learning skills
-
బైజూస్ బోధన..ఉచితంగా నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థిని ఇంగ్లిష్ మీడియంలో తీర్చిదిద్దేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రైవేట్‌గా ఈ తరహా విద్యాబోధనకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ తరహా విద్యను ప్రారంభించి ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలలంటే ఆకర్షించే తరగతి గదులు, మౌలిక వసతులే కాకుండా నాణ్యమైన విద్య సైతం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే నాడు–నేడుతో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఉండే విధంగా జిల్లాలో 51 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. దీంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు జిల్లాలో 17 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్ ఎడ్టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 4వ తరగతి నుంచి బైజూస్ ద్వారాా ఆన్లైన్లో వీడియో పాఠాలు బోధన అందించే విధంగా చర్యలు చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఉచితంగా నాణ్యమైన విద్య ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు 1,42,907 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బైజూస్ అప్లికేషన్ ద్వారా తరగతికి సంబంధించి కంటెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు. బైజూస్యాప్తో విద్యాబోధన అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఈ యాప్‌తో పాటు ఇంగ్లిషు లెర్నింగ్ యాప్‌ను ఉచితంగా అందజేస్తోంది. పర్చువల్ పద్ధతిలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా యాప్‌ను రూపకల్పన చేశారు. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫిక్స్ ద్వారా విద్యార్థులు బోధనను మరింత సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. సోషల్, సైన్స్, మ్యాథ్స్ తదితర సబ్జెక్ట్లన్నింటిని ఇంగ్లిష్తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో విద్యార్థులు భాషా పరంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా సులభంగా అర్థం చేసుకోగలరు. వీడియో పాఠాలు నాణ్యతతో పాటు స్పష్టతతో ఉంటాయి. నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ప్రశ్నలు యాప్‌లో పొందుపరిచారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రొగ్రెస్ రిపోర్టు ఇవ్వనున్నారు. బైజూస్ యాప్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అటువంటిది ఉచితంగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో 85,572 మంది బైజూస్ ప్రీమియం యాప్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే యాప్ ద్వారా విద్యాబోధన ప్రారంభమైంది. 21,092 మందికి ఉచితంగా ట్యాబ్‌లు బైజూస్ వీడియో పాఠాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 21,092 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేయనున్నారు. ట్యాబ్‌లను ఈ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బయట మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర 19,446 ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.12,843లకే అందుబాటులోకి తీసుకురానుంది. బైజూస్ కంటెంట్‌కు ఒక్కో విద్యార్థిపై తరగతి బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు. వీళ్లు 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతికి వెళ్లే సమయంలో ఆయా తరగతి సబ్జెక్ట్‌లకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. విద్యార్థులకు బైజూస్ ప్లాట్‌ఫాం లాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ప్లాట్‌ఫాం లాంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం అభినందనీయం. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. వీడియో పాఠాల ద్వారా బైజూస్ సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అందిస్తోంది. రివిజన్‌కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. – సుబ్బారావు, ఇన్చార్జి డీఈఓ -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
అభ్యాస అవంతిక
పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్’ అని ఓ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక. గుర్తించడమే నాంది ఈ శిక్షణా ప్రోగ్రామ్ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్‌ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది. మానసిక నిపుణుల సాయం అవంతిక తన ఆలోచనను క్లాస్‌మేట్స్‌తో పంచుకుంది. క్లాస్మేట్ నమితా థాపర్, అతీత్ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్ ఉద్యోగి గరిమా జిందాల్‌లు అవంతిక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్’ అనే పరిశోధన ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజైన్ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాష్కార్డ్లతో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక. వివరణాత్మక ప్రోగ్రామ్ అవంతిక తన ప్రోగ్రామ్ బాక్స్ గురించి వివరిస్తూ ‘బాక్స్‌లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్ టచ్ అండ్ ఫీల్ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్ కార్డ్ లో ఒక సర్కిల్ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్‌తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది. బహుమతిగా కార్డు బాక్స్ ఈ కార్డు బాక్స్‌ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్ బాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్ ప్యాక్‌ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు. అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్‌ను కొనుగోలు చేశాయి. డే వన్ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక. -
డిజిటల్ స్కిల్స్‌కు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా తెచ్చిన సంక్షోభం ఐటీ నిపుణులను కొత్త కోర్సుల వైపు ఆసక్తి చూపేలా చేస్తోంది. భారతలో అనేక మంది ప్రొఫెనషల్స్ డిజిటల్ స్కిల్స్, రిమోట్ వర్కింగ్స్ కోర్సులు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. అలాగే భారత్‌లో వర్చువల్ లెర్నింగ్ కోసం గడిపిన గంటలు గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో 245శాతం పెరిగినట్లు పేర్కొంది. లింక్డ్ఇన్ ఈ ఏడాదిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోర్సుల జాబితాను విడుదల చేసింది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వినూత్న కోర్సులు నేర్చుకునే అభ్యాసకుల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్ల తెలిపింది. మనదేశంలో అత్యధికంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్సు పట్ల ఫ్రొఫెషనల్స్ ఆసక్తి చూపగా, తర్వాత స్థానంలో టైమ్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. వాస్తవానికి, గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో లెర్నింగ్ అవర్స్ 3 రెట్ల కన్నా ఎక్కువ పెరిగినట్లు లింక్డ్ఇన్ లెర్నింగ్ డేటా స్పష్టంచేస్తోందని’’ అని లింక్డ్ఇన్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచీ ఆనంద్ అన్నారు. ఇక అంతర్జాతీయంగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అచీవ్ కోర్సు ప్రథమస్థానంలో ఉండగా, వర్క్ బెటర్ రిమోట్లీ కోర్సు ద్వితీయ స్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లిష్, మ్యాథ్స్.. చాలా ఈజీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యా రంగంలో స్టార్టప్స్ అంటే? స్కూల్ సిలబస్‌ను స్మార్ట్ఫోన్లలోకి తీసుకొచ్చినవి.. ఆన్లైన్లో ఫీజులు, పాఠశాల నిర్వహణ చేసేవి.. లంచ్ బాక్స్‌లు అందించేవి..., స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం రుణాలిచ్చేవి... ఇలా చాలా ఉన్నాయి. కానీ, దేశంలో తొలిసారిగా వ్యక్తిగత విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన ‘360 లెర్నింగే!’. అందులోనూ ఇంగ్లిష్, గణితం వంటి కీలక సబ్జెక్ట్స్ వర్క్‌షీట్స్‌ను కూడా అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జితేంద్ర మాచిరాజు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. బీటెక్ పూర్తయ్యాక ఎక్స్‌సీడ్ ఎడ్యుకేషన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశా. తర్వాత హయత్‌నగర్, చంపాపేట్‌లో సొంతంగా స్కూల్స్ పెట్టా. ఎక్స్సీడ్లో, స్కూల్స్‌లో ఉన్న సమయంలో గమనించిందేమిటంటే? విదేశాల్లో మాదిరిగా ఇక్కడి పాఠశాలల్లో వ్యక్తిగత అభ్యసన ప్రక్రియలు లేవు. దీనివల్లే విద్యార్థుల విద్యా విధానంలో తేడాలొస్తున్నాయని గమనించా! దీన్ని అధిగమించాలంటే స్టూడెంట్స్‌కు పర్సనల్ లెర్నింగ్ కావాలి. అందుకే మిత్రుడు కర్నాటి ప్రమోద్ కుమార్‌తో కలిసి 2015 నవంబర్ 14న రూ.10 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 360 లెర్నింగ్ఎడ్యుటెక్.కామ్‌ను ప్రారంభించాం. ఇంటికే వర్క్‌షీట్స్.. ప్రస్తుతం 3 నుంచి 13 ఏళ్ల వయస్సు విద్యార్థులు లేదా 8వ తరగతి లోపు విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్స్ వర్క్‌షీట్స్ అందిస్తున్నాం. పోటీ పరీక్షలతో సహా దేనికైనా మ్యాథ్స్, ఇంగ్లిష్‌పై పట్టుండాలి. అందుకే ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశాం. విద్యార్థి పరిజ్ఞానం, అభ్యసన తీరును బట్టి ఒక్కొక్క విద్యార్థికి ప్రత్యేకంగా వర్క్‌షీట్స్‌ను రూపొందిస్తాం. ఇందుకోసం 8 మంది నిపుణుల బృందం ఉంది. ఇందులో సబ్జెక్ట్స్ నిపుణులతో పాటూ పిల్లల మానసిక వేత్తలూ ఉంటారు. వర్క్‌షీట్స్‌ను పరిష్కరించేటపుడు ఏమైనా సందేహాలొస్తే... వీడియోకాల్ ద్వారా నిపుణులు అందుబాటులోకి వస్తారు. ప్రతి వారం విద్యార్థికి వ్యక్తిగత వర్క్‌షీట్స్‌ను ఇంటికి తీసుకెళ్లి ఇస్తాం. వాటి ని పరిష్కరించాక నిపుణుల బృందం పరిశీలిస్తుంది. తర్వాత విద్యార్థి అభ్యసన శక్తిని అంచనా వేసి వేరే వర్క్‌షీట్స్ అందిస్తుంటాం. 5 నెలలకు రూ.5 వేలు.. ప్రస్తుతం 360 లెర్నింగ్‌లో 3,500 మంది విద్యార్థులున్నారు. ఒక్క విద్యార్థికి ఒక్క సబ్జెక్ట్ వర్క్షీట్స్కు గాను 5 నెలలకు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. త్వరలో ఐఐటీ ఫౌండేషన్ వర్క్‌షీట్స్‌ను విద్యార్థులకు అందిస్తాం. ఏడాదిలో మరో 2 వేల మంది విద్యార్థులను చేరుకోవటంతో పాటూ 10, 12వ తరగతుల గణితం, ఇంగ్లిష్ సిలబస్‌లను అందుబాటులోకి తేవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఆయా సిలబస్‌ల వర్క్‌షీట్స్ రూపొందిస్తున్నాం. త్వరలోనే పాఠశాలలతో ఒప్పందం చేసుకుంటాం. ఏడాదిలో సుమారు 15 పాఠశాలలతో ఒప్పందంతో సుమారు రూ.కోటి వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.75 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2 కోట్లు వ్యాపారాన్ని చేరుకుంటాం. త్వరలో బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సేవలను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నా రు. అజయ్ ఈడూరి, రవి మంథా ఇద్దరు కలిసి సీడ్ రౌండ్లో రూ.1.2 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఏంజిల్ రౌండ్లో రూ.5 కోట్లు సమీకరించనున్నాం. ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. 6 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తాం’’ అని జితేంద్ర వివరించారు. -
కూడిక, తీసివేతలు కూడా రావు!
సాక్షి, ముంబై: రాష్ర్ట గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక విద్యార్థుల అభ్యాసం స్థాయులు (లర్నింగ్ స్కిల్స్) అత్యంత అధ్వానంగా ఉన్నట్టు వెల్లడయింది. వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక (ఏఎస్ఈఆర్) పేరుతో ఇటీవల ఢిల్లీలో విడుదల చేసిన నివేదిక ఈ బాధాకర విషయాన్ని బయటపెట్టింది. ఈ నివేదికలోని అంశాల ప్రకారం..రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న 62.2 శాతం మంది విద్యార్థులకు ప్రాథమికస్థాయి లెక్కలు (గణితం) కూడా రావడం లేదని తేలింది. సాధారణ తీసివేతలు, విభజనలు చేయడంలో విఫలమవుతున్నారు. అంతేగాకుండా పాఠాలను చదవడంలోనూ మహారాష్ట్ర విద్యార్థులు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు విశ్లేషించారు. 8వ తరగతి చదువుతున్న 80 శాతం మంది విద్యార్థులు కనీసం రెండో తరగతి పాఠ్య పుస్తకాలను చదవడంలోనూ విఫలమవుతున్నారు. అంతేగాకుండా 0.9 శాతం మంది విద్యార్థులు 1 నుంచి 9 వరకు అంకెలను గుర్తించలేకపోతున్నారు. కేవలం 5.4 శాతం మంది మాత్రమే 1 నుంచి 9 అంకెలను గుర్తిస్తున్నారు. 38.7 శాతం మాత్రమే 10 నుంచి 99 వరకు అంకెలను గుర్తిస్తున్నారు. కానీ తీసివేతలు చేయడంలో విఫలమవుతున్నారు. దాదాపు 17.2 శాతం మంది విద్యార్థులు మాత్రమే నంబర్లను గుర్తించి తీసివేస్తున్నారు. కానీ భాగాహారం చేయలేకపోతున్నారు. 14 శాతం విద్యార్థులు మాత్రమే తీసివేత, భాగాహారం వంటి చిన్న లెక్కలు చేస్తున్నారు. 1.3 శాతం మంది ఇంగ్లిష్ వర్ణమాలను గుర్తించలేకపోతున్నారని నివేదికలో తేలింది. 788 పాఠశాలల్లో అధ్యయనం.. ఏఎస్ఈఆర్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని 788 ప్రాథమిక పాఠశాలల్లో అధ్యయనం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వారు పేర్కొన్నారు. 2013 గణాంకాల ప్రకారం.. 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. 2012తో పోల్చితే అదనంగా ఐదు శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరారు. ఐదో తరగతి చదువుతున్న 16 శాతం మంది విద్యార్థులు మాత్రమే తీసివేత, భాగాహారం వంటి చిన్న లెక్కలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 20 శాతం మంది విద్యార్థులు మాత్రమే తీసివేత, విభజన చేస్తున్నారని వెల్లడైంది. ఇదిలా వుండగా రాష్ట్రంలో చాలా మంది పాఠశాలలు విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నియమాలను పాటించడం లేదు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 15 శాతం పాఠశాలల్లో ఆట మైదానాలు కరువయ్యాయి. 13 శాతం పాఠశాలల్లో మంచి నీటి సౌకర్యం కొరవడింది. 33 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి లోపించింది. 10 శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలు లేవని వెల్లడయింది. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఒకే తరగతి గదిలో రెండు అంతకంటే ఎక్కువ తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో బోధించడంలో ఉపాధ్యాయులు కూడా విఫలమవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఏఎస్ఈఆర్ అధ్యయనం విశ్లేషించింది.