. రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?

Published Thu, Apr 27 2023 5:02 PM | Last Updated on Fri, Apr 28 2023 3:20 PM

why do students commit suicide in IIT - Sakshi

👉ఐఐటీ లో సీట్ వచ్చిందంటే" లైఫ్" అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని,  మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు .

👉పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది .. చివరకు సీట్ సాధించేది 16  వేలమంది .

👉అంటే ఐఐటీ లో సీట్ కొట్టిన వారు  త్రీ రోజెస్  టీ లాగ,  "వేలాది లో ఒక్కరు" .

ఐఐటీ లో   విద్యా   ప్రమాణాలు చాలా బాగుంటాయి. కోర్స్ పూర్తి చేస్తే భారీ శాలరీ ప్యాకేజీ తో మంచి ఉద్యోగం ఖాయం. మరి ఆత్మ హత్యలెందుకు ? ఏదో ఒకటి రెండు అయితే ఏదో అనుకోవచ్చు .

ఐఐటీ చెన్నై లో గత రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు . అన్ని  ఐఐటీలలో కలిపి  నాలుగేళ్లలో నలబై దాకా !ఎందుకిలా ?

1 . ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఆరో తరగతి నుంచే పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తున్నారు. దీని వల్ల , వీరిలో గ్రోత్ హార్మోన్ లోపం;  హ్యాపీ హార్మోన్స్ తగినంత  ఉత్పత్తి కావు. విపరీతమైన ఒత్తిడి వల్ల కార్టిసోల్ ఉత్పత్తి  అవుతుంది.  దీని వల్ల  చిరాకు, అసహనం , నిద్ర లేమి , ఆత్మ న్యూనతా భావం, అభద్రత,  కుంగుబాటు లాంటి  నెగటివ్ మానసిక ఉద్వేగభావాలు కలుగుతాయి. ఒక అంచనా ప్రకారం IITలో చదివే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు డిప్రెషన్ లాంటి మానసిక రోగాలతో బాధ పడుతున్నారు.

2. క్రీడలకు దూరం  కావడం వల్ల క్రీడా స్ఫూర్తి కొరవడుతోంది. చిన్న సమస్యకు కుంగిపోతున్నారు

౩. తెలుగు, ఇంగ్లీష్, హిందీ.. ఈ సబ్జెక్టుల్లో అంతర్లీనంగా లైఫ్ స్కిల్స్ పాఠాలుంటాయి. IIT ఫౌండేషన్ లో కేవలం గణితం, భౌతిక శాస్త్రంపై దృష్టి నిలపడం జరుగుతోంది. కేవలం పరీక్ష కోసం తూతూ మంత్రంగా లిటరేచర్ అలాగే సోషల్ స్టడీస్ ను   చదవక పోవడం వల్ల , ఇంగిత జ్ఞానం, సామజిక, భావోద్వేగ తెలివితేటలు లోపిస్తున్నాయి .

పరిష్కారం :

✔️ప్రపంచం లో ఎన్నో ఉత్తమ విద్యా సంస్థలున్నాయి . వాటికీ ప్రవేశ పరీక్షలున్నాయి . ఆ పరీక్షల కోసం మహా అంటే ఆరు నెలలు ప్రిపేర్  అయితే సరిపోతుంది . చిన్నప్పటి నుంచి సంపూరణాత్మక విద్య పొందిన విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ కూడా పెద్దగా అవసరం లేకుండా   పోతుంది.

❌దీనికి భిన్నంగా IIT JEE పరీక్షను రూపొందించారు. ఏళ్ళ తరబడి గణితాన్ని భౌతిక శాస్త్రాన్ని చదివిన వారికి.. అది కూడా క్రీడలు అల్ రౌండ్ డెవెలప్‌మెంట్ లాంటి వాటిని పక్కన పెట్టి,  కోచింగ్ కోళ్లుగా మారిన వారికి మాత్రమే,  ఈ పరీక్ష లో విజయం దక్కేలా  ఆ పరీక్షను డిజైన్ చేసారు.

ఐఐటీ కోచింగ్ వేల కోట్ల ఇండస్ట్రీ. ప్రత్యక్ష పరోక్ష పాత్రధారులు ఎంతో మంది. లబ్ది దారులు ఎంతో మంది. ఏదో అద్భుతం జరిగితే తప్పించి వ్యవస్థ మారదు .

ఆరో తరగతి నుంచే కోట్లాది పిల్లల బాల్యం బుగ్గి పాలవుతోంది.  ఇంటర్ ..  అది ముగిసాక పరీక్ష రాసేవరకు బతుకు పరమ దుర్భరం. బ్రిటిష్ కాలం నాడు పోర్ట్ బ్లెయిర్ లోని సెల్యూలర్ జైలు. నేడు కోట .. ఇంకా  తెలుగు నాట కార్పొరేట్ కోళ్ల ఫారాలు. కోటలో కోటి కన్నీటి కథలు. తెలుగు నాట కోళ్ల ఫారాలలో ఎనెన్నో వ్యధలు.  

అర్జెంటు గా అమెరికాకు వెళ్ళిపోవాలి . అక్కడి డాలర్ లు ఇక్కడికి పంపిస్తే నాలుగు సైట్స్ కొనాలి. అందరితో   గొప్పలు చెప్పుకోవాలి . అటు పై 65 వచ్చే వరకు  రెండేళ్లకు  ఒక సారి అక్కడికెళ్లి వచ్చి నలుగురికి కబుర్లు చెప్పాలి.. ఇదీ  ఆలోచన ... .ఇదీ తీరు 

ఐఐటీ లో చేరొద్దన్నా ? అమెరికా కు వెళ్లొదనా ?
✔️కానే కాదు. ఐఐటీ లు ప్రపంచ స్థాయి సంస్థలు . ఉత్తమ విద్యా ప్రమాణాలు .
✔️అమెరికాకో మరో చోటుకు వెళ్లడం సహజం. మనది నేడు విశ్వ గ్రామం . రానున్నది రోబో యుగం .

❌అమెరికాకో మరో దేశానికి వెళిపోతేనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి .. అక్కడికి పొతే సమస్యలే ఉండవు అనుకోవడమే పెద్ద సమస్య . 

సమస్యలు లేని చోటు సమాధి ఒక్కటే .. సమస్యలు లేని జీవితం నరకం అని తెలుసుకోకపోవడం వీరి అజ్ఞానం. తాను సాధించలేని దాన్ని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని అనుకోవడం. పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోక పోవడం. అన్నిటికీ  మించి "కోచింగ్ కోసం .. కోచింగ్ ద్వారా ... కోచింగ్ మూలంగా" సాగే ఐఐటీ సీట్ ల భర్తీ 

✔️ఐఐటీ లు సంతోష కర జీవనాన్ని సాగించడానికి ఒక మార్గం. ఎవరూ కాదనలేని   సత్యం .  కానీ ఐఐటీ లో సీట్ సాధించడమే జీవితం. ఆ ప్రయత్నం లో పిల్లల మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత  నాశనం అయినా ఫరవాలేదు అనుకొనే సగటు మధ్య తరగతి పేరెంట్ మనస్తత్వం మారనంత వరకు...  ఇండియా లో బాల్యం శాపమే !


వాసిరెడ్డి అమర్ నాథ్,
విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు

చదవండిమహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement