అతడొక బీదవాడు. పేదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి ’నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. అనవసరంగా కష్టాలపాలవుతావు.’ అన్నాడు.
బీదవాడు వినకపోవడంతో ‘నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... దానికి తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది’ అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
సెలవు తీసుకుని వెళ్లి శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. కొన్ని రోజులు తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది.
‘ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇక మీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను’ అన్నది.
‘అయితే నాకో రాజభవనం కట్టించు’ అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. ‘మరేం చేయాలో చెప్పు’ అన్నది భూతం.
‘సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు’ అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది.
బీదవాడు దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లి.. ‘స్వామీ, నన్ను కాపాడండి’ అంటూ పాదాల మీద పడ్డాడు. ‘అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు’ అన్నాడు మహాత్ముడు.
బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. ‘వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి’ అన్నాడు. భూతం ‘ఇదేం పెద్దపని!’ అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్లీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, ‘ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను’ అన్నదా భూతం. బీదవాడు సమ్మతించాడు. ‘బతికాను’ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పింది భూతం. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
(డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కథల నుంచి)
Comments
Please login to add a commentAdd a comment