ఉన్న దానితో సంతృప్తి చెందాలి అందలాలు ఆశించకూడదు అనే సనాతన భావాలను నేటి తరం తోసిరాజంటున్నారు. నిలబడి తాగే నీళ్లు తమకు వద్దని పరుగెత్తయినా పాలే తాగుతామని చెబుతున్నారు. ఐదు, ఆరు అంకెల జీతాలు, హోదాలు అందుకున్నా అక్కడితో ఆగిపోవడం చేత కాదని, ఎదుగుదల అనేది నిర్విరామ ప్రయత్నమని స్పష్టం చేస్తున్నారు. అత్యుత్తమ ఆదాయాలు, హోదాలు ఆశిస్తూ తమ నైపుణ్యాలకు సానపట్టడంలో మన ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా ముందున్నారని నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌పై నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది.
–సాక్షి, హైదరాబాద్
తమకున్న నైపుణ్యాలు, అవి తెచ్చిపెట్టిన ఉపాధి, ఆదాయాలతో ఐటీ సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు సరిపుచ్చుకోవడం లేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ తమ సామర్థ్యాలను పదను పెట్టుకోవాలని మరింత మెరుగైన స్థితిని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అన్ని దేశాల కన్నా మనవాళ్లు ముందే ఉన్నారని ప్రముఖ ఎడ్ టెక్ ప్లాట్ ఫామ్ అయిన గ్రేట్ లెర్నింగ్...తన ‘అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివే...
♦ కెరీర్లలో ఎదుగుదల కోసం మన దేశంలో 85% మంది ప్రొఫెషనల్స్ అప్ స్కిల్లింగ్ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తుంటే, అంతర్జాతీయంగా ఈ సగటు 76%గా ఉంది. ఇక అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రొఫెషనల్స్‌లో 64% మంది మాత్రమే అప్ స్కిల్లింగ్‌కు సై అంటున్నారు.
♦ మన ప్రొఫెషనల్స్ లో 71 % మంది తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉండగా, ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 59% మాత్రమే.
♦ ఈ ఏడాది తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో అంతర్జాతీయంగా చూస్తే లాటిన్ అమెరికా అత్యంత తక్కువ ఆత్మ విశ్వాస శాతాన్ని (44%) కలిగి ఉంది.
♦ భారతదేశం, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో ఆఫీస్ వర్క్ అనేది ప్రొఫెషనల్స్ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోంది. అదే సమయంలో అమెరికా, పశ్చిమాసియాలలో కుటుంబ బాధ్యతలు అనేవి ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావడంలో అడ్డంకిగా ఉన్నాయి.
♦అప్ స్కిల్ కావడంలో ప్రొఫెషనల్స్‌కు ప్రేరణ కలిగించే అంశాల్లో పని చేస్తున్న సంస్థలో పెద్ద హోదా ప్రధాన కారణం కాగా, వ్యక్తిగత ఆస్తులు రెండో కారణంగా నిలిచింది. కొత్త ఉద్యోగాన్ని పొందడం అనేది 3వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment