ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్‌కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు.
పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్‌బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్‌పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను.
స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు..
నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్‌బీయింగ్ అవసరం.
ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను.
వందల మంది టీచర్లకు శిక్షణ
స్పెషల్ చిల్డ్రన్‌కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను.
జన్యులోపాలపై అవగాహన
ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను.
ఒక్కో అడుగు..
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment