సాక్షి, ముంబై: రాష్ర్ట గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక విద్యార్థుల అభ్యాసం స్థాయులు (లర్నింగ్ స్కిల్స్) అత్యంత అధ్వానంగా ఉన్నట్టు వెల్లడయింది. వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక (ఏఎస్‌ఈఆర్) పేరుతో ఇటీవల ఢిల్లీలో విడుదల చేసిన నివేదిక ఈ బాధాకర విషయాన్ని బయటపెట్టింది. ఈ నివేదికలోని అంశాల ప్రకారం..రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న 62.2 శాతం మంది విద్యార్థులకు ప్రాథమికస్థాయి లెక్కలు (గణితం) కూడా రావడం లేదని తేలింది.
సాధారణ తీసివేతలు, విభజనలు చేయడంలో విఫలమవుతున్నారు. అంతేగాకుండా పాఠాలను చదవడంలోనూ మహారాష్ట్ర విద్యార్థులు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు విశ్లేషించారు. 8వ తరగతి చదువుతున్న 80 శాతం మంది విద్యార్థులు కనీసం రెండో తరగతి పాఠ్య పుస్తకాలను చదవడంలోనూ విఫలమవుతున్నారు. అంతేగాకుండా 0.9 శాతం మంది విద్యార్థులు 1 నుంచి 9 వరకు అంకెలను గుర్తించలేకపోతున్నారు. కేవలం 5.4 శాతం మంది మాత్రమే 1 నుంచి 9 అంకెలను గుర్తిస్తున్నారు. 38.7 శాతం మాత్రమే 10 నుంచి 99 వరకు అంకెలను గుర్తిస్తున్నారు.
కానీ తీసివేతలు చేయడంలో విఫలమవుతున్నారు. దాదాపు 17.2 శాతం మంది విద్యార్థులు మాత్రమే నంబర్లను గుర్తించి తీసివేస్తున్నారు. కానీ భాగాహారం చేయలేకపోతున్నారు. 14 శాతం విద్యార్థులు మాత్రమే తీసివేత, భాగాహారం వంటి చిన్న లెక్కలు చేస్తున్నారు. 1.3 శాతం మంది ఇంగ్లిష్ వర్ణమాలను గుర్తించలేకపోతున్నారని నివేదికలో తేలింది.
788 పాఠశాలల్లో అధ్యయనం..
ఏఎస్‌ఈఆర్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని 788 ప్రాథమిక పాఠశాలల్లో అధ్యయనం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వారు పేర్కొన్నారు.
2013 గణాంకాల ప్రకారం.. 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. 2012తో పోల్చితే అదనంగా ఐదు శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరారు. ఐదో తరగతి చదువుతున్న 16 శాతం మంది విద్యార్థులు మాత్రమే తీసివేత, భాగాహారం వంటి చిన్న లెక్కలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 20 శాతం మంది విద్యార్థులు మాత్రమే తీసివేత, విభజన చేస్తున్నారని వెల్లడైంది. ఇదిలా వుండగా రాష్ట్రంలో చాలా మంది పాఠశాలలు విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నియమాలను పాటించడం లేదు.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 15 శాతం పాఠశాలల్లో ఆట మైదానాలు కరువయ్యాయి. 13 శాతం పాఠశాలల్లో మంచి నీటి సౌకర్యం కొరవడింది. 33 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి లోపించింది. 10 శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలు లేవని వెల్లడయింది. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఒకే తరగతి గదిలో రెండు అంతకంటే ఎక్కువ తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో బోధించడంలో ఉపాధ్యాయులు కూడా విఫలమవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఏఎస్‌ఈఆర్ అధ్యయనం విశ్లేషించింది.
కూడిక, తీసివేతలు కూడా రావు!
Published Sat, Jan 18 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement