ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.
ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'?
అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.
'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్‌లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్‌ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment