నిజాయితీకి లభించిన బహుమానం | Worker And Shop Owner: Moral Story | Sakshi
Sakshi News home page

నిజాయితీకి లభించిన బహుమానం

Published Sun, Dec 5 2021 8:56 PM | Last Updated on Sun, Dec 5 2021 8:56 PM

Worker And Shop Owner: Moral Story - Sakshi

రామాపురం అనే గ్రామంలో కిరాణా వ్యాపారస్తుడైన సుబ్బయ్యకు నిజాయితీపరుడు అనే పేరుంది. వయసు మీదపడటంతో సుబ్బయ్య  తప్పుకుని తన కొడుకు రాజేశ్‌కి వ్యాపారాన్ని అప్పగించాడు. సుబ్బయ్య కిరాణా వ్యాపారం చేసేటప్పటి నుండి ఆ దుకాణంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వీరయ్య.. రాజేశ్‌కి కూడా  చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందుకే రాజేశ్‌ హాయంలో కూడా కిరాణా వ్యాపారం నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయింది.

అయితే వీరయ్యకి కూడా వయసు మీద పడటంతో కొంతకాలానికి పని మానివేశాడు. దాంతో రాజేశ్‌కి తన కిరాణా దుకాణంలో పనిచేయడానికి ఒక నమ్మకస్తుడైన పనివాడి అవసరం పడింది. పనివాని ఎంపికలో రాజేశ్, తన తండ్రి సలహా కోరాడు. ఆ విషయాన్ని సుబ్బయ్య తన స్నేహితులకి చెప్పటంతో వాళ్ళు తమకు తెలిసిన పనివాళ్ళని సుబ్బయ్య దగ్గరకి పంపారు.

అనేక రకాల వడపోతల తర్వాత తమ కిరాణా వ్యాపారంలోకి ఉపయోగపడతారు అనుకునే ఇద్దరిని ప్రాథమికంగా ఎంపిక చేశాడు సుబ్బయ్య. వారిద్దరి పేర్లు వినయ్, సతీశ్‌. ‘ఆ ఇద్దరిలోంచి ఒకరిని ఎంపిక చేసుకో. వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి అప్పగించిన పని వాళ్లు చేస్తున్నప్పుడు  ఆ ఇద్దరినీ  నిశితంగా పరిశీలించ’మనీ రాజేశ్‌కి వివరించాడు సుబ్బయ్య. ముందుగా వినయ్‌ని పిలిచి ‘నెలకు ఎంత జీతం కావాలి?’ అని అడిగాడు సుబ్బయ్య.  

‘తమరు ఎంత ఇస్తే అంతే చాలు బాబయ్యా!’ సమాధానమిచ్చాడు వినయ్‌. ‘సరే..ఓ రెండు రోజులు కిరాణా దుకాణంలో ఉండి చెప్పిన పనులు చేయి, దాన్ని బట్టే నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు.  ‘అయితే రేపే వచ్చి పనిలో చేరతాను’ అని వినయ్‌ సెలవు తీసుకున్నాడు. ‘రేపు వినయ్‌ దుకాణానికి వచ్చాక  ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో చూపించి అప్పుడప్పుడు గల్లా పెట్టెకి తాళం వేసి ఇంట్లోకి వెళ్లొస్తూ ఎవరైనా సరుకులకు వస్తే ఆ ప్యాకెట్స్‌ పై ఉన్న ధర తీసుకుని, ఆ డబ్బుని నీకు ఇమ్మని చెప్పు. అలాగే చిల్లర ఒక పదిరూపాయలు పైన ఉంచు’ అంటూ రాజేశ్‌కి సలహా ఇచ్చాడు సుబ్బయ్య.

మరుసటి రోజు వినయ్‌ వచ్చాక  తండ్రి చెప్పినట్లే చేశాడు రాజేశ్‌. మధ్య మధ్యలో ఇంట్లోకి  వెళ్లొచ్చినప్పుడల్లా  తను  ఏఏ వస్తువులను అమ్మాడో, ఎంత డబ్బు వచ్చిందో రాజేశ్‌ చేతికిచ్చేవాడు వినయ్‌. ఆ విషయాన్నే రాత్రి తండ్రికి చెప్పాడు రాజేశ్‌. ‘రేపు వినయ్‌ వచ్చాక నా దగ్గరకు పంపించు’ అని చెప్పాడు సుబ్బయ్య. అతను చెప్పినట్టే మరుసటి రోజు వినయ్‌ రాగానే అతనిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజేశ్‌. వినయ్‌ని ఉద్దేశించి సుబ్బయ్య ‘ఈ రోజు మన ఎలక్ట్రానిక్‌ కాటాని ఉపయోగించి సరుకులు అరకేజీ, కేజీల చొప్పున ఆ కవర్లలో ప్యాక్‌ చేయాలి.

అలా ప్యాక్‌ చేసేటపుడు అరకేజీ ప్యాకెట్లలోంచి ఓ పది గ్రాముల చొప్పున, కేజీ ప్యాకెట్లలోంచి ఇరవై గ్రాముల చొప్పున ఆ సరుకులు తీసేసి ప్యాక్‌ చేయాలి. తెలిసిందా? ఈవాళ్టికి అరకేజీ ప్యాకెట్లు ఒక అయిదు, కేజీ ప్యాకెట్లు ఒక అయిదు ప్యాక్‌ చేసి తరువాత కొట్లో పనిచూసుకో’ అని పురమాయించాడు. ‘అలాగేనండి’ అంటూ సుబ్బయ్య చెప్పినట్లుగానే ప్యాక్‌ చేసి వాటిని సుబ్బయ్యకి అప్పజెప్పి కిరాణా దుకాణంలోకి వెళ్ళిపోయాడు వినయ్‌.

ఈ వ్యవహారాన్నంతా రాజేశ్‌ పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆ రోజు పని పూర్తి అయిన తరువాత వినయ్‌ని పిలిచి ఆ రెండురోజులకు ఇవ్వాల్సిన మొత్తం కన్నా ఎక్కువ  మొత్తాన్ని ముట్టజెప్పి, తరువాత రెండు రోజులు సతీశ్‌ పనితీరును కూడా పరిశీలించి , ఇద్దరి పనితీరును బేరీజు వేసుకుని కబురు చేస్తానని పంపించివేశాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సతీశ్‌కి కబురుపెట్టాడు.

వినయ్‌ని అడిగినట్టే సతీశ్‌నీ అడిగాడు సుబ్బయ్య ‘ నెలకు ఎంత జీతం కావాలి?’ అని. ‘మూడువేలు ఇవ్వగలిగితే చేయగలను’ బదులిచ్చాడు సతీశ్‌. వినయ్‌కి చెప్పినట్లుగానే ‘సరే, ఒక రెండు రోజులు కిరాణా దుకాణంలో  చెప్పిన పనులు చేశాక దానిని బట్టి నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు సుబ్బయ్య. ‘సరేనండి, రేపే వచ్చి పనిలో చేరతాను’ అంటూ సెలవు తీసుకున్నాడు సతీశ్‌.

అప్పుడు రాజేశ్‌తో ‘వినయ్‌ విషయంలో మొదటి రోజు ఏం చెప్పి చేయమన్నానో,అలాగే సతీశ్‌కీ చెప్పి చేయించు’ అన్నాడు సుబ్బయ్య. మరుసటి రోజు సతీశ్‌ రాగానే  సుబ్బయ్య చెప్పినట్టే చేసి.. జరిగినదంతా ఆ రోజు రాత్రి తండ్రికి వివరించాడు రాజేశ్‌. 

‘రేపు సతీశ్‌ రాగానే నా దగ్గరకు తీసుకురా’ అని రాజేశ్‌కి పురమాయించాడు సుబ్బయ్య. తండ్రి అడిగినట్టుగానే తెల్లవారి సతీశ్‌ రాగానే అతణ్ణి  తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు రాజేశ్‌. తూకం, ప్యాకింగ్‌ విషయంలో వినయ్‌కి పురమాయించినట్టే సతీశ్‌కీ పురమాయించాడు సుబ్బయ్య. విన్నవెంటనే సతీశ్‌ ‘ఇటువంటి పనులు నేనెంత మాత్రం చేయను, చేయలేను. నిన్న పనిచేసినందుకు గానూ వందరూపాయలు ఇప్పించండి వెళ్ళిపోతాను’అన్నాడు.

 ‘సరే, ఈ పని చేయవద్దులే. నువ్వు అడిగినట్లే మూడువేల రూపాయలు ఇస్తాను. నిన్నటి నుంచి నువ్వు పనిలో చేరినట్లే. పో.. పోయి కొట్లో పనులు చూసుకో’ అన్నాడు సుబ్బయ్య. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న రాజేశ్‌తో ‘రానవసరంలేదని వినయ్‌కి కబురు పెట్టు’ అని సుబ్బయ్య అనడంతో కొడుకు విస్తుపోయాడు. ‘అదేంటి జీతం ఎంతిస్తే అంతకు ఒప్పుకొని, చెప్పిన పనిని తు.చ తప్పకుండా చేసిన వినయ్‌ని వద్దని కరాఖండిగా ఇంత జీతం ఇవ్వమని అడగటమే కాకుండా, చెప్పిన పని చేయనని తృణీకరించిన సతీశ్‌ని పనిలో పెట్టుకున్నారేంటి ’ అని తండ్రిని అడిగాడు రాజేశ్‌. 

‘వినయ్‌ పనిచేసిన రెండురోజుల్లో మొదటిరోజు కొట్లో నువ్వు లేనప్పుడు సరుకులు కొనమని నా స్నేహితున్ని పంపి ‘మా కొట్లో పనిచేసే వాడిని ముప్పై రూపాయల పంచదార ప్యాకెట్‌  ఇవ్వమని అడిగి నలభైరూపాయలు ఇచ్చి ‘ఇవిగో ముప్పై రూపాయలు..సరిగా చూసుకో’ అని చెప్పమన్నాను. ‘పొరపాటున పది రూపాయలు ఎక్కువిచ్చేశారు’ అని వెనక్కి ఇచ్చేసినా లేదూ చూసుకుని కూడా  తిరిగి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా వచ్చి నాకు చెప్పమన్నాను.

వినయ్‌ అతనితో ‘సరిపోయింది’ అని చెప్పి నీకు డబ్బు అప్పచెప్పేటప్పుడు ఆ పదిరూపాయలను తన దగ్గరే ఉంచేసుకున్నాడు. అలాగే రెండో రోజు నేను చెప్పినట్లుగా అది తప్పు పనైనా ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు వినయ్‌. జీతం ఎంతిస్తే అంతే చాలనుకునే దాని వెనుక.. ఇదుగో ఇటువంటి మోసాలు చేస్తూ సంపాదించుకోవచ్చన్న ధీమా అన్నమాట. అదే సతీశ్‌ విషయానికొచ్చేసరికి మొదటిరోజు నా స్నేహితుడు పదిరూపాయలు ఎక్కువ ఇస్తే  పదిరూపాయలు ఎక్కువ ఇచ్చారని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, రెండో రోజు నేను చెప్పిన అవినీతి పనిని చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడక తన ఒక రోజు కష్టానికి మాత్రమే ప్రతిఫలం ఇమ్మని అడిగాడు.

ఇక నిక్కచ్చిగా ఇంతే జీతం ఇవ్వమని అడగడానికి కారణం అతని నిజాయితీయే. అటువంటి నమ్మకస్తుడు, నిజాయితీపరుడే మనకు కావలసినవాడు. అందుకే అతనిని పనిలోకి తీసుకున్నది’ అని చెప్పిన తండ్రి వివరణకు అబ్బురపడ్డాడు రాజేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement