Mental development
-
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో!
ఆనందం అంటే బయటికి నిరూపించలేనిది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవించే స్థితి. ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రుచికి సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఆ అనుభూతిని ఎలా పొందాలి..? ఆనందానికి అర్థం పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? అది తెలుసుకుంటే ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీవు ఎవరో తెలుసుకుంటే చాలు. నిజానికి నీవు ఎవరు అంటే ఆ భగవంతుడివే. ఆ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీ గురించి నీవు తెలుసుకోవడం మొదలుపెట్టగానే అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది. వేరే వారి గురించి ఆలోచిస్తే నీ అంతరంగం కలుషితమవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటే వారి సమాచారం, వారి భావాలు నీ మనసు లోకి ప్రవేశించి నీ మీద స్వారీ చేస్తాయి. నీవు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తే నీ జీవితం వారికి సమర్పించినట్లు, మీ వ్యక్తిత్వం సహజత్వాన్ని కోల్పోయి అతనికి నీవు బానిసగా ఉన్నట్లే. ఇతరుల పట్ల ఆలోచిస్తున్నాను అంటే మనం వారిపై రాగద్వేషాలు పెంచుకున్నట్లే. ప్రస్తుతం మనుషులు తన జీవితం తను జీవించటం మర్చిపోయి ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఒకసారి మనసు కలుషితమై పరిపరివిధాల అనవసరమైన విషయాల గురించి మనసులో ఆలోచన చేసి దాని ద్వారా శరీరంలో ప్రాణ శక్తి తగ్గి అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి తద్వారా అవయవాలు పని చేయక అనేక రకాల జబ్బులు కలిగి శరీరం తన శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మానవునికి ఈ శరీరం ఉంటేనే ఏ కార్యమైనా చేయగలిగేది. నీవు జీవించేది నీ కోసమా..? లేక ఇతరుల కోసమా..? ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం జీవిస్తున్నాను అని నీవు అనుకుంటే నీవు మాయలో ఉన్నట్టే... బానిసత్వంలో బతుకుతున్నట్టే. సమాజాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి. నీ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ఉద్ధరించే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇంతవరకు ఎవరు అది సాధించలేదు. సేవ చేయాలి కానీ నీవే తర్వాత సేవ చేయించుకునే పరిస్థితి ఏర్పడకూడదు. నిజానికి సేవ అంటే దాని నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, అలా ఆశించి సేవ చేస్తే కర్మ రెట్టింపు అవుతుంది. సమాజం చెడిపోయింది. దానిని మంచి వైపు నడిపించాలని తపనతో తమ కుటుంబాన్ని మంచి వైపు నడిపించడం మరచిపోతున్నారు. సమాజాన్ని ఉద్ధరించడం తప్పనిసరి అవసరమే కానీ దానికి ఓ పద్ధతి ఉంది. ముందు తనని తను ఉద్ధరించుకోకుండా, తన బాధ్యతలు, బంధాలను, దాటకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సరికాదు. అందుకు సమాజం కూడా సహకరించదు. నీ కోసం నీవు జీవించడమే నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీవు ఇచ్చే అత్యున్నత జీవితం. నిన్ను నీవు ఉద్ధ్దరించి ఉన్నప్పుడే సమాజాన్ని సరి చేసే అర్హత వస్తుంది. కాబట్టి మొదలు నిన్ను నీవు సరి చేసుకో. ఆ తర్వాతనే సమాజం గురించి ఆలోచన చేయి. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మలు వారివి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణలో ఉండాలి. నీకు ప్రపంచాన్ని మార్చే అర్హత వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను వదలదు. నీకు ఆ అర్హత లేకుంటే సమాజం నిన్ను స్వీకరించదు. మేధావులు మాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ అదే వారి బలహీనత. తమ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే మనిషి ఆనందంగా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. అందుకే భౌతికమైన అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యం మనిషి జీవితకాలం పరితపించేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం పొందాలనే తపనలో భౌతిక, శారీరక సుఖాలే ఆనందం అనే భ్రమలో నిజమైన ఆనందాన్ని పొందలేక అసంతృప్తి పడుతున్నాడు. దీనికి మూల కారణం తన గురించి తను ఆలోచించుకోలేకపోవడం. నీ గురించి నీవు తెలుసుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించుకోవడమే దీనికి పరిష్కారం. మనిషి ఆనందంగా ఉండలేక పోవడానికి కొంత పూర్వ జన్మ, ఇంకొంత ఈ జన్మలో చేసిన కర్మలు కారణం. ఈ కర్మలను క్రమేణా నివృత్తి చేసుకుంటూ వాటి తీవ్రతను తగ్గించుకొని అనవసరమైన వాటికి విలువ ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే విలువ ఇస్తూ ఫలితం పొందితే ఆనందం సిద్ధిస్తుంది. ఆనందం అంటే ఎవరికి వారు స్వయంగా అనుభవించే స్థితి. ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. ► భౌతిక సంపద పెరగడం అంటే మానసిక సంపద తరగడమే. ► సంపద పెరిగితే సంతృప్తి రావాలి ► సంతృప్తిని మించిన సంపద లేదు. ► ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థం లేదు, ► మనం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. ► ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా జీవిస్తాడు. – భువనగిరి కిషన్ యోగి -
అభ్యాస అవంతిక
పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్’ అని ఓ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక. గుర్తించడమే నాంది ఈ శిక్షణా ప్రోగ్రామ్ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్‌ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది. మానసిక నిపుణుల సాయం అవంతిక తన ఆలోచనను క్లాస్‌మేట్స్‌తో పంచుకుంది. క్లాస్మేట్ నమితా థాపర్, అతీత్ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్ ఉద్యోగి గరిమా జిందాల్‌లు అవంతిక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్’ అనే పరిశోధన ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజైన్ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాష్కార్డ్లతో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక. వివరణాత్మక ప్రోగ్రామ్ అవంతిక తన ప్రోగ్రామ్ బాక్స్ గురించి వివరిస్తూ ‘బాక్స్‌లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్ టచ్ అండ్ ఫీల్ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్ కార్డ్ లో ఒక సర్కిల్ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్‌తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది. బహుమతిగా కార్డు బాక్స్ ఈ కార్డు బాక్స్‌ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్ బాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్ ప్యాక్‌ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు. అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్‌ను కొనుగోలు చేశాయి. డే వన్ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక. -
ఇక్కడ అందం అమ్మబడును
అద్దంలో మొహం చూసుకున్నాడు. ఏ మార్పూ లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె– ఆరంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు. మూత తీశాడు– గుప్పున కొట్టింది. ఇంట్లోకి సరుకులు తెద్దామని బజారుకి బైలుదేరాడు పరంధామయ్య. చల్లబడిన తర్వాత వెడతానన్నాడు. వెంటనే వెళ్లమంది పార్వతమ్మ. అతనికి వెళ్లాలనే వుంది. కాని భార్య తొందరగా వెళ్లమంది కాబట్టి కొంచెం ఆలస్యం చెయ్యడంలో కాస్తంత తృప్తి. సెలవు కోసం వారం అంతా ఎదురుచూస్తూ, తీరా వొచ్చిం తర్వాత ఏమీ చెయ్యక వృథాగా గడిపేశామే అని బాధపడుతూ మళ్లా పని ప్రవాహములో కొట్టుకుపొయ్యే మధ్యతరగతి వ్యక్తి పరంధామయ్య. సెలవు రోజున తన వ్యక్తిత్వానికి అనువైన పని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలియదు. తనూ, భార్య యింకెవ్వరూ లేకుండా, అలా షికారు తిరిగి సినిమాకెళ్లి, ఏ హోటల్లోనో భోంచేసి, పార్కులో పెళ్లినాటి సంఘటనలు స్మరించుకుని, ఆమె తొడమీద తల ఆనించి పడుకుని ఆకాశంలో నక్షత్రాలకేసి నిశ్చలంగా చూస్తూ విశ్వంలోని నిశ్చలత్వాన్ని తనలో నింపుకుని క్రొత్త సౌందర్యాన్ని, ఆనందాన్ని పొంది... అదే పేచీ–వారి జీవితాల్లో ఆనందం, సౌందర్యం లేవు. శారీరక సౌందర్యం అంత ముఖ్యమైంది కాదంటారు. మరేదో శీలంలో సౌందర్యంట– మనస్సులో వుంటుందిట. బాహ్య సౌందర్యం వుంటేనే ఆ మిగతావి కూడా వుంటాయి. సౌందర్యం ఎట్లా వొస్తుంది? డబ్బుంటే అదే వొస్తుంది. శాస్త్రజ్ఞులు కనుక్కొన్న పరికరాల ద్వారా అందాన్ని కూడా పొందవచ్చు.తన అందం గూర్చి పరంధామయ్యకి బోలెడన్ని శంకలు. అందం స్త్రీది, తెలివి పురుషుడిదీ అనుకునే రోజులు వెళ్లిపోయినై. కొంచెం పొడుగాటి ముక్కు. కాస్తంత పొట్టిదిగా వుంటే ఎంత బావుండును. పెదవులు కొంచెం వంకర. జుత్తు పాపిడ తిన్నగారాదు. కాఫీ హోటలుకు చేరుకున్నాడు. ఆలోచనలతో దూరమే తెలియలేదు. టీ త్రాగాడు. బైలు దేరాడు. తన మాట వొదిలేద్దాం. పార్వతమ్మ అందం విషయం ఆలోచించు. ఆమె అందంగా వుండదు. కనుబొమ్మలకి ఆకారం లేదు. అర్ధచంద్రాకారం ఆకృతి కలిగి దట్టంగా, నల్లగా, స్ఫుటంగా వుండాలి. అలా లేవు. ఆ ముక్కు? కాస్తంత పొట్టిదనే వొప్పుకోవాలి. తన ముక్కులో పొడుగైన ఆ కాస్త భాగం కోసేసి, ఆవిడ ముక్కు మొనకి అతికించివేస్తే ఎంత బాగుంటుంది! ఇంతకీ తను ఎక్కడికి నడుస్తున్నట్లు? సరుకుల కోసం. ముందు ఆ కొట్లో కెడదాం. ఆ సందు మలుపులో. సందు మలుపు తిరగగానే, ఒకరి వెనుక ఒకరు వరుసగా నిలబడ్డ జనం– రోడ్డంతా కమ్మేశారు. ఏం జనం, ఏం జనం? ఏదేనా ఊరోగింపు కాబోలు. వరుసగా నిలబడడం దేనికో? ఇవతల ప్రక్క మొగాళ్ల క్యూ ఫర్లాంగు. అవతల స్త్రీల క్యూ. ఎందుకు నిలబడ్డారో? ‘ఏ అబ్బాయ్– ఏమిటిదంతా?’’ సమాధానం చెప్పకుండా, ఆ కుర్రాడు పరుగెత్తుకెళ్లి క్యూలో కూరుకుపొయ్యాడు. తనకెందుకు? తన దోవను తను పోక. ఇందరు మనుషుల్ని ఒదిలి ఎలా వెళ్లడం? అదే మానవత్వం అంటే. తోటి మానవుడి రహస్యాన్ని పంచుకోవడం. క్యూ ప్రభావం సుడిగాలిలా పరంధామయ్యని చుట్టేసింది. మానవ హృదయం దేన్నో ఆశించి రోదిస్తుంటే తాను చెవులు మూసుకోగలడా! ‘క్యూ చివరలో ఏముందబ్బాయి?’ క్యూ సమరంలో గాయపడి వెనక్కి తిరిగొచ్చిన బాలవీరుడు.‘‘అందం అమ్ముతున్నారుటండి’’ అని బాలవీరుడు కుంటుకుంటూ నిష్క్రమించాడు. పరంధామయ్య పరధ్యానం కట్టిబెట్టి ఒక్క గంతేసి క్యూ చివరలో స్థావరం ఏర్పరచుకున్నాడు. ఒక మజిలీ గడిచింది. మదీనా చేరాడు. మక్కాకి పోవాలి. వెనక మరో పదిగజాల జనం గొలుసు కట్టేసుకున్నారు. తను సౌందర్యం గురించి ఆలోచించటం, సౌందర్యం లభ్యం కావటం– క్యూలో కాలక్షేపం కాదు. ముందువాడి వెన్ను ఎంతసేపని చూడగలం? వెనక్కి తిరిగితే, ఆసామీ మీసాల మధ్య నలిగిన చుట్ట. ఆయన కనుబొమ్మలు చూడు– అదొక పిల్ల అడివి. ఆడాళ్లకి వేరే క్యూ పెట్టారు. పౌరసత్వ బాధ్యతలు గుర్తెరింగిన ప్రజ, ఏమీ తోచకపోతే స్త్రీలకేసి చూస్తూ కూర్చోవచ్చు. క్యూలో నిలబడిం తర్వాత ముందువారిని, వెనక వారిని ఈ క్యూ ఎందుకని అడిగే అధికారం లేదు. చివరిదాకా అనుభవించి, తనకు తానే సత్యం తెలుసుకుని హతమవ్వాలి. అయినా, అందం అమ్మడం ఏమిటో! సరిగ్గా విన్నానా? లేకపోతే యింతమంది స్త్రీలు, పురుషులు యీ క్యూలో అవతరించరు. అందం అమ్మడమేమిటి నా నెత్తి. అందంగా చేసే పరికరాన్ని అమ్మడం అని. వాక్యంలో ఏదో లోపించింది. క్యూలో అడుగు ముందుకు కదిలింది. ఆ ముసలమ్మకి అందం ఎందుకు? వార్ధక్యం, జాడ్యం, మృత్యువు లేకుండా చేసే మార్గం కనుక్కునేటందుకే సిద్ధార్థుడు సంసారం త్యజించి, ధ్యానం సాగించి బుద్ధుడుగా అవతరించాడట. నిజంగా బుద్ధుడు సాగించినది సౌందర్యాన్వేషణే– అది సాధ్యం కాకపోయినప్పుడు, వేరే లోపల అందం, నిర్యాణము, శాంతి అంటూ తత్వచింతనలో పడ్డాడు. మరో రెండు గజాలు పురోగమనం. మరో మూడు. ప్రజ యింక ఆగరు. అందం ఆకలై ముందుకు నెట్టివేస్తోంది. ఏదో వాసన. ఏమిటి చెప్మా! ‘‘కలరా వుండలా?’’ ‘‘ఏమో. గసగసాలు’’. ‘‘అబ్బే కర్పూరం దండలండి’’ ‘‘చమురు కంపు’’ ఒక్కసారి పదిగజాలు. అమ్మయ్య! ఆవిడెవరు? రమణయ్యగారి చెల్లెలా. ఆవిడే. చాలా అందమైంది. ఈమధ్యనే భర్త కాలం చేశాడు. అంత అందమైన భార్యకు భర్తగా వుండేందుకు తగనని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకుంటారు. ఆవిడకేం కావాలో? రెండు గజాల దూరంలో శిఖరం, దైవం సాక్షాత్కారం. కొబ్బరికాయ కొట్టి పూజారి పళ్లెంలో అణా వుంచినట్లు ప్రతివాడూ ఆ కిటికీముందు నిలబడటం, డబ్బు సమర్పించుకోడం, వాడిచ్చిన ప్రసాదం కళ్ల కద్దుకొని– పత్రి పూలూ వగైరా మాదిరి బిల్లు చీటీ యిస్తాడు– దాన్ని చెవులో బదులు జేబులో వుంచుకొని బైటపడటం– అల్లా జరుగుతోంది. ఒక్కొక్క భక్తుడే దూరంగా వెళ్లిపోతున్నాడు. వారి మొహాలలో శాంతి ఆనందం తాండవిస్తున్నాయా? ఇంక ముందు యిద్దరే వున్నారు. పరంధామయ్య సింహద్వారం చేరుకున్నాడు. ఎదురుగా గోడ. దానిలో వో కంత. చెంపలు వేసుకో, కళ్లు మూసుకో, పర్సు తీ– చిల్లర. ‘‘పావలా’’ అన్నాడు దైవం. ఇంత పొట్లం ఏదో చేతిలో పెట్టాడు. పెద్దదే– ఏదో వాసన. దూరంగా, తొందరగా నడిచి వెళ్లాడు. ముందు విశ్రాంతి కావాలి. దాహంగా వుంది. మనుషుల వాసన చొక్కాలో ప్రవేశించింది. ఇందాక హటల్లోకి చేరుకున్నాడు. అద్దంలో మొహం చూసుకున్నాడు. వెనకటిదే. ఏ మార్పూ లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె– ఆరంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు. మూత తీశాడు– గుప్పున కొట్టింది. అందులో వున్నది ఇంగువ. దాన్ని వర్ణిస్తూ కాగితం. అందం మార్కు ఇంగువనే ఎల్లప్పుడూ వాడండి. సువాసన, నూతనమైన మూలికలు, అత్తరులు జోడించి సమకూర్చిన పరిమళం. భుజించిన మొన్నాడు కూడా దాని పరిమళం వదలదు. మీ వంటకాలలో వాడితే మీ ఇల్లాలి పట్ల ప్రేమ, ఆదరణ పెరుగుతాయి. పరంధామయ్య చాలా సేపటి వరకూ తేరుకోలేదు. కాని తనొక్కడే కాడు. వేలమందిలో తను వొక్కడు. వాళ్లందరూ చేసినపనే తనూ చేశాడు. కించపడటానికేముంది? సరుకులు కొనుక్కుని మెల్లిగా ఇంటికి చేరుకునేటప్పటికి పార్వతమ్మ వంటింట్లో వుంది.‘‘ఇంత ఆలస్యమైందేం?’’ ‘‘ఏమీ లేదు. మెల్లిగా నడుచుకుంటూ వొచ్చాను’’ ‘‘ఇదేమిటి– యి పొట్లం?’’ ‘‘చూడు.’’ ఆవిడ మొహంలో చిరునగవు లేదు. అసంతృప్తిని వొక్క చూపులో వ్యక్తం చెయ్యగల కళాజీవి. ‘‘ఇంత ఇంగువ తెచ్చుకుంటారా ఎవరేనా?’’ ‘‘అంతే యిచ్చాడు వాడు.’’ ‘‘చిన్న పొట్లం అడగలేక పొయ్యారా?’’ ‘‘చిన్న పొట్లం వుంటుందని నాకు తెలియదు.’’ ‘‘ఇంకెప్పుడూ ఇట్లాంటి పని చెయ్యకండి’’ అని పార్వతమ్మ వంటింట్లో కెళ్లింది. సుళువుగా బైట పడినందుకు లోలోన సంతోషపడ్డాడు. ‘‘ఇదిగో చూడండి. నేను తీసుకొచ్చాను– చిన్న పొట్లం’’ అన్నదామె. ‘‘నువ్వూ ఆ క్యూలో నిలబడ్డావా?’’ ‘‘ఆహా. పనిపిల్ల చెప్పింది. ఇంగువ చవగ్గా అమ్ముతున్నారని. ఇదేమిటో చూద్దామని దాన్ని తీసుకొని బైలుదేరాను. క్యూలో నుంచోవడం లేదు ఏం లేదు. ఎలాగో సందు చేసుకొని యీ పొట్లం లాక్కుని వొచ్చింది. ఈ చిన్న పొట్లం దానికిస్తాను. మీరు తెచ్చింది మనకుంటుంది.’’పార్వతమ్మ ఎంతవరకూ నిజం చెప్పిందో పరంధామయ్యకి తెలుసు. తనెంత నిజం చెప్పాడో ఆమె కూడా అంతే. ఇది అన్యోన్యం కాక మరేమిటి కలంపేరు బుచ్చిబాబుతో ప్రసిద్ధులైన శివరాజు వెంకట సుబ్బారావు (1916–1967) ‘సౌందర్యాన్వేషణ’ కథకు సంక్షిప్త రూపం ఇది. స్త్రీ పురుష సంబంధాలు, మానసిక చైతన్యం మీద బుచ్చిబాబు ఎక్కువ దృష్టి పెట్టారు. నన్ను గురించి కథ వ్రాయవూ?, అరకు లోయలో కూలిన శిఖరం, బీ, నిప్పు లేని పొగ ఆయన కథల్లో కొన్ని. ఆయన రాసిన ఒకే ఒక్క నవల ‘చివరకు మిగిలేది’ తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ‘నా అంతరంగ కథనం’ పేరిట పాక్షిక ఆత్మకథ వెలువరించారు. -
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
గుంటూరుస్పోర్ట్స్: క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులో కూడా ముందంజలో ఉంటారని రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి జె.డి.శీలం చెప్పారు. క్రీడలు మంచి ఆరోగ్యంతోపాటు, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శనివారం 60వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రోరల్ స్కేటింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆసక్తి, ప్రతిభను గమనించి ఆ దిశగా క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి చుక్కా కొండయ్య మాట్లాడుతూ విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, వైజాగ్, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు అండర్-11, 14, 17 బాలబాలికల విభాగాలలో పోటీలు జరుగుతాయని స్టేడియం స్కేటింగ్ కోచ్ సలామ్ చెప్పారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారును రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ పార్వతి, డీఈవో శ్రీనివాసరెడ్డి, డీఎస్డీవో వెంకటేశ్వరరావు, బాబురావు, పీఈటీలు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీ అలంకారానికి ఆవాసం...
స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ప్రియపత్ని మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణమాసం. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలను పుణ్యప్రదమైనవిగా పరిగణిస్తారు. సోమవారాలు శివపూజకు, మంగళవారాలు గౌరీపూజకు, శుక్రవారం శ్రీ లక్ష్మీపూజకు, శనివారం విష్ణుపూజకు మిక్కిలి అనుకూలమైనవి. ఈ మాసంలో శుక్లపక్షం విశేషమైనది. ఈ పక్షంలోని ఒక్కొక్కరోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రవచనం. లక్ష్మీదేవికి నెలవైన ఈ మాసంలో ఒక్కపూట భోజనం చేస్తూ, మరోపూట ఉపవాసం ఉండి లక్ష్మీపూజ చేయడం వల్ల సకల శుభాలూ చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి. హరిః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్! చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా!! అనంతకోటి శక్తి సంపన్న, అనంత కల్యాణ గుణసంపన్న, ధర్మ సంవర్థిత, సకల లోకరక్షిత అయిన శ్రీమహాలక్ష్మీదేవి జగత్కల్యాణ మనుగడకై నిరంతర దివ్య ఆశీస్సులనిచ్చే దేవదేవి. స్థితికార్య నిర్వహణలో శ్రీమన్నారాయణుని సమబాధ్యతను స్వీకరించిన లక్ష్మీదేవి జగతికి మూలాధారమై, నిత్యవందనీయమై విరాజిల్లుతోంది. అనంతకోటి జీవరాశులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ తలచుకునే తల్లియే లక్ష్మీదేవి. ఆమె తన వైభవాన్నే వరంగా అందించి, లోకాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రాణశక్తికి, దైహిక, మానసిక ఆరోగ్యానికి అధిష్థాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మి పాడిపంటలతో సమస్త సంపదలనూ, శారీరక దారుఢ్యాన్నీ ప్రసాదించే వరాలతల్లి. సకల శుభాలకూ నెలవు, సత్సంతాన ప్రాప్తిని కలిగించే మహాదేవి సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయ సాధనకీ ఆలవాలం ఆ చల్లనితల్లి. ఆ లక్ష్మీ వైభవమే సర్వజగత్తులోని అద్భుతాలు, అవసరాలు, అనంత చైతన్యవిభూతులు. పాలకడలి నుండి జనించి, వైకుంఠంలో కొలువుదీరి, లోకంలోని ప్రతి అణువులో ధ్వనించే చైతన్య వైభవమై, జీవజాతి మనుగడకై అవతరించి శ్రీలక్ష్మీదేవి మానవుల మనోవికాసానికి, ఆనందానికి, చిరునవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణసంపత్తికి, సకలసంపదలకూ ఆలవాలమై భాసిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముని అనేకరూపాల్లో ఆరాధించటం ఆనవాయితీ. ‘లోకో భిన్న రుచిః’ అన్నట్లుగా పరంపరానుగతంగా, తరతరాలుగా ఆరాధ్యదైవాలను కొలవడం ప్రతీతి. కాని శ్రీలక్ష్మీదేవిని పూజించని ప్రాణి పద్నాలుగు భువనభాండాల్లో ఎక్కడా ఉండదు. సర్వమానవ జ గతి పరిపుష్టికి సహకరించే విశ్వజనని కరుణాకటాక్ష కైంకర్యాన్ని ఆశించని వారుండరు. అఖిల బ్రహ్మాండ జనిత, సకల ప్రాణులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించే లోకమాత శ్రీలక్ష్మీమాత. విద్యామాతయైన శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే లోకంలో మనుగడే లేదు. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు. ఆమె అనంతవిభూతుల్లో ధనం ఒకటి మాత్రమే. ఉత్సాహం, ఉల్లాసం, కాంతి, సౌందర్యం, శుచిశుభ్రత... వంటి ఉత్తమలక్షణాలు శ్రీలక్ష్మీదేవి స్వరూపాలు. లక్ష్మీదేవి ఇంద్రుడితో ఇలా చెప్పింది- ‘‘బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, ఓర్పు, శాంతి, సమ్మతి... ఈ ఏడుగురు దేవతలూ నాకు సన్నిహితులు. నేనున్నచోట వైభవంతో విలసిల్లుతుంది’’ అని. శ్రీలక్ష్మీమాత భక్తులను కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. ఆ తల్లే భక్తుల చేయి పట్టుకుని అతిజాగ్రత్తగా లక్ష్యంవైపుగా తీసుకెళ్లి విజయాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్యమే రూపధారణ చేసుకుని లక్ష్మీదేవి ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారు అలక్ష్యాన్ని ఏమాత్రం క్షమించదు. ప్రపంచమంతా నిండి ఉండే శ్రీ లక్ష్మీదేవి వ్యక్తితోపాటు సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్నీ కీర్తి సమృద్ధులతో నింపాలనీ, ఆ దేవి దివ్యాశీస్సులే సకల లోకాల్నీ వైభవంతో విరాజిల్లేలా చేస్తాయని శ్రుతి నిర్దేశితం. శ్రీలక్ష్మీదేవి అలక... జగత్తునంతా అల్లకల్లోలం చేస్తుంది. జగములనేలే ఆ తల్లి చిరుమందహాసమైనా చాలు అనంత దివ్యవైభవ సంపదను ధారాపాతంగా వర్షిస్తుంది. అఖండ మహిమాన్వితం, పరమానందదాయకం శ్రీలక్ష్మీ వైభవం. శ్రీమహాలక్ష్మి చూపులు... దుర్మార్గుల విషయంలో పరమక్రూరంగా ఉంటాయట, భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట, దారిద్య్రమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి, ఎంతో ఉదారంగా సంపదను అనుగ్రహిస్తాయట. ‘‘నీ చల్లని చూపులతో మా దురదృష్టాన్ని పోగొట్టు తల్లీ...’’ అని ఆమెను ప్రార్థించాలి. - ఇట్టేడు అర్కనందనాదేవి శివప్రీతికరం శ్రావణ సోమవారం శ్రావణమాసంలో వచ్చే సోమవారం శివునికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ నాలుగు సోమవారాలు దీక్షగా ఉపవాసముండి శివుడికి అభిషేకం, రుద్రనమకం, చమకం పఠించడం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణోక్తి.