అభ్యాస అవంతిక | Avantika Kampani from Mumbai launched Sikh learning program | Sakshi
Sakshi News home page

అభ్యాస అవంతిక

Published Sun, Apr 11 2021 6:32 AM | Last Updated on Sun, Apr 11 2021 6:33 AM

Avantika Kampani from Mumbai launched Sikh learning program - Sakshi

పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్‌’ అని ఓ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది.

ముంబైలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక.

గుర్తించడమే నాంది
ఈ శిక్షణా ప్రోగ్రామ్‌ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్‌ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్‌ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది.

మానసిక నిపుణుల సాయం
అవంతిక తన ఆలోచనను క్లాస్‌మేట్స్‌తో పంచుకుంది. క్లాస్‌మేట్‌ నమితా థాపర్, అతీత్‌ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్‌ ఉద్యోగి గరిమా జిందాల్‌లు అవంతిక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్‌’ అనే పరిశోధన ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజైన్‌ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్‌ ఫ్లాష్‌కార్డ్‌లతో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక.

వివరణాత్మక ప్రోగ్రామ్‌
అవంతిక తన ప్రోగ్రామ్‌ బాక్స్‌ గురించి వివరిస్తూ ‘బాక్స్‌లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్‌ టచ్‌ అండ్‌ ఫీల్‌ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్‌ కార్డ్‌ లో ఒక సర్కిల్‌ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్‌తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది.

బహుమతిగా కార్డు బాక్స్‌
ఈ కార్డు బాక్స్‌ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్‌ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్‌ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్‌ బాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్‌ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్‌ ప్యాక్‌ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్‌ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు.

అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్‌ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్‌ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్‌ను కొనుగోలు చేశాయి. డే వన్‌ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్‌ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్‌ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement