పిల్లల కథ: తన వంతు సాయం | Telugu Kids Story: Helping Nature, Secret Donation is Grand Charity | Sakshi
Sakshi News home page

పిల్లల కథ: తన వంతు సాయం

Published Wed, Jun 22 2022 7:53 PM | Last Updated on Thu, Jun 23 2022 7:21 PM

Telugu Kids Story: Helping Nature, Secret Donation is Grand Charity - Sakshi

గుర్ల అనే గ్రామంలో నివసించే శశిధరుడికి బాగా డబ్బుంది. పండే పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఐతే ఎవరైనా  అవసరం పడి చేయి చాస్తే మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చేవాడు కాదు. ఈ ప్రవర్తన భార్య సుగుణకి నచ్చేది కాదు. ‘మీ మిత్రుడు చరితాత్ముడిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన గుణం ఎంత మంచిది! ఎందరికో ఉత్తి పుణ్యాన దానాలు చేస్తూంటాడు. తను చేసిన దానాలను కూడా ఎవరికీ చాటద్దంటాడు. తన వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ దానాలకే ఖర్చు పెడతారు. గుప్త దానమే గొప్పదంటాడు’ అని భార్య చెప్పాక శశిధరుడిలో ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చింది.

వెంటనే చరితాత్ముడిని కలవడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో పొరుగూరి రైతులు తమకు పంట నష్టం వచ్చిందని చెప్పి ఆదుకోమంటున్నారు చరితాత్ముడిని. ‘నేను మిమ్మల్ని ఆదుకున్న సంగతి బైటకు పొక్కనీయవద్దు. ఆ షరతు మీదే మీకు సాయపడగలను’ అని చెప్పాడు చరితాత్ముడు రైతులతో. దానికి వాళ్లు అంగీకరించి చరితాత్ముడి దగ్గర ధన సహాయం తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు శశిధరుడి రాకను గమనించి ‘మిత్రమా! చాలాకాలం తరువాత ఇలా దర్శనమిచ్చావేంటి?’ అంటూ మిత్రుడిని ఆహ్వానించాడు చరితాత్ముడు.

‘నేనొక విషయం విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. ఎన్ని దానాలు చేసినప్పటికీ పైకి చెప్పవద్దని అంటావెందుకో? నీకు పేరు రావాలని ఉండదా? ’ సందేహం వెలిబుచ్చాడు శశిధరుడు.

‘నా దృష్టిలో గుప్తదానమే మహాదానం. అది అవతలి వారిని అవసరంలో ఆదుకోవడానికే తప్ప మన గొప్ప చెప్పుకోడానికి కాదని నా ఉద్దేశం’ నిరాడంబరంగా చెప్పాడు చరితాత్ముడు.

‘నీ గుణం గొప్పదే కావచ్చు కాని ఇన్ని దానాలు చేస్తున్నప్పటికీ ఎవరికీ ఆ విలువ తెలియకపోవడం చూసి చింతిస్తున్నాను. అందువలన నువ్వు నాకొక సాయం చేయాలి’ అడిగాడు  శశిధరుడు.

ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు  చరితాత్ముడు. 
‘ నువ్వు చేస్తున్న దానాలకు నీ పేరెలాగూ వద్దంటున్నావు. నీకు అభ్యంతరం లేకుంటే.. ఇకనుండీ నువ్వు ఏ దానం చేసినా అది నాదిగా చెప్పుకుంటాను. వాళ్లంతా నేనే దానం చేస్తున్నట్లుగా చెప్పుకుని నన్ను కీర్తిస్తారు. నా గురించి అందరూ గొప్పగా అనుకోవడం నాకు ఎంతో ఇష్టం’ అంటూ తన మనసులో కోరికను బైటపెట్టాడు శశిధరుడు. దానికి చరితాత్ముడు ‘నాకు కీర్తి కాంక్ష లేనప్పుడు అది నీకు దక్కితే నాకేమీ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేస్తున్నది నువ్వేగాని నేనన్నది బైటపడకూడదు. దానికి కూడా నువ్వు ఒప్పుకోవాలి’ అని స్పష్టం చేశాడు. అంగీకరించాడు శశిధరుడు.

ఆరోజు మొదలు చరితాత్ముడు తన దగ్గరకొచ్చిన వారికి  ఏ దానమిచ్చినా సరే అది శశిధరుడిదనే చెప్పేవాడు. అలాగే వాళ్ళు కూడా  బైట చెప్పడం మొదలెట్టారు. ఈ విషయం ఊరూవాడా పాకింది. ఇంతకాలం ఏనాడూ ఎవరికీ దానాలు చేయడం చూడని శశిధరుడిలో మార్పు రావడం వింత విషయంగా తోచింది అందరికీ. 

ఇలా ఉండగా కొంతకాలానికి చరితాత్ముడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ పరిస్థితిలో దానం కోసం ఎవరైనా వచ్చినప్పటికీ అడగడానికి సంకోచించేవారు. ఐతే చరితాత్ముడి భార్య సుమతి ‘మావారి పరిస్థితి బాగులేదన్నది మీకు తెలుసు.  శశిధరుడు దానాలు చేస్తున్న సంగతి మా వారు ఇటీవల చెప్పడం నాకు తెలుసు. అందువలన ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళండి. తప్పకుండా సహాయపడతాడు’ అని పంపించడం మొదలెట్టింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్లంతా తిన్నగా శశిధరుడి దగ్గరకు పోయి ‘ఇంతదాకా మీరు చేస్తున్న దానాల గురించి వింటూనే ఉన్నాం. మీరు తప్పకుండా సాయం చేయాలి’ అంటూ చేయిచాచసాగారు. గతుక్కుమన్నాడు శశిధరుడు. ఇంతవరకూ తను చేసిన దానధర్మాలు చరితాత్ముడివేనని చెప్పలేక, తను సహాయపడతానని మాటివ్వలేక గిలగిలలాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఊళ్ళోకి వరదలొచ్చి కొందరి ఇళ్ళు కొట్టుకుపోయాయి.

అప్పుడు కొందరు ఊరిపెద్దలు శశిధరుడి దగ్గరకొచ్చి ‘ఇళ్ళు కోల్పోయిన కొందరికి ఇళ్లను కట్టించడానికి అందరినీ సాయమడుగుతున్నాం. మీరెలాగూ దానకర్ణులుగా పేరుబడ్డారు. మీ వాటా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంతకాలం అయాచితంగా తనకు పేరొచ్చింది. ఇప్పుడు తన ఆస్తిలోంచి తీసివ్వడానికి మనసొప్పటంలేదు శశిధరుడికి. భర్త వాలకం కనిపెట్టిన సుగుణ ‘ఒకరి డబ్బుతో చేసిన దానాలను మీవిగా చెప్పుకుని మురిసిపోయారు. తీరా ఇప్పుడు నిజంగా మీరు చేయాల్సి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం మానవత్వమని పించుకుంటుంది. దయచేసి మీలో మార్పు తెచ్చుకోండి’ అని సున్నితంగా మందలించింది. 

ఇంతదాకా వచ్చి ఇప్పుడు కుదరదు అంటే అయాచితంగా తనకు వచ్చిన మంచిపేరు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవడమే ధర్మమనిపించింది. మరో ఆలోచనకి తావివ్వకుండా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోడానికి తన వంతు సాయంగా భారీగానే ముట్టచెప్పాడు శశిధరుడు. భర్తలో మార్పు చూసిన భార్య సుగుణ ఎంతగానో సంతోషించింది. (క్లిక్‌: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement