లక్ష్మీ అలంకారానికి ఆవాసం... | Lakshmi ornaments home ... | Sakshi
Sakshi News home page

లక్ష్మీ అలంకారానికి ఆవాసం...

Published Sun, Aug 11 2013 10:42 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

లక్ష్మీ  అలంకారానికి ఆవాసం...

లక్ష్మీ అలంకారానికి ఆవాసం...

 స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ప్రియపత్ని మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణమాసం. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలను పుణ్యప్రదమైనవిగా పరిగణిస్తారు. సోమవారాలు శివపూజకు, మంగళవారాలు గౌరీపూజకు, శుక్రవారం శ్రీ లక్ష్మీపూజకు, శనివారం విష్ణుపూజకు మిక్కిలి అనుకూలమైనవి.
 
 ఈ మాసంలో శుక్లపక్షం విశేషమైనది. ఈ పక్షంలోని ఒక్కొక్కరోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రవచనం. లక్ష్మీదేవికి నెలవైన ఈ మాసంలో ఒక్కపూట భోజనం చేస్తూ, మరోపూట ఉపవాసం ఉండి లక్ష్మీపూజ చేయడం వల్ల సకల శుభాలూ చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
 హరిః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్!
 చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా!!

 
 అనంతకోటి శక్తి సంపన్న, అనంత కల్యాణ గుణసంపన్న, ధర్మ సంవర్థిత, సకల లోకరక్షిత అయిన శ్రీమహాలక్ష్మీదేవి జగత్కల్యాణ మనుగడకై నిరంతర దివ్య ఆశీస్సులనిచ్చే దేవదేవి. స్థితికార్య నిర్వహణలో శ్రీమన్నారాయణుని సమబాధ్యతను స్వీకరించిన లక్ష్మీదేవి జగతికి మూలాధారమై, నిత్యవందనీయమై విరాజిల్లుతోంది. అనంతకోటి జీవరాశులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ తలచుకునే తల్లియే లక్ష్మీదేవి. ఆమె తన వైభవాన్నే వరంగా అందించి, లోకాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రాణశక్తికి, దైహిక, మానసిక ఆరోగ్యానికి అధిష్థాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మి పాడిపంటలతో సమస్త సంపదలనూ, శారీరక దారుఢ్యాన్నీ ప్రసాదించే వరాలతల్లి.

 సకల శుభాలకూ నెలవు, సత్సంతాన ప్రాప్తిని కలిగించే మహాదేవి సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయ సాధనకీ ఆలవాలం ఆ చల్లనితల్లి. ఆ లక్ష్మీ వైభవమే సర్వజగత్తులోని అద్భుతాలు, అవసరాలు, అనంత చైతన్యవిభూతులు.
 
 పాలకడలి నుండి జనించి, వైకుంఠంలో కొలువుదీరి, లోకంలోని ప్రతి అణువులో ధ్వనించే చైతన్య వైభవమై, జీవజాతి మనుగడకై అవతరించి శ్రీలక్ష్మీదేవి మానవుల మనోవికాసానికి, ఆనందానికి, చిరునవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణసంపత్తికి, సకలసంపదలకూ ఆలవాలమై భాసిస్తుంది.
 
 భారతీయ సంప్రదాయంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముని అనేకరూపాల్లో ఆరాధించటం ఆనవాయితీ. ‘లోకో భిన్న రుచిః’ అన్నట్లుగా పరంపరానుగతంగా, తరతరాలుగా ఆరాధ్యదైవాలను కొలవడం ప్రతీతి. కాని శ్రీలక్ష్మీదేవిని పూజించని ప్రాణి పద్నాలుగు భువనభాండాల్లో ఎక్కడా ఉండదు. సర్వమానవ జ గతి పరిపుష్టికి సహకరించే విశ్వజనని కరుణాకటాక్ష కైంకర్యాన్ని ఆశించని వారుండరు. అఖిల బ్రహ్మాండ జనిత, సకల ప్రాణులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించే లోకమాత శ్రీలక్ష్మీమాత. విద్యామాతయైన శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే లోకంలో మనుగడే లేదు.

లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు. ఆమె అనంతవిభూతుల్లో ధనం ఒకటి మాత్రమే. ఉత్సాహం, ఉల్లాసం, కాంతి, సౌందర్యం, శుచిశుభ్రత... వంటి ఉత్తమలక్షణాలు శ్రీలక్ష్మీదేవి స్వరూపాలు. లక్ష్మీదేవి ఇంద్రుడితో ఇలా చెప్పింది- ‘‘బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, ఓర్పు, శాంతి, సమ్మతి... ఈ ఏడుగురు దేవతలూ నాకు సన్నిహితులు. నేనున్నచోట వైభవంతో విలసిల్లుతుంది’’ అని.  శ్రీలక్ష్మీమాత భక్తులను కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. ఆ తల్లే భక్తుల చేయి పట్టుకుని అతిజాగ్రత్తగా లక్ష్యంవైపుగా తీసుకెళ్లి విజయాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్యమే రూపధారణ చేసుకుని లక్ష్మీదేవి ఆవిర్భవించింది.

కాబట్టి అమ్మవారు అలక్ష్యాన్ని ఏమాత్రం క్షమించదు. ప్రపంచమంతా నిండి ఉండే శ్రీ లక్ష్మీదేవి వ్యక్తితోపాటు సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్నీ కీర్తి సమృద్ధులతో నింపాలనీ, ఆ దేవి దివ్యాశీస్సులే సకల లోకాల్నీ వైభవంతో విరాజిల్లేలా చేస్తాయని శ్రుతి నిర్దేశితం. శ్రీలక్ష్మీదేవి అలక... జగత్తునంతా అల్లకల్లోలం చేస్తుంది. జగములనేలే ఆ తల్లి చిరుమందహాసమైనా చాలు అనంత దివ్యవైభవ సంపదను ధారాపాతంగా వర్షిస్తుంది. అఖండ మహిమాన్వితం, పరమానందదాయకం శ్రీలక్ష్మీ వైభవం.
 
 శ్రీమహాలక్ష్మి చూపులు... దుర్మార్గుల విషయంలో పరమక్రూరంగా ఉంటాయట, భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట, దారిద్య్రమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి, ఎంతో ఉదారంగా సంపదను అనుగ్రహిస్తాయట. ‘‘నీ చల్లని చూపులతో మా దురదృష్టాన్ని పోగొట్టు తల్లీ...’’ అని ఆమెను ప్రార్థించాలి.
 
 - ఇట్టేడు అర్కనందనాదేవి
 
 శివప్రీతికరం శ్రావణ సోమవారం
 శ్రావణమాసంలో వచ్చే సోమవారం శివునికి ప్రీతికరమైనది. కాబట్టి  ఈ నాలుగు సోమవారాలు  దీక్షగా ఉపవాసముండి శివుడికి అభిషేకం, రుద్రనమకం, చమకం పఠించడం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణోక్తి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement