నేర్చుకో.. లాభాలు అందుకో | Investing with the help of learning apps | Sakshi
Sakshi News home page

నేర్చుకో.. లాభాలు అందుకో

Published Sat, Oct 23 2021 5:54 AM | Last Updated on Sat, Oct 23 2021 5:54 AM

Investing with the help of learning apps - Sakshi

ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్‌ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్‌ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్‌’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది.

అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్‌ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్‌ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్‌ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం.

మహిళలకు ప్రత్యేకంగా..  
పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్‌’ యాప్‌. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్‌ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్‌ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్‌ఫామ్‌లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్‌ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్‌ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్‌’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్‌ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్‌’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్‌ వెల్లడించారు.

సొంత సామర్థ్యాలపై ఆసక్తి
నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్‌యాప్‌ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్‌ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది.   

నాణ్యతపై దృష్టి..
ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్‌ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చైర్మన్‌ రామ్‌దియో అగర్వాల్, బీఎస్‌ఈ సీఈవో ఆశిష్‌ చౌహాన్, ఎడెల్‌వీజ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్‌ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఈవో ఉత్పల్‌సేత్‌ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్‌ తెలిపారు. లెర్న్‌యాప్‌ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్‌ సింగ్‌ చెప్పడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement