ఆచరిస్తే..అద్భుతాలే.!
ఆచరిస్తే..అద్భుతాలే.!
Published Wed, Nov 9 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
డీటూహెచ్, ఆన్‌లైన్ శిక్షణతో బహుముఖ ప్రయోజనం.
భానుగుడి(కాకినాడ) : జేఈఈ అడ్వాన్‌డ్, జేఈఈ మెయిన్, ఐఐటీ శిక్షణలపేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న కోట్లాది రూపాయల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆయా పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకులతో టీవీల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఐఐటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ లెర్నింగ్ (ఐఐటీ–పాల్) పథకాన్ని రూపొందించింది. ఈ టీవీ ఆధారిత శిక్షణాతరగతులను విద్యార్ధులు వినియోగించుకుంటే అధ్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జనవరి ఒకటి నుంచి ప్రారంభం
జనవరి–1 నుంచి దేశవ్యాప్తంగా ఈ విద్యాపథకం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రవేశాలకు శిక్షణ పొందే విద్యార్థులకు స్వయం ప్రభ విద్యాచానళ్ల ద్వారా ఉచిత టీవీ ఆధారిత శిక్షణ ఇవ్వనున్నారు. నాలుగు స్వయంప్రభ విద్యా చానళ్ల ద్వారా విద్యార్థులకు అవసరమయ్యే గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను ప్రతి సబ్జెక్టుకు 200 తరగతుల వరకు ఉండేలా ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశా రు. సబ్జెక్టులో వచ్చే సందేహాల నివృత్తికి ఆన్ లైన్లో సమాధానాలు సబ్జెక్టు నిపుణులు ఇస్తారు. ఈ పరీక్షలకు యేటా రాష్ట్రం నుంచి లక్ష మంది విద్యార్థులు సిద్ధమవుతుండగా, మన జిల్లానుంచి 12–15 వేల మంది విద్యార్థులు రూ.లక్షలు వెచ్చించి పరీక్షలకు సిద్దమవుతున్నట్లు అంచనా.
బడుగు విద్యార్థులకు అధిక ప్రయోజనం
బడుగు విద్యార్థులు జేఈఈ అడ్వాన్‌డ్ పరీక్షలకు సన్నద్ధమవ్వాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఇదొక సదావకాశం. జిల్లాలో42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 ఎయిడెడ్ కళాశాలలున్నాయి. 21,738 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 11,600 మంది సైన్సు గ్రూపు విద్యార్థులున్నారు. ఎంసెట్‌తో సహా, ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులు వందల్లోనే. ఆయా కళాశాలల్లో వీటికి సంబం«ధించిన భోధన జరగకపోవడం, విద్యార్థులు బయట తరగతులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడం కారణంగానే నైపుణ్యం ఉన్నా పరీక్షలకు సన్నద్ధమవడం లేదు. ప్రస్తుత విధానంతో ఆ ఇబ్బంది తీరనుంది.
– విప్పర్తి సోమశేఖర్, ప్రిన్సిపాల్, పీఆర్ జూనియర్ కళాశాల, కాకినాడ
ఆచరణ ముఖ్యం
ప్రస్తుత పథకాన్ని విద్యార్థులు ఆచరణలో పెట్టాలి. ప్రతీరోజూ ఈ తరగతులకు హాజరుకావడం దినచర్యలో భాగంగా టైంటేబుల్ ఏర్పాటు చేసుకుని సన్నద్ధం కావాలి. ప్రభుత్వ కళాశాలల్లో మెరికల్లాంటి విద్యార్థులున్నారు. వీరికి కనీసం మెటీరియల్ కొనుక్కోవడానికే డబ్బులు లేని పరిస్థితి ఉంది. వారికి ఈ పథకం అద్భుతంగా ఉపయోగపడుతుంది. – అరుంధతి, కెమిస్ట్రీ అధ్యాపకురాలు
ప్రింటెడ్ మెటీరియల్‌ను అందివ్వాలి
విద్యార్థులకు ఆన్‌లైన్ లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వినే వెసులుబాటు ఉంది. విద్యార్థులకు ప్రింటెడ్ మెటీరియల్‌ను అందిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం. ఎక్కువ సందేహాలు వచ్చే ఫిజిక్స్‌లో కాంతి, ఉష్ణం, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితంలో డెరివేటివ్స్ ఇలా పలు అంశాల్లో లోతుగా నిపుణులు అధ్యయనంతో చేసే భోధన అన్నివిధాలుగా మేలు జరుగుతుంది.
కే.ఎస్.ఎస్.రాజ్‌కుమార్, ఫిజిక్స్ అధ్యాపకులు
మంచి నిర్ణయం
ప్రభుత్వం ఐఐటీ, జేఈఈల కోసం ప్రత్యే క తరగతులను ఈ –లెర్నింగ్ విధానం ద్వారా అందివ్వాలన్న ఆలోచన చాలా మం చిది. ఈ కాంపిటేటివ్ పరీక్షలకు మేథస్సుతో పాటుగా, సకాలంలో స్పందించే నైపుణ్యం కావాలి. దానికి ప్రత్యేక శిక్షణ తప్పనిసరి. ఈ శిక్షణ ప్రభుత్వ కళాశాలల్లో లేదు. ప్రస్తుత పథకంతో పేద విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్ర యోజనం చేకూరుతుంది. – లక్ష్మినారాయణ, పీఆర్‌జీ ఫిజిక్స్ అధ్యాపకులు.
Advertisement